Home తాజా వార్తలు మనమూ పాటిద్దాం సోషల్‌ మీడియా ఫాస్టింగ్!

మనమూ పాటిద్దాం సోషల్‌ మీడియా ఫాస్టింగ్!

Social Media Fasting

 

ప్రపంచం మొత్తం మీద ఇంటర్నెట్ వాడే వాళ్ల సంఖ్య నాలుగున్నర బిలియన్ల కంటే ఎక్కువేనట. ఇందులో అధిక శాతం మంది సోషల్‌మీడియాలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. దాంట్లో టైం పాస్ కోసం వాడేవాళ్లే మరీ ఎక్కువట. అవసరం లేకున్నా అదేపనిగా ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టా… అంటూ ఇలా వారివారి అమూల్యమైన సమయాన్ని పాడుచేసుకునే వారెక్కువన్నమాట. రోజురోజుకీ ఎక్కువౌతున్న ఇలాంటి అలవాట్లకు చెక్ పెట్టడానికే వచ్చింది సోషల్ మీడియా ఫాస్టింగ్…

ఏదైనా సరే వాడుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు దేనికీ బానిస కాకూడదు. సోషల్‌మీడియా విషయంలో ఇది బాగా వర్తిస్తుంది. ఉదయం లేవగానే వాట్సప్‌ల్లో గుడ్‌మార్నింగ్‌లతో మొదలై ఎక్కడెక్కడివో మెసేజ్‌లను షేర్ చేయడమే పనిగా పెట్టుకున్నవాళ్లు ఉంటారు. మన ఫోన్ మెమొరీ మొత్తం నిండిపోయి ఎంత ఇబ్బంది పడతామో వాళ్లకు అవసరం లేదు. పనికొచ్చేవి పనికిరాని పోస్టులను పెట్టడమే పనిగా పెట్టుకున్న వారు యాభైలో వందమంది ఉంటారు. మిగిలిన వారు లైకులు, షేర్లు, కామెంట్లు చేస్తుంటారు. మిగిలిన శాతం మంది కేవలం ఆ పోస్టులను చూస్తారంతే. దీనివల్ల యూజర్లకు స్క్రీన్ టైం పెరగడం తప్ప పెద్దగా లాభమేంలేదంటున్నారు నిపుణులు. సోషల్ మీడియా ఫాస్టింగ్‌తో ఈ సమస్యను కొంతవరకైనా తీర్చవచ్చని చెబుతున్నారు నిపుణులు.

సోషల్‌ మీడియా ఫాస్టింగ్ అంటే…
అమెరికాలో 2018లో ఒక మత పెద్ద సోషల్‌మీడియా ఫాస్టింగ్‌కు పిలుపునిచ్చాడు. ఈ విధానం యువతను ఆకర్షించింది. నెమ్మదిగా మిగతా దేశల యువతీయువకులు అనుసరించడం ప్రారంభించారు. సోషల్‌మీడియా అడిక్షన్ నుంచి బయటపడేయడమే ఈ విధానం ఉద్దేశం.

1. ఏడు రోజుల పాటు సోషల్‌మీడియా అకౌంట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి.
2. గ్యాడ్జెట్స్ నుంచి ఆ యాప్‌లను తొలగించాలి.
3. లేదంటే యాప్‌లు, నోటిఫికేషన్లు, అలర్ట్‌ని డిజేబుల్ చేస్తే సరిపోతుంది.
4. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఎందులోనూ యాప్‌లను ఉపయోగించకూడదు. ఇలా వారం రోజులపాటు పాటించాలి.
5. ఆ తర్వాత కూడా ఈ విధానాన్ని పాటించొచ్చు.
6. వారం రోజుల తర్వాత పూర్తిగా సోషల్‌మీడియా వాడకాన్ని కొద్దికొద్దిగా ఇలా తగ్గించుకోవచ్చు.

