Home ఎడిటోరియల్ జిఎస్‌టి-మేలుకీడులు

జిఎస్‌టి-మేలుకీడులు

Article about Modi china tour

ఘనతర సంస్కరణగా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి పురివిప్పుకున్న విప్లవాత్మక ఆర్థిక మలుపుగా ప్రశంసలందుకున్న ఏకీకృత వస్తు, సేవల పన్ను జిఎస్‌టికి ఏడాదినిండిన సందర్భంగా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నది. పన్ను విస్తృతి, రాబడి పెంచడం ద్వారా జిఎస్‌టి ఘనవిజయం సాధించిందని చెప్పుకుంటున్నది. గత ఆర్థిక సంవత్సరం (201718) లో జిఎస్‌టి నెలవారీ సగటు వసూలు రూ.89,885 కోట్లకు చేరిం దని, పరోక్ష పన్ను చెల్లింపుదారుల విస్తృతి పెరిగిందని వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాబడి అంచనాలకు మించి 13లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం విప్పిపరుస్తున్న గణాంకాలు గణనీయ ఆర్థిక విప్లవాన్నే సూచిస్తున్నాయి.
జిఎస్‌టి మూలంగా సరకు రవాణా వేగం బాగా పుంజుకున్నదని, సరిహద్దు చెక్‌పోస్టుల ఎత్తివేతవల్ల, ఇవే బిల్లుల విధానం కారణంగా ట్రక్కులు గమ్యం చేరు కునే సమయం కనీసం 20శాతం తగ్గిందని స్పష్టపడుతున్నది. ఇలా ఈ కొత్త జాతీయ స్థాయి పన్నువల్ల పలు రకాల ప్రయోజనాలు కలిగిన మాట నిజం. అదే సమయంలో జిఎస్‌టి వల్ల ఏర్పడిన నష్టాల వార్తలు లేకపోలేదు. ఇందులో ప్రధాన మైనది పెద్ద చేపలకు మేలు, చిన్నవాటికి కీడు కలిగాయన్నది. బడా పరిశ్రమలు బాగుపడి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కర్మాగారాలు, చేతివృత్తులు దెబ్బతిన్నాయన్నది. 28శాతం గరిష్టస్థాయి పన్ను శ్లాబువల్ల ఎంతో హానికలుగుతున్నదన్నది మరో విమర్శ. ఈ అభిప్రాయం ఏడాదిక్రితం జిఎస్‌టిని ప్రవేశపెట్టినప్పుడే వ్యక్తమైంది. కాని ఎన్‌డిఎ పాలకులు దానిని పెడచెవిని పెట్టారు.
కాంగ్రెస్ నాయకత్వంలో యుపిఎ ప్రభుత్వం జిఎస్‌టి ని ప్రతిపాదించినప్పుడు 18శాతం గరిష్ఠ పన్ను రేటును అమలు చేయాలని సంకల్పించింది. ఈ పన్నును అమలులోకి తెచ్చిన భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 28శాతం పన్ను రేటును విధించింది. బహుళ శ్లాబులకు తెరలేపింది. ఈ కారణంగా పన్ను వర్తించే వ్యాపార వర్గాలు పెరిగి ఆదాయమూ విశేష స్థాయికి పుంజుకున్నది.
ప్రభుత్వ రాబడి ఎక్కువ కావడమంటే దేశాభివృద్ధికి ఖర్చు చేయడానికి దానికి అధిక నిధులు అందుబాటులోకి రావడమే. అయితే అందుకోసం ఆ మేరకు మరింతగా ప్రజల గోళ్లూడగొట్టి అధిక పన్నులు వసూలు చేయడమే జరిగితే అది వాంఛనీయం కాదు. ఇప్పుడు జరుగుతున్నది అదేనని చెప్పడానికి సంశయించనక్కరలేదు.
జిఎస్‌టి వచ్చిన తరువాత టివిలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్‌లు, ఎసిలు వంటి సామాగ్రి ధరలు ఒకటినుంచి మూడు శాతం పెరిగాయి. వాటిమీద ఆసక్తి, మోజు ఉన్న వర్గాల ప్రజలను వాటికి దూరం చేశాయి. వ్యాట్(విలువ ఆధారిత పన్ను) వ్యవస్థలో 26 శాతంగా ఉన్న పన్ను వర్తింపు స్థాయి ఇప్పుడు 28 శాతానికి పెరిగింది. దీనికారణంగానూ, సరకులు మరింత ప్రియమైనందు వల్లనూ మొత్తంమీద ధరలు గత ఏడాది కాలంలో మూడు నుండి ఐదు శాతం అధికమయ్యాయి.
జిఎస్‌టి మూలంగా కలిగిన హాని గురించి ప్రముఖులు, అనుభవజ్ఞులు చెప్పిన మాటలను కూడా తెలుసుకోవాలి. తయారీ రంగంలో అగ్రస్థానంలో గల తమిళనాడు పరిశ్రమల మంత్రి ఆ రాష్ట్ర శాసనసభలో చెప్పిన దాని ప్రకారం జిఎస్‌టి వచ్చిన తరువాత 50,000చిన్న పరిశ్రమలు అక్కడ మూతపడ్డాయి. ఐదు లక్షలమంది కొలువులు కోల్పోయారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అన్ని రాష్ట్రాలలోనూ కలిపి దాదాపు కోటి మంది ఉద్యోగాలు నష్టపోయారని ఆయన చెప్పారు. గుజరాత్‌లోని సూరత్ చేనేత పరిశ్రమ జిఎస్‌టి వల్ల భారీగా దెబ్బతిన్నది. 40శాతం వ్యాపారులు ఇక్కట్ల పాలయ్యారు. నూలుపై 18శాతం పన్ను చేనేత రంగానికి ప్రాణాంతకమైంది. వ్యాట్ హయాంలో పన్ను రహితంగా వర్థిల్లిన అసోం హస్తకళల ఉత్పత్తుల వ్యాపారం జిఎస్‌టి అమలుతో ముడిసరుకుల మీద సుంకాలవల్ల తీవ్రంగా నష్టాలపాలైంది. ఆ మేరకు ఆ రంగంలో ఉపాధులు నాశనమయ్యాయి.
ప్రజలకు ఇంతగా నొప్పి కలిగించడం ద్వారా భారీగా పెరిగిన జిఎస్‌టి రాబడి వారి బాగుతో నిమిత్తం లేని ప్రగతిని సాధించిందని చెప్పవచ్చు. కానీ జనహిత కారిగా నిరూపించుకోలేక పోయిం దని రూఢిగా భావించవచ్చు. విస్తృతి, రాబడి పెంచుకోవడంలో జిఎస్‌టి విజయం సాధించింది గనుక కొన్ని వస్తువులకు పై స్థాయి పన్ను బాధనుంచి విముక్తి కలిగించే చర్యలు చేపడతామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దానితోపాటు జిఎస్‌టికి సంబంధించిన అన్ని కోణాలను హేతుబద్దం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నొప్పిలేని ఇంజక్షన్ మాదిరిగా పన్నులు ఉన్నప్పుడే ప్రజలు వాటిని సునాయాసంగా కట్టగలరనే విషయాన్ని పాలకులు తెలుసుకోవాలి. కొద్దిగా ఉన్న పై వర్గాలకు అపారమైన మేలు కలిగిస్తూ విస్తారంగా ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలకు బాధ కలిగించే రీతి పన్నుల వ్యవస్థ ప్రజాపాలనకు ఎంతమాత్రం మేలు చేకూర్చదు.