Home ఎడిటోరియల్ మోనిటైజేషనా, ప్రైవేటైజేషనా?

మోనిటైజేషనా, ప్రైవేటైజేషనా?

Article about ruling political parties in india

 

మన దేశ పాలకులు ప్రజా సేవ కోసం పాలనా చేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి ప్రజాసంక్షేమ కార్యక్రమం కోసం ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలనా చేయాల్సిన పార్టీల పాలకులు నేడు వారి అధికార రక్షణ కోసం స్వార్థ రాజకీయ కుటిల నీతితో అనాలోచిత పాలనతో నియమ నిబద్ధత లేని పాలన ఖర్చులతో దేశా ఖజానాను అప్పులతో నింపి, ఇప్పుడు నీతిమాలిన నియమాలతో చేసిన అప్పులు తీర్చుట కోసం ప్రజలపై కపట ప్రేమ నటిస్తూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్నట్టు నాటకీయ కోణంలో ప్రజల ఆస్తులను మోనిటైజేషన్ పేరుతో ప్రైవేటీకరణకు దారులు వేస్తున్నది. మోనిటైజేషన్ అంటే ప్రైవేటీకరణ లేదా నిర్వహణకు ప్రైవేటు వారికి అప్పగించటం. పేరు ఏది పెట్టినా మన పాలకులు వారి అనాలోచిత పనులవల్ల, ప్రణాళికల వల్ల, పథకాల వల్ల ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగపడే ప్రజా ఆస్తులను పాలకులు తమ సొంత ఆస్తులుగా భావించి ప్రజా భవిష్య ప్రయోజనం మరిచి ఆస్తులను మోనిటైజేషన్ పేరుతో ప్రైవేట్ వారికి ఇవ్వడానికి సిద్ధపడటం ప్రత్యేకంగా ప్రభుత్వమే తమ అసమర్ధతను ఒప్పుకొని దేశంలో ప్రైవేటీకరణకు మార్గాలు వేయడం ప్రజలకు నష్టమే జరుగుతుందని నిపుణుల ఆలోచన.

అది పూర్తిగా కట్టబెట్టటం కాదు, నిర్వహించి ప్రభుత్వానికి కొంత ముట్టచెప్పటం అని చెబుతున్నది. దానికే మోనిటైజేషన్ అని పేరు పెట్టారు. ప్రైవేటురంగం గురించి దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భ్రమలు కల్పిస్తుంది. ప్రైవేటు రంగం ఎంత అవినీతి, అక్రమాలతో జనాలను పీక్కు తింటుందో, ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందో కరోనా మహమ్మారి వెల్లడించింది. జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, ఎస్ బ్యాంకు, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలి సర్వీసెస్, ఒడా ఫోన్, సత్యం కంప్యూటర్స్ ఇలా అనేక కంపెనీలు ఎలా మోసాలకు పాల్పడ్డాయో తెలిసిందే. ఇలాంటి వారికి ప్రభుత్వ ఆస్తులను అప్పగిస్తే వారు బాగు చేస్తారన్న హామీ ఏమిటి? రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఘోర వైఫల్యం గురించి తెలిసిందే. మన కళ్ల ముందు దివాలా తీసిన అతిపెద్ద ప్రైవేటు కంపెనీ. వారి సామర్ధ్యం ఏమైంది? రూ. పద్దెనిమిది వేల కోట్ల ఆస్తులున్న సదరు కంపెనీ 50 వేల కోట్ల అప్పులతో ఐపి (దివాలా పిటీషన్) పెట్టింది. దానికే రాఫెల్ విమానాల కాంట్రాక్టును కట్టపెట్టారు. పెద్ద కంపెనీగా పేరు గాంచిన టాటా గ్రూపుకు చెందిన టాటా సన్స్ లిమిటెడ్ కంపెనీ వివాదం గురించి తెలిసిందే.

సైరస్ మిస్త్రీ నియామకం, తొలగింపు, కోర్టు వివాదాలు. అసలు ఏం జరుగుతోంది, వారు దేని గురించి దెబ్బలాడుకుంటున్నారో జనానికి తెలుసా? పారదర్శకత ఉందా! వారి సమస్యలనే వారు పరిష్కరించుకోలేక బజారుకు ఎక్కిన వారు దేశాన్ని ఉద్ధరిస్తారంటే నమ్మటం ఎలా? వారు గాకపోతే మరొకరు. బండారం బయటకు రానంత వరకే పెద్ద మనుషులు. తెర తొలిగితే విశ్వరూపం కనిపిస్తుంది. ఇలాంటి ప్రైవేటు సంస్థలకు ప్రజల ఆస్తులను అప్పగించబోతున్నారు. ఇక ప్రైవేటు బ్యాంకులు తీరుతెన్నులను చూద్దాం. గతంలో ప్రైవేటు రంగంలోని బ్యాంకులు, బీమా కంపెనీలు జనానికి టోపీ పెట్టాయి. అప్పుడే మరిచిపోతే ఎలా? ఇప్పుడు జాతీయ సంపదలుగా ఉన్న వాటిని తిరిగి ప్రైవేటు రంగానికి కట్టబెట్టబోతున్నారు. 1947 నుంచి 1969 వరకు 559 ప్రైవేటు బ్యాంకులు దివాలా తీశాయి. ఈ కాలంలో 736 బ్యాంకులను విలీనం లేదా రద్దు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులను తిరిగి ప్రైవేటీకరించాలని కోరుతున్నారు. వాటిని ప్రైవేటు వారు నష్టల్లోకి నెట్టితే ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత తీసుకుంటారు. 1969 బ్యాంకుల జాతీయీకరణ తరువాత కూడా కొన్ని ప్రైవేటు బ్యాంకులను అనుమతించారు.

