Home ఎడిటోరియల్ రాయ్ ఎందుకు మానవవాది?

రాయ్ ఎందుకు మానవవాది?

Article about ram mohan roy biography

 

సతీ సహగమన దురాచారానికి క్రీ.శ 1815-25 మధ్య కాలంలో ఒక్క కలకత్తా నగరంలోనే సుమారు ఐదు వేల మంది బలయ్యారు. దాని నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు రాజా రామ్మోహన్ రాయ్! ఆయన జీవితమేమీ పూలబాట కాదు. రెండు సార్లు ఇంట్లోంచి వెళ్లగొట్టబడ్డాడు. 22 మే 1772లో బెంగాల్‌లోని ఖానాకుల్, హుగ్లీ జిల్లా రాధానగర్‌లో సంప్రదాయ హిందూ దంపతులకు జన్మించిన ఆయన తండ్రి రామ్‌కాంతో రాయ్, తల్లి తరణీదేవి. కాశీలో విద్యాభ్యాసం చేసి, ఉపనిషత్తుల సారాన్ని గ్రహించి, విగ్రహారాధనను ఖండిస్తూ రాయ్ గ్రంథ రచన చేశారు. అదే బెంగాలీ భాషలో తొలి వచన కావ్యం అయ్యింది. ఆ రచన చేసినందుకు తండ్రి కోపగించి ఇంటి నుండి వెళ్లగొట్టాడు. కొన్నేళ్ల పాటు ఎక్కడెక్కడో తిరిగి, టిబెట్‌కు వెళ్లి అక్కడ బౌద్ధులతో చర్చలు సాగించాడు. ఒక దశలో ఆగ్రహించిన అక్కడి మత గురువులు రామ్మోహన్ రాయ్‌ని చంపేయాలనుకున్నారు. కాని, అక్కడి స్త్రీలు కొందరు ఆయనను దాచిపెట్టి కాపాడారు. నాటి నుండి ఆయన స్త్రీ జనోద్ధరణకు పూనుకున్నారు. ఆ ప్రయత్నంలోనే ఒక సంఘ సంస్కర్త, ఒక మానవవాది ఉద్భవించారు.

బెంగాల్‌లో కులీనులు అనే ఒక బ్రాహ్మణ తెగకు చెందిన యువకులకు తమ కుమార్తెలనిచ్చి పెళ్లి చేయడం గౌరవంగా భావించేవారు. కాని, అలాంటి బ్రాహ్మణ యువకులు ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఒక్కో యువకుడికి ఐదు, పది మంది కన్యలతో పెండ్లి జరిపించే వారు. ఒక్కోసారి యాభై మందినైనా సరే కట్టబెట్టేవారు. ఆ సంఖ్య వంద కూడా దాటుతూ ఉండేది. అలాంటి సామాజిక పరిస్థితుల్లో భర్త చనిపోతే అతని భార్యలంతా సహగమనం చేయాల్సి వచ్చేది. దగ్గరగా ఉన్నవారు భర్త శవంతో కలిసి చితిమీదికి వెళ్లేవారు. ఆ సమయంలో దూరంగా ఉన్న భార్యలు, భర్త ధరించిన పంచో, కండువానో లేదా మరేదైనా వస్తువో మీద వేసుకుని, ఉన్న చోటనే చితి పేర్పించుకుని అందులోకి దూకేవారు. భర్త చనిపోయిన స్త్రీలు సహగమనం చేస్తే పుణ్యం వస్తుందని, కుటుంబ కీర్తి పెరుగుతుందని హిందూ మతవాదులు ఒక అభిప్రాయాన్ని ప్రచారం చేశారు. అదొక అబద్ధమని నాటి స్త్రీలు గ్రహించలేకపోయారు. ఎక్కువ మంది అమాయక స్త్రీలు ఒప్పుకునే వారు. ఎవరైనా మొండికేస్తే, బలవంతంగా శ్మశానానికి తీసుకుపోయి వారిని చితిపైకి తోసేసేవారు.

