Home ఎడిటోరియల్ కొరియాలో శాంతి పవనాలు

కొరియాలో శాంతి పవనాలు

sampadakeyam

ఉత్తర దక్షిణ కొరియా మధ్య శాంతి పవనాలు. ఇంతలోనే ఎంత మార్పు. గత సంవత్సరం వరుసబెట్టి ఉత్తర కొరియా మిస్సిలీ ప్రయోగాలు, అణు పరీక్షలు అమెరికాను సైతం భయకంపితం చేశాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డిపిఆర్ కొరియా (ఉత్తర) ఛైర్మన్ కిం జోంగ్ అన్ మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రపంచం మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలోకి వెళుతుందా అని సర్వత్రా ఆందోళన. కాని 2018 అందుకు పూర్తి భిన్నమైన వాతావరణంతో ఉభయ కొరియాల మధ్య నవశకానికి నాంది పలికింది. ఉత్తర కొరియా ఛైర్మన్ కిం శుక్రవారంనాడు చరిత్రలో తొలిసారి అత్యంతపటిష్టమైన నిస్సైనిక మండలం గుండా సరిహద్దు దాటి దక్షిణ కొరియా భూభాగంలో అడుగుపెట్టాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ కరచాలనంతో స్వాగతం పలికారు. 63 సంవత్సరాలనాడు దేశ విభజన అనంతరం ఇదొక అద్భుతమైన సందర్భం. 195053 కొరియా యుద్ధం తదుపరి ఇరుదేశాల మధ్య తాత్కాలిక సంధి తప్ప యుద్ధ విరమణ ఒప్పందం జరగలేదు. అంటే ఉభయ కొరియాలు ఇప్పటికీ యుద్ధంలోనే ఉన్నట్లు లెక్క. నాడు కమ్యూనిజం వ్యాప్తిని నిరోధించటానికి అమెరికా సైన్యం కొరియా దక్షిణ ప్రాంతం పక్షాన రంగంలో దిగగా, రష్యా, చైనాలు ఉత్తర కొరియాకు అండగా నిలిచాయి. దక్షిణ కొరియాలో 25 వేల మందికి పైగా అమెరికన్ సైన్యం ఇప్పటికీ తిష్టవేసి ఉంది. నిరంతర ఉద్రిక్త వాతావరణంలో ఉత్తర కొరియా దుర్భేద్యమైన సైనిక శక్తిగా ఎదిగింది.
ప్రపంచాన్ని అణు యుద్ధం అంచుకు చేర్చుతున్న ఉన్మాదిగా ట్రంప్ నిందించిన ఉత్తర కొరియా మూడవ తరం నాయకుడైన కిం జోంగ్ అన్ ఆకస్మికంగా శాంతి ప్రవక్తగా మారటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదెలా సాధ్యమైంది! అమెరికా ఒత్తిడిపై భద్రతా మండలి విధించిన ఆర్థిక ఆంక్షలు కారణమా? చైనా ఒత్తిడి కారణమా? కొరియన్ ప్రజల శాంతి అభిలాష కారణమా? శాంతి కొరకు దక్షిణ కొరియా ప్రభుత్వ కృషి కారణమా? ఇవి అన్నీ లేదా కొన్ని కింను ప్రభావితం చేసి ఉండవచ్చు. దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ ఆ పేరుకు తగ్గట్లు ఉభయ కొరియాల మధ్య వేడిని చల్లబరిచాయి. వాటిలో తమ దేశం పాల్గొనటానికి, రెండు కొరియాల క్రీడాకారులు ఒకే పతాకం కింద పాల్గొనటానికీ కిం అంగీకరించటం ఇరు దేశాల మధ్య సుహృద్భావం నెలకొల్పింది. అణ్వస్త్ర కార్యక్రమం విరమణకు చైనా ఒత్తిడి, అమెరికా తరఫున దక్షిణ కొరియా రాయబారాలు పర్యవసానంగా కిం కొద్ది కాలం క్రితం అప్రకటితంగా బీజింగ్ సందర్శించి చైనా నాయకులతో చర్చలు జరిపి వెళ్లారు. ఈలోపు కిం తో నేరుగా చర్చలకు అమెరికా సిద్ధమంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ సమావేశం జూన్ జులైల్లో జరగనుంది. కిం మూన్ చరిత్రాత్మక సమావేశం అందుకు మార్గం సుగమం చేసింది.
శాంతి చర్చలు జరిగిన గ్రామం పేరుతో విడుదలైన పాన్‌ముంజోమ్ డిక్లరేషన్ దశలవారీ ఆయుధాల తగ్గింపు, శత్రు చర్యల అంతం, సైనిక పహారాలోని సరిహద్దును శాంతి మండలంగా మార్చటం, అమెరికా, చైనాలతోసహా బహుళపక్ష చర్చలను కోరటం వగైరా వాగ్దానాలు చేసింది. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చాలని అంగీకరించటం, త్రైపాక్షిక లేక బహుళ పక్ష చర్చల ద్వారా నిర్యుద్ధ సంధిని శాంతి ఒడంబడికగా మార్చి యుద్ధానికి అధికారిక ముగింపు పలకాలని అంగీకరించటం విశేషం. ‘కొరియా ద్వీపకల్పంలో ఇకపై యుద్ధం ఉండదు నూతన శాంతి శకం ప్రారంభమైంది’ అని ఇరువురు నేతలు 8 కోట్ల కొరియన్‌లకు, యావత్ ప్రపంచానికీ వాగ్దానం చేశారు. ఇరు కొరియాల నేతలు శాంతి ప్రకటనలు చేయటం ఇదే మొదటిసారి కాదు. 2000, 2007 సంవత్సరాల్లో ప్యాంగ్‌యాంగ్‌లో అగ్రనాయక సమావేశాలు జరిగాయి. నాటి ఒప్పందాలు ఆరంభంతోనే ఆగిపోయాయి. వాటిని గుర్తు చేసుకున్న ఉత్తర కొరియా నాయకుడు కిం, ‘మా మార్గంలో ఇబ్బందులు, ఎదురు దెబ్బలు ఉండవచ్చు. అయితే బాధలేకుండా విజయం సాధించలేము’ అన్నారు.
ఉభయ కొరియా నేతల శాంతి సమావేశాన్ని అమెరికా, రష్యా, చైనా, జపాన్ తదితర దేశాధినేతలు స్వాగతించారు. ‘నా మంచి మిత్రుడు, చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్ చేసిన గొప్ప సహాయాన్ని మరిచిపోవద్దు. అతని సహాయం లేకపోతే ఈ క్రమం మరింత దీర్ఘకాలం పట్టేది, కఠినంగా ఉండేది’ అన్న ట్రంప్ ట్వీట్ గమనార్హమైంది. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనాలని, అమెరికన్ సైన్యాలు వైదొలగాలని, ప్రజల్లోని పునరేకీకరణ ఆకాంక్షను నెరవేర్చేదిశగా ఉభయ రాజ్యాల నేతలు ప్రయాణించాలని ఆశించుదాం.