Home కలం నిశ్చల అనిశ్చితమ్!

నిశ్చల అనిశ్చితమ్!

article about lo choopu veli choopu book

 

ఈ కాలమని, ఆ రుతువనీ చెప్పడానికి లేదు; అది కాలాన్ని తరాలుగా చీల్చిన యుగం- అది యుగాల అంతరాల్ని చెరిపేసిన సమయం. సాధారణ అర్థంలో సమయాలుగా లెక్కకట్టలేని అటువంటి సందర్భాలకి చిక్కని, అంతుచిక్కని…
గోళాలకి, ఖగోళాలకీ చెందని…
…. సీమ ఉందొకటి నాది! అచ్చంగా అది నాదే!!
అది ఎలాంటిదంటే, ఉప్పెన సముద్రాన్ని నలుచెరగులా వెనక్కి తోసిన నేల, లేదా ఉప్పటి నీరు నలుదిశలా మింగితే మిగిలిన లంక. అది ఏకాంతంలా పరుచుకున్న మైదానం కాదు, పోనీ ఏకాకితనమై విస్తరించిన అడవీ కాదు. కట్టడాలతో ఇరుకైన ఊరూ కాదు, కాలే కట్టెల గుర్తులైనా మిగలని కాడు కూడా కాదు.
అక్కడ ఆలయం లేదు.. అల్లా లేడు… అసలు ఎల్లానూ లేదు.
అటువంటి నాదైన దేశంలో… సొంత ప్రదేశంలో –
ఎంకిడుకి ఎల్లడు వల్ల మరణం… ప్రాణాధిక సావాసి ఎడబాటుతో శోకం, చేజార్చుకున్న సతత యవ్వన సంజీవని వల్ల సంతాపం, మహా మోహదాహాల గిల్గమేశుడు అల్లిన గీతాలేవో ఆ మూల నీలిరాతిగుట్టల్లో మార్మోగుతున్నాయి.
అనాది ఋత్విక్కుల ఆది ఋగ్వేద శ్లోకం… ’అగ్నిమీళే పురోహితం…’ సామూహిక సమారాధనై, మానవేతిహాసాల తొలి వాక్ చైతన్యమై అలుముకుంటుంది.
ఏకానేక కీచుగొంతుకల గ్రీసు ఆత్మాశ్రయ గీతాలు విమలగాంధర్వ గానాలై, జంత్రవాద్యాల జంట జాతరై పేట్రేగుతున్నాయి.
’అగ్ మెమ్నాన్ చెరలో ట్రోజన్ ్రాణి ్ర్కైసెస్, అతిరథ… మహారథ అకిలెజ్ కి ఆగ్రహం, తను ఆరాధించే బ్రైసెస్ ని బేరం పెడితే అలగడా మరి అకిలెజ్, క్రైసెస్‌ని వదిలేయాలంటే బ్రైసెస్ కావాలని కదా అగ్ మెమ్నాన్ మెలిక, అలిగిన అకిలెజ్ మానేయకుంటాడా మహాయుద్ధం….’ అని హోమర్ కవనోధృత ’ఇలియడ్’ హోరుకి అనిబద్ధ అనన్విత రాగాలు కడుతున్నాడో రాలుగాయి Rhapsode.
అనామకంగా ఆగమైపోతున్న ప్రేయసీప్రియుల ప్రళయాంతరంగ ప్రణయాన్ని ’అగం’ ఆశుకవిత్వాలు అల్లుతున్నారు సంగం కవులు ఒక పక్క. నిరీక్షణ… అలక… వియోగం… విరహం…. వివశ సమాగమాల అనేకానేక నైరూప్యావస్థల నయనార్ల ఎదగాయాలు గేయాలై… గానాలై… లాస్యాలై నయనానందకర దృశ్యాలవుతున్నాయి.
చీనీచీనాంబర సిలుకుపోగుల కులుకు రవరవల్లాంటి, చిలిపి చిలక గుసగుసల వంటి ప్రా-చీనీయ చికిలింత రాగాలు రిక్కించిన చెవులకే దక్కుతున్నాయి.
ఆళ్వారు అంటే మునిగిపోయినవాడనే అర్థాన్ని సార్థకం చేస్తూ దాస్య… సఖ్య… మధుర భక్తుల మనసారా మమేకమై… నిండారా నిమగ్నమై… తనివితీరా తన్మయులై ఆళ్వారులు ఇంకోపక్క ఏకతారలేవో మీటుకుంటూ పాశురాలు పాడుకుంటున్నారు.
’మదీనుబ్బ సంసార మాడూ స్తవంబు/ పదములు, పర్వత పదము, లానంద/ పదములు, శంకర పదముల్ నివాళి/ పదములు, వాలేశ పదములు, గొబ్బి/ పదములు, వెన్నెల పదములు, సెజ్జ/ వర్ణన మణిగణ వర్ణన పదము/ లర్లవ ఘోషణ….’ లకి పాల్కురికి సోమన పలికిన సాక్ష్యం నిజమైనట్టు తెనుగు పదాలు తెరలు చించుకొని కదిలొస్తున్న కలకలం!
’వీణాగానము వెన్నెల తేట/ రాణమీరగా రమణుల పాట/ పేరు చెప్పిన పిన బ్రాహ్మణవీట/ జాణలు మెత్తురు జాజర పాట…’ అని నాచన సోమన పలవరించిన పాట గతులు కుదిరిన జతులై గమకిస్తోంది.
అతని రేగిపండు రంగు వుడుపు మీద మెడకొంకు చుట్టూ జిగిబిగి అల్లికల జిలుగు నాడా, ఆ జల్లిగుడ్డ మీద నిన్నటి గెలుపుల సంకేతంగా పసిడి పున్నాగల పతకం. పీచుదారాలు పేనిన తాడుతో కట్టిన సారంగి తగిలించుకొని రేపటి పుష్ప కేళీ వాగ్గేయ వాద్యవాదనల పోటాపోటీకి పరాసు పదాల పచ్చి ప్రణయాన్ని పలవరింతల సాధన చేస్తున్నాడొక Troubadour.
లౌకికాలౌకికాల నడుమ కట్టిన తాళ్లపాక వారి నూనూగు తాడు మీద తంబుర మీటుకుంటూ, ఇహపరాల సమాంతరత్వం మీద సరితూగు సంకీర్తనై, నరనారాయణత్వాల మధ్య అభేదాలు ఆరోపించే అద్వైతాల నడతతో నడకతో, దేహమోహాన్ని, ఆత్మదాహాన్నీ పాడుకుంటూ వస్తున్నాడు సత్-చిత్-ఆనందమయ అన్నమయ్య.
కొంచెపు టంకాలు అంచెలంచెలుగా పిక్కటిల్లి ఢంకాలు మోగిస్తున్న మెత్తని మోతలో పులికంటి పూసల జెన్ జపనీయ జపమాల తెగి రాలిన చప్పుడు, హైకూ కప్పల నిశ్శబ్దం… విన్నవాడికి విన్నంత.
అలనాటి హరప్ప… మొహంజదారోల నుంచి ఈనాటి ఆధునికోత్తర హనన నాగరికతల వరకూ దేశకాలాలకి జాతిభేదాలకి అతీతంగా సంచార… దిమ్మర… భ్రమరకాంక్షులైన కవిగాయక, వాగ్గేయకార పరంపర అలా నా కాలాతీత ఆంతరంగిక ఆవరణంలో పరిభ్రమిస్తూ… నన్ను ఆవహిస్తూ!!

