Home ఎడిటోరియల్ అవార్డుల దుకాణం మూసేయాలి

అవార్డుల దుకాణం మూసేయాలి

nandi

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాల్లో వచ్చిన తెలుగు సినిమాలకు ప్రకటించిన నంది అవార్డులలో సామాజిక, రాజకీయ, ప్రాంతీయ వివక్ష కనబడుతోందని సినీ వర్గాల్లోని కొందరు బహిరంగంగా విమర్శలకు దిగారు. చివరకది వ్యక్తిగత, అగౌరవ పదజాలానికి దిగజారింది కూడా.
తెలుగు సినిమాను గౌరవించాలనే ఉద్దేశంతో ప్రకటించిన పురస్కారాలపై ఈ విరుచుకుపడడమేమిటని కినుక వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను రద్దుచేసే ఆలోచనలో ఉందని ఓ దినపత్రిక పతాక శీర్షికలో ప్రచురించింది. అవార్డుల ఎంపికలోకి చూస్తే రావలసిన సినిమాలకే వచ్చాయి కాని రావలసిన విభాగాలకు రాలేదనిపిస్తుంది. ఉత్తమ చిత్రాల స్థాయి లో ఉన్న సినిమాలకు ఏదో సాంకేతిక విభాగానికి అవార్డు ఇచ్చి ఇచ్చాంకదా అని అనిపించుకునేలా జ్యూరీ వ్యవహరించిందనిపిస్తుంది.
సినిమా పరిశ్రమలో వ్యాపార ధోరణులు పెరిగాక మంచి సినిమాలు కరువై ఉన్న సినిమాల్లోనే ఏదో మూలన నతికి ఉన్న మంచిని దొరకబుచ్చుకొని అవార్డుకు ఎంపిక చేసే పరిస్థితి వచ్చింది.
ఈ రోజుల్లో ఒక వస్తువును మార్కెట్‌లోకి విడుదల చేసిన వ్యాపారి దాని అమ్మకం ద్వారా డబ్బులు కూడబెట్టుకున్నట్లే సినీవర్గాలు కూడా నటీనట, సాంకేతిక వర్గం బాసటతో వ్యాపారం చేస్తున్నాయి.
సామాజిక ప్రయోజనాన్ని, కళాపోషణను, జాతి సంస్కృతిని పక్కనబెట్టి అమ్మకం జరిగే ప్రొడక్ట్‌ను తయారు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సినిమాలకు అవార్డులీయడం గురించి ఆలోచనలో
పడడంలో తప్పేమీ లేదు.
సినిమా పూర్తిస్థాయి వ్యాపారమైనట్లే, వాటికి అవార్డు లీయడం వాటి ప్రదానోత్సవాలను భారీగా నిర్వహించి తమ వ్యాపారాలను పెంచుకోవడానికి సినిమా పత్రికలు, టివి ఛానల్స్, ఇతర సంఘాలు పోటీ పడుతున్నాయి.
సినిమా అవార్డుల పండుగను టీవీ ఛానళ్లు వినోదాత్మక కార్యక్రమంగా మలిచి, ప్రేక్షకులను ఆకర్షించి, ప్రకటనల ద్వారా కోట్లు కూడబెట్టుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు కూడా నంది తదితర సినిమా అవార్డుల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదనిపిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏటేటా ఉగాది పండుగనాడు సంరంభంగా జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వెనుకబడిపోయింది. 2012, 2013 సంవత్సరాలకు చెందిన నంది బహుమతులను మార్చి 1, 2017న ప్రకటించడం, ఆ తర్వాతి సంవత్సరాలైన 2014, 2015, 2016లకు గంపగుత్తగా ఈ నెలలో అనగా ఇంకో నెల గడిస్తే 2017 దాటిపోతుందనే దుగ్దలో బయటపెట్టడం చూస్తుంటే సర్కారు వైఖరి బోధపడుతుంది, అన్యమనస్కంగా వ్యాపార చిత్రాలకు అవార్డులు ఈయడం కన్నా మా అంచనాలు తగ్గ ఎంట్రీలు రాలేదని సినిమా వర్గాలకు ప్రభుత్వం షాకులీయవచ్చు లేదా కొన్ని సంస్కరణలు చేపట్టవచ్చు. దీనివల్ల కుంటుపడుతున్న సమాంతర సినిమా పరిశ్రమను ప్రోత్సహించవచ్చు. అవార్డుల ప్రధాన ఉద్దేశ్యానికి తిరిగి ఊతమీయవచ్చు. కేవలం నాలుగయిదు అవార్డులతో ప్రారంభమైన నంది అవార్డుల పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వాలకు తలకు మించిన భారంతో పాటు పలు సమస్యలు ఎదురు కావడానికి కారణం అవార్డుల సంఖ్య పెరిగిపోవడమే. నంది అవార్డుల చరిత్రచూస్తే ఈ విషయం
అర్థమవుతుంది.
