Home ఎడిటోరియల్ మారందాయి మహాశ్వేతాదేవి

మారందాయి మహాశ్వేతాదేవి

ph

“నా భారతదేశం ఇప్పటికీ ఒక చీకటి తెర వెనుక జీవిస్తూ ఉంది. ఈ చీకటి తెర ప్రధాన స్రవంతి ఈ దేశాన్ని పేదల నుండి, అణగారిన వర్గాల నుండి వేరు చేస్తుంది. ఈ చీకటి తెరను పూర్తిగా చింపివేయాల్సి ఉంది. తెర ను చింపివేస్తే కాని భారతదేశం తన నిజస్వరూపాన్ని తనకు తాను వీక్షించలేదు. తనను తాను పూర్తిగా కనుగొనలేదు”. రామన్ మెగాసెసె అవార్డును అంగీకరిస్తూ మహాశ్వేతాదేవి చేసిన ప్రసంగంలోని మాటలు అవి.
రచన, ఉద్యమం, కార్యాచరణ ముప్పేటలుగా కలగలిసిన అరుదైన వ్యక్తి త్వం మహాశ్వేతాదేవిది. రాస్తున్న రచనకి, జీవిస్తున్న జీవితానికి మధ్య అభేదం చెప్పగలిగిన అతికొద్దిమంది సృజనకారులలో ఆమె ముందు వరుసలో నిలుస్తారు.బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేంచంద్, శరత్‌చంద్ర, కిషన్ చందర్‌లలాగా తెలుగువారికి సొం తమైపోయిన మరో రచయిత మహాశ్వేతాదేవి. అమృతాప్రీతం, ఆశాపూర్ణాదేవి, కమలాదాస్, అరుంధతీరాయ్, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, ఓల్గా వంటి భారతీయ రచయిత్రులలో అగ్రగామి మహాశ్వేతాదేవి.
మహాశ్వేతాదేవి డ్రాయింగ్‌రూం రచయితా కాదు. రీడింగ్ రూం రచయితా కాదు. ఆమే క్షేత్రస్థాయి రచయిత. పుస్తక పరిజ్ఞానం కన్నా వాస్తవ సామాజిక జ్ఞానం మీద ఆధారపడే ఆమె సాహిత్య సృష్టి చేశారు. ఆమె బతికిన 91ఏళ్లలో 60 ఏండ్లు సాహిత్య సృష్టి చేశారు.
విద్యార్థి దశలోనే వామపక్ష భావాలను జీర్ణించుకున్న మహాశ్వేతాదేవి ఆంగ్ల అధ్యాపకురాలు గా అభివృద్ధి చేసుకున్నారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు నిలయంగా ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌లో (విద్యాలయంలో) చదవడం మూలాన స్వతంత్ర భావాలను అలవర్చుకున్నారు.మార్కిస్టు కావడం మూలాన ఉద్యోగం పోయినా చెక్కు చెదరని ధైర్యంతో సమాజ పాఠశాలోనికి ప్రవేశించారు.ప్రజల దగ్గర పాఠాలు నేర్చుకున్నారు.గోడలు లేని సమాజమే ఆమెకు పాఠశాల. గోడలు లేని సమాజానికి అధ్యాపకురాలు.
ఆమె అణగారిన వర్గాల ప్రజలతో, ఆదివాసీ జనాలతో కలిసి జీవించింది. వారితో కలిసి పోరాడింది. కలిసి పండుగలలో పాల్గొంది. వాళ్ళ కోసం రాసింది. ఆమె వాళ్లను నా ప్రజలు అన్నది. వాళ్లు ఆమె ను “మారందాయి”అన్నారు. అంటే పెద్దక్క అని అర్థం. మహాశ్వేతాదేవి భారతదేశంలో జరిగిన, జరుగుతు న్న వివిధ సంఘటనలపై సామాజిక రచనలు సృజన చేశా రు. ఆమె రచనలు పాఠకుల్ని కల్లోలపరుస్తాయి. ఎందుకంటే ఆ రచనలు నిండా ఆమె నిజమైన ముఖం ఉం టుంది కనుక. రచనల, కార్యాచరణల సంగమం ఆమె.
