Home ఆఫ్ బీట్ బిగ్‌బాస్2.. ఏమైనా జరగొచ్చు

బిగ్‌బాస్2.. ఏమైనా జరగొచ్చు

టెలివిజన్ చరిత్రలో బిగ్‌బాస్1 రియాల్టీ షో ఎన్‌టిఆర్ హోస్ట్ చేయటంతో  టిఆర్‌పి రేటింగ్స్‌లో వంద స్పీడ్‌లో దూసుకుపోయింది. ఎన్‌టిఆర్ బిజీగా ఉండటంతో బిగ్‌బాస్ రెండో సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో నానిని ఎన్‌టిఆర్‌తో పోల్చి చూడటంతో అంచనాలను అందు కోవడంలో విఫలం అయినట్టు కన్పించాడు. అయితే రోజులు గడిచే కొద్దీ నాని హోస్టింగ్ బాగానే చేస్తు న్నాడనే టాక్ వచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 2 లో మొదటి వారం మినహాయించి అన్ని వారాలూ టిఆర్‌పి రేటింగ్స్ టాప్ రేంజ్‌లోనే ఉన్నాయి.  పార్టిసిపెంట్స్ మధ్య వివాదాలు, ఎవరూ ఊహించని ఎలిమినేషన్స్, నాని యాంకరింగ్ అన్నీ కలిసి కార్యక్రమంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. 

