Thursday, April 25, 2024

దేశ ప్రయోజనాలే గీటురాయిగా ఉండాలి..!

- Advertisement -
- Advertisement -

Article about PM Modi and China Relationship

ప్రధాని మోడీ లడఖ్ ప్రాతానికి వెళ్లి ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనోధైర్యం కల్పించిన తీరును యావత్ దేశం మెచ్చుకుంటుంటుంది. భారత్ జోలికి వస్తే ఖబర్దార్ దెబ్బకు దెబ్బ తీస్తాం అని ప్రకటించడాన్ని అందరూ హర్షిస్తున్నారు. చైనా, పాకిస్తాన్ ఎవరయినా మా జోలికి వస్తే ఉపేక్షించేది లేదు ఎవరిని వదిలిపెట్టం అని మోడీ ప్రకటించడంపై ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సైనికులకు ధైర్యాన్ని నూరిపోసినట్లే వలసకూలీలకు కూడా విశ్వాసాన్ని కల్పించి ఉంటె ఇంకా బాగుండేది అని అభిప్రాయ పడుతున్నారు. మోడీ వారికి విశ్వాసం కల్పించి ఉంటె వారికి ఇన్ని కష్టాలు వచ్చేవికావు. వందల కిలోమీటర్లు కాలినడకన వారి స్వస్థలాలకు వెళ్లేవారు కాదు అని అంటున్నారు.
రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ మోడీ ప్రకటించి విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు కాని ఆ ఫలాలు ఇంకా అందలేదని అంది ఉంటె బాగుండేదని అంటున్నారు. అలాగే లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన వారికి కూడా ధైర్యాన్ని కల్పించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉంటె చైనా కు అసలు మన మీద ఎందుకు ఆగ్రహం కలిగింది. మన మీద ఎందుకు కాలుదువ్వుతున్నట్లు… అనే చర్చ జరుగుతుంది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్నేహ హస్తం అందించిన చైనా.. ఆయన ప్రధాని అయ్యాక ఎందుకు దుష్మన్ పెంచుకుంటుంది… ఏమి కారణమై ఉంటుంది అనే చర్చ కూడా ఉంది. అంతర్జాతీయ సంబంధాలను నిత్యం అధ్యనం చేసే మేధావులు చైనా భారత్‌ల మధ్య ఘర్షణపై తమ అవగాహనను ఆర్టికల్స్ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు జరిగిన గోధ్రా సంఘటనను ఆ తరువాత జరిగిన పరిణామాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