ఒక జీవిత కాలంలో ఒక వ్యక్తి సమాజానికి ఎంత చేయగలదో తెలుసుకోవడానికి మహాశ్వేతాదేవి జీవితం నిలువెత్తు ఉదాహరణ. ఆమె రచనలన్నీ క్షేత్ర పర్యటనలో ఆదివాసులతో కల్సి పంచుకున్న అనుభవాలు , వాళ్లనుభవిస్తున్న బాధలు, ప్రభుత్వాల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యల నుండి సృష్టించబడ్డవే. ఆదివాసీలను అక్కున చేర్చుకొని తానే ఒక ఆదివాసీ స్త్రీగా, ఆదివాసీ వ్యక్తిగా ఆదివాసుల నైతిక శక్తిగా మారిపోయిన మహాశ్వేతాదేవి జాతి గుర్తుంచుకునే,జాతిని మేల్కొలిపే ఆదివాసీ సాహిత్యాన్ని సృష్టించింది.
ఆమె రచనలు ఎవరిదీ అడవి, రాకాసికోర, ఒక తల్లి, రుడాలి, ఝన్సీరాణి అంధామాణిక్, అరణ్యేర్‌అధికార్, బషాటుడూ, (బషాయిటుడు) తదితర పేరొందిన నవలలతో పాటు మరెన్నో కథలను వెలువరించిన మహారచయిత్రి.
మహాశ్వేతాదేవి సఫాయిల శ్రమపై ఆధారపడి బతికే ప్రజల జీవితాన్ని నవలగా రాయగా దానిని తెలుగులోకి అనువదించి క్రితంలో ‘చతుర మాస పత్రిక’ ప్రచురించింది. ఆ కథలో ఆడ పిల్ల అనే కారణంతో పసి వయసులోనే పారవేయబడ్డ ఒక అందమైన బ్రాహ్మణ పాపను సఫాయి కుటుంబం చేరదీసి పెంచుతుంది. ఆ పాప పెరుగుతున్న క్రమంలో సఫాయి కార్మికుల జీవనాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తారు. ఆ నవల పూర్తి చేశాక సఫాయి కార్మికులమంటూ కొన్ని కులాల్ని సృష్టించిన సమాజంలో ఆ సమాజాన్ని సహిస్తూ బతుకుతున్నందుకూ మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఆ జీవితాల వేదనను భరించలేక చదవడం మానేయాలన్న తిరస్కారం, ఆ తిరస్కారం మనపైనే అన్న నిజం గ్రహింపునకు వచ్చి చదవడం కొనసాగించక తప్పని తపన పాఠకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
“ నా రచనలు చదివాక, పాఠకులకు తమ చుట్టూ ఉన్న సమాజంపైన అసహ్యం కలగాలి. ఆ అసహ్యంతో ఆ సమాజాన్ని మార్చుకునేందుకు ఏదో ఒక రూపంలో నడుం బిగించాలి” అని మహాశ్వేతాదేవి జైపూర్ లిట్ చెప్పడం ఏ ప్రయోజనాన్ని ఆశించో ఆ నవల మనకు తెలియజేస్తుంది.
మధ్యతరగతి నైతికతను తాను ద్వేషిస్తానని ఆమె నిర్మోహమాటంగా చెబుతారు. అదొక బూటకం. అక్కడ ప్రతిదీ అణచబడుతుంది, అని ఆమె నిరసించారు. అనేక మంది తమ జీవితాల్లో కనిపించే ద్వంద్వ ప్రమాణాలను ఖండించి తీరాలని ఆమె కచ్చితంగా చెప్పారు. పటాటోపానికి పది మందికి ఒకటి చెబుతూ వ్యక్తిగతంగా విరుద్ధమైన విలువలను పాటించడం నికృష్టం అని ఆమె భావన.
