Wednesday, November 30, 2022

‘సాహిత్య కళానిధి’ కపిలవాయి

- Advertisement -

Article about kapilavai lingamurthy biography

భిన్న సాహిత్య ప్రక్రియల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన బహుముఖ సృజనశీలి కపిలవాయి లింగమూర్తి. కవిగా, శతక కర్తగా, రచయితగా, పరిశోధకుడిగా, తాళపత్రాల పరిష్కర్తగా, విమర్శకుడిగా, నాటక కర్తగా, చరిత్ర కారుడిగా, బాల సాహితీవేత్తగా ప్రత్యేక స్థానం పొందిన నిత్య కృషీవలుడాయన. వందకు పైగా గ్రంథాలను రచించి, రికార్డు నెలకొల్పిన సాహితీ మూర్తి లింగమూర్తి. మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు 1927 మార్చి 31న నాగర్‌కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో కపిలవాయి లింగమూర్తి జన్మించారు. వారిది పండిత కుటుంబం. నాలుగైదు తరాల పూర్వ కాలం నుండే విద్యావంతులైన కుటుంబం వారిది. తాతల కాలం నుండే వారి ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉండేది. లింగమూర్తి తాతయ్య తండ్రి రామయ్య స్వదస్తూరీతో రాసుకున్న పీచు ప్రతులు, తాళ పత్ర గ్రంథాలు ఆ గ్రంథాలయంలో ఉండేవి. ఆయన పూర్వీకులు వైద్య, జ్యోతిష్య శాస్త్రాల్లో నిపుణులు. చిన్నతనంలోనే లింగమూర్తి మూడో ఏట ఉండగానే ఆయన తండ్రి వెంకటాచలం మరణించారు. దాంతో మేనమామ చేపూరు వెంకట పెద్ద లక్ష్మయ్య దగ్గర అమ్రాబాదులో ఆయన పెరిగారు. అక్కడే ప్రాథమిక తరగతుల్లో చదువుకున్నారు. మేనమామ లక్ష్మయ్య కవి, పండితుడు, వైద్యుడు, జ్యోతిష్య శాస్త్రవేత్త, వేదాంతి. నిత్య అధ్యయన శీలి లక్ష్మయ్య రోజూ కనీసం ఒక పద్యమైనా, శ్లోకమైనా కొత్తది నేర్చుకునేవాడట.

పాఠశాలలో నాలుగో తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్న లింగమూర్తి ఇంట్లో తెలుగు అభ్యసించారు. మేనమామ అమరం, ఆంధ్ర నామ సంగ్రహం మొదలైనవి నేర్పించారు. ప్రతిరోజూ పాఠం మేనమామకు అప్పజెప్పిన తర్వాతే నిద్ర పోవడం నిత్యకృత్యమై, తెలుగు సాహిత్యాన్ని అభ్యసించారు. చిన్నప్పుడు పాఠశాలలో దస్తీ మసికిల్ అనే పీరియడ్‌లో బొమ్మల తయారీ నేర్పేవారట. ఆ అనుభవంతోనే లింగమూర్తి స్వయంగా ఆయన స్వగ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని సిమెంటుతో తయారు చేశారు. మేనమామ పెద్ద లక్ష్మయ్యకు లింగమూర్తిని డాక్టర్ చేయాలనే కోరిక ఉండేది. అందువల్లే మూలికా పరిచయం కోసం షడ్రస నిఘంటువనే పేరున్న అభిదాన రత్నమాలను చదివించారు.

స్వగ్రామం జినుకుంటలో లింగమూర్తి పెద తండ్రి వీరయ్య భార్య చనిపోవడంతో లింగమూర్తి మకాం మళ్ళీ జినుకుంటకు మారింది. దాంతో వైద్య విద్యాభ్యాసానికి ఫుల్‌స్టాప్ పడింది. పెద తండ్రి దగ్గర జ్యోతిష్య శాస్త్రం కొంత వరకు నేర్చుకున్నారు. అలా కాలం గడుస్తుండగా లింగమూర్తి తల్లిగారికి అనారోగ్యం సంభవించడంతో ఆయన నాయనమ్మ తమ్ముడు ఈశ్వరయ్య ఆమెను చికిత్స కోసం తమ స్వగ్రామం మేడిపూరు తీసుకెళ్ళారు. తల్లితో పాటు లింగమూర్తి కూడా ఆ ఊరు వెళ్ళారు. అక్కడ ఈశ్వరయ్య తమ్ముడు నారాయణ ఉత్తర రామాయణం చదువమని ప్రోత్సహించారు. ఆయన మనుచరిత్ర ఇవ్వడం తనను సాహిత్యాధ్యయనం వైపు మళ్ళించిందని లింగమూర్తి పేర్కొన్నారు. ఆ రోజు నారాయణ తనకు మనుచరిత్ర ఇవ్వకపోతే తాను వైద్యుడిగానో, జ్యోతిష్కుడిగానో, అభిరుచి ఉన్న చిత్రలేఖనాన్ని అభ్యసిస్తే చిత్రకారుడిగానో అయి ఉండేవాడినని ఆయన అభిప్రాయం. ఆయన కవి కావడం వెనుక మూల కారణం మనుచరిత్ర అధ్యయనం.