bigboss

ప్రస్తుతం నలుగురు ఒక్క దగ్గర కలిస్తే వారు ముఖ్యంగా మాట్లాడుకునే టాపిక్ బిగ్‌బాస్ 2. షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలుసుకోడానికి వీక్షకుల్లో ఆసక్తి పెరిగింది. బిగ్‌బాస్ సీజన్ -1 హిట్ కావడంతో రెండో సీజన్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. న్యాచురల్ స్టార్ నాని, వ్యాఖ్యాతగా రెండో సీజన్ గత నెల ప్రారంభమైన విషయం తెలిసిందే… ఈ సీజన్‌లో గీతామాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా, యాంకర్ శ్యామల, కిరీటి, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, గణేష్, సంజనా అన్నే, నూతన్‌నాయుడు, నందినిలు కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. వీళ్లల్లో సంజనా, నూతన్‌నాయుడు, తేజస్వి, కిరీటి, శ్యామల, భానుశ్రీ లు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు.
ఇమేజ్ కంటే డ్యామేజీలే ఎక్కువ..
ఈ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో బిగ్‌బాస్ వల్ల వచ్చిన ఇమేజ్ కంటే ఎక్కువగా డ్యామేజ్ జరిగిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే ముందు వరసలో ఉంటుంది తేజస్వి. అప్పటి వరకూ చిన్నా చితకా సినిమాల్లో నటించిన తేజస్వికి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. బిగ్‌బాస్ ఎంట్రీ తరువాత ఈ అమ్మడు ఇమేజ్ ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. బలమైన కంటెస్టెంట్‌గా ఉన్న కౌశల్‌తో వివాదం, సామ్రాట్‌తో లవ్ ఎఫైర్, ఆమె వస్త్రధారణ తదితర బ్యాక్ డ్రాప్స్ కారణంగా ఆమెను బిగ్‌బాస్ హౌస్ నుండి వెళ్ల గొట్టారు ప్రేక్షకులు. ఇక భానుశ్రీది కూడా ఇదే పరిస్థితి. ఈ షో ద్వారా హీరోయిన్ అయిపోదామనుకున్న మోడల్ సంజనా అన్నే హౌస్ నుండి తొలివారమే ఇంటి ముఖం పట్టింది. దీప్తి సునైనా హౌస్‌కి రాకముందు ఆమె యూట్యూబ్ సంచలనంగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. కాని హౌస్‌కి వచ్చిన తరువాత ఆమె తనీష్‌తో ప్రేమ వ్యవహారం, అతడితో రొమాన్స్ కారణంగా ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో చాలా వరకూ ఆమె ఇమేజ్‌కు భంగం కలిగిందనే టాక్ వినిపిస్తోంది. మరో కంటెస్టెంట్ బాబు గోగినేని అయితే సోషల్ మీడియాలో ఫుట్‌బాల్ ఆడేస్తున్నారు నెటిజన్లు. అన్నీ నాకే తెలుసు అన్న ధోరణి ప్రేక్షకులకు చిరాకు పెట్టిస్తుంది. అంతేకాకుండా కౌశల్, గీతామాధురిలతో వివాదం కూడా ఆయన ఇమేజ్‌ను మార్చేసింది. తనీష్, సామ్రాట్, నందినిలపై కూడా నెగిటివ్ ట్రోల్ నడుస్తున్నాయి. హౌస్‌లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడుపై ప్రేక్షకుల్లో సానుకూల స్పందన ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం.
మళ్లీ అవకాశం : ఎలిమినేట్ అయిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వటం కూడా బిగ్‌బాస్ షోకి ప్లస్ అయింది. తేజస్వి ఉన్నప్పుడు కంటే ఎలిమినేటి అయ్యాక టిఆర్‌పి రేటింగ్స్ అమాంతం పెరిగాయి. తేజస్వి చేసే పనులు చూడలేని ఫ్యామిలీ ఆడియన్స్ తిరిగి షో చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మరోసారి బిగ్‌బాస్‌కి రికార్డ్ స్థాయిలో టిఆర్‌పి వచ్చే అవకాశం ఉంది. ఈ రేటింగ్స్ సునామీ రేంజ్‌లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం విజయ్‌దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ త్వరలో హౌస్‌లో సందడి చేయనున్నాడు.
బిగ్‌బాస్ వాయిస్ ఎవరిది..?
సీజన్ 1, సీజన్ 2లలో హోస్ట్ , కంటెస్టెంట్స్ మారారే తప్ప బిగ్‌బాస్ మారలేదు. అదే పంథాలో తన వాయిస్‌తో కొత్త కంటెస్టెంట్స్‌ని అదుపులో పెట్టుకున్నాడు. మరి ఆ బిగ్‌బాస్ మరెవరో కాదు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ. బిగ్‌బాస్ వాయిస్ కోసం ఎంతోమందితో ఆడిషన్స్ చేయించి చివరికి అతన్ని సెలక్ట్ చేశారు. మా టివిలో వచ్చే సిఐడి సీరియల్‌లో కూడా ఈయన డబ్బింగ్ చెప్పేవాడు. అయితే ఆ గొంతు ఇంతకుముందు విన్నారనే ఫీల్ రాకుండా, ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేలా చేయటంలో రాధాకృష్ణ విజయం సాధించాడు.
నూతన్ రీ ఎంట్రీ వెనక అసలు విషయం..?
నూతన్ నాయుడు హౌస్‌లో కామన్‌మెన్‌గా ఎంట్రీ ఇచ్చి రెండు వారాలు మాత్రమే ఉండి బయటకు వచ్చాడు. ఆ రెండు వారాల్లోనే తానేమిటో ప్రేక్షకులకు తెలిసేలా చేసి ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. ఆ స్థానమే మళ్లీ హౌస్‌లోకి వచ్చేలా చేసింది. బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యధిక ఓటింగ్‌ని సాధించి హౌస్‌లోకి నూతన్‌నాయుడు అడుగుపెట్టారు. హౌస్‌లోకి తిరిగి వెళ్ళటానికి ఎలాంటి పావులు కదపలేదు. కుట్రలు, కుతంత్రాలు చేయలేదు. మంచి మనస్సుతో ప్రజలను అభ్యర్థించాడు. ఏకంగా 2 కోట్ల 40 లక్షల 28 వేల ఓట్ల మెజారిటీని సాధించాడు. అందరూ శ్యామల,తేజస్వి మధ్య పోటీ జరుగుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ నూతన్ నాయుడు టాప్ లో నిలిచాడు. ఇది కౌశల్ ఆర్మీ తెచ్చిపెట్టుకున్న విజయం.
మొదటి సీజన్ విన్నర్ ..వైల్ కార్డ్ ఎంట్రీ!
ప్రేక్షకుల్లో లేటెస్ట్ టాక్ ప్రకారం బిగ్ బాస్-2 హౌజ్‌లోకి బిగ్‌బాస్ 1 విన్నర్ శివ బాలాజీ ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మొదటి సీజన్‌లో టఫ్ కంటెస్టంట్స్ అందరిని వెనక్కి నెట్టేసి ఫైనల్ విన్నర్‌గా శివ బాలాజి నిలిచాడు. బిగ్‌బాస్ తర్వాత ఏదో ఒక సినిమాలో కనిపించిన శివబాలాజి పెద్దగా బయట కనిపించలేదు. అయితే మరోసారి బిగ్‌బాస్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. ఒకవేళ నిజంగానే బిగ్ బాస్-2లో శివ బాలాజి వస్తే అతని మరింత క్రేజ్ వచ్చేస్తుంది. తప్పకుండా మళ్లీ ఆడియన్స్ ఈ షో మీద ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. షో మొదలై నెల గడుస్తున్నా నాని వచ్చే శని, ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో షో నీరసంగా ఉండేది. అయితే లాస్ట్ వీక్ యాంకర్ ప్రదీప్ ఎంట్రీ వల్ల షో మీద కాస్త ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పుడు దాన్ని మరింత పెంచేలా బిగ్‌బాస్ టాస్కులను ప్లాన్ చేస్తున్నారట.
ఓవరాల్‌గా బిగ్‌బాస్ వల్ల కంటెస్టెంట్స్‌కి ఒరిగింది ఏదైనా ఉందా…? అంటే సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్స్, వ్యక్తిగత దూషణలు తప్ప కెరియర్ పరంగా బిగ్‌బాస్ హెల్ప్ కావడం లేదని, షోను వీక్షిస్తున్న సగటు ప్రేక్షకుడి టాక్. అయితే తెరవెనుక ఏమైనా ఒరిగింది అనుకుంటే అది షోలో పాల్గొన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ మాత్రమే చెప్పాల్సి ఉంది.

-విష్ణు కాసోజు