Home ఎడిటోరియల్ గ్రంథాలయోద్యమ ఖిల్లా నల్లగొండ జిల్లా

గ్రంథాలయోద్యమ ఖిల్లా నల్లగొండ జిల్లా

Librarian movement

 

నిజాం నిరంకుశ పాలనలో కుళ్ళి కృశించి కోడు గట్టిన జీవితాలను, తెలంగాణ సమాజాన్ని మెలుకొల్పింది గ్రంధాలయ ఉద్యమం. గ్రంథాలయం ఒక సజీవ మూర్తి, ఒక చైతన్య స్రవంతి మన చరిత్రలో, సంస్కృతిలో, జాతీయ సంపందలో ఒక ముఖ్య భాగం. విశేషమేమిటంటే నాటి అన్ని ఉద్యమాల కంటే కూడా గ్రంధాలయోద్యమం ముందున్నది గ్రంధాలయోద్యమమే స్వాతంత్య్రోద్యమానికిగాని, నిజాం వ్యతిరేక ఉద్యమానికి దిక్సూచి అయ్యిం ది. అయితే 19 వ శతాబ్దం చివరి భాగాన తెలంగాణ వ్యాప్తంగా గ్రంథాలయాలు ఏర్పడినా హైదరాబాదులో 1901 స్థాపించిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం తెలంగాణ సమాజంలో సాంస్కృతిక, సాహిత్య, తెలుగు భాషకు, రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. దీని తరువాత రాజరాజ నరేంధ్ర ఆంధ్ర భాషా నిలయాన్ని 1904 హనుమకొండలో స్థాపించారు. వీటిని అధారగా చేసుకొని 1927 నాటికి నిజాం రాష్ట్రంలో వందకు పైగా గ్రంథాలయాలు స్థాపించారని అంచనా కాని అధికారిక లెక్కల ప్రకారం 63 పైగా గ్రంథాలయాలు స్థాపించినారు అని అంచనా. వాటిలో జిల్లాల వారిగా పరిశీలిస్తే హైదరాబాద్ -7, సికింద్రాబాద్-4, వరంగల్లు జిల్లా -15, కరీంనగర్ జిల్లా- 9, నల్లగొండ జిల్లా- 13, మహబూబ్‌నగర్ జిల్ల్లా- 5, మెదక్ జిల్ల్లా- 5, నిజామాబాదు- 1, అదిలాబాదు జిల్ల్లా-1, రాయచూర్ జిల్లా- 1.

మహబూబియా రిడింగ్ రూమ్ 1915 నలగొండ; ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథనిలయం 1917 సూర్యాపేట; శ్రీ ఆంధ్ర సరస్వతి నిలయం 1918 నల్లగొండ; శ్రీ భారతియాంధ్ర గ్రంథాలయం 1921 నల్లగొండ; బహిరామియా గ్రంథాలయం 1921 కొలనుపాక; తాళపత్ర గ్రంథ నిలయం 1923 కనగల్లు; విష్ణు నగరాంధ్ర భాషా నిలయం 1923 విసునూరు; శ్రీ బేతి రెడ్డి గ్రంథాలయం 1924 పిల్లలమర్రి; శ్రీ సీతారామ పుస్తక భాండాగారం 1924 కందిబండ; శ్రీ యువజన సంఘం 1924 జనగామ; శ్రీరంగభారతి గ్రంథ నిలయం 1924 కాపుగల్లు; శ్రీ పాలగిరి గ్రంథాలయం 1925 చాడా; శ్రీ విజ్ఞాన నికేతనం 1940 హుజూర్‌నగర్; రైతు గ్రంథాలయం 1942 చిలుకూరు; బాల భారతి నిలయం 1921 నల్లగొండ; శ్రీ భారతి గ్రంథాలయం 1925 నలగొండ, సిరిపురం గ్రంథాలయం 1940 సిరిపురం; శ్రీ విజ్ఞానాంధ్ర గ్రంథాలయం 1940 భువనగిరి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.

