Home కలం చీకట్లో కాంతులు మిళింద కతలు

చీకట్లో కాంతులు మిళింద కతలు

klm

ప్రపంచంలో దేశాల్లో అనేక నూతనోద్యమాలొస్తున్నాయి. పర్యావరణం నల్లజాతి మహిళల టెక్నాలజీ, జాతుల పోరాటాలు, వలసల పోరాటాలు ట్రాన్స్ జెండర్ ఉద్యమాలు ఉదృతంగా వస్తున్నాయి. యిక భారతదేశంలో కులపోరాటాలు, ఉపకులాల వం టి దండోర ఉద్యమాలు, ఆదివాసీ, ఎంబీసి ఉద్యమాలు, దళిత మహిళ, ఆదివాసీ మహిళల పోరాటాలు, కాలుష్య వ్యతిరేక, ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాలు, అడవుల పరిరక్షణ , పచ్చదనం పరిరక్షణ, ప్రజల్ని నిర్వాసితులను జేసే బారీ ప్రా జెక్టుల వ్యతిరేక ఉద్యమాల (నర్మదాబచావోలాంటి) అణు విద్యుత్ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమాలు, ట్రాన్స్‌జెండర్ ఉద్యమాలు, శిశు రక్షణ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్న యి. సోషల్ పారెస్ట్రీ అనీ, పచ్చదనం కోసం కోటి మొక్కలు నాటాలనే స్కీములతో ప్రభుత్వాలు కూడా వచ్చిన పరిస్థితి.
హిజ్రాలకనుకూలంగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్ద తు గొంతులు నినదిస్తున్నయి. ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర ్కం నేరం కాదనే తీర్పిచ్చేందగా హిజ్రాలకు సపోర్టు దొరికింది. యిట్లాంటి అణచివేత వ్యతిరేకతలన్నీ ఆహ్వానించాల్సిన పరిణామాలు. యి నూతన సామాజిక అస్తిత్వ ఉద్యమాలనుంచి ఒక కొత్తతరం ఆలోచనల, ఆకాంక్షల నుంచి వచ్చిందే మానస ఎండ్లూరి ‘మిళింద’ కథలు
‘మిళింద’ అంటే తుమ్మెద సమాజంలో వున్న పాత రక్తాన్ని తీసేసి కొత్త తేనెలు నింపే తుమ్మెద కరచాలనం ‘మిళింద’ కథలు . ఒక కొత్త మానవీయ కోణాల కతలు మానస ఎండ్లూరి మిళింద కతలు.
రచయిత్రి తన ‘తలరాత’గా చెప్పిన ముందుమాటలో ఎందుకు రాస్తుందో నేపద్యాలు, ఏ అస్తిత్వాలు తనని రాసే ట్టు పురికొల్పినయో స్పష్టం చేసింది. ‘నేను చదివిన కనీసం వంద కతల్లో,ఎక్కడా నేనా పాత్రల్లో ప్రదేశాల్లో సంఘటనల్లో కనిపించలేదు. ఎప్పుడైతే పాఠకుడ తనను తాను తాను సాహిత్యంలో అనుభవించ లేక పోతాడో అప్పుడో తన సొంత గాథల్ని వినిపించే ప్రయత్నం చెయ్యాలనుకుంటాడు. (యిక్కడ ‘డు’ కు బదులుగా‘రు’ పెడితే జనరల్ గా వుండేది) అదే ప్రయత్నం నేను చేశానూ అనే అభిప్రాయము సాహిత్య కారులందరికీ వర్తించేది. యిట్లాంటి అవగాహనా చైతన్యాలనుంచే అణగారిన కులాల మహిళలు ముఖ్యంగా అంటరాని కులాల మహిళలు రాసే విస్తత్రిలో మానస ఎండ్లూరి ఒక గొత్త గొంతుక.
