Home కలం గేయం పుట్టుపూర్వోత్తరాలు

గేయం పుట్టుపూర్వోత్తరాలు

ఆదిమ కాలం నుండి తన సంఘర్షణాత్మక జీవన సమరంలో అనుభూతి వ్యక్తీకరణం ఏదో ఒక విధముగా సాధిస్తూనే ఉన్నాడు. భాష పుట్టుటకు ముందునుంచి అంగచాలనము, భాషారహితములగు కేకలు, అరుపులు, వేటాడి తెచ్చిన జంతువుల చర్మముతో త యారు చేసుకున్న వాద్యములు, వ్యక్తీకరణకు దోహదమొనర్చినాయి. సామూహిక నృత్యములలో ఆటవికులలో భాష, భావములకన్నా హర్షాత్మకమైన కేరింతలు, గంతులు, వాద్య ధ్వనులు ముఖ్యములై ఉంటాయి. నృత్యముల లో ఆనందానుభూతి వ్యక్తమొనర్చగలుగు నాటికి లయ, మాధుర్యము, మానవ హృదయము ఆకర్శించినవనవచ్చును. నృత్తము పిదప నృత్యము, ఆపై నాట్యమని అనుభూతి వ్యక్తీరణములోని అభివృద్ధి దశల పౌర్వాపర్వమును భరత మహర్షులు నిష్కర్షించిరి. మానవ సంస్కృతి చరిత్ర కారులను ఇట్లే వివరించిరి. ఆధునిక భాషా శాస్త్రజ్ఞలు సైతము భాషా తొలినాళ్ళ నుండియు లయ, లయానుగుణమైన గేయము, గేయ సంస్కారములో కవిత్వము, భావ వ్యక్తీకరనానుకూలమైన వ్యవహారభాష కాలక్రమాను గతములని నుడివిరి. చిత్ర విచిత్ర, కమనీయమైన ప్రకృతి దేవతా చిద్విలాసమును చూచి ఆనంద పరవశుడై ప్రాకృత జీవి యగు ప్రాచీన మానవులు చిందులు తొక్కుచూ, పాడిన పాటయే మానవ లోక కవిత్వావిర్భావమునకు నాంది అని “మౌల్టన్‌” పండితుడు ఒక సిద్ధాంతము చేశాడు. ఆ పాట ఆడుచు, పాడినది గనుక ఆటపాట, లేదా నృత్త గీతము అని పేరు. ఆ నృత్త గీతము ఛందోబద్ధమగు పాటయే గాని గద్యము కాజాలదు. ఈ నృత్త గీతములో మూడు భిన్న కళాంశములు కలవు. అడుగు వేయుట, రాగము తీయుట, మాట పలుకుట. ఈ మూడే నృత్తము. నాదము, శబ్దము అను పేళ్ల పరుగుచు క్రమముగా నాట్యమునకు, సంగీతమునకు, కవిత్వమునకు బీజములైనవి. “ఆదికవి” వాల్మీకియందు కలిగిన కవితావిర్భావము ఈ సిద్ధాంతమునకు చక్కని నిదర్శనం. మహోల్లాసముతో క్రీడించుచున్న క్రౌంచమిథునమున మగపక్షిని బోయవాడు పడగొట్టగా పెంటి పక్షి దుర్భర దుఃఖముతో విలవిలలాడుచుండగా, శోకమైన ఆ సన్నివేశమును చూచి భావితాత్ముడగు వాల్మీకి దుఃఖపరవశుడై ఆ కిరాతుని కోపించి శపించెను. ఆ శాపాక్షరములు శ్లోకరూపమున వెలువడెను. శ్లోకమనగా ఛందోబద్ధ రచన. మహర్షి పొందిన శోకము వెంటనే నోట వెలువడుటవలన సమాక్షములైన నాలుగు పాదములతో శ్లోకత్వము పొందింది.