Thursday, March 28, 2024

హక్కులకు అండ

- Advertisement -
- Advertisement -

The rate of increase in unemployment reached 7.6 percent

అణచివేత ఎక్కడ ఏ రూపంలో వున్నా దాని ఉక్కు పాదం కింద నలిగిపోతూ కన్నీరు మున్నీరవడం కంటే దానిని ఎదిరించి నిలవడమే మానవాభ్యుదయానికి సంకేతం. మనిషి స్వేచ్ఛను అరికట్టే ఏ చర్యనైనా ఖండించవలసిందే. ప్రభుత్వాలు ఎదురు కంఠాన్ని కాలరాస్తున్నప్పుడు రగిలే ధిక్కార స్వరమే మానవ హక్కులకు రక్షా కవచం. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని మానవ హక్కుల పరిరక్షకులకు ప్రకటించడం మంచి పరిణామమే. ప్రపంచం ఆధునికం అవుతున్న కొద్దీ హక్కుల హననం ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఈ బహుమతి వాటిని కాపాడడానికి పోరాడుతున్న వ్యక్తులకు, శక్తులకు అత్యంత ప్రోత్సాహాన్నిస్తుంది. మాజీ సోవియట్‌లలో ఒకటైన బెలారస్‌లో రెండవ సారి జైలు నిర్బంధాన్ని అనుభవిస్తున్న హక్కుల ఉద్యమకారుడు బియాలియాత్‌స్కీకి, రష్యన్ హక్కుల ఉద్యమ గ్రూపు సంస్థ మెమోరియల్‌కు, ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కి ప్రకటించారు. మానవ హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, శాంతియుత సహజీవనం కోసం పోరాడిన అసాధారణ త్రయానికి శాంతి అవార్డు ఇస్తున్నట్లు నార్వేకి చెందిన నోబెల్ కమిటీ అధ్యక్షురాలు రీస్ ఆండర్సన్ ప్రకటించారు. 60 ఏళ్ల బియాలియాత్‌స్కీ బెలారస్‌లో వియాస్నా మానవ హక్కుల కేంద్రాన్ని 1996లో నెలకొల్పారు. ఆ దేశాధినేత అలెగ్జాండర్ లుకాషెంకో నియంతృత్వ అణచివేతకు వ్యతిరేకంగా ఈ సంస్థను స్థాపించారు. నిరసన ప్రదర్శనలు, ఉద్యమాలు నిర్వహించి జైలు పాలైన వారికి సహకారం అందించడానికి, రాజకీయ ఖైదీలపై బెలారస్ అధికారులు సాగించే అణచివేత చర్యలను గ్రంధస్థం చేయడానికి అంకితమై ఈ సంస్థ పని చేస్తున్నట్టు చెబుతున్నారు. బియాలియాత్‌స్కీ 2011లో బూటకపు పన్ను ఎగవేత కేసులో జైలుపాలై 2014 వరకు శిక్ష అనుభవించాడు. మళ్లీ గత ఏడాది లుషెంకో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతూ అరెస్టయ్యాడు. ఇప్పటికీ జైలు జీవితం గడుపుతున్నాడు. ఆయనను తక్షణమే విడుదల చేయాలని నోబెల్ కమిటీ విజ్ఞప్తి చేసింది. తనకు శాంతి బహుమతి వచ్చిన సంగతి కూడా ఆయనకు వెంటనే తెలియజేసే అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. శాంతి బహుమతికి ఎన్నికైన మరో సంస్థ మెమోరియల్ 1989లో నెలకొన్నది. సోవియట్ యూనియన్ పాలకులను ఎదిరించినందుకు 1975లో నోబెల్ శాంతి బహుమతి పొందిన శఖరోవ్ ఈ సంస్థ స్థాపకుల్లో ఒకరు కావడం గమనార్హం. ఇటీవల రష్యాలో అనేక హక్కుల బృందాలను విదేశీ ఏజెంట్లుగా ముద్ర వేసినందుకు నిరసనగా ఈ సంస్థ ఉద్యమించింది. మెమోరియల్‌కు శాంతి బహుమతిని ప్రకటించడం తీవ్ర నిర్బంధాన్ని అనుభవిస్తున్న రష్యన్ పౌర సమాజానికి జేజేలు చెప్పడమేనని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. ఒక దేశం ఎప్పుడైతే అక్కడి మానవ హక్కులను అణగదొక్కుతుందో అది ప్రపంచానికే ప్రమాదకారిగా తయారవుతుందని అంటూ తాము మానవ హక్కులకు అండగా ఎల్లప్పుడూ వుంటామని నోబెల్ కమిటీ చెప్పుకున్నది. శాంతి బహుమతి పొందిన మరో సంస్థ ఉక్రెయిన్‌లోని సెంటర్ ఫర్ లిబర్టీస్. రష్యా ఉక్రెయిన్ పౌరుల మీద సాగిస్తున్న యుద్ధ కాండకు వ్యతిరేకంగా అంతర్జాతీయ కోర్టుకు వెళ్లడానికి ఈ సంస్థ కృషి చేస్తున్నది. రష్యా యుద్ధ నేరాల ఘటనలను రికార్డు చేస్తున్నది. ఇప్పటి వరకు అటువంటి 19000 ఘటనలను గుర్తు పట్టింది. ఈ మూడు సందర్భాల్లోనూ అక్కడి ఆధిపత్య శక్తుల దుర్మార్గాలను ఎదిరిస్తున్న వారికి శాంతి బహుమతి ఇవ్వడం సంతోషించవలసిన విషయమే. అయితే శాంతి బహుమతి అందుకుంటున్న అలెస్ బియాలియాత్‌స్కీగాని, ఇతర రెండు సంస్థలు గాని మాజీ సోవియట్లకు చెందినవి కావడం ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన అంశం. మానవ హక్కుల హననం కేవలం సోవియట్‌లలోనే జరుగుతుందని అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రచారం చేస్తాయి. అక్కడ, ఇక్కడ గల రాజకీయ వ్యవస్థల మధ్య శత్రుత్వాన్ని ఇది వెల్లడిస్తుంది. కమ్యూనిస్టు వ్యవస్థను నామరూపాల్లేకుండా నిర్మూలించాలనే దృష్టితోనే ప్రజాస్వామ్య వ్యవస్థలని చెప్పుకునే పాశ్చాత్య దేశాల పెట్టుబడిదారీ పాలకులు పని చేస్తారు. గతంలో సోవియట్ అసమ్మతివాదులైన శఖరోవ్‌కు, సోల్జినిత్సిన్‌కు నోబెల్ పురస్కారాలను అందించారు. మానవ హక్కుల హననానికి ఇప్పుడు దాదాపు అన్ని దేశాల పాలకులు పాల్పడుతున్నారు. అమెరికా వికీలీక్స్ వీరుడు అస్సాంజేను ఎంతగా రాచిరంపాన పెడుతున్నదో తెలిసిందే. అలాగే అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడుని తెల్ల పోలీసు ఏ విధంగా నడి రోడ్డు మీద మెడ మీద బూటు కాలుతో తొక్కి హతమార్చాడో అటువంటి ఘటనలు ఇంకా ఎలా జరుగుతున్నాయో తెలిసిందే. తాము చేసే హక్కుల అణచివేతను కప్పివేసి ఎదుటి దేశాల్లో జరుగుతున్న వాటిని మాత్రమే వేలెత్తి చూపించినంత కాలం ఇటువంటి బహుమతులకు దక్కవలసినంత గౌరవం లభించదు.

Article about Protection of Human Rights

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News