ఉపవాసంతో ఎన్నో లాభాలు
మీడియా ప్రభావం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.ముఖ్యంగా మానసికంగా చాలా కుంగుబాటుకు లోనవుతారని అధ్యయనకారులు చెబుతున్నారు. అంతేకాకుండా శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల శరీరం రోగాల పుట్టగా మారుతుందని వైద్యులు అంటున్నారు. అందుకే సోషల్‌మీడియా ఫాస్టింగ్ చేస్తే మంచిదంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ఈ ఉపవాసం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు.

అవేంటో చూద్దాం….
1. సోషల్‌మీడియా ఫాస్టింగ్ వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. ఆ సమయంలో పుస్తకాలు చదవొచ్చు. బంధువులు, స్నేహితులను కలవొచ్చు. ఓ మంచి ప్రదేశానికి వెళ్లి రావచ్చు. కుటుంబ సభ్యులతో కులాసాగా కబుర్లు చెప్పుకోవచ్చు.
2. ఈ ఫాస్టింగ్ వల్ల బోర్ ఫీలయ్యేవారు ఏంచేయాలంటే.. వాళ్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలి. నేను ఏపనన్నా చేయగలననే నమ్మకం తెచ్చుకోవాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోమరిగా ఉండకుండా ఫిట్‌నెస్ కోసం ప్రయత్నించాలి.
3. సోషల్‌మీడియాను ఎంత వరకు అవసరమో అంతే ఉపయోగించుకుందాం అనే ఓ మైండ్ సెట్ ఏర్పడుతుంది. ఫాస్టింగ్‌కు ముందు తర్వాత జరిగే పరిణామాలను మీరే గుర్తిస్తారు. తేడా తెలుసుకుంటారు. జీవన శైలి తప్పక మారుతుంది.
ఈ ఫాస్టింగ్ తర్వాత సోషల్‌మీడియాను పూర్తిగా పక్కన పెట్టనక్కర్లేదు. అవసరం మేరకు ఉపయోగించుకుంటే చాలా లాభాలే ఉంటాయి.

సోషల్‌మీడియా వల్ల మంచి, చెడు అని చెప్పలేం. ఉపయోగించుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాల్లో సోషల్‌మీడియా ఎడిక్షన్ పెద్ద సమస్యగా మారింది. భవిష్యత్తులో ఈ ఎడిక్షన్ వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆ దేశాలు గుర్తించాయి. అందుకే ఆయా దేశాలు సోషల్‌మీడియా డిఫెన్సీ థెరపీలను అక్కడ ప్రోత్సహిస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఈ ఫాస్టింగ్ మొదలైంది. అంటే ఎలక్ట్రానిక్ ఫాస్టింగ్. దీని ప్రకారం ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, సర్వీసులకు దూరంగా ఉండటం. ఇలా పాటించడం కష్టమైనా కూడా ఎడిక్షన్ నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. సోషల్‌మీడియా ఫాస్టింగ్‌తో సెల్ఫ్ కంట్రోల్, విల్ పవర్ పెరుగుతుంది. అసలైన జీవితం అంటే ఏంటో తెలుస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా సోషల్‌మీడియాలో ఉత్తపుణ్యానికి పోస్టులు పెట్టేవారు, ఆ పోస్టులకు ఎవరెవరు లైకులు కొట్టారు. ఎన్ని కామెంట్లు వచ్చాయి, ఎంత మంది షేర్ చేసుకున్నారంటూ చూసుకున్నారంటూ గంటల తరబడి చూసుకుంటూ సమయాన్ని వృథా చేసుకునేవారికి సోషల్‌మీడియా ఫాస్టింగ్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. లేకుంటే వారిలో అదుపు లేకపోవడం వల్ల ఆ ప్రభావం యూజర్ల మానసిక స్థితిపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇతరులతో పోల్చుకుంటూ మానసికంగా కుంగిపోతున్నారని, డిప్రెషన్ కేసుల్లో చాలా వరకు ఇలాంటివే వస్తున్నాయని మానసిక వైద్యులు చెబుతూనే ఉన్నారు.

Article about Social Media Fasting