Home కలం పచ్చి అబద్ధం లాంటి నిజం ‘నాన్న’

పచ్చి అబద్ధం లాంటి నిజం ‘నాన్న’

poetry book

 

మనిషి లో కలిగే భావోద్వేగాలకు అక్షర రూపం ఇవ్వగలిగిన వాడు ఒక్క కవి మాత్రమే. తన కవిత్వంలో లోక దర్శనం చేయిస్తాడు. భిన్న భావోద్వేగాల్ని అనుభవించి పలవరించి, పలకరించి, పులకరించి వాటిని ఏరి కోరి దండ గా మలిచి మనకందిస్తాడు. కుటుంబం లో నాన్న గొప్పనా, అమ్మ గొప్పనా అని అడిగితే కొంచం కష్టమే. చాలా సందర్భాల్లో అమ్మ గొప్పదాన్ని, మాతృత్వాన్ని గుర్తు పెట్టుకొని పేరు ఇస్తాము గాని నాన్న చేసిన త్యాగాల్ని మాత్రం మరుగుపర్చేస్తాము. కొడుకు/కూతురు వృద్ధి లోకి రావడానికి తల్లి కెంత బాధ్యత ఉందో, తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంది. కొడుకు/కూతురు కోసం కొన్ని సార్లు అబద్దాలు ఆడతాడు, మోసం చేస్తాడు మనుషుల్ని …అతన్ని అతనే మోసం చేసుకుంటాడు. ఇదంతా ఎందుకంటే లోకం లో ని తండ్రుల త్యాగానికి అక్షరరూపం ఇచ్చి ‘నాన్న పచ్చి అబద్దాల కోరు‘ అని తాము అభివృద్ధిలోకి తెచ్చిన నాన్నా అబద్దాలకోరుని గుర్తు చేసుకుంటాడు. ఇందులో ఆదర్శాలు లేవు, అతిశయోక్తులు లేవు కేవలం నిజాయితీ గా నాన్న గురించి చెప్పిన కన్ఫెషన్ కావొచ్చు.

మొదటి రాతలోనే తమ కోసం చేసిన తాగ్యానికి అబద్దపు కోటింగువేసి మమ్మల్ని మోసం చేసాడే ఎలా, కొత్త చెప్పులు కొని/ పాత చెప్పులు తానూ వేసుకుంటూ, నాకు లడ్డూ కొనిచ్చి/పిడికెడు పప్పులు తింటూ తీపి తనకి పడదన్నప్పుడు గాని తెలియరాలేదు. నా కోరిక తీర్చడానికి తాను అబద్దంగా మారాడు.

ఎంత మోసగాడు కాకపోతే నేను కడుపులో పడ్డప్పటినుంచి ఉద్యోగం వచ్చేదాకా రెక్కలు ముక్కలు చేసుకొని వెన్ను వెన్నువిరిగిన నాన్నని ఆస్పుత్రి లో చేర్పించారని మోసం చేసాడు కాదు. నిజం తెలిస్తే అమ్మ ఎక్కడ ఏడుస్తుందో అని ఎంత పెద్ద అబద్ధం ఆడాడు. నేను పుట్టినప్పటి నుండి నాన్న పడ్డ కష్టాలను చూసిన వ్యక్తి అమ్మే కదా తట్టుకోలేదని తన కష్టాలని ‘అమ్మకు చెప్పకురా‘ అని వొట్టేసుకున్న నాన్న పచ్చి అబద్ధాలకోరే . చదువుకునేలోపు పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నప్పుడు, ఆడపిల్ల పుట్టిందని కట్టుకున్నోడు వదిలేసినప్పుడు, పచ్చి బాలింతగా అమ్మగారింటికొచ్చినప్పుడు ఇలా ప్రతి చోట అవమానాలతో ఓటమి తో బయటకు గెంటివేయబడి న ఓ సగటు ఆడపిల్ల ఎవరో మగాడు ఆశ్రయమిస్తే దయలేని సమాజం ‘ఉంపుడుగత్తె‘గా ముద్రేసినా బాధ పడకుండా కూతురిని పెళ్లి చేసి పంపడమనుకుంటే వయసు వచ్చిన కన్నపేగు తల్లి కన్నీటి కి ఖరీదు కట్టి లేచిపోవడం విషాదం కాదు …ఇక్కడే మరో ‘అట బొమ్మ‘ మొదలు.

