Home ఎడిటోరియల్ హిందీ సాహితీశిఖరం నీరజ్

హిందీ సాహితీశిఖరం నీరజ్

Article about Modi china tour

కారవాం గుజర్ గయీ గుబార్ దేఖ్తే రహే…. బృందం వెళ్ళిపోయింది. రేగిన దుమ్ము చూస్తు ఉండిపోయాం… గొ ప్ప హిందీకవి ఈ లోకం విడిచివెళ్ళి పోయారు. గోపా ల్ దాస్ నీరజ్ జులై 19వ తేదీన 93 సంవత్సరాల వయసులో ఢిల్లీలోని ఎయి మ్స్‌లో తుదిశ్వాస విడిచారు. పద్మభూషణ్ అవార్డు పొందిన నీరజ్ కిడ్నీలు చెడిపోవడంతో పాటు, శరీరమంతా ఇన్ ఫెక్షన్ వ్యాపించి మరణించినట్లు డాక్టర్లు తెలియజేశారు. 1991లో పద్మశ్రీ అవార్డుతోను, 2007 లో పద్మభూషణ్ అవార్డుతోను ఆయన్ను ప్రభుత్వం సన్మానించింది.
భారత సాహిత్యంలో తనదైన అధ్యాయం రాసుకున్న ఒక గొప్ప కవిని తలచుకోవలసిన సమయమి ది. ఆయన నిజానికి సినిమా కోసం పాటలు రాయలేదు. ఆయన రాసిన కవితలను సినిమాలకు వాడుకున్నారు. అలీగఢ్ లో ఆయన హిందీ ప్రొఫెసరుగా పనిచేశారు. కారవాం గుజర్ గయీ..గుబార్ దేఖ్తే రహే కవిత ఆయన రాసిన కవితల్లో ప్రసిద్ధ కవిత. కాని సినిమాలో ఆ కవితకు పూర్తి న్యాయం చేయలేకపోయారు. నయీ ఉమ్ కీ నయీ ఫసల్ సినిమాలో ఈ పాట పెట్టారు. 1960 దశకంలో హిందీ పాటల అభిమానులకు నీరజ్ పేరు సుపరిచితం. ఆ కాలం కవిసమ్మేళనాల కాలం. ముషాయిరాల కాలం. కవిత్వానికి పెద్దపీట వేసిన సాహిత్యాభిమానులున్న కాలం. అప్పట్లో అద్భుతమైన భావకవిత్వంతో లోతయిన తాత్వికభావాలు ప్రకటించిన కవి నీరజ్. పైన మనం చెప్పుకున్న పాట అలాంటి లోతయిన భావుకత ఉన్న పాటే. చాలా సరళంగా అందమైన భావాలు ప్రకటించడంలో ఆయనకు ఆయనే సాటి. 1971లో వచ్చిన షర్మీలీ సినిమాలో ఆయన రాసిన ఖిల్తేహై గుల్ యహాం.. అలాంటి గొప్ప పాటల్లో ఒకటి.
నీరజ్ చాలా అరుదైన కవి, అద్భుతమైన కవి. సినిమా వాళ్ళ అవసరాల కోసం ఆయన పాటలు రాయలేదు. తన గుండెల్లో వెల్లువెత్తే భావాలను కవితలుగా మలిచాడు. అలాంటి ఒక కవిత లిఖే జో ఖత్ తుఝే.. కవిత మూడు పేజీల కవిత. ఇంత పెద్ద కవితను పాటగా ఎలా మలచాలో తెలియక శంకర్ జైకిషన్లు సతమతమయ్యారు. కన్యాదాన్ సినిమాలో ఈ పాటను వాడుకున్నారు. నీరజ్ పాటల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు తప్పకుండా చెప్పవలసిన పాట మేరా నామ్ జోక ర్‌లో రాసిన ఏ భాయ్ జరా దేఖ్ కే చలో పాట. ఈ పాట వింటున్నప్పుడు ఒక విధమైన ర్యాప్ శైలి వినిపిస్తుంది.