వాటిలో ఇప్పటి వరకు 36 బ్యాంకులు అక్రమాలకు పాల్పడ్డాయి. అవేవీ ఇప్పుడు ఉనికిలో లేవు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు వాటిలో ఒకటి. దానిని ఓరియంటల్ బ్యాంకుతో విలీనం చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు అంత సమర్ధవంతమైనవి అయితే ఈ పరిస్ధితి ఎందుకు తలెత్తింది. ఇప్పుడున్న ప్రైవేటు బ్యాంకులు తమ వాటాను ఎందుకు పెంచుకోలేకపోతున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 563 ప్రైవేటు బ్యాంకులు విఫలమయ్యాయి. అక్కడ మొత్తం ప్రైవేటు రంగానిదే ఆధిపత్యం కదా! అందువలన అలాంటి పనులు చేయబోయే ముందు పోటీతత్వం ఉందో లేదో, వినియోగదారులను అధిక ధరలతో పిండకుండా చూసేందుకు ప్రభుత్వం బహిరంగ సమీక్షలు జరపాలని ఆస్ట్రేలియా పోటీతత్వ నిఘా సంస్థ అధ్యక్షుడు రోడ్ సిమ్స్ చెప్పారు. మరి తామే అసలైన జవాబుదారులం, చౌకీదారులం అని చెబుతున్న నేటి పాలకులు అలాంటి చర్చ ఎన్నడైనా, ఎక్కడైనా జరిపారా ఆస్ట్రేలియాలో తరచుగా పోటీ లేకుండా ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారని సిమ్స్ వాపోయాడు. నియంత్రణలు లేకపోతే జనాన్ని పీక్కుతింటారని అన్నాడు. ఆస్తులను పాడి గేదెల మాదిరి మారిస్తే ఆర్థిక సామర్ధ్యానికి ప్రతిబంధకం అవుతుందన్నాడు. సింగపూర్‌లో రైల్వేలను కొంత మేరకు ప్రైవేటీకరించారు. తీసుకున్న యజమాని తగినంత పెట్టుబడి పెట్టని కారణంగా రైళ్లు ఆగిపోతున్నాయి. అందువలన తిరిగి జాతీయం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది.

పలు కంపెనీలు టెలికాం రంగంలోకి వచ్చినపుడు పోటీ పడి చార్జీలు తగ్గించిన విషయం తెలిసిందే. ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో వినియోగదారులను అతి తక్కువ ఛార్జీలతో ఆకర్షించింది. తన ఆర్థిక శక్తిని పెట్టుబడిగా పెట్టింది. గణనీయమైన మార్కెట్‌ను ఆక్రమించింది. పోటీ కంపెనీలు దివాలా తీసిన తరువాత చార్జీలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న ఒకటి రెండు కంపెనీలు కూడా రంగం నుంచి తప్పుకుంటే ఆ కంపెనీ ఎంత చెబితే అంత చెల్లించక తప్పదు. రేపు రోడ్లయినా, విద్యుత్ మరొకటి ఏదైనా అంతే. మొత్తం ప్రైవేటు వారి నిర్వహణకుపోతే వారెంత చార్జీ చెల్లించాలంటే అంత చెల్లించాల్సిందే. ప్రజల ఆస్తులను ప్రైవేటు వారికి కట్టబెట్టటం మన దేశంలోనే కాదు. అనేక దేశాల పాలకులు సమర్పించుకుంటున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న వాటి విలువ కనిష్ఠంగా రూ. 75 లక్షల కోట్ల డాలర్లని నాలుగు సంవత్సరాల నాటి ఒక అంచనా. రాష్ట్ర, స్ధానిక ప్రభుత్వాల వాటిని కూడా కలుపుకుంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వాల అప్పులు అనేక దేశాల్లో జిడిపికి వంద శాతం దాటినందున రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు నిధుల కేటాయింపు మరింత ఇబ్బంది అవుతుందని, అవసరాలకు- కేటాయింపులకు మధ్య తేడా 2040 నాటికి 15 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. మన దేశంలో కూడా అదే జరుగుతోంది.