నాన్న నన్ను ఎలా చూశాడో అమ్మని కూడా అలాగే చూశాడు ‘అమ్మ కోక‘ లో ఎంత ఆత్రం గా ప్రేమని పొదివి పట్టుకున్నాడు చూడు, ‘చనుబాలు కుడుచువేళ/మేలి ముసుగు తెర అమ్మకోక/మండుటెండ లో నిండు గొడుగు అమ్మకోక/అమ్మ కోక తో అనుబంధం /కన్ను రెప్ప సంబంధం. ఇన్ని గొప్ప నిజాలని ఎంత తీయనైన అబద్దం తో కప్పి పుచ్చాడో మా నాన్న. కంటి చుక్క విలువ నాన్న కి తెలిసినట్టు గా ఎవరికీ తెలియదు కావొచ్చు అందుకే ‘ఇగిరిపోవే కన్నీటి చుక్క‘ అంటూ లోకం లో సకల బాధలు పడుతున్న మనుషుల కంటి నుంచి కిందపడకుండా ఇగిరిపొమ్మంటాడు. విత్తిన విత్తు మొలకెత్తినప్పుడు/మొలిచిన పంట నివ్వనపుడు/రైతు కంట పడక ఇంకిపో/మూన్నాళ్ళకే కడుపులో ఆడపిల్ల అని గర్భస్రావం చేస్తున్న సమయంలో మనసు బాధని బయటపడుకుండా కంటి నీరు ఇంకిపో అని వాళ్లకి తట్టుకునే శక్తిలేదంటాడు. కొడుకు చదువుకొని పైకొస్తాడని అమ్మ, అయ్యా గొడ్డు చాకిరీ చేసుకొని, అప్పులు చేసి మరి చదివించాలని చూస్తే తనలాగే కూలి కమ్మని విధి రాసిన రాత కి కుమిలిపోతాడే నాన్న.

బాధ్యతగా ఉండాల్సినోడు నాగరికత మోజులో ‘చదువు సంస్కారాలు విడిచి/అమ్మ అయ్యల ఆశలు మరిచి/అవతరించే ఆ అబ్బోడు కూడా కల్లు ముంత కోసం మరో కూలి గా/..వ్యసనం లో పడీ కొట్టుకునే కొడుకలున్నంతవరకు మారదు. జ్ఞాపకం చాలా చెడ్డది ఎన్ని ఏళ్ళు గడిచిన కూడా వీడిపోదు అందుకే ఆకులు రాలిన/వీడని పచ్చదనం, మాట రాని మౌనం లో విలపిస్తున్న జ్ఞాపకం ఏళ్లకు ఏళ్ళు వెళ్లిపోతున్నా నాకు కానుకగా వదిలేసి వెళ్తాయి /, జ్ఞాపకం మధురమే కాదు బాధాకరమే …కన్నీటి కి మాటలొస్తే ఎలా ఉంటుంది ఒక్క కన్నీటి చుక్క ఎన్ని జీవిత సత్యాలు చెప్తుందో/ ఎన్ని రహస్యాలని విప్పి చెప్తుందో, ఒక్క కన్నీటి చుక్కని కదిలించి చూడు వేదంతఃని జీవితాన్నే చూపిస్తుందంటాడు నాన్న. ఇక భ్రూణ హత్యలని అడుగుగడుగునా చూస్తున్నాం. స్త్రీని దేవత గా పూజించే దేశం లో పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే చంపేస్తున్నాం. దీన్ని మార్చాలని కోరిక.

అందుకే ‘బాలికలను బతకనిద్దాం! /గర్భం లో పిండాన్ని శ్కాన్ చేసి ఆడపిల్లని తెలియగానే చంపేయకు/పుట్టనివ్వు ఆడపిల్లని ఎందుకు పుట్టనివ్వాలంటే ఏమో పుట్టాక గొప్ప ప్రముఖురాలవ్వవచ్చు/యోధురాలు కావొచ్చు అందుకే ‘ఆడపిల్ల అంటే అమ్మ /ఆడపిల్లను పుట్టనిద్దాం/బాలిక ని బతికిద్దాం. నాన్న పగవారి గురించే ఆలోచించడమే కాదు తన గురించి తానూ వగచి బాధపడుతున్నాడు ఎందుకో తనని తానూ తరిచి చూసుకొని ఎన్నాళ్లయిందో అని బాధ పడుతున్నాడు, /భారమవుతున్న బాధ్యతల్లో/నన్ను నేను ప్రేమించుకొని ఎన్నాళ్ళు అయింది/ నాలో నుండి నేను దూరమవుతూ మరమనిషి లా మారకముందే, దేవుడా /నాన్కు లేనిదే నా కొద్దు/ నన్ను నన్నుగా మిగల్చు చాలు అంటాడు. నయయమై న కోరికని కదా ….(ఎన్నాళ్ళు అయిందో!).

