Home కలం బతుకు పాటల పల్లవి ‘కలల సాగు’

బతుకు పాటల పల్లవి ‘కలల సాగు’

kalam

పువ్వు తాను విచ్చుకోవడంతో పాటు చుట్టూ పరిమళాలను వెదజల్లుతుంది. ఉత్తమ సాహితీ వేత్త కూడా అంతే. తాను ఎదగడంతో పాటు చుట్టూ సాహిత్య పరిమళాలను వెదజల్లేందుకు కృషి చేస్తారు. ప్రముఖ కవి వఝల శివకుమార్ కూడా అంతే! శివకుమార్ తెలంగాణ కల సాకారం అయ్యేందుకు పరిశ్రమించారు. విరివిగా కవిత్వ ఆవిష్కరణ చేశారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి గొంతుకై నిలబడ్డారు.
కోల్‌బెల్ట్ ప్రాంతంలో కొత్త కలాలకు నిరంతరం ప్రోత్సాహమిస్తూ, నూతనంగా కవిత్వ సృజన రంగంలోకి వచ్చిన కవులకు మార్గదర్శిగా నిలిచారు శివకుమార్. ఆయనకు అభ్యుదయ రచయితల సంఘం, చైతన్య సాహితి, మంజీర రచయితల సంఘం, సాహితీ గౌతమి, కళానికేతన్, అలిశెట్టి ట్రస్టు వంటి వివిధ సంస్థలతో సత్సంబంధాలున్నాయి. పలు సాహిత్య సంస్థలను వివిధ ప్రాంతాల్లో నెలకొల్పి, ఆయా ప్రాంతాల కవులను ప్రోత్సహించారు. తెలంగాణ సాహిత్య సమాఖ్యను స్థాపించి, ఆధునిక సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకుంటూ కవులకు, రచయితలకు చేదోడువాదోడుగా నిలిచారు.
దివారాత్రాల అనుభవాల సలపరింతలో బతుకు పాటల పల్లవులుగా కలలు ప్రతిధ్వనించాలని వాంఛించే వఝల శివకుమార్ వెలువరించిన కవిత్వ సంపుటి ‘కలల సాగు’. 63 కవితలతో కూడిన ఈ సంపుటిలో ఒక్కో కవితకూ ఒక్కో ప్రత్యేకత ఉండడం విశేషం.
కవితలకు శీర్షిక పెట్టడంలో వఝల ప్రత్యేక శైలి కనబరుస్తారు. కొన్ని కవితల శీర్షికలు స్టేట్‌మెంట్లుగా ఉంటాయి. ‘ఆటా మనదే ఓటమీ మనదే’, ‘కొలను నిద్రపోతుంది’, కళ్లూ మనవే వేళ్లూ మనవే’, ‘జమ్మి చెట్టు అక్కడే ఉంది’, ‘కలలు గుబాళించనీ’, శిఖరం విశ్రమించదు’, ‘మనం మాట్లాడాల్సిందే’ శీర్షికలను దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. విషయ సూచికకు ఆయన పెట్టిన పేరు ‘నారుమడి’. నారుమడితోనేగా సాగు ఫలవంతమయ్యేది!
హక్కుల పోరాట యోధుడు బాలగోపాల్‌ను స్మరించుకుంటూ ‘చెకుముకి’ అనే కవితలో ‘హక్కుల కంఠనాళాలను / వ్యవస్థల అదృశ్య హస్తాలు నొక్కినప్పుడలా / గొంతుకనిచ్చి మ్రోసిన / స్వరభాస్వరానివి నువ్వు’ అంటారు. తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్‌ను గుర్తు చేసుకుంటూ ‘శిఖరం విశ్రమించదు’ అని నిక్కచ్చిగా చెప్తారు. “విద్రోహ విషాన్ని కడుపులో దాచుకున్న / కుట్రలను నిగ్గదీసిన సాహసం నీది” అని పేర్కొంటారు.
వఝల ఆశాజీవి. అందుకే రేపటి వేకువ కోసం కలలు కంటారు. రెప్పల దొన్నెల్లో అలల అలికిడికి చెవులప్పగిస్తారు. నిదుర తెర కింద రెక్కలు విప్పిన సింగిడికి కళ్లను అంకితం చేస్తారు. వికాసపు మూలాలను కలలో దర్శిస్తారు. స్వప్న లిపిని నిజజీవితంలో వెతుక్కుంటారు. స్వప్నం వాస్తవ రూపం దాల్చేందుకు కలంతో బీజాలను వెదజల్లుతారు. అందుకే “ఇన్నాళ్లూ కన్నీళ్ల స్నానం చేసిన / గత వర్తమానాలు భవిష్యత్తు కోసం / పసిడి కలల పన్నీటి స్నానాలు చేయనీ” అని ఆకాంక్షిస్తారు.