కాని స్వాతంత్య్రానికి పూర్వం దాదాపు మన నల్లగొండ జిల్లాలో 45 గ్రంథాలయాలున్నాయి. నల్లగొండలో గిరుల మీద గిరులు భువన యాదగిరిలున్నాయి. దురాజుపల్లి గుట్టలున్నాయి. రాచకొండ కొండలున్నాయి. నల్లగొండ జిల్లాలో చైతన్య ఉంటుంది, అన్యాయాన్ని ఎదిరించే తత్వముంటుంది, ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి, దుర్మార్గాన్ని ధిక్కరించే సాహిత్యం ఉంటుంది. ఈ జిల్లాలో జైనం, బౌద్ధం, శైవం వర్ధిల్లాయి. నాడు ఈ జిల్లాలో నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ రైతాంగ పోరాటాలు ఉవ్వెత్తున్న ఎగిసిపడటానికి అనేక కారణాలు ఉన్నా ఒక ప్రధాన బలీయమైన కారణం తెలంగాణలో నాడు ఈ నీలగిరి గడ్డలో 13 గ్రంథాలయాలు స్థాపించడం కూడా. ఈ నీలగిరి మట్టి బిడ్డలు విజ్ఞానాన్ని పొంది దొరల గడీలను ధిక్కరించే స్వరం పెంచి సాంఘిక చైతన్యానికి తెర లేపారు.

మన ఉద్యమాల పోరుగడ్డలో 1917 అక్టోబర్ మాసంలో సుర్యాపేట తాలుకాలో విజయ దశమి రోజున భువనగిరి లక్ష్మీనారాయణ ఇంట్లో పువ్వాడ వెంకటప్పయ్య శ్రీ ఆంధ్ర విజ్ణాన ప్రకాశిని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనితో పాటు కృషి ప్రచారణి గ్రంథమాల స్థాపించారు. నాటి ఈ గొప్ప లక్ష్యానికి కోదాటి లక్ష్మీనరసింహరావు, రామకృష్ణారావు, కన్నెగంటి వీరాచారి, యామా కన్నయ్య, నకిరెకంటి రామలింగయ్య, యామా కన్నయ్య అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండ వీరికి మాడపాటి హనుమంత రావు, సురవరం ప్రతాప్ రెడ్డి సహాయ సహకారాలు ఎన్నటికీ మరువలేనివి. సుర్యాపేటలోని ఈ గ్రంథాలయం కేవలం గ్రంథనిలయంగానే గాక ఉద్యమ కేంద్రంగా జిల్లా మొత్తం నలుమూలల నిజాం వ్యతిరేక ఉద్యమానికి ముఖ్య భూమిక పోషించింది.

‘బేజాప్తా‘ కార్యక్రమం పేరుతో గ్రంథ భిక్ష సేకరించేవారు. జాతీయ పండుగలు, దేశ నాయకుల జయంతులు, వర్ధంతుల కార్యక్రమాలు రహస్యంగా గ్రంథాలయానికి ప్రక్కన ఉన్న భువనగిరి లక్ష్మీనారాయణ ఇంట్లో జరిగేవి. దీపావళి పండుగ సందర్భంలో పెద్దలందరూ గ్రంథాలయ భిక్ష పేరుతో విరాళాలు, పుస్తకాలు, వార, మాస పత్రికలు, వివిధ భాషలలో (ఉర్దూ, తెలుగు, హింది) ఉన్న పుస్తకాలు సేకరించి గ్రంథాలయానికి పోగు చేసేవారు. అలా సేకరించిన గ్రంథాలు నాడు పది వేలకు పైచిలుకుకు చేరుకున్నాయి.

‘నైజాం సర్కరోడా నాజీల మించినోడా చుట్టు ముట్టూ సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ, నీ వుండేది హైదరాబాద్, దాని పక్క గోల్కొండ, ఖిల్లా కిందా నీ గోరి కడుతామ్ కోడుకో నైజాం సర్కరోడా’ అని గర్జించిన సాహిత్య వీర కిశోరం యాదగిరి, లెఫ్ట్ ఉద్యమ నేత అజాత శత్రువు ధర్మభిక్షం, వర్దెల్లి బుచ్చిరాములు, విద్యాసాగర్ రావ్ లాంటి ఉద్యమ బిడ్డలను అందించిన ఈ నీలగిరి బిడ్డలు శ్రీ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినిలో పుస్తకాలతో కుస్తీ పట్టినవారే. నాడు నిజాం ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రంథాలయాలు స్థాపించరాదని, సామావేశ మందిరాలు నిర్మించరాదని, తెలుగు పత్రికలు చదువవద్దు అని పర్మానా విధించారు. దీనికి కారణం ప్రజలు గ్రంథాలయాల వలన విజ్ఞానం పొంది ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తారని స్థానిక పోలీసు అధికారులు అనుమతి లేనిదే గ్రంథాలయాలు స్థాపించరాదని బలవంతంగా గ్రంథాలయాలను మూసివేయించారు. ఇది నిజాం రాష్ట్రంలో సూర్యాపేట గ్రంథాలయంపై జరిగిన మొట్ట మొదటి దాడి. మాడపాటి హనుమంతరావు సహకారంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి సహకారంతో గ్రంథాలయం పునః ప్రారంభమైంది.