చరిత్రలో అంటరాని మహిళలు ఎట్లా బతికారు? వారి జీవిత సాంస్కృతిక సంపదల రికార్డుల్లేవు. పురాణాలు,యితి హాసా లు, ప్రాచీన కవిత్వాలు సాహిత్యాలు ఆధునిక, అభ్యుదయ సాహిత్యాలు కూడా వారి అస్తిత్వాల్ని అవాచ్చంజేసినయి.
కానీ జాన పద మౌఖిక సాహిత్యంలో అణగారిన, దళిత మహిళల గాథలు కథలు కథలుగా విస్తారంగా ప్రచారంలో వున్నయి. వారి కట్టుబొట్టు, సంఘర్షణలు జీవితాలు, అనుభవాలు, భాషా సంస్కృతులు, వారి వెతలు మౌళిక సాహిత్యంలో దొరికినంతగా లిఖిత సాహిత్యంలో మచ్చుక్కూడ దొరకవు.
‘మిళింద’ కథల్లో రచయిత్రి ప్రధానంగా బొట్టులేని క్రిస్టియన్ మహిళల మీద విసిరే వివక్షల పట్ల, ట్రాన్స్ జెండర్‌ల ప్రేమ కథల పట్ల, ఆడమగ వివక్షల పట్ల, భార్యబాధితులు, భర్త బాదితుల పట్ల, సామాజిక మానవీయతల పట్ల యింకా దళిత కులాల్లో వుండే అంటు సొంటు లేని ఉన్నతమైన ప్రేమలు వెదజల్లే విలువల పట్ల తన ఆలోచనల్ని ఆకాంక్షల్ని తన ‘మిళింద’ కథల ద్వారా ఆవిష్కరించింది.
బొట్టులేని తనాలు ఆడవాల్ల చుట్టు అల్లింది. హిందుత్వము. బొట్టు లేకుంటే చూపించే అవమానాలు వివక్షలు దళిత క్రిస్టియన్ మహిళలే ఎదుర్కొనే హిందూ మతాల కర్కోటత్వము. బొట్టు లేని దళిత మహిళా మొక్కాలు కొట్టోచ్చినట్లు మాల మాదిగలుగా పట్టిస్తయి. వివక్షలు అవమానాలు మొకమ్మీన కొట్టినట్లే జరుగుతుంటాయి. ఏ కూపీలు లాగకుండా అవలీలగా వాల్లపట్ల ఏర్పర్చుకునే కుల విలువలు, అంటరాని తనాలు వెంటనే నిర్ణయించే బడ్తాయి. అట్లా బొట్టు లేని దళిత మహిళల పట్ల జరిగే అవమానాల్ని ఆధిపత్యాల్ని బొట్టు బొట్టుగా కూర్చి చెప్పింది రచియిత్రి.
కానీ బొట్టు లేని దళిత మగవాల్లకు, ఆధిపత్య కులాల క్రిస్టియన్ మహిళలకు దళిత క్రిస్టియన్ మహిళకున్న బొట్టు సమస్యల వివక్షలు కనిపించవు. మొకాన బొట్టు వున్నా లేకున్నా మొకాలు చూసి అంటరాని వాల్లుగా గుర్తు పట్టేకృరమైన మోకానిజము కుల వ్యవస్థ కుంది. బొట్టు భోజనాలు’ కత లీనా మేడమ్ లాగ ఆధిపత్య కులాల క్రిస్టియన్ మహిళలకు బొట్టు లేకున్నా వారికి ఏ వివక్షలు అవమానాలు ఎదురు కావు. వారి గౌరవాలకే ఆటంకాలుండవు.
