Home ఎడిటోరియల్ లైంగిక పరాయీకరణ!

లైంగిక పరాయీకరణ!

8-year-old girl is raped in Ananthapur

సమాజ సమస్యలకు పరిష్కారం ప్రశ్నలతోనే మొదలవ్వాలిగాని ప్రశ్నల దగ్గరే ఆగిపోకూడదు. ఒక పరంపర గా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్న ఇటీవల తరచుగా వినబడుతోంది. బాలికలపై అత్యాచారాలు చేసే నేరగాళ్ళకు ఉరి శిక్ష విధించేలా ఒక ఆర్డినెన్స్ ను తెచ్చినా ఇలాంటి సంఘటనలు ఆగిపోవడంలేదెందుకనేది ఇంకో ప్రశ్న. సమాజవిశ్లేషకులు, సంఘసేవకులు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన సందర్భం ఇది. సామాజిక రుగ్మతల్ని చట్టాలు ఎన్న డూ నిర్మూలించ లేవు. కఠినమైన చట్టాలు నేరస్తుల్ని కఠినంగా శిక్షించడానికి పనికి రావచ్చేమోగానీ దారుణనేరాలు జరక్కుండా మా త్రం ఆపలేవని గుంటూరు నగరంలో మే 15న ఓ బాలిక మీద జరిగిన అత్యాచారం చెప్పకనే చెప్పింది. బాలికల మీ ద అత్యాచారం జరగడం ఇదే నెలలో గుంటూరు జిల్లాలో ఇది మూడోసారి. గతంలో అత్యాచారంతో ‘మాత్రమే’ ఆగిపోయే నేరాలు కొత్త ఆర్డినెన్స్ రాకతో హత్యాచారాలు గా మారే ప్రమాదం వుందని అనేక మంది సమాజశాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు కొట్టివేయదగ్గవేమీకా వు. చట్టాలు కఠినంగా మారే కొద్దీ నేరాలు తగ్గకపోగా మ రో మాటల్లో చెప్పాలంటే నేరాల తీవ్రత పెరుగుతూ వుం టుంది.పరాయీకరణవల్ల మనిషి, మనిషిగాకాకుండా పోతున్నాడని కార్ల్ మారక్స్ ఆవేదన వ్యక్తంచేశాడు. దానికి కొనసాగింపుగా ఆస్ట్రియా దేశపు ప్రముఖ మనో విశ్లేషకుడు విల్ హెల్మ్ రైక్ (Wilhelm Reich) లైంగిక పరాయీకరణను వివరించాడు. మనోవిశ్లేషణ రంగంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ తరువాత అంతటివాడు రైక్. మనం ఇప్పుడు చర్చించాల్సింది నేరస్తుల్ని ఎలా శిక్షించాలని కాదు; లైంగిక పరాయీకరణకు దారితీస్తున్న సామాజిక పరిస్థితుల్ని ఎలా సరిదిద్దాలి అనేది. ఆహారం, నిద్ర, మైధునాలు సృష్టిలో ప్రతి జీవికీ శరీర ధర్మాలు. జీవి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆహారం నిద్రలు నిరంతరం కొనసాగుతాయి. అయితే, మైధునానికి ఒక పరిమితి వుంది. పునర్ ఉత్పత్తి గ్రంధులు క్రియాశీలంగా మారినప్పటి నుండి అవి పనిచేయడం ఆగిపోయే వరకు శరీరానికి మైధున అవసరం వుంటుంది.