స్త్రీలను అలా సజీవంగా అగ్నికి ఆహుతి ఇచ్చే సంప్రదాయం ఈ దేశంలో చాలా కాలం కొనసాగింది. ఏ స్త్రీ అయినా మంటలు భరించలేక చితిలోంచి పైకి లేవబోతే, ఆమెను వెదురు కర్రలతో నిర్దాక్షణ్యంగా బలవంతంగా చితి మీద నొక్కి పెట్టేవారు. అలాంటి ఘోర అకృత్యాల్ని రూపుమాపడానికి రామ్మోహన్‌రాయ్ మానవతా దృక్పథంతో సంఘ సంస్కర్త అయ్యారు. మన దేశ సంస్కృతి ఇంత నికృష్టంగా ఉండేదని నేటి దేశభక్తులెవ్వరూ గుర్తు చెయ్యరు. బ్రాహ్మణ వాద మనువాద తప్పిదాల్ని విమర్శించరు. అవే ఇంకా కొనసాగడం లేదేమని తెగ బాధపడుతుంటారు. వైజ్ఞానిక వాదులు మాత్రం విషయం గతంలోదైనా, సమకాలీనంలోదైనా మానవీయ విలువలు లేని వాటిని నిర్దంద్వంగా నిరసిస్తారు. కొడుకు మీద బెంగపెట్టుకున్న తండ్రి రామ్‌కాంతో రాయ్ కొన్నాళ్లకు రామ్మోహన్ రాయ్‌ని పిలిపించి ఇంట్లో పెట్టుకున్నారు. కాని, కొడుకు బ్రాహ్మణ మతాచారాలను ఖండించడం చూసి భరించలేక రెండోసారి కూడా ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఇల్లు వదిలి వెళ్లిన రాయ్ ఆరేళ్లపాటు ఇంగ్లీషు, ఫ్రెంచ్,లాటిన్, గ్రీకు, హిబ్రూ భాషలను నేర్చుకుని పదమూడేళ్ల పాటు గుమస్తా ఉద్యోగం కూడా చేసి, సంఘ సంస్కరణ కోసం దాన్ని కూడా వదిలేసి కలకత్తాలో స్థిరపడ్డాడు.

మానవీయ విలువల్ని ప్రతిష్టించాలన్న బలమైన కోర్కె లేకపోతే సమాజ ఉద్ధరణ కోసం కుటుంబ జీవనాన్ని, ఉద్యోగాన్ని వదిలేసి సంఘర్షిస్తూ ఉండడం వీలు కాదు. కలకత్తాలో ఉన్న రోజుల్లోనే రామ్మోహన్ రాయ్ చిన్న చిన్న పుస్తకాలు రాసేవారు. ఉపన్యాసాలిస్తుండేవారు. సతీసహగమన దురాచార దుర్మార్గం గురించి ప్రజలకు బోధించేవారు. పండితులతో వాదిస్తుండేవారు. అయినా, అతి కొద్ది మంది మాత్రమే ఆయనను బలపరిచేవారు. రాయ్ ఏమాత్రం నిరుత్సాహ పడకుండా సతీ సహగమనాన్ని నిషేధించాలని, స్త్రీల ప్రాణాలు రక్షించాలని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపుతూనే ఉండేవారు. దాని ఫలితంగా మూర్ఖ పండితులంతా ఏకమై ప్రతిదాడులు చేశారు. సహగమనం లేకపోతే హిందూమతం భ్రష్ఠుపట్టిపోతుందని, ఆ ఆచారాన్ని అలాగే కొనసాగనివ్వాలని లక్షల మంది ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. రామ్మోహన్ రాయ్ వాదనను నిరసిస్తూ పుస్తకాలు రాసి పంచిపెట్టారు. అయినా వారి ప్రయత్నం నీరుగారిపోయింది. రామ్మోహన్ రాయ్ వాదనలోని మానవీయ కోణాన్ని గుర్తించి లార్డ్ విలియం బెంటింగ్ 4 డిసెంబర్ 1829న సతీసహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశాడు. హిందూ మతం ముసుగులో కొనసాగుతున్న ‘హత్య’లకు అడ్డుకట్ట వేశాడు.

రామ్మోహన్ రాయ్ కేవలం హిందూమతం దురాగతాల్ని ఎత్తి చూపడమే కాదు. ఇతర మతాలు చేస్తున్న దుర్మార్గాల్ని కూడా విమర్శించారు. బైబిల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందులోని దోషాల గూర్చి సంస్కృతంలో పుస్తకాలు రాశారు. “క్రీస్తు కేవలం మత గురువు మాత్రమేనని, ఆయన ‘దేవుడు’ అని అనడం అసమంజసమని” రాయ్ అభిప్రాయపడ్డారు. క్రైస్తవులతో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. వారి వాదనలని, రాతలని రాయ్ ఖండించారు. రాయ్ రచనలను క్రైస్తవ సంఘాలు విమర్శించాయి. క్రైస్తవులకు చెందిన ప్రింటింగ్ ప్రెస్‌లోనే మొదట రామ్మోహన్ రాయ్ రచనలు అచ్చయ్యేవి. అవి విపరీతంగా ప్రజాదరణ పొందేవి. విషయం గ్రహించిన ప్రింటింగ్ ప్రెస్ వారు తర్వాత కాలంలో రాయ్ రచనలు అచ్చేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు రాయ్ నిరాశపడలేదు. స్వంతంగా ప్రెస్ పెట్టి, తన రచనలు తనే అచ్చేసుకోవడం ప్రారంభించారు. 1804 లో తన 32వ యేట రామ్మోహన్ రాయ్ పర్షియన్ భాషలో “తుహఫత్ ఉల్ మువహిదిన్ ” అనే పుస్తకం రాశారు. దానికి ఉపోద్ఘాతం అరబిక్ భాషలో రాశారు. అప్పటికి మేధోపరమైన గ్రంథాలు బెంగాలీ భాషలో రాయడం ప్రారంభం కాలేదు. సామాజిక,రాజకీయ, విద్యారంగాలలో ఆయన చేసిన గణనీయమైన కృషిని గుర్తించి మొగల్ రాజు అక్బర్ 2 (అక్బర్ షా 18061837) ఈయనకు “రాజా” అనే బిరుదు ప్రదానం చేశాడు.