వలస పక్షులు పా పం ఎంత కష్టమో కదా /గుండె చేతబట్టుకొని పట్నం పయనమైన గొల్లన్న /ఆకలితో పట్నం వైపు అడుగులేస్తున్న చాకలి తిప్పన్న/మగ్గం మూగయిన చేనేతన్న ప్రాణం మనుగడ కోసం కొట్టుకుకుంటుంది వెళ్లలేక వెళ్తున్న వలసపక్షులు ఊపిరితో ఊరు చేరే ప్రాణులెన్నో పాపం వలసపక్షుల బాధని అనుభవిస్తూ నిత్యం మనుగడ కోసం యుద్ధం చేస్తున్నారు కాదు …ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు మృగ్యమే. అలాంటి ఉమ్మడి కుటంబాలకోసం కలవరిస్తున్నాడు నాన్న. ఉమ్మడి కుటుంబం లో కొన్ని అనుభూతుల్ని కళ్ళ ముందుంచాడు నాన్న మరల అలాంటివి రావాలి నాన్న భుజాలపై ఊరేగింపు/బాబాయిల బౌమతులు/పిన్ని కూనిరాగాలు/అవ్వనోట నీతి కధలు/ఒకరికి జ్వరమొస్తే ఇల్లంతా లంఖణాలు/ ఇలా ఉమ్మడి కుటంబంలో ఆప్యాయతల్ని కలబోసి ముందుంచారు.(ఉమ్మడి కుటుంబాలు).

నాన్న నిజంగా నే పచ్చి అబద్ధాల కోరు. యాంత్రికతను నిజ జీవితంలోకి అన్వయించుకున్నాక , మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలు గా మారాక ప్రేమలు, ఆప్యాయతలు విలువలేని వస్తువులైనప్పుడు మనం కోల్పోయిన భావోద్వేగాల్ని గుర్తు చేశాడు. నాన్న కళ్ళ నుంచి చూసిన లోకాన్ని అక్షరరూపం లో సురేంద్ర ప్రపంచానికి చూపడం గొప్ప. ఎన్నో కవితలు చాలా రోజులు వెంటాడతాయి. ఈ సంపుటికి వ్యతిరేకార్థంలో శీర్షిక ని పెట్టి కొన్ని ప్రశ్నల్ని సమాజం పై సంధించాడు అది తల్లి తండ్రులని పిల్లలు నిర్లక్ష్యం చేసిన తీరు పై కావొచ్చు, ఒక మట్టి పరిమళం, భోళాతనం, లౌక్యం తెలియని అమాయకత్వం ఈ నాన్నలో కనిపిస్తాయి. మనిషి మరో మనిషి కోసం పడే ఆరాటం ప్రతి కవితలో ప్రతిబింబిస్తుంది. వీటిలోని కవితలన్నీ భిన్న సందర్భాలలో రాసినవి. ఒక్కో కవిత ఒక్కో సందర్భానికి గుర్తు చేస్తోంది. సమాజం లో జరిగే సంఘటనలకు సాక్షీభూతం ఈ సంపుటి. కొడుకుల కోసం/కూతుర్ల కోసం, అయిన వాళ్ళ కోసం ఈ నాన్న తానూ కరిగిపోతూ మరొకరి వెలు గు నిచ్చే క్రమం లో ‘అబద్దం‘ గా మారి ఎం దరో కొడుకుల్ని./బిడ్డల్ని ‘నిజం‘ గా మార్చాడు. అం దుకే నాన్న పచ్చి అబద్ధాల కోరు. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. మంచి సంపు టి ని అందించిన సురేంద్ర గారికి అభినందనలు.

Article about Poet emotions in poetry