Home కలం అపర వేమన ఎస్.కె.పిళ్ళె

అపర వేమన ఎస్.కె.పిళ్ళె

pillai

తెలుగు సాహిత్యంలో శతక కవిత్వమునకు విశిష్టత చేకూర్చిన కవి ఎస్.కె. పిళ్ళె. వీరు కరీంనగర్ (జిల్లా) ధర్మారం(మండలం) గోపాల్‌రావుపేట అను కుగ్రామములో సందినేని ముత్తయ్య, ఐలవ్వ, దంపతులకు 15.5.1935 లో జన్మించిన సందినేని కొమురయ్య పిళ్ళె ప్రగతి శీల భావాలతో జీవితమంతా కవిత్వం రాశారు. నిజాం ప్రభుత్వ తాబేదార్లు రాక్షస రజాకర్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాల్గొ ని జైలుశిక్ష అనుభవించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఎందరెందరికో ఆదర్శప్రాయుడై విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డునందుకున్నారు.1993 ఫిబ్రవరిలో పరమపదించిన ఎస్.కె. పిళ్ళె మరణం లేని కవిగా చిరస్థాయిగా జన హృదయంలో జీవిస్తారు. ఎస్.కె.పిళ్ళె గారు “హేప్రభోశతకం” “ఎగు డు దిగుడు సమాజం” “భుజం భుజం కలిపినపుడు” “చిత్రంపు పోకడల్‌” వంటి కావ్యాలను వెలువరించారు. “నిరక్షరాస్యత నిర్మూలన”(తుమ్మెద పాటలు) బాలెంతగండి వంటి చిరుపొత్తములను ముద్రించి గ్రామీణులలో చైతన్యం రేకెత్తించడానికి ఉచితంగా వాటిని పంపీణి చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. “విప్లవ కవి” “అభ్యుదయ” ఉద్యమ నిర్మాత, మహాకవి శ్రీ శ్రీ మరణంతో కలత చెంది 1983 లో ఆయన స్మృతిలో “జనహిత సాహిత్య సమితి”ని ప్రారంభించి పలు సాహిత్య సమావేశాలు నిర్వహించి యువ కవులను ప్రోత్సహించినారు. “జనహిత ప్రచురణ”ల విభాగాన్ని నెలకొల్పి తన కవిత్వమే కాకండా ప్రసిద్దకవి మలయశ్రీ, కాలువ మల్ల య్య వంటి వారి పుస్తకాల ప్రచురణలకు దోహదపడినా రు. పద్యం, గేయం రాయడంలో ఎస్.కె.పిళ్ళె చేయి తిరిగిన రచయిత. పిళ్ళె గారు రాసిన “హేప్రభోశతకం” 1969లో వెలువడింది. వీరు అధిక్షేపధోరణి లో సమకాలీన సమాజంలోని ప్రతి సమస్యను అందులోని చెడును ఎత్తి చూపారు. దీనిని కవిగారు తమ తల్లి దండ్రులు ముత్తయ్య ఐలవ్వలకు అంకితం చేసి జన్మను ధన్యం చేసుకున్నారు. సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలను చూసి కలత చెంది శతక రూపమున ‘ఈశ్వరునకు’ నివేదించుకున్నారుఈ విషయం శతక పద్యాలకు మకుటమైన “ధర్మ సంస్థాపనం బెట్లు ధరణి యందు! సంభవించును హేప్రభోశాశ్వతముగా ” అన్న దాని వలననే తెలియుచున్నది. ధర్మ మార్గం, న్యాయ చింతన కరుణా హృదయం గల కవి కలుషితమయిన మానవ లోకమును చూసి కలత చెంది విచారించారు. మతములు, సంసార విషయములు కల్తీలు, మోసాలు, ఆర్థిక అసమానతలు, కార్మిక, కర్షకుల బాధలు, పెట్టుబడిదారి వ్యవస్థ అసలు స్వరూపం పంచాయితి సమితులు , జిల్లా పరిషత్ అకృత్యాలు, పంచవర్ష ప్రణాళికలు. అన్ని రంగములలో దమన నీతిని ఎండగట్టారు.