ఇదే పోరు భూమిలో మరొక విజ్ఞాన కోవెల 1918లో నల్గొండ పట్టణంలో ఆంధ్ర సరస్వతి గ్రంథ నిలయంను శబ్నవిశ్న వెంకట రమణ నరసింహ రావు స్థాపించారు. నల్గొండ జిల్లాలోని ఉద్యమకారులు గ్రంథాలయంలోని ఆంధ్రపత్రిక, ఉర్దూ పత్రికలు, వివిధ పత్రికల పఠనం ద్వారా విజ్ఞానాన్ని సంపాదించి నిజాం దౌష్టానికి, అకృత్య పాలనకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాందీ పలకడానికి ఈ గ్రంథాల యం కూడ ఒక కారణం అని చెప్పడంలో సందేహం లేదు.

అంధ్ర జన సంఘం నాలుగవ మహాసభ రెండవ తెలంగాణ గ్రంథాలయాల మహాసభలు సుర్యాపేటలో నిజాం ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా గ్రంథాలయ ఉద్యమకారులు ఎదురు నిలిచి శ్రీ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయంలో దిగ్విజయంగా జరుపుకున్నారు. అదే విధంగా ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభలు తెలంగాణ ప్రాంతంలో (సూర్యాపేట, నల్గొండ, వరంగల్, దేవరకొండ, జోగిపేట) మహా సభలు జరగడం వల్ల ఆ ప్రాంతాల్లో గ్రంథాలయాల్లో పఠనాలయాలు, పాఠశాలలు స్థాపించి ప్రజలను విద్యావంతులు చేసి నిద్రాణమయి ఉన్న స్వాతంత్య్రోద్యమ కాంక్షను ప్రజలలో చిగురింపజేశాయి. నిజాం రాష్ట్ర లైబ్రరీ ఉద్యమం రెండవ సమావేశం 1928లో సుర్యాపేటలో జరిగింది. గోవా నుంచి ముఖ్య అతిధిగా స్వాతంత్య్ర సమర యోధుడు వామ న నాయక్ అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుండి దాదాపు 29 గ్రంథాలయా ప్రతినిధులు హాజరయ్యారు. గ్రంథాలయ ఉద్యమం తెలంగాణ ప్రజలను మేల్కొల్పడంలో కీలక పాత్ర పోషించింది.

రావి నారాయణ రెడ్డి అధ్యక్షత ఎనిమిదవ ఆంధ మహాసభ జరుగుతున్న (నల్గొండ జిల్లాలో హుజూర్‌నగర్ సమీపం చిలుకూరులో) కాలంలో చిలుకూరు గ్రంథాలయం బాపూజీ గ్రంథాలయ గా వెలుగొందుతున్నది. 1942 రావినారాయణ రెడ్డి చేతుల మీదుగా రైతు గ్రంథాలయం ప్రారంభించబడింది, నాడు కీ.శే. అమరనాయిని అలివేలు మంగమ్మ గాంధీ పార్కుతో ఉన్నఈ స్థలాన్ని గ్రంథాలయానికి విరాళంగా రాసి ఇచ్చారు. నాడు ఈ గ్రంథాలయం 600 గ్రంథాలతో ప్రారంభించబడింది. నేడు దాదాపు 10 వేల పై చిలుకు గ్రంథాలు ఉన్నాయి.

నాటి రజాకార్ల ఆగ్రహానికి గురై కొన్ని రోజులు రహస్య ప్రాంతంలో నడపబడింది. తరువాత కొత్తూరు మాణిక్యం ఇంటిలోకి మార్చబడింది. తరువాత రజాకార్ల నిర్బంధం వలన రెండవ సారి కూడా ఈ గ్రంథాలయం అజ్ఞాత వాసం (దాదాపు ఆరు నెలలు) చేయాల్సి వచ్చింది.