ఈ శ్లోకద్వయములో మనము గ్రహించవలసిన మొదటి అర్థము అనవ్యాహరణమనగా వెంటనే ఉద్భవించుట అనియు, తంత్రీలయలనగా శ్రుతిలయలనియు, హృదయవేదనా భరితమైన మహర్షి పొందిన మానసిక సంఘర్షణ వల్ల వెలుడిన పాదాలు మానవునిలోని అంతఃకరణ ఆత్మశుద్ధికి నిదర్శనమై నిలిచాయి. ఆది వేదమగు ఋగ్వేదమునందలి ఋక్కులన్నియు మంత్రద్రష్టల భవ్యావిష్టులైయున్న సమయమున, తమంత వారి నోట వెలువడినవే గాని, ప్రయత్నపూర్వకముగా రాయబడినవి కావు. అందు పురష ప్రయత్నమేమియు లేదు. గనుకనే అవి అపౌరుషయములైనవి. అపౌరుషయమైన ఆ వేద వాక్కు ఛందో బద్ధముగనే ఆవిర్భవించుట కవిత్వమునకు, ఛందస్సునకును సహజ సంబంధమును నిరుపవాద సిద్ధాంతము చేయుటకు రామాయణ శ్లోకముకంటే బలవత్తరమైన దృష్టాంతము లేదు. ఆది మానవుడిలో కలిగిన అనంతమైన మార్పు కొత్తదనానికి నాందిగా నిలిచినది. మాటలురానివాడు తనలోని భావాలను తెలుసుకోవడానికి సంజ్ఞల ద్వారా అవసరాలు తీర్చుకున్నాడు. ఆడ, మగ సామూహిక సంచార జీవితానికి అలవాటు పడ్డారు. సుఖ దుఃఖములు వారు మూగ మనసుతోనే పంచుకున్నారు. ప్రకృతిలోని రాగాలు సెలయేళ్ళు, నదీ ప్రవాహాలు, పక్షులు, జంతువుల అరుపులు వారిలో రాగ రంజితమై పెక్కు మార్పుకు మూలమైనవి. జ్ఞానం వికసించి మానం కాపాడుకోవాలనే, తపనపడ్డారు. ఆకు లలములను ఆశ్రయించారు. తంత్రీలయాన్వితమైన నాదాలు, సూర్య, చంద్రుల వెలుతురు వారిని పరవిశింప చేశాయి. ఆది మానవుడు ఆకలిని తీర్చుకోవడానికి వేటాడడం వాటి నుంచి రక్షణకై సామూహికంగా జీవించడం, వేటాడిన ఆహారాన్ని నిప్పు రగల్చి కాల్చుకోవడం, ఆనందంగా గంతులు వేస్తూ, అలవోకగా అరచిన అరుపులే పాటగా వెలువడిందని అనేకమంది భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కొందరు మాటలేకుండా? పాటయెలా? వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. జీవితం కష్ట, సుఖాలతో నిండినది. భావోద్వేగాలు దానికి మూలము. పశు పక్ష్యాదులకు మాటలేకపోయినా? మమకారముంటుంది. తన సంతానాన్ని అవి ఎంతగానో ప్రాణపదంగా పోషిస్తవి. వాటికి నడక నేర్పుతవి. వాటికి ఎగరడం నేర్పుతవి. ఆ పిల్లలు తల్లిని అనుకరించి, తల్లివలె అరిచి, నడిచి, రివ్వున ఎగిరి జీవితాన్ని గడపగలవు. క్రూర జంతువులు, పశువులు కూడా తమ జాతి లక్షణాన్ని అందుకోగలవు. అందుకే మనం గ్రహించవలసినవి అనేకం మిగిలున్నవి. కరుణ, జాలి, దుఃఖం, కోపం, సంతోషం ఇవి అంతః గుణ గణములు. మరి ప్రాచీన మానవులు కూడా తమ ఆప్తుల సంతోషంలో సంతోషం, దుఃఖంలో దుఃఖం పంచుకొన్నారు. తన వారు మరణించినప్పుడు పొందిన మనోవేదన రాగరంజితమై అది ఏడుపై, భావం, భాషయై, పాటవలె ఎదలోని ఆవేదనను వెళ్ల గ్రక్కినారు. అదియే పాట. అది గణాల వెసులుబాటుతో స్వర నియమముతో ఆ పాట ఆవేదనయే మాటకు నాందియైనదని వాల్మీకి శోకధార “మానిషాద” శ్లోకంతో వెలువడినట్లుగా జరిగిందని తెలుస్తున్నది.
