Home ఎడిటోరియల్ ఎన్‌కౌంటర్ల మారణహోమం

ఎన్‌కౌంటర్ల మారణహోమం

edit

ఏప్రిల్ 22వ తేదీన మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా బామరగఢ్ తెహసీల్ లోని బోరియా, కసన్సూర్ గ్రామాల మధ్య మావోయిస్టుల దళం ఉంది. వారిలో కొంతమంది ఉదయం అల్పాహారం స్వీకరిస్తున్నారు. మరి కొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. మావోయిస్టులు ఆ ప్రాంతంలో బస చేశారన్న సమాచారం అందుకున్న భారీ సి.ఆర్.పి. దళం, సి-60 కమాండోల బృందం గ్రెనేడ్ ప్రయోగించగలిగే ఆయుధాలు తీసుకుని వచ్చి మావోయిస్టులను చుట్టుముట్టి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అక్కడ బసచేసిన మావోయిస్టులందర్నీ మట్టుబెట్టారు. ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మరణించారని చెప్పిన పోలీసులు ఎంపిక చేసిన కొంత మంది పత్రికా రచయితలను అక్కడికి తీసుకెళ్లారు. ఆ విలేకరులు అధికారులు చెప్పే కథను పూసగుచ్చినట్టు రాశారు.
మరుసటి రోజున మరో ఆరు మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించారని పోలీసులు చెప్పారు. ఈసారి ఎదురు కాల్పులు జిమలగట్ట అటవీ ప్రాంతంలోని రాజారాం ఖాండ్ల వద్ద జరిగాయట. ఇంద్రావతి నదిలో 15 మృత దేహాలు లభించాయని ఏప్రిల్ 24న పోలీసులు ప్రకటించారు. ఈ మృత దేహాలు 22వ తేదీన ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టులవట. ఆ తర్వాత ఇంద్రావతి నదిలో మరో మూడు మృత దేహాలు దొరికాయి. అంటే రెండు ఎదురుకాల్పుల ఘటనల్లో మొత్తం 40 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ‘ఎదురు కాల్పుల నిపుణులకు’ అవార్డులు, పదోన్నతులు వేచిఉన్నాయి. ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టినందుకు ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
విద్రోహ కార్యకలాపాల వ్యతిరేక చర్యలో పోరాడే వారికి, పోరాడని వారికి మధ్య పెద్ద తేడా ఉండదు. మరణించిన వారిలో 22 మంది మాత్రమే తమ కార్యకర్తలని మావోయిస్టులు చెప్తున్నారు. కసన్సూర్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ఎనిమిది మంది స్త్రీ పురుషులను గట్టెపల్లి దగ్గర పట్టుకెళ్లి ఏప్రిల్ 21వ తేదీ రాత్రి కాల్చేశారని మృతుల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ఉంది. ఆ తర్వాత ఈ ఎనిమిది మంది మృత దేహాలను మరణించిన మావోయిస్టుల మృత దేహాలతో కలిపేశారు. వారు 22వ తేదీనాటి ఎదురు కాల్పుల్లో మరణించినట్టు చూపించారు. ఎదురు కాల్పుల్లో మరణించినట్టు చెప్పిన తన కుమారుడి మెడ మీద లోతైన గొడ్డలి వేటు ఉందని మృతుడి తండ్రి చెప్పారు. అంటే పోలీసులు కిరాతకానికి కూడా పాల్పడ్డారు. కాని అధికారవర్గాల వారు ఈ విషయాన్ని ఖాతరు చేయరు.
అధికారవర్గాల వారు లెక్క చేసేదల్లా గనుల తవ్వకంవల్ల బడా వ్యాపారులకు ఎంత లాభం వస్తుంది, అందులో రాజకీయ నాయకులకు, అవినీతిపరులైన అధికారులకు ఎంత వాటా వస్తుందని మాత్రమే. గనుల తవ్వకం పథకాలకు దళారులుగా వ్యవహరించింది ఈ నాయకులు, అధికారులే. మాదియా గోండులు, ఇతర వనవాసులు గనుల తవ్వకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గనుల తవ్వకం వల్ల తాము నివసించే కొండలు, అడవులు, నదులు నాశనం అవుతాయనీ, పెట్టుబడిదారీ సంస్కృతి ప్రవేశించడం వల్ల తమ సంస్కృతి ధ్వంసం అవుతుందని వనవాసులు భావిస్తున్నారు. వనవాసులు కోరుతున్నది అడవుల్లో దొరికే చిన్న చిన్న ఉత్పత్తులను వినియోగించుకునే కుటీర పరిశ్రమల అవసరం ఉందనే. ఈ కుటీర పరిశ్రమలు కూడా తమ గ్రామసభల ద్వారానే నిర్వహించాలని వనవాసులు కోరుతున్నారు.