“కాలమెంతగమారె కలహప్రియులే మెండు/కనికరమిసుమంతగానరాదు” సమాజం మారుతున్న ఏం సాధిస్తున్నాం? సాధించిన విజ్ఞానాన్ని అజ్ఞానంతో మానవ వినాశనానికి ఉపయోగిస్తున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది. ఈర్ష, ద్వేషాలతోనే కదా! దీనిని జయించి మానవలోకంలో ఒకరిపై ఒకరు ప్రేమాను రాగాలతో కలిసి జీవించలేరా? అనేదాన్ని కవి ఇలా అంటున్నారు.
“ఈర్ష్యాతిశయములు నీసడింపులేగాని /కమ్మని పలుకుల కలిమిలేదు”ఎంతో చక్కగా భావాన్ని వ్యక్తపరిచి పాఠకుల్ని ముగ్ధులను చేయగల నేర్పు పిళ్ళెలో ఉండటం గర్వించదగింది.
“ప్రభులే బాసలు మరచిన నీసడింపులే గాని
ప్రజల పాలన నెవ్విది భాగ్యమొదవు”
నేడు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నాం. అనగా ప్రజాప్రభుత్వ ఆధీనంలో ఉన్నాం కాని? వాళ్ళు ఎలక్షన్లనాడు చేసిన బాసలు మరిచి ప్రజా కార్యక్రమాలను నిర్ల క్ష్యం చేయడాన్ని శ్రీ పిళ్ళె నిరసించారు. ప్రభులే చేసిన ప్రతిజ్ఞలు మరిస్తే “ధర్మ సంస్థాపనంబెట్లు ధరణియందు సంభవించును! హేప్రభో శాశ్వతముగ” అంటున్నారు.
సమాజంలోని బాధలు తనవిగా భావించుకొనెవారే ప్రజాకవులు కళకళ కోసం కాదు. అది ప్రజల కొరకు అని భావించే వారిలో పిళ్ళే ఒకరు.
“దొంగ తనము జేయు దుష్టుల బట్ట పోలీస్ అధికార్ల జాలియేమి
దొంగయొకడుకాగ దుర్బలత్వముగల మనుజవర్యుల నెల్లమందులింత్రు” …..(అంటూ) నేటి వ్యవస్థలలోని లోపాన్ని ఎత్తిచూపడంలో కవి ఎంతో నేర్పుగా కవిత్వీకరించారు. కవిగారు తనయొక్క దృష్టి నేటి వ్యవస్థలోని లోపాన్ని ఎత్తిచూపడంలో ఎంతో నేర్పుగా చూపెట్టారు.
“ప్రజల సేమము కోరు పాలకులు కరువైరి
అవినీతి నణచెడి యువకులేరి”
ప్రతి మానవుడు ధన సంపాదనే ధ్యేయంగా స్వార్ధపరత్వంతో వ్యవహరించకూడదు. స్వార్థం వదిలి సమాజ సేవకై సంసిద్దులు కావాలి.నేను ఒక్కడిని సమాజపు సేవ చేయకుంటే ఏమౌతుందని భావించరాదు. అందరూ అలా భావిస్తే ఎట్లా అని కవి అంటున్నారు.
“పడరాని పాట్లన్ని పంతుళ్ళ పాలైన
భావి పౌరులకెల్ల బ్రహ్మగలడొ”నేటి వ్యవస్థలో ఉపాధ్యాయునికి సముచితమైన గౌరవం లభించడం లేదు. నాటి గురుకులాలు, గురుశిష్య మర్యాదలు ఏమైనవి? కవి పిళ్ళె జ్ఞప్తికి తెచ్చుకుంటూ బాధపడినారు. బడి పంతుళ్ళను వేధించవద్దని వారు ఏ విధంగా భావిపౌరులను తీర్చిదిద్దగలరని శ్రీ పిళ్ళే ప్రశ్నిస్తున్నారు.
