Home ఆఫ్ బీట్ కరీంనగర్ జిల్లా శాసనసాహిత్యం

కరీంనగర్ జిల్లా శాసనసాహిత్యం

kalam

చారిత్రకంగా భౌగోళికంగా కరీంనగర్ జిల్లాకు మనదేశంలోనే ప్రత్యేక స్థానం ఉన్నది. ఆదిమానవులు సంచరించిన జాడలు ఇక్కడ ఆధారాలతో లభించినవి. ఇక్కడి గోదావరి, మానేరు నదులు ఇప్పటికన్నా ఎంతో విస్తీర్ణంతో జీవనదులుగా వ్రహించేవి. ఇక్కడి గోదావరి సముద్రం అంచుదాకా ఒక ప్రధాన నీటి మార్గంగా ఉపయోగపడింది. ఇక్కడి పీఠభూమి మానవులు కర్రదుంగలు బల్లకట్టు ద్వారా పల్లపుప్రాంతాలను అన్వేషిస్తూ వలుసలు సాగించారు. అనేక సౌకర్యాలకు నిలయమైన, మానవులకు జీవనాధారమైన ప్రదేశంగా దీనిని గుర్తించిన శాతవాహనులు తమ తొలి రాజధానుల్లో ఒకటైన గోదావరి ఒడ్డున కోటి లింగాల ప్రాంతం లో నిర్మించుకున్నారు. దాదాపు 450 సంవత్సరాలు వీరు పరిపాలించారు. శాతవాహనులకు కథా సాహిత్యానికి సంబంధం ఉంది. నాటి ప్రాంతీయ వ్యవహార భాష అయిన “పైశాచీ” భాషలో గుణాడ్యుడు బృహత్కథను సంకలనం చేశాడు. అతను సిముకుని ఆస్థాన కవి “పైశా చీ” భాష నుండి సోమదేవుడు సంస్కృతంలోకి అనువదించిన “కథా సరిత్సాగరం” ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కావడానికి కారకులైన సిముక, గుణాడ్య, హాలుడు. సోమదేవ ప్రభుతులు ఈ ప్రాంత సాహితీ రంగానికి పెట్టనికోటలైనిల్చినారు.
కరీంనగర్ జిల్లాకన్నా జనాభాలో వైశాల్యంలో చిన్నవైన దేశాలెన్నో ఉన్నాయి. ఈ జిల్లా ఒక దేశమైతే అన్ని రంగాల్లో సాధించాల్సిన స్వయం సమృద్ధికి నిర్థిష్ట ప్రణాళికలు అవసరమైనట్టే సాహిత్య, కళా సాంస్కృతిక రంగా ల్లో అవసరం ఈ జిల్లా ప్రజల జీవితాన్ని చిత్రించే సినిమా యిప్పటివరకు రాలేదు. సినిమాలో, టి.విలో, రేడియోలో ఈ జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రచనలు యిప్పటికి అంతగా రావడంలేదు. ఈ జిల్లా కవులకు, రచయితలకు నిలయమై తెలంగాణా ప్రాంత సాహిత్య, సాంస్కృతిక చారిత్రక చరిత్రకు ఇది పునాది రాయియై నిల్చినది. వెయ్యేండ్ల ఆంధ్ర సాహిత్య మహాస్రవంతిలో ఈ కరీంనగర్ జిల్లా సబ్బిరాష్ట్రం తెలుగు సాహిత్యం ఒక జీవనదివలె ప్రకాశించినది.
ఈ జిల్లాలో వందల సంఖ్యలో తెలుగు కవులు అసంఖ్యాక కావ్యాలను రచించారు. నేటి కరీంనగర్ జిల్లా పరిధిలోని నాటి సబ్బిసాయిర మండలంలో వేములవాడ, రామగిరి, నగునూరు, పొలనాస, వెలిగందుల, ధర్మపురి ప్రముఖ యాత్రా స్థలాలు.