ప్రాచీన మానవునికి అర్థంగాని చంద్రుడు, సూర్యుడు, చుక్కలు, ఆకాశం, వర్షం, భూమి మొదలగువాని గురించి పలు రకాలైన కథలల్లి పాటలు పాడుకొని ఉంటాడు. పురాణ గాథలన్నింటిలో ఈ విషయాలు స్పష్టంగా కనబడతాయి. ఆత్మారాధన, భూతారాధన దశలలో అగోచరాలైనవానిని పూజించి, వాని గురించి పాటలల్లి పాడడాన్ని ప్రారంభించాడు. హృదయ భారాన్ని తగ్గించడం కొరకు దుఃఖాన్ని, ఆవేశాన్ని, కష్టాన్ని పైకి తీసి పాటలుగా మలచుకొని పాడుకొన్నాడు. పాటకు పల్లవి ఉంటుంది, లయ ఉం టుంది. రిథవ్‌ు ఉంటుంది, కూని రాగాలు, సామూహిక అరుపులు, తీవ్రమైన దుఃఖం కూడా లయాత్మకమైన మనసులో హృదయవేదన కలుగుతుంది. “పాట” మనషిలోని హృదయవేదనను తీర్చే సాధనమైంది. ఒక స్త్రీ తన కూతురు ప్రసవించి చనిపోగా శవము వెంట స్మశాన వాటికకువచ్చి బంధువులందరు వినగా తన కడుపు చిచ్చును గద్గద కంఠముతో అతి హృదయ విదారకముగా వర్ణించుచు రోధించింది. ఆ తల్లి పల్లెటూరి మనిషి, నిరక్ష్యరాస్యయైన ఈమె అప్పటికప్పుడు “ఆశువు”గా తన రోదనంతా పాటగా వివరించింది. ఆమె రోదనంతా ఛందోబ ద్ధంగా ఆవిష్కరింపబడి ఆ మాటల పొందికతో, కూ తురి జీవిత కథనంగా, వచ్చిన బంధువులను ఆకర్శించగలిగింది.
“నాకంటె ముందె బిడ్డా / నీవె పోయితివా
ఎన్ని జన్మలపాపం / ఇవ్వాలకూడింది
కడుపులోన దుఃఖం / ఆగుతూ…..
లేదే ఎందు బోయితివి/ ఏడబోయితివి నీవు”
ఈ విధంగా మాటలు వల్లిస్తూ “పాట” గా తన బిడ్డతో తనకు ఉన్న అనుబంధాన్ని శోక రూపంలో వెల్లగక్కడం కనపిస్తుంది. మనోవేదన, దుఃఖం అంతులేని శోకమై ఆప్తులకోసం కన్నీరుకార్చే క్రమంలో “పలవరింతే” పాటయైపోతుంది. అది ఎందరికో దుఃఖం కలిగిస్తుంది. “కొడుకు మరణంతో విలవిస్తున్న తల్లి దుఃఖం పాటవలె వెలువడింది.
ఆ తల్లి అరణ్య రోదనయై మనసు ద్రవింపజేస్తుంది. “బిడ్డ కొరకు తల్లి” “ కొడుకు కొరకు తల్లి” విలపించే తీరులో వాళ్ల వేదన “మానిషాద” శ్లోకం వలె వాల్మీకి దుఃఖధారవలె సంగీత ప్రాశస్తమై వెలువడటం వల్ల, సుఖ దుఃఖముల నుంచే కవిత్వం ప్రవాహమై వెలువడిందనేది అక్షర సత్యం. జానపద గేయం పుట్టుక విషయమై పాశ్చాత్య పండితులకు పెక్కు భేద భావములున్నవి. కొందరేక కర్తృత్వమనిరి మరి కొందరు పండితులు సామూహిక కర్తృత్వమును బలపరిచి సిద్ధాంతీకరించిరి. ‘శ్రమ’ పాట పుట్టుటకు కారణమైంది. ప్రాచీన సమాజంలో వేటాడడం శ్రమతో కూడిన పని. వేటాడేటప్పుడు పాటలు పాడే వారు కాదు.అప్పుడువారి దృష్టి ఆయుధ ప్రయోగంపైనే కేంద్రీకరించి ఉంటుంది. అంతేగాక పాటల ధ్వని వల్ల జంతువులు పారిపోవడం కూడా జరుగుతుంటుంది. వేటాడిన తరువాత జంతువుల్ని పట్టుకొనిలేక చనిపోయిన వాటిని తీసుకొని అందరు కలిసి ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంతో గంతులు వేస్తు, చిందులు తొక్కుతూ గేయాలు పాడి ఉంటారు. వీటిని శ్రామిక గేయాలనవచ్చు. శ్రమను మరచిపోవడానికి అరచిన అరుపుల నుంచే పాట పుట్టింది. దాన్ని ఆధునికులు గేయము అంటున్నారు. కష్టజీవులైన