Home ఎడిటోరియల్ ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!

ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!

Article about Telangana Formation day on June 2nd

జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక ఇన్‌స్ప్రిరేషన్. నేను విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. ఆంధ్ర, రాయలసీమ జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడి విద్యార్ధులు తెలంగాణ ప్రాంత మీద అభిమానం చూపించేవారు. ఇక్కడి పోరాటాల గురించి ధైర్య, సాహసాల గురించి, త్యాగాల గురించి, ఈ ప్రాంత ప్రత్యేకతలు అడిగి తెలుసుకునేవారు. తెలంగాణకు అనేక ప్రత్యేకతలున్నాయి. నిజాం కాలంలో జరిగిన సాయుధ పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. సమ్మక్క సారక్క, రాణిరుద్రమల వీరవనితల చరిత్ర కలిగిన గడ్డ. నిజాం కాలంలో జరిగిన అభివృద్ధికి కూడా దేశ స్థాయిలో గుర్తింపు ఉండేది.

చారిత్రిక కట్టడాలు, విద్య, వైద్యం, రవాణా వ్యవస్థల ఏర్పాటు విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, ఇరిగేషన్ రంగంతో ఇతర రంగాలలో నాడు అభివృద్ధి జరిగింది. చరిత్రలో కాకతీయుల కాలం గురించి అందరికి తెలిసిందే. హైద్రాబాద్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో చెన్నై నుండి విడిపోయిన ఆంధ్ర ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. ఆతరువాత ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం అందరికి తెలిసిందే. వివక్షకు వ్యతిరేకంగా మా తెలంగాణ మాకు ఇవ్వండి అని 1968లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ ఉద్యమంలో వందలాది మంది యువకులు పోలీసుల కాల్పులలో చనిపోయారు. నెలలతరబడి కర్ఫ్యూ కొనసాగింది.

మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడడం ఎన్నికలలో గెలవడం ఆ తరువాత కాంగ్రెస్‌లో విలీనం అవడం అందరికి తెలిసిన చరిత్రే. 68 ఉద్యమం విఫలం అయిన తరువాత కూడా అనేక మంది తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారు. రాజకీయ పార్టీలు పెట్టారు. కానీ ఎవరూ ఆచరణలో విజయం సాధించలేకపోయారు. 1968 నుండి 2001 వరకు అంటే 32 సంవత్సరాల పాటు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతూ రావడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదనే నిర్ధారణకు వచ్చారు. ఇలాం టి సమయంలో కెసిఆర్ తెలంగాణ జెండా ఎత్తుకున్నారు. అందరూ ఇది వచ్చేది కాదు చచ్చేది కాదు అని అన్నారు. ఈయనతో ఏమవుతుంది అని పెదవి విరిచారు. మంత్రి పదవి రానందుకే తెలంగాణ నినాదం ఎత్తుకున్నాడు అన్న విమర్శలు కూడా చేశారు.

అనేక విమర్శలు, అనుమానాల మధ్య 2001 ఏప్రిల్ 27 న తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు. అధికార పార్టీ తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి, డిప్యూటి స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన కొద్ది రోజులలోనే స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలలో టిఆర్ ఎస్ ప్రభంజనం సృష్టించింది. నాడు తెలంగాణలో తీవ్ర నిర్బంధం అమలవుతుంది. నిత్యం తుపాకీ కాల్పుల శబ్దాలు, ఎన్‌కౌంటర్స్, మనుషులు మాయం కావడం జరుగుతుండేవి. యువకులు పల్లెలు వదలి పట్టణాల బాట పట్టారు. ఒకవైపు కరువు విలయతాండవం చేస్తుంది. మరోవైపు వ్యవసాయం వేస్టు హైటెక్ బెస్ట్ అం టూ చంద్రబాబు విజన్ 2020 డాక్యూమెంట్ పెట్టాడు. విద్యుత్ సంస్కరణలు తెచ్చి కరెంట్ చార్జీలు పెంచాడు. దీనితో విద్యుత్ ఉద్యమం వచ్చింది. బషీర్‌బాగ్ కాల్పులు జరిగాయి. ఇలాంటి పరిస్థితులలో కెసిఆర్ తెలంగాణ జెండా ఎత్తుకున్నారు.

అనేక కష్టాలు, అవమానాలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రస్థానం ప్రారంభించారు. జలదృశ్యంలోఉన్న ఆఫీస్‌ను పోలీసులు కూల్చేశారు. అన్నింటిని తట్టుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ సలహాలను సూచనలను తీసుకుంటూ తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులతో గంటల తరబడి రోజుల తరబడి చర్చలు జరిపారు. ఏ ఏ రంగాలలో ఏవిధంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఎలా జరుగుతుందో గణాంకాలతో సహా నిర్థారించారు. భారీ బహిరంగ సభలు నిర్వహించి పాటలు ఉపన్యాసాల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని రగిలించి ఉద్యమానికి సిద్ధం చేశారు. 2004 సాధారణ ఎన్నికలలో టిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుంటే తప్ప అధికారంలోకి రాలేమనే రాజకీయ పరిస్థితిని కెసిఆర్ సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర సమితితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేరింది. వైస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

