Home ఎడిటోరియల్ ఉహాన్ శుభారంభం

ఉహాన్ శుభారంభం

sampadakeyam

చైనాలోని ఉహాన్‌లో చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్రమోడీ రెండ్రోజుల ‘ఇష్టాగోష్టి’ చర్చలు ఈ రెండు ఆసియా మహారాజ్యాల మధ్య సంబంధాల మెరుగుదలకు శుభారంభంగా పరిగణించవచ్చు. 21వ శతాబ్దం ఆసియా ఖండానిదన్న భావన నెరవేరాలంటే ఈ రెండు దేశాల మధ్య శాంతి, స్నేహం, సహకారం ఎంతైనా అవసరం. అయితే రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను, వాటివల్ల ఉత్పన్నమవుతున్న చికాకులను రాజకీయ స్థాయిలో అధిగమించకుండా ఆ ఆకాంక్షనెరవేరటం సాధ్యం కాదు. అనుమానాలు, అపోహలే కాదు, రాజకీయ వ్యూహాలు సైతం ఇరుదేశాల మధ్య పరస్పర అవిశ్వాసానికి దారి తీస్తున్న పరిణామం విస్మరించరానిది. పాకిస్థాన్‌పట్ల ఇరుదేశాల వైఖరుల్లో పూర్తి విరుద్ధత ఒక ప్రధానమైన చికాకు. సానుకూల అంశాల దృష్టి నుంచి చూస్తే, చైనా, భారత్ ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఆర్థిక వ్యవస్థల పరిమాణంలో అవి ప్రపంచంలో వరుసగా రెండవ, మూడవ స్థానంలో ఉన్నాయి. మన దేశ ఆర్థికాభివృద్ధి రేటు మూడేళ్ల క్రితం చైనాను మించినప్పటికీ, చైనా ఆర్థిక వ్యవస్థ మన దేశం కన్నా ఐదు రెట్లు ఎక్కువ అని గమనించాలి. భారత్ చైనా మధ్య పరస్పర వాణిజ్యం గతేడాది 20 శాతం పెరిగి 84 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే భారత్ వాణిజ్య లోటు సుమారు 52 బిలియన్ డాలర్లు. 2001లో చైనా ఎగుమతుల్లో భారత్ 19వ స్థానంలో ఉండగా ఇవాళ 5వ స్థానం. ఈ లోటును సమతూకం చేయటానికి భారత్ నుంచి దిగుమతులకు చైనా మార్కెట్లను మరింతగా తెరవాలన్న డిమాండ్ ఉంది.
రాజకీయంగా చూచినపుడు ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం ప్రధానమైంది. 3500 కిలోమీటర్ల సరిహద్దు వెంట శాంతి సామరస్య పరిరక్షణ ఒప్పందం కుదిరిన 1993 నుంచి ఒక్క తూటా పేలకపోయినా, అప్పుడప్పుడు అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. 2013, 2015 ల్లో కొన్ని విశ్వాస కల్పన ఒప్పందాలు జరిగినా, గత ఏడాది డోక్లాం వద్ద సైన్యాల మోహరింపు ఈ సమస్యకున్న సున్నితత్వాన్ని వెల్లడి చేసింది. సరిహద్దు సమస్యపై ఏర్పాటైన ప్రత్యేక ప్రతినిధుల బృందాలు 20 దఫాలు చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి స్థూల రేఖలను అంగీకరించినప్పటికీ, ఉన్నత రాజకీయ అంగీకారంతోనే ఒప్పందం సాధ్యం. ఉహాన్‌లో ఈ సమస్యను చర్చించిన నేతలిరువురూ సరిహద్దు వెంట శాంతి పరిరక్షణ ఆవశ్యకతను వక్కాణించి, కమ్యూనికేషన్ పెంచుకోవాలని, ఇరుపక్షాల మధ్య అంగీకరించబడిన విశ్వాస చర్యలను చిత్తశుద్ధితో అమలు జరపాలని తమ సైన్యాలకు ఆదేశాలు జారీ చేయటం ఆహ్వానించదగింది. అయితే సరిహద్దు గుర్తింపు దిశగా చర్యలను వేగవంతం చేయటం అవసరం. చైనా ప్రతిపాదించిన ‘బెల్ట్ రోడ్’ ప్రాజెక్టుకు భారత్ వ్యతిరేకత (అది పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం గుండా వెళుతున్నందున భారత్ దానిపై తమ సార్వభౌమత్వ సమస్యను లేవనెత్తింది), హిందూ మహాసముద్రంలో నావికాదళ విన్యాసాలకుగాను అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో భారత్ చేరటం, భారత్ పొరుగున శ్రీలంక, మాల్దీవులు, భూటాన్‌ల్లో చైనా ప్రభావం పెరగటంపట్ల భారత్ ఆందోళన, పాకిస్థాన్ టెర్రరిజం ఇతర రాజకీయ సమస్యలు.
మోడీ, క్సి ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యలను చర్చించినట్లు ప్రకటన తెలిపినందున ఈ అన్ని సమస్యలపై వారు మనసు విప్పి మాట్లాడుకుని ఉండవచ్చు. అలాగే పాకిస్థాన్ తన ఆధిపత్యం కొరకు పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో భారత్, చైనాలు సంయుక్తంగా ఆర్థిక ప్రాజెక్టులు చేబట్టాలన్న నిర్ణయం పరస్పర విశ్వాసం పెరుగుదలకేగాక పాకిస్థాన్‌సహా ఆసియా దేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు అదొక నమూనా కావచ్చు. చైనా సహా ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాల మెరుగుదలలో మోడీ విఫలమైనాడన్న భావన నేపథ్యంలో, మరో సంవత్సరంలో ఎన్నికలకు వెళ్లాల్సిన సందర్భంలో, ఐదారు మాసాల తెరవెనుక ప్రయత్నాల అనంతరం చైనా అధినాయకునితో మోడీ ఇష్టాగోష్టి సమావేశం ఏర్పాటైంది. పాకిస్థాన్ సహా ఇరుగుపొరుగు దేశాలతో అటువంటి సమావేశాలు అభిలషణీయం. అయినా సమస్యలు నాయకుల వ్యక్తిగత సంబంధాల ఆధారంగా పరిష్కారానికి నోచుకోవు. ఇచ్చిపుచ్చుకునే వైఖరితో కూడిన రాజనీతిజ్ఞత అవసరం. ఉహాన్ సమ్మిట్ నెలకొల్పిన సుహృద్భా వం ఫలితాల దిశగా ప్రయాణిస్తేనే ప్రజలకు ప్రయోజనం. లేకపోతే అదొక జిమ్మిక్కుగా మిగిలిపోతుంది.