1964లో నిర్మించిన తెలుగు సినిమాలకు 1965 లో నంది అవార్డులీయడంలో దీనికి తెరలేచింది.
సాంస్కృతిక, విద్యా, సాంఘిక విలువల పెంపుకు తోడ్పడే చలన చిత్రాలకు ఈ గౌరవం దక్కాలని ఆనాటి ప్రభుత్వం సంకల్పించి వీటిని ప్రవేశపెట్టింది. కళాత్మకతతో కూడి శిల్పకళను చాటే లేపాక్షి నంది బొమ్మను పురస్కారం రూపానికి తీసుకుంది.
1965లో తొలిసారిగా ప్రవేశపెట్టినపుడు ఈ పురస్కారం కేవలం మూడు ఉత్తమ చిత్రాలకే పరిమితమైం ది. ప్రథమ ఉత్తమ చిత్రంగా డా॥చక్రవర్తి, రెండోదిగా కీలు బొమ్మలు, మూడోదిగా టెంపుల్ బెల్స్ ఎంపికయ్యాయి. ఉత్తమ నటులంటే ఇప్పుడు కేవలం హీరోలే గుర్తొస్తారు గాని సినిమాలో నటించిన అందరిలో ఎవరు ఉత్తమ నటన ప్రదర్శిస్తే వారికి ఉత్తమ నటుడిగా గౌరవం దక్కిన రోజులున్నాయి.
1978 లో వచ్చిన ‘నాలాగా ఎందరో’ కు ఉత్తమ ప్రథమ చిత్రం నంది పురస్కారమే కాకుండా నటుడు హేమసుందర్‌కు ఉత్తమనటుడి అవార్డు లభించింది. ఆ సినిమాలో హేమసుందర్ ఆడపిల్లల తండ్రిగా నటించాడు. అదే సంవత్సరం కృష్ణంరాజు హీరోగా నటించిన ‘మన ఊరి పాండవులు’ చిత్రానికి ఉత్తమ ఛాయాగ్రహణం అవార్డు వచ్చింది. అప్పుడు ఉత్తమ నటుడి ఎంపికపై ఎలాంటి వివాదం రాలేదు.
ఎంపికలో నిజాయితీ, నటన పట్ల గౌరవం వల్ల అలా సజావుగా సాగింది. అదే విధంగా 1979లో పునాదిరాళ్లు సినిమాకు ఉత్తమ తృతీయ చిత్రం అవార్డుతోపాటు అందులో నటించిన గోకిన రామారావుకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఆయన ఆ సినిమాలో హీరోకాదు.
అదే సంవత్సరం శంకరాభరణం విడుదలైంది. దానికి అయిదు నంది పురస్కారాలిచ్చినా ఉత్తమ నటుడి అవార్డు దక్కలేదు. 1981 లో పల్లె పిలిచింది అనే సినిమాలోని నటనకు గాను డా॥ఎం.ప్రభాకర్‌రెడ్డికి ఉత్తమ నటుడి గౌరవం దక్కింది. అదే సంవత్సరం ‘ప్రేమాభిషేకం’విడుదలైంది.