కరీంనగర్ జిల్లా (సబ్బివాడు)లో తొలి తెలుగు పద్యకవిత వేములవాడ జినవల్లభుని కంద పద్యాలతో కీ॥శ॥ 946 సం॥లో ఆరంభమైంది. ఈ జిల్లాలో కావ్యసాహిత్యం కంటే ముందు శాసన సాహిత్యం కన్పిస్తున్నది. గంగాధర మండల కేంద్రానికి అతి సమీపంగా కురిక్యాల దగ్గర కొండన్నపల్లె గ్రామం కలదు. అక్కడ జినవల్లభుని శాసనం ఇప్పటికి పెద్దరాతిపై కన్పిస్తుంది.
కన్ధం: జినభావనంబు లెత్తించుట
జినపూజల్సేయుచున్కి జినమునులకున
త్తిన యన్న దానం బీవుట
జినవల్లభు బోలంగలరెజిన ధమ్మన్ పరుల్
దినకరుసరి వెల్గుదుమని
జిన వల్లభు నొట్టు నెత్తుజతకవిననుం
మన జుల్గలరే ధాత్రిం
విని తిచ్చదు ననియ వృత్తకవీన్ద్రుల్
ఒక్కొక్క గుణంబు కల్గుదు
రొక్కొణ్దగా కొక్కలక్కలేవెవ్వరికిం
లెక్కింప నొక్కొలక్కకు
మిక్కిలి గుణపక్షపాతి గుణముణిగణంబుల్
జినవల్లభుడు శాసనకవి పంపకవి సోదరుడు. ఇక్కడ దిగంబరమైన మఠం ఉండేది. ఇదే శతాబ్దిలో రెండవ అరికేసరికాలంలో కురిక్యాల శాసనానికి కొంచెం ముందుగా జినవల్లభుని అన్న పంప మహాకవి కన్నడ భాషలో విక్రమార్జున విజయం, ఆదిపురాణం ఇక్కడి వేములవాడలో రంచించాడు. “పంపకవి”కి కొంత తర్వాతివాడైన “కాశ్మీరకవి” సోమదేవసూరి కీ॥శ॥959 మూడవ అరికేసరి కాలంలో ఇదే వేములవాడలో యశస్తి లక చంపువు కథాసరిత్సాగరం, నీతి సూక్తి ముక్తావళి అనే గ్రంథాలు సంస్కృతంలో రచించాడు. పంప, సోమదేవ కవులిద్దరూ జైనులు. కళ్యాణి చాళుక్యులు కర్ణాటక భాషనే ఆదరించారు. శిలా శాసనాలు తప్ప, ఆ కాలంలో తెలుగు కన్నడ సంస్కృత భాషల్లో ఏ ఒక్క కావ్యరచన కానీ, ఇక్కడ జరిగిన ఆధారాలు లేవు.
కాకతీయుల కాలంలో మంథని కాళేశ్వర ప్రాంతాల్లో ఉద్దండ సంస్కృత పండితులుండేవారు. వారు చక్రవర్తుల ప్రాపునందారు, సన్మానాలు అందుకున్నారు. కాని వారు ఏ భాషలో కావ్యరచనలు చేసిన ఆధారాలు లేవు. సాహితీలోకంలో స్థలకాల రచనల విషయాల్లో వివాదాస్పదుడైన వేములవాడ భీమకవి మాత్రం ఈ కాలంవాడు. కావ్యాలు కాకున్నా కావ్యాలన దగిన రెండు పద్యశాసనాలు ఈ మండలంలో కాకతీయయుగంలో లభించాయి.
గద్యశాసనాలు, కేవలం భాషా స్వరూప చారిత్రక విషయాల అవగాహనకు ఉపకరించేవి పద్యశాసనాల్లో వెల్లంకి గంగాధర మంత్రి నగునూరు శాసనం. మహా కవి తిక్కన సోమయాజికి 60, 70 ఏండ్ల పూర్వపుది; గొడిశాల చంపూశాసనం ఇంచుమించు తిక్కన కాలపుది. కటుకూరు, మంథని, కాళేశ్వర శాసనాలు సంస్కృతంలో ఉన్నాయి.