Home ఎడిటోరియల్ స్టార్ట్ అప్ ఇండియా చతికిల!

స్టార్ట్ అప్ ఇండియా చతికిల!

startup

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలలో ప్రధానమైనది నిరుద్యోగం. ముఖ్యంగా చైనాతో జనాభాలో పోటీపడుతూ 2020 వ సంవత్సరం కల్లా ప్రపంచంలో కెల్లా అతి పెద్ద జనాభా గల దేశంగా రికార్డుల పుటలో ఎక్కనున్న భారతదేశంలో ప్రస్తుతం 18 కోట్ల మంది నిరుద్యోగులు వున్నారు. దేశ జనాభాలో యువత 54 శాతంగా వున్నరు. మెరుగైన విద్యావకాశాల కారణంగా ఏటా 15 లక్షల మంది విద్యావంతులు నిరుద్యోగుల జాబితాలో కొత్తగా చేరుతున్నారు. కొత్తగా పట్టభద్రులైన వారిలో 15 శాతం మందికి మాత్రమే ఉపాధి లభిస్తుండగా మిగితా యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూపులు చూడడమో లేక ఆర్ధిక సమస్యల కారణంగా తక్కువ జీతాలకు పనిచెయ్యడమో జరుగుతోంది. సగటున 4 శాతం వృద్ధి పొందుతున్న నిరుద్యోగుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే దేశానికి వెన్నెముక అయిన యువత నిరాశా నిస్పృహలో కూరుకుపోవడం ఖాయమని అసోచాం, భారత పరిశ్రమ సమాఖ్య వంటి సంస్థలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ భారతంలో విశృంఖలంగా పెరుగుతున్న నిరుద్యోగం ఆర్థిక సామాజిత అసమానలతలను సృష్టిస్తుందని సామాజిక మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపధ్యంలో యువత సృజనాత్మకత, వృత్తి నైపుణ్యం, విభిన్న ఆలోచనా ధోరణిని వెలికి తీసేందుకు, ప్రభుత్వంపై ఆధారపడకుండా వారు స్వంతంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 16 న స్టార్ట్ అప్ ఇండియా అనే విన్నూత పథకానికి శ్రీకారం చుట్టింది. పరిశ్రమలు, నూతన ఆవిష్కరణ వైపు యువతను ప్రోత్సహించేందుకు, వారి వ్యాపార దృక్పధాన్ని వెలికితీసేందుకు ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఉద్యోగాలను వెదుక్కోవడం కాదు మీరే భావి భారతానికి ఉద్యోగ సృష్టి కర్తలుగా ఎదగాలని ప్రధాని పిలుపు నిచ్చారు.
ఈ చొరవ ద్వారా భారతదేశాన్ని సరైన దిశలో నడిపించవలసిన అవసరం వుందని ప్రభుత్వం భావించింది. అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, దేశంలోని యువత వినూత్న ఆలోచనలు, అవసరమైన బలం, శక్తి, నైపుణ్యం కలిగి ఉండటంవంటివి వ్యాపారాన్ని నడిపించటానికి ముఖ్యమైనవి. యువత వారు సమాజంలో శక్తివంతమైన, అత్యంత నైపుణ్యం కలిగిన విభాగంగా ఉంటారు కాబట్టి వారు ఈ పథకానికి మంచి లక్ష్యంగా ఉన్నారు.
సరైన దిశానిర్దేశం, శిక్షణ, ప్రభుత్వపరంగా ప్రోత్సాహంకరువైన కారణంగా అంకుర పరిశ్రమలు అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్నాయి. తమ ఉత్పత్తులకు సరైన మార్కెట్ లేకపోవడం, కాలం గడుస్తున్న కొద్దీ ఆదాయం తగ్గిపోయి, బ్యాంకుల నుండి రుణాలు తీర్చేందుకు ఒత్తిడి పెరగడం, ఇతర అంకుర పరిశ్రమల నుండి తీవ్రమైన పోటీ, ఇటువంటి ఉత్పత్తులు లేదా సేవలు నాణ్యతలో తీసికట్టుగా వున్నాయన్న దుష్ప్రచారం, టీం లో సభ్యుల నుండి సహాయ సహకారాలు అందకపోవడం, మార్కెటింగ్ మెళకువలు లేకపోవడం, వినియోగ దారుల అవసరాలను దృష్టిలో వుంచుకోకపోవడం వలన అధిక శాతం అంకుర పరిశ్రమలు మన దేశంలో విఫలమయ్యాయని తెలుస్తోంది. వీరికి తగిన శిక్షణ కూడా అందించడంలో ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపడం లేదు.