శ్రామికులు ఈనాటికి ఎత్తైన కరెంటు స్తంభాలు ఎత్తడానికి “హైలెస్సా హైలెస్సా” అని పలుకుతారు. పల్లకినీ మోసే బోయీలు “హో హో హో హో” అని పలుకుతారు. పెద్దరాళ్లను పైకిలేపే కార్మికులు “ఔర్‌తోడా ఐసో” అని పలుకుతారు. చాకలివాళ్లు బట్టలు ఉతికేటప్పుడు “ఉస్ ఉస్‌” అని ఉచ్ఛ్వాస, నిశ్వాసల ద్వారా ఊపిరిని బిగపడుతూ, వదులుతూ, వారి శ్రమలో కొంత భారాన్ని తీర్చుకుంటారు. దీని ద్వారా ప్రాచీన మానవుడు కూడా తన శ్రమను మర్చిపోవడానికి చేసిన ప్రయత్నమే అరుపులు. ఆనందంలో కేరింతలు, సామూహిక నృత్యాలు, అనంతరం భాషగా, శ్రమను మర్చిపోవడానికి పాటలుగా అల్లారని మనకు తెలుస్తున్నది. నదీ తీరాలలో వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత రైతులు మోట తోలేటప్పుడు, నాగలి దున్నేటప్పుడు, ఏతం తొక్కేటప్పుడు, పైరు కోసేటప్పుడు, ధాన్యాన్ని నూరేటప్పుడు, శ్రామిక గేయాలు పాడి ఉంటారు. స్త్రీలు బుట్టలల్లేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, విత్తనాల్ని చల్లేటప్పుడు, ఎన్నో శ్రామిక గేయా ల్ని మృధు మధురంగాగానం చేసి వుంటారు. వర్షా లుపడిన తరువాత రైతులు నాగళ్లు దున్నుతారు. నాగేటి చాళ్లల్లో ఆడవారు విత్తనం వేసి మట్టి కప్పుతారు. వరుసైన స్త్రీలను ఆట పట్టించడానికి వ్యంగ్యం గా పాడే పాట ముచ్చటగొల్పుతుంది.
“ముద్దుటర దున్నువాడా / ముద్దుల మేనత్త కొడుకా/ దాపటెద్దు దప్పికాయెరా / ఓరందకాడ / నర్సయ్య బావా/ సీల! దింపి నీలబెట్టరా”
దాపటెద్దు దప్పికైందని, నాగలిని ఆపుమని ముద్దుల మరదలు ఆజ్ఞ. నిజానికి తన అలుపును దప్పికను చెప్పటం తప్ప మరొకటి కాదు. బావా, మరదళ్ల సరసం ఇందులో కనిపిస్తున్నది. పని, పాటలు శ్రమ రూపాలు. ఆటా పాటలకు, పని పాటలకు మధ్య ఓ చారిత్రక పరిణామం ఉంది. ఆ పాటలు, పని పాటలు రెండూ ఒకటి కావు. ఆట పాటల్లో ఆట, పని పాటల్లో పని పాట జమిలిగా గణతెగ సమాజాల సంస్కృతిని, మానవీయ హృదయ స్పందనల్ని ఇంకా కాపాడుకుంటూ వస్తున్న రూపా లు. పిల్లల్ని జో కొడ్తూ పాట, బుజ్జగిస్తూ పాట, నాట్లే స్తూ, మోట కొడ్తూ, విసుర్రాయి ఇసురుతూ, ధాన్యం దంచుతూ, చేను కాస్తూ, పడవ నడుపుతూ, బీడీలు చేస్తూ, బర్లుకాస్తూ పాట. ఇవీ పనీపాట ఒకేసారి సాగే రూపాలు. ఇందు లో ఆట, పాట దాగుంది. ఆట పాటల్లో ఆట, పాట రెండూ ఉంటాయి. పని పాటల్లో పనీ, పాటా రెండూ ఉంటాయి. ఆటకు పనికి తేెడా ఉంటుంది. పనిలో ఏదో ఒకటి చెయ్యడం ఉంటుంది. ఆటల్లో పనిచేయ డం ఉండదు. ఆడటమే ఉంటుంది. పనిచేయడంలో పనిచేస్తున్నాను అనే ఎరుక ఉంటుం ది. హృదయ సంబంధమైన మానసిక అవస్థలైన సుఖ దుఃఖములు పాటకు మూలమైనవి. కష్ట సుఖాలలో సామూహికంగా ఆలపించిన గీతాలు పాటలై పల్లవించి, భాషయై సౌందర్యపూరితమైన మాటయై నిలిచింది.“గీతిక” హృదయ భారాన్ని తీర్చే పాట సాహిత్య మూలాలలో కూడాపాట అయినది. గేయం అన్నిటికీ మూలం. మానవుడి హృదయ భారం తీర్చి అతడిని పరిణతుడిగా మార్చే సాధనమైంది.