1980లో ‘కుక్క’ సినిమాలో నటించిన శకుంతలకు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆ ఏడే నటి సుజాత నటించిన గోరింటాకు వచ్చింది. అవార్డులను సామాజిక జీవన, సందేశాత్మక చిత్రాలకు ఇచ్చారనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. అయితే సినిమా నిర్మాణం కోట్లాది రూపాయలతో కూడుకున్నందువల్ల, చిత్ర నిర్మాణ వ్యయం పెరిగిపోతున్నందువల్ల సమాంతర సినిమాలు తగ్గిపోతున్నాయి. తక్కువ ఖర్చుతో సందేశాత్మక సినిమాలు తీసి అవార్డులతో తృప్తిపడే దర్శక, నిర్మాతలు తగ్గిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం అవార్డుల విషయంలో పునరాలోచించక తప్పదు. అయితే చిన్న సినిమాలను ప్రోత్సహించేలా ఆర్థిక సహాయంలోగాని, పురస్కారాల్లోగాని ప్రాధాన్యత ఇస్తే పరిశ్రమ వృద్ధికి తోడ్పడినట్లవుతుంది.
కాలక్రమేణా పురస్కార నందుల సంఖ్య పెంపు కూడా ఇబ్బందికరంగా తయారైందనవచ్చు. కేవలం 3 ఉత్తమ చిత్రాలకు ఈయడంలో మొదలైన నందులు ఇప్పుడు 43అయ్యాయి.
వివిధ సాంకేతిక విభాగాలకు చేర్చుతూ పోవడంతో ఇలా తయారైంది. వీటితోపాటు ఎన్‌టి.రామారావు, రఘుపతి వెంకటరత్నం, బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణిల పేరిట జాతీయ అవార్డులు కూడా ఉన్నాయి.
ఉత్తమ చిత్రానికి, ఉత్తమ పిల్లల చిత్రానికి, ఉత్తమ వినోదాత్మక చిత్రానికి, ఉత్తమ డాక్యుమెంటరీలకు మాత్రమే బంగారు నందులిస్తారు. రెండో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, విభాగాలకు వెండి నంది, మిగతా అన్నింటికి తామ్ర నందులే బహుకరిస్తారు.
1997 నుండి డబ్బింగ్ ఆర్టిస్టుకు, ఫైట్ మాస్టర్లకు, సినీ గ్రంథాలకు నందులు ఆరంభించబడ్డాయి. 1981 నుండి స్పెషల్ జ్యూరీ అవార్డు మొదలైంది. ఇలా సంఖ్య పెరగడంతోపాటు వివాదాలకు తావు పెరిగింది.
ఇక తెలంగాణ రాష్ట్రం పరిస్థితి వేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి స్థాయిలో సంఖ్యలో తెలంగాణ వారు లేరు. పరిశ్రమను తెలంగాణ కోణంలో వృద్ధిపరచవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. రకరకాల ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చి తెలంగాణ సామాజిక సినిమాను
నిలబెట్టుకోవాలి.
ఫిబ్రవరి 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాలు ప్రకటించగానే తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు పడింది. తమదీ ప్రభుత్వమే కదా తామూ అవార్డు లీయాలి గదా అన్నట్లు ఆదరబాదరాగా ‘సింహ’ అవార్డులకు తెరలేపింది. దాశరథి, కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి, పైడి జయరాజుల పేరిట వ్యక్తిగత పురస్కారాలుంటాయని వార్తలు వచ్చాయి.
జూన్ 2, 2014 నుండి డిసెంబర్ 31, 2015 వరకు వచ్చిన తెలుగు సినిమాలకు అర్హత ఉంటుందని, ఎంట్రీలకు ఫిబ్రవరి 18, 2017 చివరి తేదీ అని ప్రకటించింది. జివో 876, ఏప్రిల్ 19, 2016 ప్రకారం ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ఛైర్మన్‌గా, మరి 8 మంది మెంబర్లుగా ఎంపిక కమిటీ సిద్ధమైంది. ఆ తర్వాత దానికి సంబంధించిన వార్త బయటపడలేదు.
ఇలా మొక్కుబడిగా నిర్వహించే నందులవల్లగాని, సింహాలవల్లగాని సినీ పర్రిశమకు ఒరిగేదేం లేదు. సినిమాల్లో మానవీయ విలువల్ని, సామాజిక బాధ్యత అంశాలను ప్రోత్సహించదలచుకుంటే అవార్డులను గణనీయంగా తగ్గించి నిక్కమైన సామాజిక సినిమాను రక్షించాలి. అలాంటి సినిమాలు రాని పక్షంలో అనవసరపు భారాన్ని దింపుకోవడమే మేలు.