Home ఎడిటోరియల్ విశ్వాసం-విజ్ఞానం

విశ్వాసం-విజ్ఞానం

Article about Modi china tour

శుక్రవారం నాటి సంపూర్ణ చంద్రగ్రహణం శాస్త్రీయ చైతన్యం, జిజ్ఞాస గలవారినీ, ఆధ్యాత్మిక విశ్వాసులనూ విశేషంగా ఆకట్టుకున్నది. గ్రహణమని పిలిచే ఈ అరుదైన అద్భుతమైన ఖగోళ సన్నివేశం తాము చూడగలిగే పరిధిలో సంభవించినప్పుడు ప్రజలు దానిపట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించడం మామూలే. ఈసారి గ్రహణం సంపూర్ణం కావడమే కాకుండా చంద్రుడు ఎప్పుడూ లేని రీతిలో ఎర్రగా కనిపించడం వల్ల కూడా చూసితీరాలన్న ఆసక్తి మెండుగా కలిగింది. అంతేకాదు ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువసేపు దర్శన భాగ్యం కలగడమూ ఇందుకు మరో కారణం. ఇదే సమయంలో అంగారకుడు భూమికి చేరువ కావడం ఆసక్తిని మరింత పెంచింది. మొత్తానికి దాదాపు ప్రపంచమంతటినీ ఆకట్టుకున్న విశేష సన్నివేశమిది. శాస్త్రీయ దృష్టితో చూసిన వారికి మనోవికాసాన్ని ఆధ్యాత్మిక విశ్వాసాల పరంగా తిలకించిన వారికి ఆత్మతృప్తిని కలిగించింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఈసారి గ్రహణ సందర్భంలో కొందరిలో మూఢవిశ్వాసాల పైత్యం ముమ్మరించడమే అత్యంత శోచనీయం. గ్రహణవేళ నరబలి ఇస్తే అపారమైన శక్తులు కలుగుతాయనే అంధ భావనతో ఆంధ్రప్రదేశ్‌లో ఒకచోట కొంతమంది నరబలి ఇవ్వడానికి విఫలయత్నం చేశారన్న సమాచారం దిగ్భ్రాంతిని కలిగించింది.
ఒకవైపు శాస్త్రీయ శోధన, దాని అఖండ విజయాలు మానవ జీవితాన్ని సౌకర్యవంతం చేస్తుండగా మరోవైపు ఛాందసభావాల, మూఢనమ్మకాల పునర్ విజృంభణ, అమితత్వాలు అమానుషం వైపు అడుగులు వేయిస్తున్నాయి. స్వార్థకాంక్షను వికృతరూపు ఎత్తిస్తున్నాయి. విశ్వాసాలు పరులకు హానికాని వ్యక్తిగతమైన ఆత్మతృప్తికి పరిమితం కావాలే కాని సమాజానికి కీడు చేసే మౌఢ్యానికి అంతిమంగా ఆత్మవినాశానికి దారితీయకూడదు. దారుణంగా అత్యంత విషాదకరంగా ఇప్పుడు అదే జరుగుతున్నది. వాట్సప్ వంటి అమోఘమైన సాంకేతిక విప్లవాన్ని పుకార్లు వ్యాప్తి చేసి భయ దేషాలను రెచ్చగొట్టి సాటివారి ప్రాణాలను బలితీసుకునే మూకదాడులు, హత్యలు జరిపించడానికి దుర్వినియోగ పరుస్తున్నారు. ప్రజలను డూడూ బసవన్నలుగా, మూకలుగా, శరీరమే తప్ప విచక్షణ విజ్ఞానం లేని మూర్ఖులుగా రూపొందించి స్వప్రయోజనాలకు వాడుకునే దుష్టధోరణులు ప్రబలుతున్నాయి.
ఇక్కడే ఇంకొక సమాచారాన్ని ప్రస్తావించుకోవలసిఉన్నది. దేశంలోని మెజారిటీ మతస్థులు పరమ పవిత్రంగా భావించే గంగా నదీ జలాలు కొన్నిచోట్ల ఆరోగ్యానికి అత్యంత హానికరమైన స్థాయిలో కలుషితమయ్యాయని జాతీయ హరిత ట్రిబ్యునల్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్ నుంచి ఉన్నావో వరకు గల గంగానదీ జలాలు తాగడానికి, స్నానం చేయడానికి పనికి రావని ట్రిబునల్ నాడు ప్రకటించింది. అంతేకాదు అమాయక ప్రజలు భక్తి ప్రపత్తులతో అత్యంత పవిత్రమని భావించి ఆ నీటిని తాగుతున్నారు. అందులో మునుగుతున్నారు. అది వారి ఆరోగ్యానికి మంచిదికాదని పేర్కొన్నది. ఆ సంగతి వారికి తెలియదు. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని సిగరెట్ ప్యాకెట్‌ల మీద ఉంటుంది. అదే విధంగా ఈ ప్రాంతంలోని గంగా జలాల నుంచి వాటిల్లే ముప్పు గురించి ఎటువంటి హెచ్చరికలు చేయకపోవడం ఆందోళన చెందవలసిన విషయం అని కూడా ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఇది ఆ జలాలను వినియోగించేవారి జీవన హక్కుకు భంగమని స్పష్టం చేసింది.
దేశం ఒకవైపు పారిశ్రామికంగా, సంపద సృష్టిపరంగా విశేషాభివృద్ధివైపు ఉరకలు వేసే ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నది. అందుకవసరమైన సాంకేతికాదిపరిజ్ఞానాలను సమకూర్చుకుంటున్నది. అదేస్థాయిలో దేశ ప్రజల్లో పురోగామి భావజాలాన్ని పెంపొందించవలసి ఉండగా జాతిని అందుకు వ్యతిరేక దిశగా నడిపించే కుట్ర సాగుతున్నది అనే అభిప్రాయానికి అవకాశం కలుగుతున్నది. మతపరమైనవిగాని, ఆచార సంప్రదాయాల పరమైనవిగాని అనాదిగా ఉన్న విశ్వాసాలలోని అప్రజాస్వామికమైన అంశాలను వదిలించుకుంటూ పాటించడం వర్ధిల్లే సమాజాల లక్షణం. అటువంటి చోటనే ప్రగతి శిఖరాలనందుకుంటుంది. ప్రజలు సుభిక్షంగా ఉంటారు. మన రాజ్యాంగం, దానికి అనుగుణంగా సమాన హక్కులను శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహిస్తూ, విరుద్ధమైన వాటిని నిరుత్సాహపరుస్తూ వస్తున్న ఉన్నత న్యాయస్థానాల తీర్పులు మాత్రమే ఈ విపత్కర పరిస్థితుల్లో జాతికి సరైన బాట చూపగలవు. వాటి వెలుగులో మనలనుమనం తీర్చిదిద్దుకోవలసి ఉన్నది.