మనుషుల జీవితాల్లోనికి రాజకీయార్థిక అంశాలు అతిగా చొరబడిపోయినపుడు నిద్ర, మైధునాలు మరుగునపడిపోయి ఆహార అంశం మాత్రమే ప్రధానం అయిపోతుంది. ఆహారం అంటే తిండి మాత్రమేకాదు; అది వస్త్రాలు, నివాసాలు, ఉపాధి, వ్యక్తిగత ఆస్తి, ఆదాయాలు, ప్రతిష్టల సమాహారం. కిలో బియ్యం రూపాయికే సరఫరా చేసేందుకు ప్రభుత్వ పథకాలున్నాయి. కానీ, నిద్ర, మైధునాల కోసం అలాంటి రాయితీలులేవు. ఎనిమిది గంటల నిద్ర ఒక రూపాయకే వంటి పథకాలను మనం ఎక్కడా చూసివుండం. బానిస ప్రభువులు సహితం బానిసలకు రాత్రి వేళల్లో నిద్ర, మైధున సౌకర్యాలు కల్పించేవారనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. అలనాటి బానిసలకున్న సౌకర్యం కూడా వర్తమాన నాగరీకులకు లేదు. భూస్వామ్య సమాజంలో ఆవిర్భవించిన దాంపత్య సాంప్రదాయంలో సంభోగానికి అనేక షరతులు, పరిమితులు వున్నాయి. ఆ విధానంలో, భర్త ఆస్తిని అతని సంతానానికి వారసత్వంగా అందించే బాధ్యత భార్యది. భర్త సంతానం, తన సంతానం ఒకటి కాదు. వాటి మధ్య కొం డంత తేడావుంది. ఆదిమ సమాజాల్లో స్త్రీలకు ‘తన సంతా నం’ అనేది వుండేది. భూస్వామ్య సమాజంలో అది కుదరదు. భూస్వామ్య దాంపత్యబాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలంటే, భార్య, పెళ్ళికాక ముందు కన్యత్వాన్నీ, పెళ్లయ్యాక పాతివ్రత్యాన్నీ కచ్చితంగా పాటించి తీరాలి!.
పెళ్ళికాని స్త్రీలు కన్యత్త్వాన్నీ, పెళ్ళయిన స్త్రీలు పాతివ్రత్యాన్నీ పాటించే సమాజంలో పెళ్ళికాని పురుషుల లైంగిక అవసరాల్ని తీర్చడానికి వ్యభిచారవ్యవస్థ ఏర్పడింది. భార్యల్ని కోల్పోయిన, భార్యల నుండి విడిపోయిన ‘సింగిల్’ పురుషులకు కూడా ఈఏర్పాటు అందుబాటులో వుంటుంది. అంతర్ దహన యంత్రాల భాషలో చెప్పాలంటే పాతివ్రత్య సమాజంలో వ్యభిచార వ్యవస్థ ఎగ్జాస్ట్ వాల్వ్ వంటిది. పాతివ్రత్యం లేకుంటే వ్యభిచారం ఉండదు. పెళ్ళి వ్యక్తిగత ఆస్తితో ముడిపడినట్టే వ్యభిచార వ్యవస్థ కూడా వ్యక్తిగత ఆస్తితోనే ముడిపడి వుంటుంది. పురుషులకు మాత్రమే ఆస్తి హక్కువుండే కాలంలో ఏర్పడిన దాంపత్య నిబంధనలు, విలువలు, కట్టుబాట్లు స్త్రీలకు ఆస్తి హక్కు ఏర్పడిన ఆధునిక సమాజంలో కూడా కొనసాగడం ఎంత వరకు సమంజసం? మరోవైపు వేశ్యావృత్తికి గత కాలపు సాంస్కృతిక గౌరవమర్యాదలు (గురజాడవారి మధురవాణి) రద్దు కావడమేగాక, ఆ వృత్తి మీద అనేక ఆంక్షలు పెరుగుతున్నాయి. ఎగ్జాస్ట్‌వాల్వ్ లేనపుడు యంత్రం బద్దలైపోతుంది. మురుగు కాల్వల్ని ఆక్రమించేసి ఇళ్ళు కట్టేసుకుంటే ఒక రోజు మురుగు కట్టలు తెగి ఇళ్ళను ముంచేస్తుంది. అయితే, వాణిజ్య లైంగిక శ్రమను చట్టబద్ధం చేయడం ఈ సమస్యకు ఎలాగూ శాశ్వత పరిష్కారం కాదుకానీ తాత్కాలిక ఉపశమనం అవుతుంది. పెట్టుబడిదారీ సమాజం ప్రతిదాన్నీ సరుకుగా మార్చేసినట్టే సంభోగాన్ని కూడా సరుకుగా మార్చేస్తుంది. అంటే, దాన్ని కొనుక్కోవాల్సిన వస్తువుగా మారుస్తుంది. నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవాల్సిన నిద్ర, ప్రేమతో పొందాల్సిన మైధునం చివరకు అంగడిలో కొనుక్కోవాల్సిన సరుకుగా మారిపోతున్నాయి. పురుషులే కాకుండా భర్తల్నికోల్పోయిన, భర్త ల నుండి విడిపోయిన ‘సింగిల్’ స్త్రీలు కూడా కొనుక్కోగలిగితే ఈ సరుకు అందుబాటులో వుంటుంది. సరుకును డబ్బుపెట్టి కొనుక్కోలేనివారి పరిస్థితి ఏమిటనేది ఇక్కడ అంతకన్నా కీలకమైన ప్రశ్న. వ్యక్తిగత ఆస్తి, వృత్తి నైపుణ్యాలు లేనివారికి పెళ్ళి కానట్టే, అవి రెండూ లేనివారికి వ్యభిచార యోగంకూడా దక్కదు. పైగా, వ్యభిచార వ్యవస్థ అచ్చంగా నగదు వ్యాపారం. వాణిజ్య లైంగిక శ్రామికుల దగ్గర స్వైపింగ్ మిషన్లు వుండవు. నగదు రహిత సమాజం నగదులేమి సమాజంగా మారిపోయినపుడు లైంగిక రం గంలో సంక్షోభం కూడా తీవ్రం అవుతుంది. అత్యాచార సంఘటనలు పెరగడానికి పెద్ద నోట్ల రద్దు కూడా ఒక కారణమని మనం ఇంకా గమనించకపోవడం అన్యా యం!. నిద్ర, మైధునాలను నిర్లక్ష్యం చేసినపుడు సమాజ నియమాలకూ, శరీర ధర్మాలకు మధ్య ఒక అంతర్యుధ్ధం ఆరంభమవుతుంది. అది అనేక మానసిక వైకల్యాలకు దారి తీస్తుంది. జీనవశైలి రోగాలంటే రక్తపోటు, మధుమే హం మాత్రమే చాలామందికి గుర్తుకు వస్తాయి. కుంగుబాటు(Depression) కూడా ఈ జాబితాలో వుంది. నిద్రమాత్రల (Anti Depressant) అమ్మకాల గణాంకాలు తీస్తే, దేశంలో ఎంత మంది నిద్రలేమి (Insomnia)తో బాధపడుతున్నారో సమాజంలో సంతోష ప్రమాణాలు ఎంత ఘోరంగా పతనం అయిపోతున్నాయో అర్ధం అవుతుంది. సంతోష ప్రమాణాలపై ఐక్యరాజ్యసమితి రెండు నెలల క్రితం 156 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఇండి యా 138వ స్థానంలోవుంది. సంతోష ప్రమాణాల్లో భారతదేశం గత ఏడాదికన్నా మరో 11 స్థానాలు దిగజారగా, టెర్రరిస్టు దేశంగా పేర్కొనే పాకిస్తాన్, పేద దేశమైన నేపాల్‌లు ఇండియాకన్నా మెరుగైన స్థానాల్లో వున్నాయి.
