Home ఎడిటోరియల్ ఎన్‌ఆర్‌సి చిక్కుల్లో మోడీ సర్కారు

ఎన్‌ఆర్‌సి చిక్కుల్లో మోడీ సర్కారు

NRC Cartoon

 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి, పండిట్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు అన్ని ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తే పెను వివాదం చెలరేగడం, రెండు నెలలైనా నిరసనలు చల్లారక పోవడం ఒక విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేస్తున్నది. ఈ చట్టం భారత దేశపు పౌరులు ఎవ్వరిపై ఎటువంటి ప్రభావం చూపబోదని ప్రభుత్వం ఎంతగా భరోసా ఇస్తున్నా వివిధ వర్గాల ప్రజలలో అనుమానాలు తొలగిపోవడం లేదు. ఈ సంకట పరిస్థితికి ప్రధాన కారణం బిజెప అజెండాలో ఉన్న జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) అమలులోకి తీసుకు రావడానికి ఇది మొదటి మెట్టనే అభిప్రాయం బలంగా నాటుకోవడమే అని అర్ధం అవుతుంది. అసోంలో అమలులో ఉన్న ఈ ప్రక్రియ గందరగోళంగా మారడం, అటువంటి రిజిస్టర్‌ను వివాదాలకు తావు లేకుండా రూపొందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో పాలనా యంత్రాంగం సమర్ధత పట్ల ఈ సందర్భంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసోంలో ఏడేళ్ల పాటు ఎంతో భారీ ప్రక్రియ జరిపి, సుమారు రూ. 1600 కోట్ల ప్రజాధనంతో తయారు చేసిన ఎన్‌ఆర్‌సి తుది జాబితా గత జనవరి మధ్య నుండి వెబ్‌సైట్‌లో అదృశ్యం అయిన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. సుమారు నెల రోజులుగా ఈ జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రావడం లేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో గత ఏడాది ఆగస్టు 31న ప్రచురించిన తుది జాబితా ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది. 3.4 కోట్ల జనాభా నుంచి సుమారు 19 లక్షల మంది తుది జాబితాలో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలో డేటాను స్టోర్ చేసేందుకు ఐటి సంస్థ విప్రోకు కాంట్రాక్టు ఇచ్చారు. గత అక్టోబర్‌లో ఆ సంస్థతో కాంట్రాక్టు ముగిసింది. అయితే ఎన్‌ఆర్‌సికి కొత్త కో ఆర్డినేటర్ రావడం వల్ల ఇంకా డేటా స్టోరేజ్ రెన్యూవల్ ప్రక్రియ జరగలేదని చెబుతున్నారు.

ఎన్‌ఆర్‌సి డేటా ఆఫ్‌లైన్ కావడం వల్ల అసోంలో ఆందోళన మొదలైంది. డేటా గల్లంతు అయినట్లు ఆరోపణలు వచ్చాయి. కావాలనే బిజెపి ఎన్‌ఆర్‌సి డేటాను పక్కనపెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపణలు సారించాయి. అయితే, అసోంలో జాతీయ పౌర పట్టిక కోసం సేకరించిన డేటా సురక్షితంగా ఉందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. క్లౌడ్ స్టోరేజ్‌లో వచ్చిన విజిబులిటీ సాంకేతిక సమస్యను పరిష్కరించామని ఆ శాఖ ప్రతినిధి తెలిపారు. డేటా ఏమీ కాలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా అసోంలోని ఎన్‌ఆర్‌సి డేటాను ట్యాంపర్ చేసినట్లు మాజీ కో ఆర్డినేటర్ ప్రతీక్ హజేలాపై కేసు నమోదు చేశారు. పౌరసత్వ పట్టికకు సంబంధించి డేటా అప్‌డేట్ విషయంలో ట్యాంపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