జనవరి 4, 1925న ఆయన జన్మించారు. పుట్టింది ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో మహెవా దగ్గర ఉన్న పురావాలీ ఊళ్ళో పుట్టారు. అసలు పేరు గోపాల్ దాస్ సక్సేనా. నీరజ్ అనే కలం పేరుతో రాసేవారు. అలీగఢ్ లో ధర్మసమాజ్ కాలేజిలో హిందీ ప్రొఫెసరుగా పనిచేశారు. హిందీ సినిమాలకు పాటలు చాలా కాలం రాశారు. యస్.డి.బర్మన్, ఆర్. డి. బర్మన్, శంకర్ జైకిషన్లు ఆయన పాటలకు బాణీలు కట్టిన దర్శకులు. ఉత్తరప్రదేశ్ లోని మంగళయాతన్ యూనివర్శిటీకి ఆయన ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. తన బాల్యం సంఘర్షణలతో నిండిన బాల్యమని ఆయన ఒక ఇంటర్వ్యులో చెప్పుకున్నారు. ఆరేళ్ళకే తండ్రి చనిపోయారు. జీవిక కోసం చిన్నప్పుడు బీడీలు, సిగరెట్లు అమ్మా రు, లాయర్ల వద్ద టైపిస్టుగా పనిచేశారు, పిల్లలకు ట్యూషన్లు చెప్పా రు, రిక్షాలాగారు, గోడలపై ప్రకటనలు పెయింటులతో రాశారు.
గోపాల్ దాస్ నీరజ్ కు సినిమాల వల్ల పేరు రాలేదు. సినిమాల్లో ఆయన కవితలు రాక ముందు నుంచే ఆయన గొప్ప కవిగా పేరు సంపాదించుకున్నారు. స్కూలు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కవిత్వం రాశారు. 1960లో ముంబయిలో ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. అక్కడ బర్సాత్ కీ రాత్ సినిమా తీసిన ఆర్ చంద్ర ఆయనతో తన సినిమాకు పాట రాయాలని కోరారు. ఆ సినిమాయే నయీ ఉమ్ కీ నయీ ఫసల్. ఆ పేరు కూడా నీరజ్ పెట్టిందే. పాట రాయడానికి నీరజ్ ఒప్పుకున్నారు. కాని ఉద్యోగం వదిలి ముంబయి రాలేనన్నారు. ఆయన కవితల పుస్తకం నుంచే చంద్ర తన పాటలకు కావలసింది తీసుకున్నారు. ఆ సినిమా హిట్ కాలేదు కాని పాటలు హిట్టయిపోయాయి. ఇంతకు ముందు మనం చెప్పుకున్న పాటే కాదు. ఆజ్ కీ రాత్ బీ షౌక్.. పాట కూడా అందులోదే.
ఆ తర్వాత చంద్రశేఖర్ తీసిన సినిమా చాచా చాచాలో వో హం నథే అనే పాట కూడా చాలా హిట్టయ్యింది. ఒక కవిసమ్మేళనంలో అంతకు ముందు దేవానంద్ ను నీరజ్ కలుసుకున్నారు. ఆ తర్వాత 1965లో దేవానంద్ ప్రేమ్ పూజారి సినిమా తీస్తున్నప్పుడు. దేవానంద్ ఆ సినిమా కోసం నీరజ్ ను ముంబయి పిలిచారు. యస్.డి.బర్మన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు నీరజ్ మీద పెద్ద నమ్మకం లేదు. అందుకే రాగానే ఎప్పుడు వెళతావని అడిగాడట. ఆ తర్వాత రంగీలారే పదంతో మొదలు పెట్టి రాయాలంటూ ఒక ట్యూన్ ఇచ్చాడు. సాధారణంగా వాడే అనేక పదాలు రాయకూడదని ఆంక్ష పెట్టాడు. ఈ దెబ్బకు నీరజ్ ముంబయి నుంచి పారిపోతాడని ఆయన అనుకున్నాడు. పాట రాసిన తర్వాత ముందు నాకు వినిపించు, తర్వాత బర్మన్ దగ్గరకు వెళ్ళమన్నాడు దేవానంద్. మర్నాడే పాట నీరజ్ రాసి దేవానంద్ కు వినిపించాడు. దేవానంద్ కు ఆ పాట బాగా నచ్చేసిం ది. వెంటనే బర్మన్ వద్దకు వెళ్ళారు. అప్పుడే రాసేశారా అన్నాట్ట బర్మన్. పాట విన్న తర్వాత బర్మన్ తన అభిప్రా యం మార్చుకున్నాడు.ఆ తర్వా త బర్మన్, నీరజ్ కాంబినేషన్లో అనేక పాటలు వచ్చాయి.