పదేళ్ల క్రితం తెలుగు ఎడిషన్ కి ఎడిటర్ గా, ఇంగ్లీషు ఎడిషన్ కి స్పెషల్ కరస్పాండెంటుగా నేను పనిచేసిన ’ద సండే ఇండియన్’ డిజిటల్ ఎడిషన్ లో నా బ్లాగ్ – ’Rhapsody’! వృత్తిపరంగా జర్నలిస్టునే కానీ, ప్రవృత్తిరీత్యా అంతర్లోకాల్లో నేను Rhapsode నే అంటూ, అదే పేరు నా బ్లాగ్ కి ఖాయంచేశారు మా ఫీచర్స్ ఎడిటర్ ప్రశాంతో బెనర్జీ.
మూగ స్వరాలతో మౌన రాగాలతో నిశ్శబ్ద గానాల నిలవనీటినై కదలక మెదలక మురిగిపోతుంటాను కదా, నేనెలా పాటల… సయ్యాటల… బలాదూర్ భట్టునౌతాను? భావగీతాలాపనల bard కాగలను, బడాయి కాపోతే.
అయ్యాను-
… అనంగరాగ ఆలాపనల అనాలోచిత ఆత్మలోక సంచారిని కాబట్టి!
‘The Puritans thought that we are granted the ability to love
Only through miracle,
but the troubadours knew how to burn themselves through,
how to make themselves shrines to their own longing.‘
… అంటుంది కవి Mary Szybist (’The Troubadours Etc.’).
… ప్రేమానుభవానికి తమని తాము దగ్ధం చేసుకునే, సుదీర్ఘమైన స్వీయ వాంఛాఫలసిద్ధికి తమని తామే కోవెలలు చేసుకునే troubadours అంశని వరంగానో, శాపంగానో పొందిన ప్రచ్ఛన్న పథికుడ్ని కనుక!
అందుకే ఈ సంకలనం – ’a troubadour’s diary’ అయ్యింది!
డైరీ ఏమిటి? ఆ ఆటగాళ్లు… పాటగాళ్లు… దరువులోళ్లు… మేళగాళ్లు… భజనగాళ్లు ఎవ్వరైనా రోజువారీ పద్దులు రాసుకోడం, చిట్టాలు ఎక్కించడం, ఆవర్జాలతో దస్కతు చేయడం ఏనాడూ లేదే.
ఆ troubadours కి లేదు, కానీ, ఈ troubadour కి ఉంది!