1998 నాటికి మన కేంద్ర ప్రభుత్వ రుణం దాదాపు రూ. పది లక్షల కోట్లు. అది 2014లో ప్రస్తుత పాలకుల అధికారంలో రూ. 53 లక్షల కోట్లకు పెరిగింది. 2021 మార్చి నాటికి ఆ మొత్తం రూ. 116 లక్షల కోట్లు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది రూ. 132 లక్షల కోట్లు అవుతుందని అంచనా చెపుతున్నాయి. కేంద్రం, -రాష్ట్ర ప్రభుత్వాల రుణాల మొత్తం జిడిపిలో 2019- 20 నాటికి 70% అయితే, మరుసటి ఏడాదికి అది 90 శాతానికి చేరింది. వంద శాతం మార్కు దాటటానికి ఎంతో దూరంలో లేము. అందువలన పాలకులు తెగబడి ప్రభుత్వ ఆస్తులను అయినకాడికి తెగనమ్మి లేదా నిర్వహణకు ప్రైవేటు వారికి అప్పగించి సొమ్ము చేసుకొని లోటు పూడ్చుకొనేందుకు లేదా అప్పులు తీర్చేందుకు పూనుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తరువాత జనం మీద మరిన్ని భారాలు మోపటమే తరువాయి భాగం అవుతుంది. నిరుపయోగంగా పడి ఉన్న ఆస్తులను ధనార్జన కోసం అని నమ్మబలుకుతున్నా ప్రభుత్వాలు మోనిటైజ్ అండ్ మోడర్నయిజ్ (ధనార్జన, నవీకరణ) అనే ఇతివృత్తంతో బడ్జెట్‌ను రూపొందించామని, ప్రభుత్వం ఉన్నది పాలన చేయటానికి తప్ప వాణిజ్యం చేయటానికి కాదు అన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖ “దీపం” (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్) ఏర్పాటు చేసిన ఒక వెబినార్‌లో ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రైవేటీకరణ, ధనార్జన (మోనిటైజేషన్) ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకు వినియోగిస్తామన్నారు.

చిత్రం ఏమిటంటే బ్రిటన్‌కు చెందిన కొన్ని కంపెనీలు చేతులెత్తేసి ‘మా వాటాలను అప్పగిస్తాం. మమ్మల్ని ఈ అప్పుల ఊబి నుంచి బయటపడేయండి’ అని వేడుకోళ్లకు దిగింది. ఇంకా అనేక కంపెనీలు అదే స్ధితిలో ఉన్నాయి. ఇదే సమయంలో దేశ పాలకులు దేశానికి చెందిన 26,700 కిలోమీటర్ల జాతీయ రహదారులు / 400 రైల్వే స్టేషన్లు / 150 రైళ్లు, రైల్వే ట్రాక్ లు / 42,300 కిలోమీటర్ల విద్యుత్ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌లు / 5,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల హైడ్రో, సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు / 8,000 కిలోమీటర్ల సహజ వాయువు పైప్‌లైన్ లు / 4,000 కిలోమీటర్ల హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ పైప్ లైన్ లు /2.86 లక్షల కిలోమీటర్ల భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్ టవర్లు/ 160 బొగ్గు గనులు /761 మైనింగ్ బ్లాకులు /25 విమానాశ్రయాలు/ తొమ్మిది ఓడ రేవుల్లో 31 ప్రాజెక్టులు/ రెండు జాతీయ స్టేడియంలు అనే మా ఆస్తులతో సంపాదన మాకు చేతకావటం లేదు. వీటిని తీసుకొని మాకు డబ్బులు ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా? అంటూ ప్రభుత్వం వీధుల్లో నిలబడింది. ఇదే ప్రభుత్వం ఏడు సంవత్సరాల క్రితం మీరు మా దేశానికి రండి. వస్తువులను తయారు చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోండి’ అని విదేశీ కార్పొరేట్లు, వాణిజ్య సంస్ధలకు విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు అవే సంస్ధలకు ‘మా ఆస్తులు తీసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు నిర్వహించుకోండి మాకు కొంత డబ్బులు ఇవ్వండి’ అంటుంది ఈ ప్రభుత్వం. అంటే ప్రభుత్వమే మోనిటైజేషన్ పేరుతో ప్రైవేటీకరణకు మార్గాలు వేస్తుంది. తాత్కాలిక అవసరం కోసం ప్రభుత్వం ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగపడే ఆస్తులను నిర్వీర్యం చేయరాదని ప్రజాస్వామ్య ఆర్థిక నిపుణులు ఆవేదనతో చేస్తున్న ఆలోచినను ప్రభుత్వం గ్రహించి ఆ మోనిటైజేషన్ ప్రక్రియను మానుకుంటుందని ఆశిద్దాం…

Article about ruling political parties in india