నీలగిరి నుండి సమాజానికి దొరికిన మరొక గ్రంథాలయ ఉద్యమ శిఖరం ప్రజల మనిషి వట్టికోట అళ్వారు స్వామి మాచవరం సింహాద్రమ్మ, రామచంద్రచార్యుల పుణ్య దంపతులకు మన ఉద్యమ గడ్డలోని, నకిరెకల్లు తాలుకాలో, శాలిగౌరారం మండలం, మాదవరం కలాన్ గ్రామంలో, 1 నవంబర్ 1915లో జన్మించాడు. నకిరకల్లులో కాంచనపల్లి సీతారామ రావు అనే గురువు దగ్గర వంట పని చేస్తూ అతని వద్దనే విద్యాబుద్ధులు నేర్చుకొన్నాడు. కాంచనపల్లి సీతారామ రావుకి నకిరెకల్లు నుండి సూర్యాపేటకు బదిలి కావడంతో అళ్వారు స్వామి కూడా సూర్యాపేటకు వలస వెళ్ళాడు. అధ్యాపకుని దగ్గర వండిపెడుతూ, హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తూ, 1933 దాక కందిబండ గ్రామానికి చెందిన నారపరాజు సోదరులకు పని చేసిపెడుతూ ‘అణా గ్రందమాల’ పుస్తకాలను అమ్మిపెట్టె ఒక ఉద్యమాన్ని కొనాసాగించారు. తెలంగాణలో పల్లెపల్లెన పుస్తకా లు (గ్రంధాలు) బుట్టలో పెట్టుకొని పండ్లు ఏ విధంగా అమ్ముతారో పుస్తకాలను అ విధంగా ప్రజలకు అందించి వారిని విద్యావంతులు చేయడంలో, వారిని విజ్ఞానమనే చైతన్య దివిట్లని వెలిగించడంలో అతని కృషి అనితర సాధ్యం.

జైలు లోపల (జైల్ ఇన్సైడ్), ప్రజల మనిషి (పీపుల్స్ మాన్) (1952) అనే నవలను, గంగు (1940 -45) అనే ( అసంపూర్ణ) నవలను 1952లో రాసిన జైలు లోపల కథల సంపుటి, రామప్ప రభస వ్యాస సంపుటి మొదలగు నవలలు రచించారు. తెలంగాణ ప్రాంతంలో విద్యను పెంపొందించుకునేందుకు పుస్తకాలను బుట్టల లో పెట్టుకొని (పండ్లు ఏ విధంగా బుట్టలలో పెట్టుకు అమ్ముతారో) ప్రజలకు ఆ విధంగా అందించారు. వారికి చదివే అలవాటుని పెంపొందించడంతో పాటు పుస్తకాలను సేకరించి ‘ఆణా’ పుస్తకం లేదా ‘ఆణా’ గ్రంధాలను (రెండు అణాలకు ఒక పుస్తకం) ప్రజల కు అందించాడు.

నాడు ఇరుబది ఐదు సంవత్సరాల వయస్సులోనే 1938లో కాశీనాథుని నాగేశ్వర రావు పేరు మీద (వారి మరణాంతరం) ‘దేశోద్ధారక గ్రంధమాల’ స్థాపించి చాల తక్కువ రేటుకు పుస్తక ప్రియులకు, పల్లె ప్రజలకు, స్వాతంత్య్ర సమరయోధులకు (ఉద్యమకారులకు) అందించాడు. ఆయన ‘దేశోద్ధారక గ్రంథమా’ నుండి దాదాపు 33 పుస్తకాలు ప్రచురించడం జరింగింది. దేశోద్ధారక గ్రంధమాల నుండే సురవరం ప్రతాప రెడ్డి నవలలు, ప్రజా కవి కాళోజీ నారాయణ ‘నా గొడవ’ దీనిని నుండే ప్రచురించబడ్డాయి. మన రాష్ట్ర ప్రభుత్వం నలగొండ జిల్లాలో ఉన్న అపురూపమైన గ్రంథాలయాలను కాపాడాలి. వాటికి పునర్ ఉత్తేజాన్ని కల్పించాలి. అదే విధంగా జిల్లాలో గ్రంథాలయాల కోసం పరితపించిన మహనీయుల పేరున జిల్లా వ్యాపంగా గ్రంథాలయాలు నెలకొల్పాలి.

Article about Librarian movement