ప్రకృతీ పురుషుల కేళీవిలాస రసోద్రేక అనంత ఆనంద తాండవానికి నేనెంత వ్యసనపరుడ్నో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నా రాతల మొత్తానికీ మూలం, ముడిసరుకు అదే. ’ఆమె- అతను’ అనే వైరుధ్య శక్తుల కలయిక… ఎడబాటుల డోలాయమాన వైవిధ్య లాస్య లోలత్వానికి సహభోగిగా కంటే, ప్రేక్షకుడిగానే మరింత దాసుడ్ని. పాలుపంచుకునే స్వానుభవ భాగస్వామ్యం కంటే, చూసి, లీనమై, తన్మయమై, తరించే సదనుష్ఠాన సహానుభవం నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే నా ఈ ’లోచూపు- వెలిచూపు’ కి కారణం.
Minnesinger లాగా… Meistersinger ఒరవడిలో… Minstrel మాదిరిగా… Rhapsode వలెనే Troubadour నై మలినామలిన ప్రేమకావ్యాలు రాసుకుంటూ, ప్రాపంచిక సత్యాలు చాటుకుంటూ తిరిగే సంచార కవి డైరీ నోట్స్ ఎలాగైతే musings… memoirs… profiles… runes… popes… obituaries సమాహారమో నా ఈ రాత కూడా అంతే!

-నరేష్ నున్నా

“లోచూపు వెలిచూపు!”
a troubadours diary
(ఝరీ వచన కవన గ్రంథానికి రచయిత నరేశ్ నున్నా స్వయంగా రాసుకున్న ముందుమాట)

ప్రతులకు :అన్వీక్షికీ పబ్లికేషన్స్, 9849888773, https/www.amazon.in/dp/B09GNHDYJM సంప్రదించవచ్చును.