2006 నాటి షెడ్యూల్ తెగల, ఇతర సాంప్రదాయిక వనవాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 1996 నాటి పంచాయతీల (షెడ్యూల్ ప్రాంతాలకు విస్తరింపు) చట్టం అమలు కావాలని వనవాసులు కోరుతున్నారు. అదీగాక అటవీ ప్రాంతాలలో అభివృద్ధి పథకాలు అమలు చేయాలని అనుకుంటే ముందుగా తమ గ్రామ సభల అనుమతి తీసుకోవాలని అంటున్నారు. కానీ కలిసికట్టుగా తమ హక్కుల కోసం పోరాడితే తమ నాయకులపై బూటకపు కేసులు నమోదు చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలు మోపుతున్నారని, రాజ్య హింసకు గురి చేస్తున్నారని వనవాసులు అంటున్నారు. ఈ హింసాకాండను ఎదిరిస్తే మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారు. గనుల తవ్వకం పథకాల అమలు కోసం రాజ్యం బలప్రయోగానికి, దమనకాండకు పాల్పడుతోంది.
2007లో గడ్చిరోలీలో లాయ్డ్ మెటల్స్ కంపెనీ గనుల తవ్వకం కోసం కౌలుకు తీసుకున్నప్పుడు ప్రజలు ప్రతిఘటించడం మొదలైంది. ఆ తర్వాత అనేక వ్యాపార ప్రతిపాదనలు వచ్చాయి. గోపాని ఐరన్ అండ్ పవర్‌కు పర్యావరణ, అటవీ, శీతోష్ణస్థితి మార్పు మంత్రిత్వశాఖ ఏడాది కిందట కౌలు ఇచ్చింది. మాదియా గోండులకు సుర్జాగడ్ కొండలు పవిత్రమైనవి. వాటిని కూడా వదలడం లేదు. ఈ కొండలు పవిత్రమైనవి అన్న భావన మాత్రమే కాక మాదియా దేవుడు ఠాకూర్ దేవ్‌కు నిలయం. ఠాకూర్ దేవ్ 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఈ కొండల మీద నుంచే బ్రిటిష్ వలసవాదాన్ని ప్రతిఘటించారు. ఈ ప్రాంతంలో గనుల తవ్వకానికి కౌలుకు ఇవ్వడం అంటే తమ అవాస ప్రాంతాలను ఛిద్రం చేయడమేనని, అది తమ సంస్కృతి, జీవావరణం ధ్వంసం కావడానికి దారి తీస్తుందని వనవాసులు భావిస్తున్నారు. తమకు ఆహారం, నీరు దొరకకుండా పోయి జీవనోపాధికే భంగం కలుగుతుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
వస్తువినిమయ వ్యామోహంలో పడిపోయిన అధికార వర్గం మాదియా గోండులు అనుభవిస్తున్న విపరీతమైన గాయాలను పట్టించుకోవడం లేదు. ‘వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాలలో మావోయిస్టులు అమాయకులైన గిరిజనులను, స్థానిక ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు’ అని హోం మంత్రిత్వ శాఖలోని ‘వామపక్ష తీవ్రవాద విభాగం’ వాదిస్తోంది. అందువల్ల ‘పోలీసు బలగాలను ఆధునీకరించే పరివ్యాప్త పథకం’లో భాగంగా ‘మీడియా ప్రణాళికా పథకం’ కూడా చేర్చింది.
వామపక్ష తీవ్రవాద ప్రభావం వల్ల దేశంలోని అనేక ప్రాంతాలు అభివృద్ధిలో దశాబ్దాల తరబడి వెనుకబడిపొయాయి అని అధికార వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీన్ని పౌర సమాజం, మీడియా గుర్తించాలని అధికార వర్గాలు అంటున్నా యి. అయితే అధికారవర్గాల వారు ఏప్రిల్‌లో ‘మావోయిస్టులను’ మూకుమ్మడి ఊచకోతకు గురి చేయడాన్ని కమెండో దళాలు మాత్రమే కాకుండా మీడియా కూడా మెచ్చుకుంటోంది అని గుర్తించాలి. అంటే వనవాసుల జీవితాలలో తీవ్రమైన గాయాలు అయితే కాని దశాబ్దాల తరబడి వెనుకబడి ఉన్న ప్రాంతం ‘అభివృద్ధి క్రమంలో’ భాగస్వామి కాదన్న మాట.