అత్యాచారం అనేది మనిషి ఉన్మాదంలో చేసే చర్య అని మనకు తెలుసు. అయితే, ఏ సమూహాలు ఏ సమూహాల మీద అత్యాచారాలు చేస్తుంటాయి? ఏ సమూహాలు అత్యాచారానికి బలవుతూ (vulnerability) వుంటాయి? అనేవి ప్రాణప్రదమైన అంశాలు. ఉన్మాదానికి కూడా ఒక విధానముంటుంది. There will be a method in one’s madness. ఆ విధానాన్ని కనిపెట్టకుండా దీనికి విరుగుడును కనిపెట్టలేం. మనది కుల మత తెగ లింగ వర్గ సమాజం. అత్యాచారాలకు కూడా కుల మత తెగ లింగ వర్గ స్వభావం వుంటుంది. సాధారణంగా అణగారిన సమూహాల మీద పాలక సమూహాలు అత్యాచారాలు సాగిస్తుంటాయి. స్త్రీల మీద పురుషులు, దళిత-బహుజనుల మీద పెత్తందారీ కులాలు. ఆదివాసుల మీద నగరవాసులు, మైనారిటీల మీద మెజార్టీలు, పేదల మీద ధనికులు అత్యాచారాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో సాగుతున్నవే పిల్లల మీద పెద్దల అత్యాచారాలు. ఒక్కమాటలో చెప్పాలంటే, అణగారిన వర్గాలపై ఆధిపత్యవర్గాలు అత్యాచారాలు సాగిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇందుకు విరుద్ధంగానూ జరుగుతుంటాయిగానీ అవి చాలా చాలా అరుదైన సంఘటనలు మాత్రమే. ఇటీవలి అత్యాచార సంఘటనల్లో ఉన్మాదం, క్షణికోద్రేకాలకు మించిన అనేక కారణాలు వుంటున్నాయి. కఠువాలో ఎనిమిదేళ్ళ బాలిక, ఆసిఫాబానో మీద సాగిన హత్యాచారానికి అనేక సామాజిక, రాజకీయ, ఆర్ధిక కారణాలున్నాయని వెలుగులోనికి వచ్చింది. ఆస్తి కోసం, ఒక సమూహాన్ని తరిమేయడం కోసం పవిత్ర మందిరాల్లోనూ ప్రణాళిక బద్ధంగా అత్యాచారాలు జరుగుతాయని ఈ కేసు చాటి చెప్పింది. జమ్మూ-కాశ్మీర్‌లో ముస్లింలకు, ఇతరులకు ఘర్షణలు జరుగుతున్నాయనే ఇంతకాలం బాహ్యప్రపంచం నమ్మేది. అక్కడ (ముస్లిం) ఆదివాసుల్ని అంతం చేసేందుకు పెద్ద వ్యూహమే అమలవుతున్నదని ఆసిఫాబానో కేసు స్పష్టం చేసింది. న్యాయస్థానాలకు కూడా కుల మత తెగ లింగ వర్గ రాజకీయ స్వభావం వుంటుందంటే 20వ శతాబ్దంలో అనేకమంది ఒప్పుకునేవారుకాదు. ధర్మాసనాల అవినీతి కథనాలు పరంపరగా బయటికి వచ్చేస్తున్నాయి కనుక ఇప్పుడు వాళ్ళు అలా దబాయించే సాహసం చేయకపోవచ్చు.
కుల మత తెగ లింగ వర్గ రాజకీయ రంగాల్లో ఆధిపత్యంగల సమూహాలకు చెందిన నేరస్తులు చట్టం కోరల నుండి సులువుగా తప్పించుకుంటుంటే, అలాంటి ఆధిపత్యంలేని సమూహాలకు చెందిన నిందితులు చట్టం కోరల్లో నిస్సహాయంగా చిక్కుకుంటుంటారు. సారాంశంలో, అత్యాచార నిరోధక చట్టాల కోరలకు కొత్తగా పెడుతున్న పదునంతా అణగారిన సమూహాలను శిక్షించడానికే ఉపయోగపడతాయి. మనం తరచూ సమస్యల్ని తిట్టుకుంటామేతప్ప వాటిని సృష్టించిన వ్యవస్థను మార్చే ప్రయత్నం మాత్రం చేయం. అత్యాచారాలకు కుల, మత, లింగ, వర్గ సమాజమే కారణం అని తెలిసినపుడు ఆ సమాజాన్ని మార్చాలి, కనీసం సంస్కరించాలి. కుల, మత, లింగ సామరస్యాల్ని సాధించనంత కాలం మురుగు కాలవ మనల్ని ముంచెత్తుతూనే వుంటుంది.