తల్లి ఆరోగ్యం కుదుటపడడంతో తల్లితో పాటు తిరిగి స్వగ్రామం జినుకుంట బాట పట్టారు లింగమూర్తి. స్వర్ణకార వృత్తిలో ఉన్న తన చిన్నాన్నకు తెలకపల్లెలో దుకాణం ఉండడంతో ఆయన దగ్గర కులవృత్తి నేర్చుకున్నారు లింగమూర్తి. 1950 ప్రాంతంలో ప్లేగు వ్యాధి తీవ్రంగా ప్రబలడంతో మేనమామ సహాయంతో మెలుకమామిడి అనే గ్రామానికి మకాం మార్చి స్వర్ణకార వృత్తి కొనసాగించారు. అక్కడ యువకులతో నవలల పాత్రలు, సన్నివేశాల గురించి చర్చించేవారట. అక్కడే వేదాంత గ్రంథాలు చదివారు. కవిత్వం, భక్తి సాహిత్యం కూడా విస్తృతంగా అధ్యయనం చేశారు. చిత్రలేఖనానికి సంబంధించిన గ్రంథాలు కూడా చదివారు. మామగారి గ్రంథాలయం నుండి సులక్షణ సారం తీసుకుని, ఛందో రీతిలో పద్య రచనను సాధన చేయడం మొదలు పెట్టారు.

తల్లి వైపు పూర్వీకులు, తండ్రి వైపు పూర్వీకులు సాహిత్య ప్రవేశం ఉన్న కుటుంబాలు కావడంతో జన్యుపరంగానే సాహితీ గంధం ఆయనను చేరిందేమో! నూనూగు మీసాల పద్నాలుగు సంవత్సరాల వయసులో లింగమూర్తి పాటల రచనతో సాహిత్య రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుండి సాహిత్యంలోని భిన్న ప్రక్రియల్లో రచనలు చేశారు. నాగర్‌కర్నూలులోని జాతీయోన్నత పాఠశాలలో 1954లో తెలుగు పండితులుగా ఉద్యోగంలో చేరారు. ఆ పాఠశాలలో పనిచేసే కాలంలోనే అక్కడి హనుమదాలయంలో పాండురంగ విగ్రహ ప్రతిష్టాపన చేసిన చిక్కేపల్లి రామచంద్రరావుతో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రోద్బలం వల్ల శతక రచనకు శ్రీకారం చుట్టారు.

‘నాగర కందనూలు పురనాయక పండరినాథ విఠ్ఠలా’ అనే మకుటంతో పండరినాథ విఠల శతకాన్ని 1972లో రచించారు. ముద్రితమైన లింగమూర్తి తొలి రచన అది. అక్కడి నుండి ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. పది శతకాలు, ఏడు ద్విపద కావ్యాలు, మూడు సంకీర్తనలు, పదిహేడు చారిత్రక కథనాలు, నాలుగు ఉదాహరణలు, మూడు ఆధ్యాత్మిక గ్రంథాలు, రెండు కథల సంపుటాలు, ఒక అనువాద గ్రంథం ఒక నాటకం, ఏడు తాత్పర్యాలు, వ్యాఖ్యానాలు మొదలైనవి రచించారు. నాలుగు ప్రత్యేక సంచికలకు సంపాదకులుగా ఆయన వ్యవహరించారు. మరో ఐదు వ్యాఖ్యాన సహిత కావ్యాలను వెలువరించారు. ప్రాచీన సాహిత్యంలోని 25 కావ్యాలను ఆయన పరిష్కరించారు. వాటిని వ్యాఖ్యాన సహితంగా వెలుగులోకి తీసుకు వచ్చారు. దాదాపు 300కు పైగా గ్రంథాలకు విలువైన పీఠికలు రాశారు.

మరుగున పడ్డ తాళపత్రాల్లోని వివిధ అంశాలను లింగమూర్తి వివరించి, ప్రాచీన కవులను నేటి తరానికి పరిచయం చేశారు. మరుగున పడిన అనేక శాసనాలను వెలుగులోకి తెచ్చారు. జానపదుల పద సంపదను అందరికీ తెలియపర్చారు. వివిధ గ్రంథాల రచన కోసం విస్తృతంగా పర్యటించారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ దేవాలయాల చరిత్రపై పరిశోధన చేసి, ‘పాలమూరు జిల్లా దేవాలయాలు’ అనే పేరుతో ప్రచురించారు. అమరాబాదు స్థల చరిత్రను ‘శ్రీమత్ప్రతాపగిరి ఖండం’ అనే గ్రంథంగా వెలువరించారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా మాండలికంలోని దాదాపు ఆరువేల పదాలకు అర్థం, పదప్రయోగ సహితంగా ‘పామర సంస్కృతం’ రాశారు. మాండలికంలోని జాతీయాలను కూడా ఈ గ్రంథంలో చేర్చడం విశేషం. నాటి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, జానపదుల వ్యవహారంలోని పలు పదాలను సేకరించి, రచించిన ఉత్తమ గ్రంథమిది.

