Friday, April 19, 2024

ఎవరికి పట్టింది?

- Advertisement -
- Advertisement -

kesavananda bharati passed away

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే వలస కార్మికులపై వచ్చిన ప్రస్తావన ఈ దేశ అత్యంత నిరుపేద శ్రామికవర్గం పట్ల ప్రధాని మోడీ ప్రభుత్వం వహించిన వల్లమాలిన నిర్లక్షాన్ని ఎత్తి చూపింది. దేశమంతటా విస్తరించి ఉన్న అశేష వలస శ్రామిక జనాన్ని ఆకస్మిక లాక్‌డౌన్ ప్రకటనతో ఉన్నపళంగా దిక్కులేనివారిని చేసి, వారి బాధ్యతను మాత్రం కొంచెమైనా స్వీకరించని పాలక అలసత్వా న్ని బయటపెట్టింది. లాక్‌డౌన్ సమయంలో రవాణా సౌకర్యాలు బందై చేతిలో చిల్లిగవ్వైనా లేని దుస్థితిలో చిక్కుకొని కాలి నడకన సుదూరంలోని స్వస్థలాలకు బయలుదేరి అనేక కష్టాల పాలైన లక్షలాది మంది కార్మికులకు సంబంధించిన వివరమైన సమాచారం తన వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముఖంగా చేతులెత్తేసింది.1979 నాటి అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం ప్రకారం వారి సమగ్ర సమాచారం సేకరించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అంతేకాదు వారికి తగిన రక్షణ కల్పించవలసి ఉంది. ఈ విషయంలో బాధ్యతాయుతమైన సారథ్యం వహించడంలో కేంద్రం వైఫల్యం ప్రస్ఫుటమైంది. ఎక్కడికక్కడ అసంఘటిత రంగంలోని వ్యాపార, పారిశ్రామిక కేంద్రాల యాజమాన్యాలు సమీకరించే కార్మికులకు వారికి నేరు సంబంధాలుండవు. లేబర్ కాంట్రాక్టర్ల ద్వారా పనుల్లో కుదురుకునే వలస కార్మికులకు, తమ యజమానులెవరో కూడా తెలియదు. ప్రభుత్వ యంత్రాంగం పని స్థలాలకు వెళ్లి వారి సమాచారాన్ని అడ్రసులతో సహా సేకరించవలసిన బాధ్యతను ఈ చట్టం కల్పించింది. లాక్‌డౌన్ కాలంలో నానాకష్టాలు పడి ఇళ్లకు చేరుకున్న వారిని అక్కడైనా కలుసుకొని వారి వివరాలను పొందుపరచి ఉంటే పార్లమెంటులో ఈ అంశంపై తెల్లమొహం వేయవలసిన అగత్యం కేంద్ర పాలకులకు కలిగి ఉండేది కాదు.

దేశానికి కరోనా తెచ్చిన కష్టాలు ఇన్నీ అన్నీ కావు. ఎన్నడూ లేని విధంగా స్థూల దేశీయోత్పత్తి దాదాపు 24 శాతం మైనస్‌లో పడిపోయింది. అసంఖ్యాకంగా ఉద్యోగాలు ఊడిపోయాయి. వృత్తులు మూతపడిపోయాయి. ఆకలి చావులు కూడా సంభవిస్తున్నట్టు వార్తలు చెబుతున్నాయి. వీటన్నింటికి తోడు లాక్‌డౌన్ కాలంలో దేశం అంతకు ముందెప్పుడూ ఎరుగని వలస కార్మికుల భారీ సమస్యను చూసింది. గత వేసవి మండుటెండల్లో నగరాల నుంచి పట్టణాల నుంచి వేలు, లక్షలాది మంది కార్మికులు పొట్ట చేత పట్టుకొని కాలినడకన వందల కిలోమీటర్ల దూరంలోని స్వరాష్ట్రాలకు, స్వస్థలాలకు బయలుదేరిన సన్నివేశాలు చూసిన, విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేశాయి. సెల్ రీ ఛార్జింగ్ చేయించుకునే పాటి పైసలు కూడా లేక తమ వారితో మాట్లాడలేక వారు పడిన వేదన చెప్పనలవికానిది. నడవలేక, పొట్ట గడవక దారిలోనే అనేక మంది అకాల మరణం పాలైన కథనాలు కళ్ల నీరు తెప్పించాయి. ఉదార హృదయం కలవారు చేతనైనంత వరకు ఆదుకున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడక్కడ పునరావాస శిబిరాలు నడిపి కొంత మేరకు సాయపడ్డాయి. కాని కేంద్ర ప్రభుత్వం తగిన అత్యవసర ప్రణాళికతో వారిని స్వస్థలాలకు చేర్చడానికి చేసిందేమీ లేదు. శ్రామిక రైళ్లు వేసిన తర్వాత కూడా ఛార్జీలకు డబ్బులు లేక ఎందరో ఇక్కట్లు పాలయ్యారు. ప్రతి 10 మంది వలసకార్మికుల్లో 8 మందికి లాక్‌డౌన్ ప్రకటించినప్పటి వరకు బకాయి పడిన వేతనాలను యాజమాన్యాలు చెల్లించలేదని ఒక సర్వే నిగ్గు తేల్చింది.

ఇటుక బట్టీలు, గృహ నిర్మాణాది రంగాల్లోని కార్మికులు బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని స్వస్థలాలకు తిరిగి వెళ్లలేక పడిన తిప్పలు చెప్పనలవి కానివి. లాక్‌డౌన్ కాలం నాటి వలస కార్మికుల సమస్య కరోనా భారత గాథలో ఒక ప్రత్యేక హృదయ విదారక అధ్యాయంగా మిగిలిపోతుంది. ఇంతటి ఘోర విషాద ఘట్టానికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని కేంద్ర కార్మిక ఉద్యోగ శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సోమవారం నాడు లోక్‌సభలో సభ్యులడిగిన ప్రశ్నలకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. మొత్తం కోటి మందికి పైగా వలస కార్మికులు స్వరాష్ట్రాలకు చేరుకున్నారని వారిలో 32 లక్షల 49 వేల 638 మంది ఉత్తరప్రదేశ్ వారని, 15 లక్షల 612 మంది బీహారీలని ఇలా స్థూల సమాచారంతో సరిపుచ్చారు. వలస కార్మికులది కేవలం మానవత్వ సంబంధమైన సమస్యే కాదు, అది దేశ ఆర్థిక ప్రగతితో ముడిపడి ఉన్నది. దేశంలోని అసంఖ్యాక సన్న, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక, వ్యాపార కేంద్రాలన్నిటా ఉత్పత్తి కార్యకలాపాలకు వలస కార్మికులే వెన్నెముకలు. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత స్వస్థలాలకు చేరుకోడానికి పడిన నానాయాతనలు స్మృతిపథంలో కదులుతూ కంట నీరు తెప్పిస్తున్న స్థితిలోని కార్మికులు తిరిగి పూర్వపు పని స్థలాలకు వెళ్లడానికి ఉత్సాహం చూపరు. తమను ఇన్ని కష్టాలు పాలు చేసిన దేశ ఆర్థిక రంగం మీద వారిలో కసి పేరుకుపోయి ఉంటుంది. ఈ చేదు అనుభవం పాలకులకు ఇప్పటికైనా గుణపాఠం కావాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని వలస కార్మికుల సమగ్ర సమాచారాన్ని సమీకరించి భద్రపరచి ఎప్పటికప్పుడు తాజా పరిచే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.

Article about Parliament Monsoon Session 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News