ప్రభుత్వం ఈ పరిశ్రమ ద్వారా ఆశించిన టర్నోవర్ ఆదాయం 2018 జనవరి నుండి గణనీయంగా పడిపోయింది. ఈ సంవత్సరంలో కూడా నూతన అంకుర పరిశ్రమల స్థాపన ఆశాజనకంగా లేదు. ఇటీవల తమ ప్రభుత్వం నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని ఇచ్చిన గణాంకాలు అన్నీ సత్యదూరమని స్టార్ట్ అప్ పరిశ్రమ ద్వారా లక్ష మందికి ఉపాధి లభించిందన్న ప్రభుత్వ ప్రకటనలు అవాస్తవాలని ఇటీవలి సిఐ ఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
నేటి వైజ్ఞానిక యుగంలో విదేశాల్లో ఆయా ప్రభుత్వాల సంకల్పం, దార్శనికత, ముందుచూపు కారణంగా ఆధునిక దేశాలలో స్టార్ట్ అప్ పరిశ్రమలు గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ యువత శక్తిని రుజువు చేస్తున్నాయి. అమెరికాలో 54 వేలు, బ్రిటన్‌లో 19 వేలు, కెనడాలో 17 వేల పరిశ్రమలు వుండగా జనాభాలో మన కంటే ఎంతో చిన్నవైన ఇజ్రాయెల్, స్వీడన్, డెన్మార్క్, ఫ్రాన్స్, సింగపూర్, జర్మనీలలో పన్నెండు వేలకు పైగా అంకుర పరిశ్రమలు వున్నాయి. భారత్‌లో రికార్డుల పరంగా ఎనిమిది వేల పరిశ్రమలు వుండగా అందులో పది శాతం కూడా క్రియాశీలకంగా లేవు. అంకుర పరిశ్రమలను కార్పొరేట్ రంగం, బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు తగిన విధంగా ప్రోత్సహించడం లేదు. విన్నూత ఆవిష్కరణల కన్నా మూస విధానాలకే ప్రోత్సాహం లభిస్తుండడంతో ఔత్సాహికులైన యువ పారిశ్రామిక వేత్తలు నిరాశ చెందుతున్నారు. ఈ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉచ్ఛతర అభియాన్ ఆచరణలో విఫలమయ్యింది. ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పథకానికి ఉచ్ఛతర్ పథకాన్ని అనుసంధానం చేసినా ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారం, వివిధ పథకాల అనుసంధానం ద్వారా అంకుర పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలి.
ఏ రాష్ట్రంలోనైనా తమ కార్యాలయాన్ని స్థాపించేటప్పుడు అంకుర పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ మంత్రులతో ఒక కమిటీని వేయాలి. సెజ్‌లలో అంకుర పరిశ్రమల కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించాలి. ఆర్ధికంగా నిలదొక్కుకున్నాకే అద్దెలు వసూలు చేయ్యాలి ప్రారంభాలు ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం సెజ్‌లలో బాగా సౌకర్యవంతమైన గిడ్డంగులు, ఉచిత ప్రపంచ తరగతి కార్యాలయ వసతులు కల్పించాలి. ప్రపంచ స్థాయి నివాస వసతి, పాఠశాలలు, ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వాలు సెజ్‌లలో అందుబాటులో ఉంచాలి, ఈ ప్రాంతాల్లో పనిచేయడానికి ఉత్తమమైన ప్రతిభను ప్రోత్సహించాలి.