Home ఎడిటోరియల్ అంతిమ తీర్పు

అంతిమ తీర్పు

 

Sampadakiyam       కొందరికిది సంపూర్ణ న్యాయం, నవోదయం మరి కొందరికి అసమ న్యాయం, అన్యాయం ఇంకొందరికి మెజారిటీ స్వామ్యాన్ని రుజువు చేసిన ఏకపక్ష న్యాయం. ఎవరికి ఏ రకంగా అనిపించినా ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన అంతిమ న్యాయం. ఏ వర్గానికి ఎటువంటి అభ్యంతరాలున్నా వాటిని పక్కన పెట్టి బాధ్యతతో ఈ తీర్పును అంగీకరించవలసిన అత్యవసరమున్నది. ఆ విధంగా చేసి దేశంలో నిర్వివాదమైన అపూర్వ సామరస్య శకం వెల్లివిరియడానికి తోడ్పడాలి. మతాలు, కులాలు, ప్రాంతాలు, విశ్వాసాలు, హేతువులు మున్నగు అన్నిటికీ అతీతంగా భారతీయులందరిపైన గల గురుతర బాధ్యత ఇది. అమిత క్లిష్టంగా మారి జాతి మనుగడతోనే ముడిపడిపోయి చిరకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయి దేశం గుండెలో ముల్లుగా పరిణమించిన రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శనివారం నాడు ఇచ్చిన తీర్పుతో ఈ వివాదానికి శాశ్వతంగా తెర పడిపోయిందని భావించాలి.

అటువంటి పరిస్థితి నెలకొనడానికి దేశ ప్రజలందరూ చిత్తశుద్ధితో సహకరించాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో గల పేచీలోని మొత్తం 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణానికి అప్పగించాలని అందుకు ప్రతిగా ముస్లింలకు అదే పట్టణంలో వేరొక చోట 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ధర్మాసనం ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని అప్పగించడానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ప్రక్రియను 3 మాసాల్లో ముగించాలని కూడా సూచించింది. 2010 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఈ స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రాముడు (రామ్ లల్లా) మధ్య మూడు భాగాలుగా పంచింది. సుప్రీంకోర్టు అటువంటి విభజనకు వెళ్లకుండా మొత్తం స్థలాన్ని రామాలయ నిర్మాణానికి ఇచ్చి వేయడం గమనించవలసిన మార్పు. ఇది నిస్సందేహంగా హిందుత్వ సంస్థలకు సంపూర్ణమైన ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. తీర్పు తమకు అంగీకార యోగ్యం కాకున్నా, అందులో లోపాలున్నా దానిని సవాలు చేయదలచుకోలేదని, దేశంలో శాంతిని కోరుకుంటున్నామని ప్రధానమైన ముస్లిం సంస్థలు ప్రకటించడం సంతోషించవలసిన పరిణామం. దీనిపై పునః పరిశీలన జరపాలంటూ సుప్రీంకోర్టులో రెవ్యూ పిటిషన్ వేయకూడదని సున్నీ వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయం హర్షించదగినది.

అలాగని ఆ సంస్థ బేషరతుగా అంగీకరించిందని అనుకోడానికి వీల్లేదు. మసీదును కూల్చివేసినప్పటి నుంచి సంభవించిన చెప్పనలవికాని రక్తపాతానికి అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది బలి అయ్యారు. అటువంటి పరిస్థితి తిరిగి తల ఎత్తరాదనే సదాశయం ఈ తీర్పు తర్వాత దేశ మంతటా కనిపించింది. 16వ శతాబ్దానికి చెందిన బాబ్రీ మసీదు మూడు గుమ్మటాలను 1992 డిసెంబర్ 6వ తేదీన హిందూ కరసేవకులు ధ్వంసం చేయడం తప్పిదమేనని, అపరాధమేనని కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేసిన ధర్మాసనం ఆ తప్పును సరిదిద్దాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. అయితే అంతిమ తీర్పులో అటువంటి దిద్దుబాటు రుజువు కాలేదని ఎవరికైనా అనిపిస్తే దానిని తప్పుపట్టలేము. పరిహారంగా మరో చోట స్థలాన్ని కేటాయించాలనడంలో ఔదార్యమే కనిపిస్తున్నది గాని న్యాయం గోచరించడం లేదనే అభిప్రాయానికి తావు కలగడాన్ని ఆక్షేపించలేము.

జరిగిన తప్పును సరిదిద్దాల్సిన బాధ్యతను రాజ్యాంగం స్పష్టం చేసిందని సెక్యులర్ దేశంలో చేపట్టకూడని పద్ధతుల్లో కూల్చి వేసినందున మసీదును కోల్పోయిన ముస్లింలకు గల హక్కును గమనించకపోతే న్యాయం జరిగినట్టు కాదని ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయం అత్యంత విలువైనది. అయితే ఆ స్థాయిలో దిద్దుబాటు జరగలేదని సెక్యులర్ భావాలు గల వారికి అనిపించడాన్ని ఎంత మాత్రం తప్పు పట్టలేము. విశ్వాసం, నమ్మకం అనే వాటికి తాము ప్రాధాన్యత ఇవ్వలేమని అందుకు బదులుగా ఈ కేసును మూడు పక్షాల మధ్య భూ వివాదంగాన్నే పరిగణిస్తున్నామని కూడా తీర్పు స్పష్టం చేసింది. అదే సందర్భంలో మసీదు కూల్చివేసిన చోటనే రాముడు జన్మించాడనే హిందువుల విశ్వాసం తిరుగులేనిదని ధర్మాసనం ప్రకటించడం గమనార్హం. దాని ఆధారంగానే తీర్పు వెలువడింది. హిందువులు చిరకాలంగా నిరవరోధంగా అక్కడ పూజలు చేస్తున్నారని, ఆ స్థలంపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోడంలో ముస్లింలు విఫలమయ్యారని కూడా కోర్టు అభిప్రాయ పడింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఎంతో మథనం చేసి దేశంలో మెజారిటీ జనాభా అయిన హిందువుల, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల విశ్వాసానికి అమితమైన విలువ ఇచ్చి వెలువరించిన ఈ తీర్పును అందరూ గౌరవించడమే ప్రస్తుత అవసరం. జాతి భవ్య భవితవ్యాన్ని కాంక్షిస్తూ ఈ వివాదానికి తెర దించి దేశ ప్రజలను పీడిస్తున్న ప్రధానమైన సమస్యల వైపు దృష్టి కేంద్రీకరించడం విజ్ఞతాయుతం అవుతుంది.

Judgment proves strength of India Constitution