నాడు అమెరికా మోడీ వీసాను రద్దు చేసి అవమానించింది. దానితో తోపాటు మరికొన్ని దేశాలు కూడా నాడు మోడీ పట్ల నెగెటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నాయి. చైనా మాత్రం పాజిటివ్ వైఖరితో ఉండడమే కాకుండా వైబ్రెంట్ గుజరాత్ అనే సమ్మిట్‌ను మోడీ నిర్వహిస్తే, దానికి తన దేశం నుండి 25 కంపెనీలను పంపించడమే కాకుండా ఆ కంపెనీలు గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టేలా చేసింది. ఆ విధంగా మోడీ సిఎంగా ఉన్నప్పుడే ఆయనతో చైనా మైత్రి కొనసాగించింది. దాని కొనసాగింపుగానే మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఆ దేశ పర్యటనకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పటికి సుమారు 14 సార్లు పర్యటించడమే కాకుండా చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ తో 5 సార్లు సమావేశం కూడా అయ్యారు. ప్రైవేటు రంగంలో చైనా అనుసరిస్తున్న విధానాలు పట్ల మోడీ ఆకర్షితుడయ్యారు. దానితో మంచి సంబంధాలు కొనసాగుతున్న వేళ ఎందుకు సడన్ గా చైనాతో ఘర్షణ వైఖరి నెలకొంది. భారత్ సైన్యంపై చైనా మెరుపు దాడి ఎందుకు చేసినట్లు, చొరబాటుకు ఎందుకు ప్రయత్నించి కవ్వింపు చర్యలకు పూనుకున్నట్లు… దీనిపై లోతుగానే చర్చించుకోవాల్సి ఉంది.
నిజానికి ఇది యుద్ధాలు చేసుకునే సమయం కాదు. ఎందుకంటే లాక్‌డౌన్ తో ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లో సంభవించిన నష్టం చూసిన తరువాత అన్ని దేశాలు యుద్ధాలకు స్వస్తి చెప్పాయనుకోవచ్చు. కాకపోతే అప్పుడప్పుడు ఇరుగు పొరుగున ఉన్న దేశాలు కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడడం జరుగుతుంది. దానితో ఆ ఇరు దేశాల మధ్య కొన్ని రోజులు యుద్ధ వాతావరణం మాత్రం ఉంటుంది. తమకు ఇష్టం లేని దేశాలతో పొరుగు దేశం మైత్రిని పెంచుకుంటుంటే ఓర్వలేక ఆ దేశంతో ఘర్షణ పెట్టుకోవడం లాంటి చర్యలకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అంతే కాదు తమ దేశాలలో అంతర్గత సంక్షోభాలు తలెత్తినప్పుడు లేదా దేశంలో కీలకమైన ఎన్నికలు జరిగే సమయాలలో ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా పొరుగు దేశం ఫై కాలుదువ్వడం కూడా జరుగుతుంది. సంక్షోభం సర్దుమణిగి ఎన్నికలు పూర్తి అయితే ఘర్షణ కూడా సర్దుమణుగుతుంది. అంతే కానీ పూర్తి స్థాయి యుద్ధానికి ఎవరు కాలు దువ్వడం లేదు, ఏ దేశం సిద్ధంగా లేదు. ఆలా చూసినప్పుడు యుద్ధ వాతావరణం సృష్టించాల్సిన అవసరం మోడీకి లేదనే చెప్పాలి. కాకపోతే చైనాకు ఆ అవసరం ఉందనిపిస్తుంది. ఎందుకంటే కరోనా సృష్టికర్త చైనా అని అమెరికా మొత్తుకుంటుంది. ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. చైనా పట్ల ప్రపంచ వ్యాప్తంగా అనుమానం బలపడుతుంది. ఈ కాంటెస్ట్‌లో చూసినప్పుడు భారత్‌ను అమెరికా వైపు పోకుండా బెదిరించి తన దారికి తెచ్చుకోవాలని చైనా భావించి ఉండవచ్చు. అందులో భాగంగా మన సైనికుల మీద మెరుపు దాడి చేసిందనుకోవాలి. అయితే చైనా చర్య మోడీకి కలిసివచ్చినట్లైంది. ఎందుకంటే త్వరలో జరగబోయే బీహార్, అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికలకు ఇది బాగా వర్క్ అవుట్ అవుతుంది అని మోడీ గుర్తించారు. అందుకే దేశ సరిహద్దులకు వెళ్లి సైన్యానికి భరోసా ఇచ్చి భారత్ మాతకు జై వందేమాతరం అని నినదించి జాతీయవాదాన్ని రగిల్చారు. మోడీ నెత్తిన చైనా పాలు పోసినట్లైంది. మోడీ సకాలంలో దానిని తనకు అనుకూలంగా మల్చుకున్నారు. చైనా ఒకనాడు అండగా నిలబడింది కదా అని మెతక వైఖరి ప్రదర్శించకుండా దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించి వాతావరణాన్ని తనకు అనుకూలంగా మల్చుకున్నారు.