బాల్యంపై వఝల శివకుమార్ రాసిన కవిత ‘కలలు గుబాళించనీ’. ఆయన రాసిన గొప్ప కవితల్లో ఇది ఒకటి. సాధారణంగా తల్లిదండ్రులు నిద్రపోని పిల్లలను పడుకొమ్మని చెప్పడం, ఉదయాన్నే పిల్లలను లేపడం సర్వసాధారణం. ఇవి రెండూ చేయగూడని పనులని భావిస్తారు శివకుమార్. “ముసురుకున్న ఊహలకు రెక్కలు తొడిగే దీక్షలో/ వాడిప్పుడో మునిలా ధ్యానముద్రలో ఉన్నాడు / మౌనగీతమై మనసు వీణ మీద / రాగాలు కూర్చుకుంటున్నాడు / ఒక అతీతమైన ఆనందంలోకి / అపురూపమైన అనుభవంలోకి / ఒదిగిపోతూ ఎదుగుతున్న వేళ / వాడి నిద్రను భంగపరచకండి..” అని కోరుతారు. ఊహలకు రెక్కలు తొడిగే దీక్షలో ఉన్న వాడిని భంగపరచడమెంత తప్పో బలవంతంగా పిల్లలను నిద్రపుచ్చడమూ అంతే తప్పని ఆయన అభిప్రాయం. “కొత్త కొత్త సందేహాలకు సమాధానాలు వెతుక్కుంటూ / వాడిప్పుడో శోధకుడిలా కనపడుతున్నాడు / ఆలోచనకందని సత్యాలను అలవోకగా చెప్పుకుంటూ / వాడిప్పుడో తాత్వికుడిలా దర్శనమిస్తున్నాడు / వాడి సంతోషాలను నిరోధించకండి / ఆ వేగానికి కళ్లెం వేయకండి / బలవంతంగా నిదురపుచ్చే ప్రయత్నమూ చెయ్యకండి” అంటారు.
ఆడపిల్లలు వివాహం అనంతరం కొత్త ప్రపంచంలోకి అడుగిడుతారు. పాత ప్రపంచపు ఊసులను జ్ఞాపకాలుగా వదిలేసి కాపురానికి వెళ్లిపోతారు. విదేశాలకు కాపురానికి వెళ్ళే ఆడపిల్లల తల్లిదండ్రులు పల్లవిలేని పాటగా మారిన ఇంట్లో బిడ్డలను తలుచుకోని రోజుండదు. గుండెలపై ఆడుకుని ప్రస్తుతం సుదూర తీరాల్లో ఉన్న కూతురు ఉన్న తల్లిదండ్రుల హృదయ లయను ‘పాలపిట్టలేని దసరా’గా కవిత్వ రూపంలోకి తెచ్చారు శివకుమార్. “పిట్టలెగిరిపోయిన చెట్టుమీద / ఎదురుచూస్తున్న రెండు నిట్టూర్పుల్లా మీ అమ్మా, నేనూ…” అని ఆవేదనను అక్షరరూపంలోకి తెస్తారు. విదేశాల్లో కాపురం చేస్తున్న ఆడపిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా చదివితీరవలసిన కవిత ‘పాలపిట్టరాని దసరా’. ఆధునిక సామాజిక మాధ్యమాలు దూరాలను చెరిపేశాయి. విదేశాల్లో ఉన్న పిల్లలకు, దేశంలోనే ఉన్న తల్లిదండ్రులకు మధ్య వంతెనగా మిగిలేది వాట్సప్పులు, ఫేస్‌బుక్కులు, వీడియో కాల్సు, స్కైపులు. అందుకే “నీ పగళ్లను రాత్రులుగా అనువదించుకుంటూ / ఇంటర్నెట్లోంచి రెండు ఖండాల మధ్య / ప్రతి రాత్రీ మాటల వంతెనొకటి / నువ్వు దగ్గరున్న అనుభూతిని మోసుకొస్తుంది” అంటారు.