ఆదివాసీలు అత్యంత గొప్ప నాగరికత కలవారన్న మహాశ్వేతాదేవి మాటలు వింటే మన నాగరికులకు ఆందోళన కలగకమానదు. దేశంలో అడవులు, నదులు, కొండలు, ఇప్పటికీ కళగా ఉన్నాయంటే అందుకు కారణం ఆదివాసీలే” అని 2012లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె వివరించారు. “ఆదివాసీ సమాజంలో ఏ ఒక్కరూ, మరే ఒక్కరి కన్నా అధికుడూ కాదు. అల్పుడూ కాదు. పట్నం లాంటి సామాజిక వైకల్యాలు వారిలో కనిపంచవు. కులాల కుళ్ళు వారి దరి చేరలేదు. ప్రకృతిలో సమతూకం ఏ కాస్తనన్నా మిగిలి ఉంటే అది ఆదివాసీల చలవే” అని ఆమె వాస్తవం ఏమిటో వివరించారు.
అడవి బిడ్డలను అడవుల నుండి తరిమేస్తే మైదానాల నాగరికుల భద్రత, జీవితాలు, పర్యావరణ కాలుష్యంలో అదనపు కాలుష్యంగా కలిసిపోతాయని ఆమె చెప్పింది. “నక్సలైట్లు అడవుల్లో దాక్కోపోతే జన జీవన స్రవంతిలో కలిసి జనాన్ని ఉద్ధరించవచ్చు. కదా” అంటూ మిడి మిడి జ్ఞానంతో ప్రశ్నించే బుద్ధి జీవులకు మహాశ్వేతాదేవిలాంటి రచయిత్రి చెబితే నన్నా నిజం గ్రహింపునకు రావాలి. అడవులు నాగరికులకు నిలయాలని తెలియాలి.
గ్రీన్‌హంట్, సల్వాజుడుం తదితర పేర్లతో ప్రభుత్వాలు ఏరివేస్తున్నది నక్సలైట్లను కాదని, అడవిని ఆవాసంగా చేసుకున్న ఆదివాసీలను తరిమి వేసి అక్కడి సంపదలను తవ్వి విదేశీ బహుళ జాతి కంపెనీలకు పంచి పెట్టడమే వారి లక్షమని, తద్వారా ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీసి నగరాల జీవితాన్ని కూడా మొదలంటూ పెకిలించుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నదని మహాశ్వేతాదేవి చేసిన హెచ్చరికలను ఆలకించాలి. లేదంటే మహాశ్వేతాదేవి కోరుకున్న మరో జీవితం తర్వాత సంగతి, ఉన్న జీవితాలు కూడా అర్థాంతరంగా ముగించుకోవలసిందే. ఈ నిజం తెలిసి ప్రతి రచయిత కర్తవ్యోన్ముఖం కావలసిన అవసరం ఎంతైనా ఉంది.
వయసు మీద పడడం గురించి మహాశ్వేతాదేవికి ఎప్పుడూ చింత లేదు. 90 ఏళ్ల వయసులో కూడా మరో జీవితాన్ని గడపడం గురించి ఆమె మాట్లాడారు. “శక్తి ఉడిగిపోవడం అంటే అదే ఫుల్‌స్టాఫ్ కాదు. ట్రైన్ దిగిపోయే చివరి స్టేషన్ కూడా కాదిది. అది కేవలం నెమ్మదించడం మాత్రమే. అది మీ తేజస్సు ‘పాటు’లోకి మళ్ళడం అని ఆమె చెబుతారు.
హిమాలయాలంతటి ఆమె వ్యక్తిత్వం సాహిత్యం గురించి ఒక వ్యాసంలో చెప్పడం అసాధ్యం. అయినా “అందరు రచయితలు తమ తరానికి జవాబుదారులు, తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు’అన్న మహాశ్వేతాదేవి మాటలు అక్షర సత్యాలు.
“ప్రజల మధ్యకు వెళ్లండి. వాళ్ల జీవితసత్యాలను తెలుసుకోండి. ” అన్న మహాశ్వేతాదేవి మాటలను అమలుపరచడమే ఆమెకు మనమిచ్చే అక్షర ఘన నివాళి.
(జూలై 28వ తేదీ భారత మహా రచయిత్రి, మానవి మహాశ్వేతాదేవి రెండవ వర్థంతి సందర్భంగా)

నల్లెల్ల రాజయ్య
9989415571