క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాలతో ‘పాలమూరు కవి పండిత కుటుంబాలు’ అనే పేరుతో మరో గ్రంథం రచించారు. భాగవతంలోని పది కథలకు వ్యాఖ్యానంతో ‘భాగవత కథా తత్వం’ వెలువరించారు లింగమూర్తి. కన్నడ భాషలో ఉన్న విశ్వబ్రాహ్మణుల సంస్కృతి వివరాలను తెలుగులోకి అనువదించి, పలువురి మన్ననలందుకున్నారు. భువనవిజయాన్ని ‘రాజరథం’ అనే పేరుతో నాటకీకరించారు. మూడు తరాలలోని కపిలవాయి వంశ చరిత్రను ‘మా భగోట’ అనే పేరుతో గ్రంథస్థం చేశారు. ‘యయాతి చరిత్ర’ను టీకా తాత్పర్య సహితంగా వెలువరించారు. తెనాలి రామకృష్ణుడు రాసిన ‘ధీరజన మనో విరాజితం’ను పీఠిక సహితంగా వెలుగులోకి తెచ్చారు. ‘యోగాసక్త పరిణయ’ ప్రబంధాన్ని ప్రాచ్యలిఖిత భాండాగారం ప్రచురించింది. మాంగళ్య ధారణలోని గూఢార్థాలను, విశేషాలను వివరిస్తూ ‘మాంగల్య శాస్త్రం’ను ఆయన రచించారు.

పలు గౌరవ పురస్కారాలు, బిరుదులను డాక్టర్ కపిలవాయి లింగమూర్తి పొందారు. ‘కవితా కళానిధి’, ‘పరిశోధక పంచానన’,‘కవి కేసరి’, ‘వేదాంత విశారద’, ‘సాహితీ విరాణ్మూర్తి’, ‘గురు శిరోమణి’, ‘సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి’ అనే బిరుదులను పొందారు. తెలంగాణ రాష్ట్రావతరణ అనంతరం తొలి గౌరవ డాక్టరేటు స్వీకరించిన సాహితీవేత్తగా ప్రత్యేకత పొందారు. తెలుగు విశ్వవిద్యాలయ 13వ స్నాతకోత్సవంలో గౌరవ డి.లిట్. పట్టాను పొందారు. తెలంగాణ అవతరణకు పూర్వం అదే విశ్వవిద్యాలయం 2011 సంవత్సరంలో విమర్శ, పరిశోధన రంగాల్లో ప్రతిభా పురస్కారం అందజేసింది.

పలువురు ప్రముఖుల నుండి ఆయన పురస్కారాలను పొందారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ చేతుల మీదుగా స్వీకరించారు. పూర్వ ముఖ్యమంత్రులు ఎన్.టి.రామారావు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, పూర్వ గవర్నర్ కృష్ణకాంత్ తదితరుల నుండి వివిధ సందర్భాల్లో సన్మానాలను పొందారు. పలు సంస్థలు ఆయనకు వేర్వేరు సందర్భాల్లో పురస్కారాలను అందజేశాయి. తెలంగాణలోనే కాకుండా బెంగుళూరు, రాజమండ్రి, కడప, తిరుపతి, విజయవాడ తదితర రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ఆయన గౌరవ సత్కారాలు, పురస్కారాలు పొందారు. కపిలవాయి లింగమూర్తి రచించిన కవితలు, గీతాలు, వచనాలు, శతకాలు, వచన శతకాలు, కావ్యాలు, ద్విపదలు, నాటకాలు, ఉదాహరణలు, స్థల చరిత్రలు, బాల సాహిత్యం ఆయన ప్రతిభకు అద్దం పడుతాయి. అత్యంత క్లిష్టమైన చిత్రపది, శబ్దపది, బంధాలతో రచనలు చేసి, విమర్శకుల ప్రశంసలందుకున్న సాహితీ దురంధరుడు ఆయన. ఆయన రచనలు తెలుగు పలుకుబడుల సౌందర్యాన్ని పాఠకుల కళ్లెదుట ఉంచుతాయి. మన కాలపు మహా రచయిత కపిలవాయి లింగమూర్తి.

Related Articles

- Advertisement -

Latest Articles