Home ఎడిటోరియల్ సుప్రీం తీర్పు తర్వాత ఢిల్లీ

సుప్రీం తీర్పు తర్వాత ఢిల్లీ

edit

అనుకున్నంత అయ్యింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నరుకు మధ్య చిక్కుకున్న ఢిల్లీ పరిపాలన సంక్షోభ పరిష్కారంలో జూలై 4వ తేదీ సుప్రీంకోర్టు తీర్పు సాధించింది శూన్యం. కేజ్రీవాల్ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇది పెద్ద విజయంగా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు, ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం స్వంత నిర్ణయాలు తీసుకోవచ్చని, ప్రతి విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నరుకు పంపి ఆమోదం కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదని, అధికారుల బదిలీలు, పోస్టింగులపై కూడా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అన్నారు. నిజానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఢిల్లీ బ్యూరోక్రసీపై ఎన్నికైన ప్రభుత్వ నియంత్రణ లేదు. ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ముఖ్యమంత్రి ధర్నాకి కారణం కూడా ఐఎఎస్ అధికారుల అప్రకటిత సమ్మెకు సంబంధించింది. అధికారులు సహకరించడం లేదని, పనులు చేయడం లేదన్నదే ఆయన ఆరోపణ.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కొన్ని గంటలకే ఢిల్లీ డిప్యూటి ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అధికారుల బదిలీలకు సంబంధించి అధికారాలు ఢిల్లీ ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నాయని ఒక ఉత్తర్వు జారీ చేశారు. గతంలో కూడా ఈ అధికారాలు ఢిల్లీ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉండేవి. 2015 తర్వాత ఆ పరిస్థితి మారింది. కాని సిసోదియా జారీ చేసిన ఉత్తర్వును ఢిల్లీలోని బ్యూరోక్రాట్లు వెనక్కి పంపిస్తూ చట్టబద్ధంగా ఈ ఉత్తర్వు చెల్లదని అన్నారు. ఉద్యోగుల బదిలీలు నియామకాలను లెఫ్టినెంట్ గవర్నరుకు కట్టబెట్టిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేయలేదని కారణం చూపించారు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఏమిటో? ఎవరిష్టం వచ్చినట్లు వారు దానికి అర్థతాత్పర్యాలిచ్చుకుంటూ తమ ఇష్టారాజ్యం చెలాయించడమే అయ్యింది.
కేంద్ర హోం శాఖ 2015 మే 21న ఒక నోటిఫికేషను జారీ చేసి అధికారుల బదిలీలు, నియామకాలు వగైరా అన్నీ లెఫ్టినెంట్ గవర్నరు చూసుకుంటారని చెప్పింది. అంతకుముందు 1998 నోటిఫికేషను ప్రకారం ఈ అధికారాలు ముఖ్యమంత్రి చేతుల్లో ఉండేవి. కొత్త నోటిఫికేషను ఆ అధికారాలను లాక్కుంది. 1998 నోటిఫికేషను ప్రకారం శాంతిభద్రతలు, పోలీసు, సర్వీసులకు సంబంధించిన వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ముఖ్యమంత్రిని సంప్రదించాలి. అలా సంప్రదించకపోతే దానికి కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి. ఇప్పుడా పరిస్థితి లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరిని నియమించారో, ఎవరిని బదిలీ చేశారో ముఖ్యమంత్రి వార్తల్లో చూసి చదువుకోవాలి తప్ప మరోలా తెలిసే అవకాశం కూడా లేదు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రికి, లెఫ్టినెంట్ గవర్నరుకు మధ్య అఖాతాన్ని సృష్టించింది. ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని, లెఫ్టినెంట్ గవర్నరు ద్వారా అడ్డుపుల్లలు పెడుతుందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నాడు. ఈ ఆరోపణలను సుప్రీంకోర్టు తీర్పు బలపరిచిందని ఆయన అన్నాడు. కాని బిజెపి నేతలు మరోలా వాదిస్తున్నారు. ఇప్పుడున్న స్థితినే సుప్రీంకోర్టు తీర్పు కొనసాగిస్తుందని, అంతకుమించి మరేమీ లేదని అంటున్నారు. ఎవరు చెప్పేది సత్యం? కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఈ తీర్పు గురించి రాస్తూ దీనివల్ల ఢిల్లీ ప్రభుత్వ అధికారాలేవీ పెరగలేదని, కేంద్ర ప్రభుత్వ అధికారాలేవీ తగ్గలేదని, తీర్పు కేవలం ఎన్నికైన ప్రభుత్వ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిందని, కాని ఢిల్లీ కేంద్ర ప్రాంతం కావడం వల్ల ఇక్కడి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేయవలసి ఉంటుందని రాశారు. సుప్రీంకోర్టు తీర్పు సమస్యను పరిష్కరించలేదని దీన్నిబట్టి అర్ధమవుతోంది. దీనికి జవాబుగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు అశుతోష్ ట్వీట్ చేస్తూ అరుణ్ జైట్లీ కి రాజ్యాంగం పట్ల విశ్వాసమే లేని రాజ్యాంగ అరాచకవాది అన్నాడు.
ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెసు పార్టీ ఆటలో అరటిపండు పాత్ర పోషిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెసు ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, అజయ్ మాకెన్ తమ గొప్పలు చెప్పుకోవడం మానలేదు. షీలా దీక్షిత్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నకాలం 1998 నుంచి 2013 వరకు లెఫ్టినెంట్ గవర్నరుతో ఘర్షణ లేదని అన్నారు. పరిపాలన ఎంత గొప్పగా ఉందో చెప్పుకోవడం ముఖ్యం కాని లెఫ్టినెంట్ గవర్నరుతో ఘర్షణ లేకుండా ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడంలో గొప్పదనమేముంది. అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కోవడంలో గొప్పదనమే ముంది. నిజం చెప్పాలంటే 2015కు ముందు ఢిల్లీ ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వం కన్నా ఎక్కువ అధికారాలుండేవి. ఆ విషయాన్ని కాంగ్రెసు చెప్పడంలేదు. ఈ గొప్పలు చెప్పుకోవడం వల్ల కాంగ్రెసుకు ఢిల్లీలో కాని, జాతీయ రాజకీయాల్లో కాని ఒరిగేది ఏదీ ఉండదు. పేదలకు అనుకూల పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ పేదప్రజలనే కాదు, మధ్యతరగతిని కూడా తనవైపు తిప్పుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకుని షీలా దీక్షిత్, మాకెన్‌లు చేస్తున్న రాజకీయాలు జాతీయస్థాయిలో కాంగ్రెసుకు నష్టం కలిగించవచ్చు. మరోవైపు ఆప్ పార్టీని ఇబ్బందుల పాలు చేస్తూ బిజెపి కూడా ప్రజల సానుభూతిని కోల్పోతోంది. బాధిత పక్షంగా ఆప్ పార్టీకి ప్రజల సానుభూతి పెరిగే సూచనలే ఉన్నాయి.
ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం కూడా లేదు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఢిల్లీ ప్రభుత్వం పనిచేయడానికి అడ్డంకులు తొలగిపోయాయి, ఇక పనిచేసి చూపించాలన్న డిమాండ్ పెరిగే లోపే అరుణ్ జైట్లీ వంటి నేతలు సుప్రీంకోర్టు తీర్పుకు ఇచ్చిన వివరణ, ఢిల్లీలో బ్యూరోక్రాట్ల వ్యవహారశైలితో కేంద్రప్రభుత్వం ఢిల్లీలో రాజకీయాలు మారలేదని, ఢిల్లీ ప్రభుత్వాన్ని పనిచేయనివ్వడం లేదని కేజ్రీవాల్ మరోసారి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లభించింది. ఈ తీర్పు వచ్చిన రెండో రోజే కేజ్రీవాల్ ఫుడ్ డిపార్టుమెంటకు ఆదేశాలు జారీ చేస్తూ రేషను ప్రజల ఇంటికి వెళ్ళి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాడు. సిసిటీవీ కెమెరాల ఏర్పాటుపై కూడా నిర్ణయాలు తీసుకున్నాడు. అంటే ఢిల్లీ ప్రభుత్వం పనిచేస్తుందని, కేంద్రమే అడ్డుకుంటుందన్న అభిప్రాయం అందరిలోను బలపడే నిర్ణయాలివి. నరేంద్రమోడీ ప్రభుత్వంతో తలపడడానికి ఏమాత్రం వెనుదీయని కేజ్రీవాల్ కు ఇప్పుడు ప్రతిపక్షాల్లోను చాలా మంది మిత్రులున్నారు. మమతా బెనర్జీ, పిన్నరాయి విజయన్, చంద్రబాబునాయుడు, హెచ్‌డి కుమారస్వామి ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు.
సుప్రీంకోర్టులో ఆయన పోరాడ్డం, సుప్రీంకోర్టు తీర్పు, దానికి బిజెపి నేతలు చెబుతున్న భాష్యం ఇవన్నీ ప్రజలే కాదు ప్రతిపక్షాలు కూడా గమనిస్తున్నాయి. బిజెపిని ఢీకొనే సత్తా ఉన్న నాయకుడిగా కేజ్రీవాల్ ఎదుగుతున్నాడన్నది కాదనలేని వాస్తవం. బిజెపిని ఓడించడానికి ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెసు వైఖరి వల్ల కాంగ్రెసు ప్రతిష్ఠ ప్రతిపక్షాల్లో దెబ్బతిన్నట్లే. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను వ్యతిరేకించడం ద్వారా బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పేరు వల్ల కాంగ్రెసు ప్రతిపక్ష నాయకత్వానికి అర్హతను కోల్పోయే పరిస్థితికి నెట్టివేయబడింది. సుప్రీంకోర్టు తీర్పు ఢిల్లీలో సమస్యను పరిష్కరించలేదు కాని కేజ్రీవాల్ బలాన్ని పెంచింది. బిజెపి, కాంగ్రెసు రెండు ఇప్పుడు ఒకే శిబిరంలో కనిపించే కొత్త వాతావరణం ఏర్పడింది. సాధారణ ఎన్నికలకు ముందు కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది దారితీయవచ్చు.