సమాజంలో హిజ్రాలంటే చాలా చిన్న చూపు, హేళన, వారికి ఏ మానవ హక్కులు వర్తించవు. వాల్లని హత్య చేసినా, అత్యాచారం జేసినా కేసులుండవు. ఎప్‌ఐఆర్ లుండవు. చమార్ చినాలి అన్నా ఎస్సీ ఎస్టీ చట్టాలు అమలు కావు. యిప్పుడిప్పుడే వారి సమస్యల్ని మానవీయంగా అర్థం చేసుకునే కొన్ని గొంతులు వినిపిస్తున్నయి. ఆ నేపథ్యంలో సాహిత్యంలో చీకటి కొనలుగా వున్న ఎల్‌జీ చీటీ (LGBT) లను వారి ప్రేమల్ని కథలుగా అల్లి వారి పట్ల తన మానవీయ కోణాన్ని తన మిళిందలో చాటింది రచయిత్రి.
సమాజంలో స్త్రీ పురుషుల ప్రేమలకే అనుమతులు, గౌరవాలు లేని ‘కాప్’ హత్యలు జరుగుతున్నయి. యిక లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్ ప్రేమలకు విలువ గౌరవాల అనుమతులుంటయా! ఉల్పత్ ‘అదే ప్రేమ’ కతల్లో గే ప్రేమల్ని ఆటంకాలు లేకుండా చూపించి లేస్పియన్ ప్రేమను కృరంగా విషాదాంతం చేసిన ‘కరెక్టివ్ రేప్’ కత సమాజానికి ప్రతిబింబంగా చెప్పొచ్చు.
‘మిళింద కతల్లో బొట్టుకతలు, ట్రాన్స్ జెండర్ కతలు ఒక ఎత్తయితే, మెర్సీ పరిశుద్ధ పరిణమయు ప్రత్యేకంగా చెప్పాల్సిన కత . పితృస్వామ్యాలన్నీ ఒకటి కావు. వనరులన్ని చేతినిండావుండి, తమ ఆడవాల్లకి గడపేహద్దుగా గీసిన ఆదిపత్యకులపితృస్వామ్యాల విలువలూ, తమ ఆడవాల్లు కూలికి బోతేగానీ కూడులేని చేతిల తూటుపైసలేని అణగారిన కుల పితృస్వామ్యాల విలువలు ఒకటి కావనేది ‘మెర్సీ పరిశుద్ద పరిణయము కత అర్థం చేయిస్తుంది.
ఒక మహిళ మరో మగాయినతో మాట్లాడితే చెడిపోయిందనీ, చెల్లనిపైసనీ, భర్తచని పోతే అతనితో పాటే చితిలో చావాలనీ, పునర్వివాహాలు, వితంతు వివాహాలు నిషేధించిన అమానవీయ విలువలుండినది ఆధిపత్యకుల పితృస్వామ్యము. పెనిమిటి చినిపోతే , విడిపోతే మారుమనువు చేసుకునే ప్రజాస్వామ్యాలున్న పితృస్వామ్యాలు అణగారిన కులా ల పితృస్వామ్యంలు మెర్సీ పరిశుద్ద పరిణామం కతలో ఒక దళిత యువకుడు ప్రేమించిన ప్రేయసి అత్యాచారానికి గురయితే పెండ్లి చేసుకొని తన ప్రేమ ను చాటుకుంటాడు. అమానవీయ పితృస్వామ్య విలువలకు యి కత ఆదర్శనీయము.
‘మిళింద’ రచయిత్రి తన స్త్రీ వాది ! అనే పరిమితికన్నా మానవ వాదిగా విస్తరించాలని వ్యవస్థీకరణ దళిత మహిళల మీద కూలాల స్త్రీ పురుషులు చేస్తున్న అణచివేతల మీద తన కతలు వుంటాయనీ, దళిత మహిళల మీదే దాడులు, అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయనీ దళిత స్త్రీలకు మరింత రక్షణ భద్రత కావాలని ఆకాంక్షిస్తూ … ఆ దిశగా తన కతలు మాట్లాడ్తాయని చెప్పే కొత్త కలాల్ని ఆహ్వానించాల్సిన అవసరం వుంది.

జూపాక సుభద్ర
9849905687