“కదలించు పేదలకడగండ్లు హృదయాల /కరుణారసముచింద కావ్యమనరొ /జనరంజనం బొప్పచాలద రచియింప” ఇది జనసామాన్య హృదయగతము”
అని తన ఆవేదనను వ్యక్తపరిచారు. శిల్ప, శృంగార సౌరభ భావలోకాల, కాలక్షేపము చేయుటకంటే శ్రమ జీవుల గాధలను బాధలను ప్రపంచ ప్రతిబింబింపజేయుటే నా లక్ష్యము, అంతేకాదు ‘హేప్రభో’ యని ఆ బాధలను నివేదించుకొన్నంత మాత్రాన ఫలమేమి? గాలి లో దీపంబెట్టి రక్షింపు దేవుడా యన్నట్లేగదా! అంటూ పిళ్ళె స్వయంగా తమ బాధలను వివరించారు అని డా॥ అందె వేంకటారాజం అన్నారు. ఈ పుస్తకానికి సి. నారాయణరెడ్డి, వానమామలై వరదాచార్యులు, అందె వెంకటరాజం మొదలగు వారి అభిప్రాయాలతో నిండుదనం చేకూరింది. అభ్యుదయ పంథా నాశ్రయించిన ఈ కవి సామాజికాభివృద్ది ధ్యేయంగా కవిత్వం రాశారు.
ఎస్.కె.పిళ్ళె తన తొలి రచన “హేప్రభో శతకము” లోనే ఛందో బధ్ద కవిత్వాన్ని రాసి సామాజిక వ్యవస్థలోని అనేక రుగ్మతలపై కవిగా ద్వజమెత్తారు. అవినీతిమయమవుతున్న సమాజాన్ని చూసి స్పందించడం కవితాపరంగా భావవ్యక్తీకరణ చేయడం ఎస్.కె.పిళ్ళె ఉదాత్తతకు నిదర్శనం. ఎస్.కె.పిళ్ళె తన మరణానికి కొన్ని రోజుల ముందు “చిత్రంపుపోకడల్‌” అనే “త్రిశతి” ని పూర్తి చేశారు. ఆయన మరణానంతరం వారి కుమారులు ఈ కావ్యాన్ని వెలువరించారు. ఎస్.కె.పిళ్ళె సంప్రదాయిక కవి కాదు. విప్లవ భావాలతో ప్రజ్వరిల్లే ఆయన శతక సాహిత్యంలో ఛందో నియమాలతో రాసినారు. అది పిళ్ళెకు భాష, నుడి కారాలపై ఉన్న గొప్ప అవగాహనగా చెప్పుకోవచ్చు. ఆధునిక భావాలతో “నవ్య వేమన” వలె కవితా వ్యవసాయం చేసినారు. ఎస్.కె. పిళ్ళె పరిశోధనాత్మక కవి అందుకే ఛందో విధానంలో నూతన సృష్టిని చేసినారు. ఈ శతకంలో వైవి ధ్యం కన్పిస్తుందిని డా॥ సుమతీనరేంద్ర అన్నారు. “మకుటం ఉన్నది కాని అసలు పద్యానికి దానికి సంబంధం లేదు. పద్యంలోని నాలుగు పాదాలలోను విషయాన్ని వ్యాఖ్యానించడం వలన విషయానికి వ్యాప్తి కలిగించింది. ఐదవ పాదము “ఎంత చిత్రంపు పోకడల్ ఎస్.కె. పిళ్ళె” అన్న మకుటం ఏర్పడింది. శతక రచనలో ఇది ఒక ప్రయోగం కవి తనను తానే శ్రోతగా భావించుకోవడం వలన ఆత్మాశ్రయ రీతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది”. శతక సాహిత్యంలో తెలంగాణ మాండలికాన్ని అందంగా కవిత్వం చెప్పిన వారిలో ఎస్.కె.పిళ్ళె ప్రథములు.