Home ఎడిటోరియల్ నిరాశాజనకం!

నిరాశాజనకం!

sampadakiyam

వరుసగా మూడో సంవత్సరం తగినంతగా వర్షాలు లేకపోతే ఎన్ని కష్టాలు కలుగుతాయో ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. వ్యవసాయ రంగ సంక్షోభం మరింత పెరిగిపోయి గ్రామీణ పేదలు, సాగు కూలీలు, చిన్న రైతులు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. వలసలు పెరిగిపోతాయి, గ్రామాలు దుఃఖమయమవుతాయి. ఆహారోత్పత్తి పడిపోయి వృద్ధి రేటు కూడా తగ్గిపోతుంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతముంటుందని గత జనవరిలో ఆహ్లాదకరమైన సమాచారం అందించిన స్వతంత్ర వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ ఇప్పుడందుకు విరుద్ధమైన జోస్యాన్ని ప్రకటించి దేశం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చునని బుధవారం నాడు తాజా జోస్యం చెప్పింది. ఇదెంతో ఆందోళనకరమైన సమాచారం. పంటలు విశేషంగా సాగుచేసే జూన్ సెప్టెంబర్ తొలకరి వర్షాల సీజన్‌లో వాయువ్య రుతు పవనాలు మందగిస్తాయని పర్యవసానంగా వానలు సాధారణ స్థాయి కంటే తక్కువగా కురుస్తాయని స్కైమెట్ హెచ్చరించింది. ముఖ్యంగా జూన్‌లో అతి తక్కువగా 77 శాతం వర్షపాతమే నమోదవుతుందని జూలైలో అది 91 శాతానికి పెరుగుతుందని, వరుసగా 102%, 99% వర్షపాతాలతో ఆగస్టు, సెప్టెంబర్ నెలలు మెరుగ్గా ఉంటాయని స్కైమెట్ తెలియజేసింది. అంటే రైతులు తొలకరి మొదటి రెండు నెలల మీద ఆశలు పెట్టుకోనవసరం లేదని స్పష్టపడుతున్నది.

ఎల్‌నినో ప్రభావం వల్లే తక్కువ వర్షాలు కురిసే ప్రమాదమున్నదని చెప్పింది. 50 ఏళ్ల సగటు 89 సెం.మీ.లలో 96, 104 శాతం వర్షపాతం నమోదయితే దానిని సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. ఈ సగటులో 90, 95 శాతం మాత్రమే రికార్డయితే దానిని సాధారణం కంటే తక్కువ వర్షపాతంగా భావిస్తారు. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఎల్‌నినో, లానినో పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. పసిఫిక్ జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కితే ఎల్‌నినో ఏర్పడుతుంది. వాతావరణం పొడిదేరి వర్షాలు తక్కువగా పడుతాయి. ఇందుకు విరుద్ధ పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు లానినో ఏర్పడుతుంది. ఈ ఫిబ్రవరిలో పసిఫిక్ జలాలు అసాధారణంగా వేడెక్కి ఎల్‌నినోకు దారి తీశాయని చెబుతున్నారు.

ఇండియాలో ఏడాది పొడుగునా కురిసే వర్షంలో అధిక భాగం (70%) తొలకరిలోనే నమోదవుతుంది. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కావడం వల్ల ఈ వర్షాలకు విశేష ప్రాధాన్యముంది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండబోతున్నాయని స్పష్టపడినందువల్ల ఆ మేరకు వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతింటుందని భావించవచ్చు. గత కొద్ది సంవత్సరాలుగా వర్షాధార పంటలు సగంలో నీటి వసతి కొరవడి ఎండిపోయి రైతును కష్టాలు పాలు చేసిన విషయం తెలిసిందే. మామూలుగా తొలకరిలో రుతు పవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. జూలై 15 నాటికి దేశమంతటా వ్యాపిస్తాయి. సెప్టెంబర్‌లో వెనుదిరుగుతాయి. ఈ సమయంలోనే దేశమంతటా అధికంగా వర్షాలు కురిసి పంటలకు ప్రాణాధారమవుతాయి. గత రెండేళ్లుగా వర్షాలు సరిగా లేకపోడం వల్ల భూగర్భ జలాలపై ఆధారపడడం అపరిమితంగా పెరిగింది. పర్యవసానంగా భూగర్భ జల మట్టాలు కూడా పడిపోయాయి.

రెండేళ్లుగా కరువు నెలకొంది. 2016లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయింది. 2014, 2015 సంవత్సరాల్లో తక్కువ వర్షాలే కురిశాయి. ఆ రెండేళ్లూ కరువు నకనకలాడించింది. 2017, 2018 సంవత్సరాల్లోనూ చాలినంతగా వర్షాలు లేవు. దేశంలో సగం వ్యవసాయ క్షేత్రాలు వర్షాధారాలే. దాదాపు 26 కోట్ల 30 లక్షల మంది రైతులు, వారి కుటుంబాలు వర్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డారు. దేశంలోని 700 పైచిలుకు జిల్లాల్లో 20 శాతం జిల్లాల్లో మాత్రమే గత ఏడాది (2018) వరదలు సంభవించాయి. 40 శాతం జిల్లాలు 20 శాతం తక్కువ వర్షపాతంతో కరవు వాతపడ్డాయి. సంవత్సరాల పొడుగునా తగినంతగా వర్షాలు లేకపోడం వల్ల భూగర్భ జలాలపై అధిక భారంపడి అవి కూడా పాతాళాన్ని తాకుతున్నాయి. బోర్లు ఎండిపోయి రైతుల మదుపు విపరీతంగా పెరిగిపోతున్నది. కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు. అప్పులపాలై ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. తరచూ ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, అమలు అసాధారణ వేగంలో జరగాలి. నదులపై ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకోవాలి. నదుల అనుసంధాన ప్రక్రియ కూడా పుంజుకోవాలి. ఇందుకు అవసరమైన నిధుల కేటాయింపు జరగాలి.

Article about Rainfall 2019