హిందీ కవులకు ఒక సమస్య ఉంది. ఉర్దూ పదాలను వాడాలా సంస్కృ త పదాలు ఎన్నుకోవాలా అనే అయోమయం ఉంటుం ది. నీరజ్ ఎన్నడూ ఇలాంటి అయోమయాలకు గురికాలేదు. అసలు ఆయన బాణీకి రాయలేదు. ఆయన రాసిన కవితలకు బాణీలు కట్టుకున్నారు. సరళమైన పదాలు ఉర్దూ అయినా, సంస్కృతమైనా ఆయన పట్టించుకోలేదు. ఆయన చేసే పదాల మాయే పాటలను హిట్టయ్యే లా చేసేది. కొన్ని పాటలైతే పాటల్లా కాదు, కవితా ప్రవాహంలా ఉంటాయి. షోఖియోం మేం ఘోలా జాయే పాటలోని పదాలు నిజానికి దేవానంద్ సూచించిన పదాలు. నీరజ్ రాసిన ఒరిజినల్ కవితలో చాందినీ మేం ఘోలా జాయే అనే పదాలున్నాయి.చాందినీ అనే పదా న్ని ఎందుకు మార్చరంటే సినిమాలో ఆ సన్నివేశం పగటి పూట మధ్యాహ్నం చిత్రించినప్పుడు చాందినీ లేదా వెన్నె ల అనే పదం అసంబద్దంగా ఉంటుందని అలా మార్చుకున్నారు. నీరజ్ రోమాంటిక్ పాటలు ఎన్ని రాశారో అలాగే విషాదగీతాలు కూడా రాశారు. దేశభక్తి గీతాలు రాశారు. రిపబ్టిక్ డే రోజున ఢిల్లీలో బీటింగ్ రిట్రీట్ లో వినిపించే మార్షల్ బ్యాండ్ ఆయన రాసిన పాటదే. సీనా హై ఫౌలాద్ కా అప్నా, ఫూలోం జైసా దిల్ హై.. అంటే ఉక్కులాంటి రొమ్ము మాది, పువ్వులాంటి హృదయం… తన్ మేం వింద్యాచల్ కా బల్ హై, మన్ మేం తాజ్ మహల్ హై.. అంటే శరీరంలో వింద్యాచల పర్వతాల బలం, మనస్సులో తాజ్ మహల్ ఉంది… అద్భుతమైన కవిత్వం పలికిందీ పాటలో.
ఆయన చేసిన మాయేమిటంటే ఆయన మామూలు హిందీ పదాలు, సరళమైన ఉర్దూపదాలతో అత్యంత మధురంగా రాసేవాడు. ప్రకృతిలోని పూలు సెలయేరు మేఘాలు వంటి మాటలతో అద్భుతమైన భావాలు అల్లేవాడు. ఈ పాటలు వింటున్నప్పుడు ప్రకృతి అందమైన కావ్యంలా మన కళ్ళ ముందుకు వస్తుంది. దాంతో పాటు పదవిన్యాసం ఆకట్టుకుంటుంది.
సాహిర్ లూధియాన్వి, శైలేంద్ర, గుల్జార్ వంటి దిగ్గజ కవుల కాలానికి చెందిన కవి నీరజ్. బాణీకి రాయాలంటే గుల్జార్ కూడా ఇష్టపడలేదు. ఈ గొప్ప కవుల్లో ఇప్పుడు గుల్జార్ మాత్రమే ఉన్నారు.రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ సినిమా తీసినప్పుడు మొత్తం సినిమా కథను ఒక్క పాటలో చెప్పగలిగిన కవి నీరజ్ మాత్రమే అని ఆయన్ను రాయమన్నారు. అద్భుతమైన పాట రాసిచ్చారు నీరజ్. ఆయన కవిత్వం అత్యున్నత స్థాయి సాహిత్యం ఉన్న కవిత్వం
నీరజ్ స్వరం చాలా బాగుండేది.చాలా బాగా పాటలు పాడేవారు. హరివంశరాయ్ బచ్చన్ కవిత లు చదివిన తర్వాత తనకు కవిత్వం గురించి అవగాహన వచ్చిందని ఆయన అన్నారు.1944లో తన మొదటి పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం పేరు సంఘర్ష్. ఆ పుస్తకాన్ని హరివంశరాయ్ బచ్చన్‌కే అంకితమిచ్చారు.
హిందీ సినిమా పాటల చరిత్రలో నీరజ్ తనదైన ప్రత్యేక అధ్యాయాన్ని రాసుకున్నారు. తన పేరు ఉచ్ఛదశలో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పి తన విద్యాపరమైన వ్యాసంగం కొనసాగించడానికి అలీగఢ్ వెళ్లిపోయారు.93 సంవత్సరాల జన్మదిన వేడుకలు గొప్పగా కవులు నిర్వహించారు.నీరజ్ మరణంతో అద్భుతమైన సాహిత్యమున్న పాటల యుగం గతించిందా అనిపిస్తుంది. జావేద్ అక్తర్, ప్రసూన్ జోషీ, స్వనంద్ కిర్కిరే, పియూష్ మిశ్రా వంటి అనేకమంది ఇప్పుడు హిందీ సినిమాకు గొప్ప పాటలు అందిస్తున్నారు. కాని నీరజ్, సాహిర్ వంటి కవుల లోటు తీర్చలేనిది.

వాహెద్
7396103556