ముఖ్యంగా సతీసహగమనాన్ని, బాల్య వివాహాల్ని అడ్డుకున్నందుకు, కుల వ్యవస్థను వ్యతిరేకించినందుకు, గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచినందుకు ఆయనకు ఆ గౌరవం దక్కింది. రాజా రామ్మోహన్ రాయ్ నిరీశ్వరవాది కాదు. హేతువాది కాదు. అయినా కూడా, మానవతా దృక్పథంతో స్త్రీ జనోద్ధరణకు పూనుకున్నారు. దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతంతో బ్రహ్మ సమాజ స్థాపన చేశారు. విగ్రహారాధనను నిరసించారు. 27 సెప్టెంబర్ 1833 అరవై ఒకటవ యేట ఇంగ్లాండులోని బ్రిస్టల్‌లో తుది శ్వాస విడిచారు. అప్పటికే ఆయన ఖండాంతర ఖ్యాతి నార్జించడం వల్ల ఇంగ్లాండులోని స్టాపిల్టన్‌లో ఒక కాలి బాటకు రాయ్ పేరు పెట్టారు. “రాజా రామ్మోహన్ వాక్‌” అనేది ఆ పేరు! భారత దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వమే, భారత రాజ్యాంగం రూపుదిద్దుకోక ముందే రాజా రామ్మోహన్ రాయ్ మరి కొంత మంది సంఘ సంస్కర్తల ఒత్తిడి వల్ల బ్రిటిష్ పాలకులు కొన్ని చట్టాలు అమలు చేశారు. అవి మనువాద బ్రాహ్మణవాద క్రూరమైన నియమ నిబంధనల్ని గణనీయంగా తగ్గించాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటిషు వారి దమనకాండ తక్కువదేమీ కాదు.

కాని, స్థల కాల పరిస్థితుల్ని అవగాహన చేసుకుని, వారు కొన్ని మంచి చట్టాల్ని అమలు చేశారన్నది నిజం! సతీ సహగమనాన్ని, దేవదాసీ సంప్రదాయాన్ని నిషేధించింది (1829) వారే బాల్య వివాహాల్ని, నరబలిని నిషేధించారు. శూద్ర వధువు బ్రాహ్మణుడితో మొదటి మూడు రాత్రులు గడపడాన్ని నిషేధించారు. హిందువుల్లో అన్ని కులాల వారికి శిక్ష సమానంగా ఉండేట్లు చట్టం చేశారు. బానిసత్వాన్ని నిషేధించి,అన్ని కులాల వారికి విద్యా హక్కును కల్పించారు. ఆడ శిశువుల హత్య కూడా నిషేధించబడింది. ఆస్తి విషయంలో శూద్రులకు కూడా సమాన హక్కులు ఇవ్వబడ్డాయి. విధవా వివాహాల్ని చట్టబద్ధం చేశారు. ‘లోచరక్ పూజ’ను నిషేధించారు. అంటే శూద్రుల్ని సజీవంగా భవనాల పునాదుల కింద సమాధి చేయడాన్ని నిషేధించారు. బ్రిటిష్ వారే ఇలాంటి చట్టాలు అమలు చేశారంటే, మన దేశంలో నాటి సామాజిక జీవనం ఎంత దుర్భరంగా గడిచిందో అర్థం చేసుకోవచ్చు. విషయం అర్థం చేసుకున్న తర్వాతైనా మనం మనుషుల్లా ప్రవర్తించాలి కదా? విశాల దృక్పథంతో మనుషులంతా ఒక్కటే అనే భావనలోకి రావాలి కదా? సమాజాన్ని ఎవరు ఏ రకంగా ముక్కలు చేసినా వారంతా దోషులేనన్నది నిజం!

Article about ram mohan roy biography