ప్రతీక్‌తో కలిసి గతంలో పని చేసిన అజుపి బారువపైన కూడా ఫిర్యాదు నమోదు చేశారు. ఎన్‌ఆర్‌సి డేటా రికార్డ్ సిస్టమ్‌కు సంబంధించిన పాస్ వర్డ్‌ను ఇవ్వకుండానే రాజీనామా చేసినందుకు అతనిపై కేసు ఫైల్ చేశారు. ఆధార్ కార్డుకు సంబంధించిన పత్రాలవలే ఈ తుది జాబితాను కూడా భద్రంగా ఉంచాలని గత ఏడాది ఆగస్టు 13న సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా ఈ జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారందరికీ తెలపాలని కూడా అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఈ బాధ్యతను భారత రిజిస్టర్ జనరల్ (ఆర్‌జిఐ)తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ఎన్‌ఆర్‌సి సంస్థకు అప్పజెప్పారు. తొలగించిన పేర్ల జాబితా వచ్చిన తర్వాత అందుకు కారణం ఎన్‌ఆర్‌సి తెలపాలి. 120 రోజులలోగా ఈ ఆదేశానికి వ్యతిరేకంగా విదేశీయుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే తుది జాబితా వెలువడి ఐదున్నర నెలలు అవుతున్నా ఇప్పటికీ అసోంలో ఒక్కరికి కూడా జాబితాలో చేర్పులు లేదా తొలగింపు గురించి ఎటువంటి సమాచారం అందీయ లేదు. పైగా, సాధారణ ప్రజలు చూసుకోవడం కోసం తుది జాబితా ప్రతులను స్థానిక, సర్కిల్, జిల్లా పౌరసత్వ నమోదు కేంద్రాలు, రాష్ట్ర కో ఆర్డినేటర్ కార్యాలయాలలో ఉంచాలని గత ఆగస్టు 13న సుప్రీంకోర్టు చెప్పినా ఇప్పటి వరకు ఎక్కడా ఉంచలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుపరచడంలో గత ఐదు నెలలుగా ఎన్‌ఆర్‌సి పూర్తిగా విఫలమైనది. పది రోజులలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆగస్టు 31న అధికారులు ప్రకటించినా ఇప్పటికీ చేయనే లేదు. మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారెవరైనా తమ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో వెబ్ సైట్‌లో చూసుకొనే అవకాశం ఉండాలి. సెప్టెంబర్ 14 నుండి అటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పినా ఆచరణ నోచుకోలేదు.

అయితే సెప్టెంబర్ 14 నుండి జాబితా వెబ్ సైట్‌లో అందుబాటులోకి వచ్చినా విస్మయకరంగా జనవరి మధ్య నుండి అదృశ్యమైంది. ఈ లోగా ఈ జాబితా చేయడంలో పాల్గొన్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరిని జనవరి 31 నుండి ఉద్యోగాల నుండి తొలగించడం మరింత కలకలం రేపుతున్నది. దానితో ఈ జాబితా తయారు అగమ్యగోచరంగా మిగిలే అవకాశం లేకపోలేదు.
అసోంలో ఎన్‌ఆర్‌సి జాబితా తయారు చేయాలని 1985లోనే రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిర్ణయించినా, రాజీవ్ – అసోం ఒప్పందంలో ఇది ప్రముఖమైన అంశమైనా రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధి ప్రదర్శించలేకపోవడంతో ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆసక్తి చూపలేదు. అయితే సుప్రీంకోర్టు పట్టుబట్టి, స్వీయ పర్యవేక్షణలో జరిగేటట్లు చూసినా, తప్పుల తడకగా మిగిలింది. ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం తెలియక తికమకమవుతున్న మోడీ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో అమలు జరిపే సామర్ధ్యం ఉన్నదని చెప్పలేము. కానీ ఒక రాజకీయ నినాదంగా కొనసాగిస్తున్నారు.

ఒక వంక ఈ అంశం తమ అజెండాలో లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేస్తున్నా పౌరసత్వ సవరణ చట్టం తర్వాత తమ పయనం అటువైపే అంటూ అనేక మంది కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు తరచూ ప్రకటనలు ఇస్తున్నారు. ఆ విధంగా చేయడం చూస్తుంటే సమస్య తీవ్రత తెలియక మాట్లాడుతున్నారా లేదా తెలిసే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశీ వలసలు అకారణంగా దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభకర పరిస్థితులు ఎదుర్కొంటున్న అసోం ఈ జాబితా ప్రకటనలో పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూసి తీవ్ర ఆశాభంగానికి గురైనది. ఈ తుది జాబితా ఆత్మకు ఆమోదయోగ్యం కాదని స్వయంగా అసోం మంత్రులే ప్రకటిస్తూ ఉండడంతో ఈ సంక్షోభం నుండి ఇప్పట్లో పరిష్కారం దొరికే అవకాశాలు కనబడటం లేదు.

రాజకీయ నాయకులలో లోపించిన నిజాయితీ, పాలనా యంత్రాంగంలో కనిపించని సామర్ధ్యం, ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ భద్రతకు కీలకమైన ఇటువంటి అంశంలో ప్రమాదకర ధోరణులకు అవకాశం కల్పిస్తున్నారు. దేశ భద్రత కోసం ఉద్దేశించిన చర్యలైనా నిర్దుష్టమైన ప్రాతిపదిక ఏర్పర్చకుండా, క్షేత్ర స్థాయిలో అందుకు తగిన సంసిద్ధత కలిగించకుండా కేవలం భావోద్వేగాలతో ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నం చేస్తే ఎదురు దెబ్బ తప్పదని గ్రహించాలి.

Article about National Register of Citizens