Home ఎడిటోరియల్ ఇదేమి పబ్లిక్ సర్వీస్ కమిషన్?

ఇదేమి పబ్లిక్ సర్వీస్ కమిషన్?

stndt

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. తెలంగాణ ఏర్పడితే తమ కొలువులు తమకే వస్తాయని ఆశపడ్డ యువకుల కలలు కలలుగానే మిగులుతున్నాయి. సర్వీస్ కమిషన్ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 10,04, 427 మంది నిరుద్యోగులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నారు. వీరంతా గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారే. 2015—16నాటికి 13లక్షలకు ఆ సంఖ్య చేరుకుంది. 2016 జులై నాటికి రాష్ట్రంలో 66.43లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారని కేంద్ర గణాంకాలు చెపుతున్నాయి. వీరంతా 2030 సంవత్సరాల మధ్య వయస్సు గల వారే. మరో 20 లక్షలమంది ప్రైవేటు పనులలో చేరి చాలీచాలని జీవితాలను గడుపుతున్నవారే. ఈ మధ్య ఆ సంస్థ ఛైర్మన్ గారు చెప్పిన విషయాలు గమ్మత్తుగా ఉన్నాయి. నవంబరు 23, 2017 న ఆయన వివరించి విషయాలు ఏమంటే ఇప్పటివరకు 29,5000 ఉద్యోగాల కోసం 75నోటిఫికేషన్లు వేశామని 23,400 ఉద్యోగాలకు రాతపరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఇంకా 18 రాత పరీక్షలు వివరాలు ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు.
టిఎస్‌పిఎస్‌సి ఏ పరీక్ష నిర్వహించినా ఇంటర్వూలు మాత్రం రెండేసి సార్లు, రిజల్టు కూడా రెండేసి సార్లు పెట్టడం అలవాటయింది. గ్రూప్‌I పోస్టుల విషయంలో ఎన్ని చిత్రవిచిత్ర వేషాలు వేశారో ప్రజలందరూ గమనించారు. ఎవరు ఏ పరీక్ష పెట్టినా దాని ఫలితాలను బయట నోటీస్ బోర్డులో పెడతారు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది అభ్యర్థికి తెలుపవలసిన అవసరమున్నది. కాని ఆ పని టిఎస్‌పిఎస్‌సి చేయడం లేదు. 121 మంది అభ్యర్థుల మార్కులు కూడా బయటపెట్టలేదు. అదే సమైక్య రాష్ట్రంలో 20082009 సం॥లో నిర్వహించిన గ్రూప్2 పరీక్షల 9000 మంది అభ్యర్థుల మార్కులు బయటపెట్టారు. 23,400పోస్టులను భర్తీ చేయడానికి 45 నెలలు పట్టింది. మరి 1,12,000 మంది ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఎన్ని వందల నోటిఫికేషన్లు వేయాలో ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఊహించవచ్చు. 122 మందిని రిక్రూట్ చేయడానికే కంప్యూటర్లు తప్పుచేస్తే…లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అవి మరెన్ని తప్పులు చేస్తాయో! ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించినా పేపర్ లీకేజీ కావడం సర్వసాధారణమైపోయింది. 10వ తరగతి, ఇంటర్, ఎడ్‌సెట్, ఎంసెట్, ఎంబిబిఎస్ మొదలగు పేపర్లన్నీ లీకైనాయి. దానికి సంబంధించిన అధికారులను మందలించిన పాపానపోలేదు. ఎటువంటి చర్యలను చేపట్టలేదు. 2011లో నిర్వహించిన గ్రూప్1 రిజల్ట్ 2017 లో ఇచ్చిందంటే కమిషన్ ఎంత స్పీడ్‌గా పనిచేస్తున్నదో అర్థమవుతుంది. 10,448 కానిస్టేబుల్స్ పోస్టులుకు 6.5 లక్షలమంది నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు. ఇందులో అధిక భాగం ఎంటెక్, పిహెచ్‌డి పూర్తి చేసిన వారే ఉన్నారు. ఇక ఎస్‌ఐ ఉద్యోగాల విషయంలో రెండు సంవత్సరాలు పట్టింది. ఇంకా కొంతమందికి ఆ పోస్టులు కూడా ఇవ్వడం లేదు.
టిఎస్‌పిఎస్‌సి నిర్లక్షం వల్ల నిరుద్యోగ యువకులు సహనం కోల్పోతున్నారు. ఈ చిన్నచిన్న పరీక్షల నిర్వహణలోనే ఎన్నో అవకతవకలకు పాలుపడుతున్న కమిషన్ భవిష్యత్‌లో బాధ్యతాయుతంగా ఉంటుందనుకోవడం నమ్మదగిన విషయం కాదు.ఇక ఉన్నత విద్యామండలి పరిస్థితి కూడా దారుణం. ఛైర్మన్ అందులోని సభ్యులు చేస్తున్న రోజువారీ విధులు ఏమిటో అర్థం కావటం లేదు. ఈ మధ్య రెండురోజుల కొకసారి ఉన్నత విద్యాశాఖామంత్రిగారు యూనివర్శిటీలలోని ఖాళీలు భర్తీ చేస్తామని పదేపదే చెపుతున్నారు. దేశంలో యూనివర్శిటీలకు యుజిసి అనే సంస్థ ఉంది. ఆ యుజిసి నిబంధనలకు అనుకూలంగానే యూనివర్శిటీలలో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి కాని దానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం యూనివర్శిటీ అధ్యాపకుల భర్తీ ప్రక్రియపూర్తి చేస్తామంటుంది. యూనివర్శిటీలు అనేవి స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలే కాని ప్రభుత్వ అధీనంలో ఉండవు. ఇప్పటివరకు ఏ ఒక్క యూనివర్శిటీకి పాలక మండళ్ళను నియమించలేదు. పాలన పూర్తిగా స్తంభించి పోయింది. ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు ఇప్పటివరకు స్పందన లేదు. యూనివర్శిటీల్లో 1061 పోస్టుల భర్తీ అనేది జరిగే పనిగా లేదు. ప్రభుత్వం ఉన్నత విద్యను సమూలంగా నాశనం చేసే దిశలో ఉంది.