ప్రపంచ వ్యాపితంగా వచ్చిన ఆర్ధిక సంస్కరణల ఆ నేపథ్యంలో వచ్చిన డంకెల్ ప్రతిపాదనలు రావడం, ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడటం జరిగింది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ కాంటెస్ట్ లోనే గ్లోబలైజేషన్ విధానాలు అమలులోకి వచ్చాయి. ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా తమ వస్తువులు అమ్ముకోవచ్చు అనే పద్ధతి వచ్చింది. దీనితో ప్రత్యక్ష యుద్ధాలకు స్వస్తి చెప్పినట్లయింది. యుద్ధాల స్థానంలో మార్కెట్ ఆధిపత్య పోరు తెర మీదకు వచ్చింది. కార్పొరేట్ సంస్థలు వెలిశాయి. మార్కెట్ ఆధిపత్యం కోసం జీవ రసానిక యుద్ధాలు చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నుంచి చైనా దాడిని చూసినప్పుడు మనకు అనేక విషయాలు కనపడతాయి. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌ను చైనా ఆక్రమించిందని చెప్పొచ్చు. ఏ దేశ మార్కెట్‌కు తగ్గట్టుగా ఆ దేశానికి తన వస్తువులను ఎగుమతి చేస్తుంది. ఆ విధంగా మార్కెట్ పై తన పెత్తనాన్ని కొనసాగిస్తోంది. చైనా ఆధిపత్యాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతుంది. దీనికి తోడు సైనిక పరంగా, ఆయుధ పరంగా తన కన్నా శక్తివంతంగా ఎదిగేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా అడ్డుకుట్ట వేయాలనుకుంటుంది. ఈ సందర్భంగా అమెరికా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అమెరికా పరిశోధన విశ్లేషకుడు డాక్టర్ పాల్ క్రీక్ రాబర్ట్ మాటలను గుర్తు చేసుకోవాల్సి ఉంది. యుద్ధ నినాదమే అమెరికా విధానం అని అయన అంటాడు. అందుకే తన యుద్ధ వ్యూహాన్ని కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా వివిధ దేశాలలో టెర్రరిస్టు గుంపులను పెంచుతుంది అని కూడా అయన తన విశ్లేషణలో చెప్పుకొచ్చాడు. 120 దేశాలలో గత 100 ఏండ్లగా అమెరికా చేస్తున్న చర్యలను పూసగుచ్చినట్లు మరో అమెరికా చరిత్రకారుడు నిక్ టర్సీ సీక్రెట్ తాను రాసిన అమెరికా యుద్ధ రహస్యాలు అనే గ్రంథంలో వివరించాడు. వీరి విశ్లేషణ ఇలా ఉంటె అమెరికా సుప్రసిద్ధ మాజీ దౌత్యాధికారి మారక్స్ బ్రెజెనిక్స్ అమెరికా రాజకీయ సైనిక బడా వ్యాపార వర్గాలు చైనాను కబళించాలని చూస్తున్నారని అంటాడు. ఇవ్వన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే అగ్రరాజ్యమైన అమెరికా తన విస్తరణ కాంక్షకు మనల్ని బలి చేసే అవకాశం ఉంది అని చెప్పడానికి వీరి విశ్లేషణలను మీముందు పెట్టే ప్రయత్నం చేశాను. అందుకు చైనా పొరుగున ఉన్న భారత్‌ను తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీనీ ఆకాశకెత్తారు. భారత్ కు అన్ని రకాలుగా అండదండలు అందిస్తామని అని ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దును బలపరచడమే కాకుండా పాకిస్థాన్‌ను హెచ్చరించారు కూడా.ఆ రకంగా అమెరికా, భారత్ కు దగ్గరయ్యింది. ఈ నేపథ్యంలోనే నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని మోడీ పెద్ద ఎత్తున నిర్వహించడమే కాకుండా అమెరికాతో కొన్ని అంశాలలో ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇది చైనాకు ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు. అందుకే సడన్ గా మన సైనికుల మీద మెరుపు దాడి చేసి మనల్ని హెచ్చరించే ప్రయత్నం చేసిందనిపిస్తుంది. ఈ మొత్తం కాంటెస్ట్ ను చూసినప్పుడు పూర్తి స్థాయి యుద్ధాలు జరిగే అవకాశాలు లేవు.

మార్కెట్ పై ఆధిపత్యం కోసం, ప్రపంచం పై పెత్తన కోసం అగ్రరాజ్యాల మధ్య జరిగే ఘర్షణలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలు నష్టపోయే ప్రమాదం ఉంది. చైనాతో వాణిజ్య యుద్ధం భారత్ కు నష్టం అని నీతి అయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా అన్నారు. చైనా నుంచి భారత్‌కు ఎగుమతి చేసింది వారి మొత్తం ఎగుమతుల్లో 3 శాతం మాత్రమే. అదే మనం దిగుమతి చేసుకొనేది మాత్రం 15 శాతం వరకు ఉన్నాయంటున్నారు. పైగా ఇవి చాలా ముఖ్యమైన దిగుమతులని గుర్తు చేస్తున్నారు. చైనా వస్తువుల మీద ఆంక్షలు విధిస్తే భారత్‌కు తీవ్ర నష్టం అంటున్నారు. నేడు భారత్ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద ఆంక్షలు విధిస్తే వృద్ధి రేటు 7శాతానికి చేరుకోవడం అసాధ్యమని ఆయన అన్నారు. ఒక దేశం నుంచి దిగుమతి అయిన వాటిపై ఆంక్షలు విధించి ప్రయోజనం పొందిని దేశం ఏదీ లేదని ఒక వేళ అలా లాభపడిన దేశాలు ఏవైనా ఉంటే తనకు సూచించాలని పనగారియా సవాల్ విసిరారు. ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించుకొని దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్ లాంటి దేశాలు తలసరి ఆదాయాన్ని పెంచుకున్నాయని గుర్తు చేశారు. పనగారియా చెప్పిన దానిని బట్టి చూస్తే అభివృద్ధి చెందిన దేశాల మధ్య ఐక్యత ఉండాలి. అగ్రరాజ్యాల ఒత్తిడిలకు వారి కుతంత్రాలు బలి కాకుండా చూసుకోవాలి. స్పష్టమైన విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవాలి. ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసం ఎంతైనా ఉంది.

                                                                                    పి.వి శ్రీనివాసరావు
                                                                                     (ఇన్‌పుట్ ఎడిటర్ టి న్యూస్)

Article about PM Modi and China Relationship

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News