దీనితో టిఆర్‌ఎస్ మంత్రులు కేబినెట్ నుండి బయటకు వచ్చారు. అటు కెసిఆర్, నరేంద్రలు కూడా కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అప్పటి నుండి 2009 డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన వరకు ఉద్యమం అనేక మలుపులు తిరిగింది. 2006 కరీంనగర్ ఉప ఎన్నికలు, 2008 ఉప ఎన్నికలు ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పాయి. ఒకవైపు లాబీయింగ్, మరోవైపు ఉపఎన్నికలు సృష్టించి ఇతర పార్టీల మీద రాజకీయ ఒత్తిడి తెచ్చే వ్వూహాన్ని కెసిఆర్ అమలు చేస్తూ వచ్చారు. ఆమరణ దీక్షతో చావు నోట్లోకి వెళ్లి వచ్చారు. చిదంబరం ప్రకటన తరువాత సీమాంధ్ర నాయకులు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకటయ్యారు. దీనితో కెసిఆర్ నాయకత్వంలో టీ జాక్ ఏర్పడింది. ఉద్యమం మిలిటెంట్ రూపం తీసుకుంది. తెలంగాణ రాదనే అనుమానంతో యువకులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడ్డారు. సోని యా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సానుకూలంగా ఉండడం మరోవైపు యువకుల బలి దానాలు ఇంకోవైపు ఉద్యమ తీవ్రతతో ఆమె సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దీనితో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించింది.

14 సంవత్సరాల పాటు జరిగిన సుదీర్ఘ ఉద్యమం, యువకుల బలి దానాల ఫలితమే జూన్ 2 న రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ చరిత్రలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. తెలంగాణ చరిత్రను, కెసిఆర్‌ను విడదీసి చూడలేము. సబ్బండ వర్ణాల వారు ఘనంగా సంబరాలు చేసుకునే రోజు. ఇప్పుడు దేశం తెలంగాణవైపు చూస్తుంది. తెలంగాణ వస్తే ఆగమైతుంది. అంధకారం అవుతుంది. అన్యాయం అవుతుంది అన్న వాళ్ళ చెంప చెళ్లుమనిపించి అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమలులో దేశానికి రోల్ మోడల్ గా నిలబడింది. ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. ఉద్యమ నాయకుడే పాలకుడు కావడం ఇక్కడి ప్రత్యేకత. ఉద్యమ సమయంలో ప్రజలకు చెప్పిన మాటలు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కళ్లారా చూసిన సందర్భాలను ఉద్యమ నాయకుడైన కెసిఆర్ నిరంతరం గుర్తు చేసుకుంటూ తన పాలన సాగిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి, విద్యుత్తు రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందు కు అటు మహారాష్ట్రతో ఇటు చత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. దాని ఫలితాలు మనకు ధాన్యరాసుల రూపంలో, పచ్చటి పొలాల రూపంలో నిండు వేసవిలో మత్తడి దూకుతున్న చెరువుల రూపంలో కనపడుతుంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న గోదావరి నీటిలో కనపడుతుంది. మరో వైపు ఉద్యమ సమయంలో పేదల బతుకులను చూసిన కెసిఆర్ వారి మొహాల్ల్లో వెలుగులు నింపేందుకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ పథకాలను అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.

దీనినిబట్టి తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది అని అర్ధం అవుతుంది. సమైక్య పాలనలో వృత్తులు కునారిల్లాయి. దీనితో అనేక మంది బతుకు భారమై వలసలుపోయారు. వీరిని ఆదుకునేందుకు చేపల పంపిణి, గొర్రెల పంపిణి, చేనేత వారిని ఆదుకునేందుకు బతకమ్మ చీరల పంపిణి, గౌడ కులస్థులను ఆదుకునేందుకు నీరాను ప్రోత్సహించడం లాంటి అనేక కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టారు. అభివృద్ధి సంక్షేమం రెండిటిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతున్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేశారు. కరోనా కష్ట కాలంలో సైతం తెలంగాణ భేష్ అని దేశం మెచ్చుకునే విధంగా సిఎం కెసిఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో వలస కూలీలను ఆదుకునే అంశంలో బియ్యం నగదు పంపిణిలలో మన రాష్ట్రం టాప్.

తాజాగా నియంత్రిత సాగు విధానం లాంటి సంచలన నిర్ణయాలతో దేశానికి కెసిఆర్ లాంటి వాళ్ళు అవసరం ఉందన్న చర్చకు తెరలేచింది. కేంద్రం అమలు చేస్తున్న విధానాలు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం అనే పద్ధతిలో ప్రధాని మోడీ వ్యవహార శైలి ఉంది. దీనికి వ్యతిరేకంగా కెసిఆర్ దేశ వ్యాపితంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి అనే అభిప్రాయం కూడా వినపడుతుం ది. ప్రపంచంలోనే మనది గొప్ప ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చేవి సమాఖ్య స్ఫూర్తి, లౌకిక తత్వం. ఈ రెండింటినీ లేకుండా చేసే కుట్రకి కేంద్రం తెర లేపింది. తక్షణమే దీనిని అడ్డుకోవాలి. రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ ప్రతిన పూనాల్సిన అవసరం ఉంది అంటున్నారు.

                                                                                              పి.వి శ్రీనివాసరావు
                                                                                               (ఇన్‌పుట్ ఎడిటర్ టి న్యూస్)

 

Article about Telangana Formation day on June 2nd