వఝల శివకుమార్ కవిత్వంలో ఎక్కువగా వినబడే పదాలు నిద్ర, బాల్యం, తెర, కల, మెలకువ మొదలైనవి. ఈ పదాలతో కూర్చిన మరో కవిత ‘కొలను నిద్రపోతుంది’. బాల్యాన్ని నిద్రలేపొద్దన్నట్టుగానే కొలనునూ లేపొద్దంటారు. “ష్… / సడి చెయ్యొద్దు / నా పక్క ఓ కొలను నిద్రిస్తుంది / కమ్మగా నిద్రపోనీ / నా కోసం కురిసిరమ్మని / కారుణ్య మేఘాలకు / చినుకుల వరాన్నిచ్చి పంపిన / కమనీయ సరోవరం / నిదుర తెర కప్పుకుంది” అంటారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమంపై రాసిన గొప్ప కవిత ‘కళ్లూ మనవే… వేళ్లూ మనవే”. శీర్షిక చూడగానే కవితలో ఏం ఉండబోతుందో అర్థమవుతుంది. ఈ కవిత రచనా కాలం 2006. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న కాలమది. అయితే ఆ కాలంలో వచ్చిన మూస కవితల్లాంటి కవిత కాదిది. పడికట్టు పదాలు లేని ఉద్యమ కవిత ఇది. కవిత ప్రారంభమే ఒక స్టేట్‌మెంటుగా మొదలవుతుంది. “ఇప్పుడు కొత్తగా / మోసపోతున్నదేమీ లేదు / కుడి ఎడమల దగా మధ్య / కూడిన సఖ్యతలు శాశ్వతం కాదు” అని తేల్చిచెపుతారు. కవిత చివర్లో “ఇప్పుడు కొత్తగా మోసపోతున్నదేమిటి… / కోల్పోయిన చూపు సాక్షిగా / పొడుచుకుంటున్న కళ్లూ మనవే / పొడుస్తున్న వేళ్లూ మనవే / అగమ్యగోచరమైపోతున్న / ఈ కబోది కాలమూ మనదే” అంటారు. ప్రారంభానికి, ముగింపుకు మధ్య సరిగ్గా లంకె కుదిరిన కవిత ఇది. శిల్ప పరంగా ఉత్తమ కవితగా దీన్ని చెప్పుకోవచ్చు. వలసల కాలమిది. బతుకుదెరువు కోసం ఉన్న ఊరిని వదిలేసి, పరాయి ప్రాంతంలో గడిపే పరిస్థితే చాలా మందిది. ఈ పరిస్థితికి అక్షర రూపం శివకుమార్ రాసిన ‘జమ్మిచెట్టు అక్కడే ఉంది’ కవిత. జమ్మిచెట్టు బాల్యపు దసరా జ్ఞాపకాలకు ప్రతి రూపం. అందుకే “జమ్మి చెట్టు అక్కడే ఉంది / దాని మీద వదిలేసిన / మన అస్త్రాలూ, అమ్ములపొదీ / అక్కడే ఉన్నాయి / పద మళ్లీ మనూళ్లో మనోళ్ల మధ్య మాటకి ప్రాణం పోసుకుందాం / పాటై పరవళ్లు తొక్కుదాం…” అని పిలుపునిస్తారు.
గతంలో ‘గోగు పువ్వు’, ‘పాల కంకుల కల’, ‘దాఖలా’ కవితాసంపుటాలను వెలువరించిన కవి వఝల శివకుమార్ కలం చేసిన ‘కలల సాగు’ గెటప్ కూడా ఆకర్షణీయంగా ఉంది. కవర్‌పేజీని ఉబ్బెత్తు అక్షరాలతో ఎంబాస్డ్ ప్రింటింగ్‌తో రూపొందించడం ఈ సంపుటికి అదనపు ఆకర్షణ. ఆండ్రూ ఒస్ట్రోవ్‌స్కీ గీసిన వర్ణచిత్రాన్ని కవర్‌పేజీ చిత్రంగా ఉపయోగించడం వల్ల కవర్‌పేజీకి అందమొచ్చింది. ముందుమాటలు, వెనుకమాటలు లేకుండా నేరుగా కవిత్వంలోకే పాఠకుడిని ప్రయాణం చేయించడం కవిపై ముందస్తుగా ఒక అభిప్రాయం ఏర్పర్చుకోకుండా నేరుగా కవిత్వాన్ని చదివేందుకు ఉపకరిస్తుంది.
(‘కలల సాగు’, కవి వఝల శివకుమార్. పేజీల సంఖ్య : 144. వెల : రూ. 100. ప్రతులకు : శ్రీమతి శారద, శివానంద లహరి, ఇం.నెం. 120198/2, గోకుల్ నగర్, వెంకటాపురం, సికిందరాబాదు 500015. సెల్ నెం. 9492039488)