Home ఎడిటోరియల్ పాక్‌లో మళ్లీ ‘హం దేఖేంగే’

పాక్‌లో మళ్లీ ‘హం దేఖేంగే’

edt

పాకిస్థాన్ ఎన్నికలు అనేక విధాలుగా వివాదాస్పదమవుతున్నా యి. మిలిటరీ జోక్యం గురించి ఆరోపణలు, ఐయస్‌ఐ జోక్యం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే సంఘటనలు వీటి నేపథ్యంలో రాజకీయ నాయకత్వం ప్రజలు ఏం కోరుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా అన్నది ప్రశ్న.
ప్రఖ్యాత సంగీత కార్యక్రమం కోక్ స్టూడియో పాకిస్థాన్‌లో చాలా పేరు సంపాదించింది. కోకాకోలా పాకిస్థాన్ నిర్వహించే ఈ కార్యక్రమం కొత్త సీజను ఇప్పుడు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ప్రఖ్యాత విప్లవగీతం “హం దేఖేంగే” తో ప్రారంభమవుతోంది. సమైక్యత, ఆశ, శాంతి వంటి గొప్ప విలువలను ప్రోత్సహించే గీతమిది. ఈ పాటను 70 మంది కళాకారులు కోక్ స్టూడియోలో పాడుతున్నారు. ఈ తిరుగుబాటు గేయానికి కొత్త ప్రాణం పోస్తున్నారు. ఈ పాటను ఫైజ్ అహ్మద్ ఫైజ్ 1979లో రాశారు. ఈ పాట వెనుక ఒక చరిత్ర ఉంది. 1985లో ప్రముఖ గాయని ఇక్బాల్ బాను ఈ పాటను పాడడంలో నిరసనకు, ప్రతిఘటనకు కొత్త నిర్వచనమిచ్చింది. దాదాపు 50 వేల మంది ప్రేక్షకుల ముందు లాహోరు స్టేడియంలో ఆమె ఈ పాట పాడింది. అప్పుడు జనరల్ జియా వుల్ హక్ మిలిటరీ పాలన పాకిస్థాన్‌లో ఉంది. పాకిస్థాన్ మహిళలు కూడా భారత మహిళల మాదిరిగానే సాంప్రదాయికంగా చీరలు ధరిస్తారు. జియావుల్ హక్ ప్రభుత్వం ఇస్లామీకరణ ప్రయత్నాల్లో భాగంగా మహిళలు చీర ధరించరాదని ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షలను ధిక్కరిస్తూ ఇక్బాల్ బానూ నల్లచీర కట్టుకుని ఈ పాట పాడారు. నల్లచీర తన నిరసనను ప్రకటించే గొప్ప ఆయుధంగా వాడుకున్నారు. అంతేకాదు, జియావుల్ హక్ నిషేధించిన కవి పైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన పాటనే ఎంచుకుని మరీ పాడారు. ఆ పాట పాడవద్దని నిర్వాహకులు కోరినా ఆమె లక్ష్యపెట్టలేదు. ఫైజ్ పై జియావుల్ హక్ ఆగ్రహానికి కారణం ప్రజాస్వామికంగా ఎన్నికైన భుట్టోకు ఆయన సన్నిహితుడు కావడమే.
హం దేఖేంగే కవితను పాడిన ఇక్బాల్ బాను ఆ తర్వాత ప్రతిఘటనకు మారుపేరయ్యింది. ఇప్పుడు కోక్ స్టూడియో కొత్త సీజను, పాకిస్థాన్ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభం కాబోతోంది. ఆగస్టులో ఈ ప్రసారాలు ప్రారంభం అవుతాయి. హం దేఖేంగే పాటనే ఈ సారి మొదటి పాటగా ఎంచుకోవడంలో ఒక స్పష్టమైన సందేశాన్ని కళాకారులు పాకిస్థాన్ రాజకీయ వర్గాలకు పంపించారు. ఆధునికంగా ఈ పాటకు అవసరమైన మ్యూజిక్ ఇచ్చారు. సాంప్రదాయిక వాయిద్యాలతో పాటు పాశ్చాత్య ఆధునిక వాయిద్యాలను కూడా ఉపయోగించారు. ఈ కార్యక్రమం నిర్మాతలు అలీ హంజా, జుహైబ్ కాజీలు ఈ పాట చిత్రీకరణలో పాకిస్థాన్‌లోని వివిధ సముదాయాలన్నింటి ప్రాతినిథ్యం అందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాకిస్థాన్ లోని బహుళత్వాన్ని ప్రతిబింబించేలా చిత్రీకరిస్తున్నారు. కోక్ స్టూడియో 11వ సీజను ఇది. దేశంలోని వివిధ సంస్కృతులు, భాషల బహుళత్వాన్ని చూపించడం ద్వారా పాకిస్థాన్ ప్రజలంటే ఏమిటో, ఎక్కడ ఉన్నారో స్పష్టంగా చెప్పాలనుకున్నాం అని కార్యక్రమ నిర్మాతలు ప్రకటించారు. హం దేఖేంగే పాటను పాడే కళాకారులను పరిశీలిస్తే వారు చెప్పిన మాటల్లోని వాస్తవం కూడా అర్థమవుతుంది. సూఫీ మార్మిక గాయని ఆబిదా పర్వీన్, పాకిస్థాన్ ప్రముఖ గాయకుడు అతావుల్లా ఖాన్ ఇసాఖల్వీ, వర్ధమాన కళాకారులు రాసెల్ విక్కాజీ, ఎలిజెబత్ రాయ్, సాంప్రదాయిక భజన్ సింగర్ విష్ణు, ట్రాన్స్ జెండర్ గాయకులు లక్కీ, నగ్మా వంటి విభిన్న గాయకులు హం దేఖేంగే పాడుతున్నారు.
పాకిస్థాన్ ఏడు దశాబ్దాల చరిత్రలో సగం కాలం మిలిటరీ పాలనలోనే గడిచిపోయింది. 2013లో మొదటిసారి ప్రజాస్వామికంగా అధికారం బదిలీ అయ్యింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ అతిపెద్ద పార్టీగా అప్పుడు అవతరించింది. నవాజ్ షరీఫ్ ఎన్నడూ పూర్తికాలం అధికారంలో కొనసాగలేకపోయారు. అప్పుడు కూడా ఆయన అధికారం నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్నది పాకిస్థాన్ భవిష్యత్తును నిర్దేశించే అంశం కాదు. మిలిటరీ జోక్యం, మిలిటరీ ఒత్తిడితో పనిచేస్తున్న న్యాయవ్యవస్థ గురించి తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, స్వయంగా ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఒత్తిళ్ళ గురించి బహిరంగంగా మాట్లాడిన తర్వాత పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆలోచించవలసింది పాకిస్థాన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది. మిలిటరీ జోక్యంతో ఏర్పడే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా లేక బహుళత్వాన్ని ప్రజల ఆకాంక్షలను గౌరవించే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా అన్నది ముఖ్యం. ప్రజల అంతరంగాల్లో ప్రజాస్వామిక భావనలు బలంగా ఉన్నాయని చెప్పడానికి హం దేఖేంగే వంటి తిరుగుబాటు గీతాన్ని సరికొత్తగా పాడి వినిపించడమే నిదర్శనం. ఇప్పటికే ఎన్నికలకు ముందు హింసాకాండ పాకిస్థాన్ ఎన్నికల నిర్వహణను ప్రశ్నార్థకంలో వేసింది. 25 తేదీ ఎన్నికల పోలింగ్ నాడు హింస అపరిమితంగా చెలరేగింది. పాకిస్థాన్ తహ్రీకె ఇన్సాఫ్ పార్టీ పట్ల, ఆ పార్టీ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ పట్ల పాకిస్థాన్ మిలిటరీ మొగ్గు చూపిస్తుందన్న వార్తలు వచ్చాయి. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను అప్రతిష్ట పాలు చేసే కుట్రకు నవాజ్ షరీఫ్ కారకుడని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయితే భారతదేశంతో సంబంధాలు మరింత దిగజారవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విశ్లేషణల నేపథ్యంలో కోక్ స్టూడియో 11వ సీజనుకు సంబంధించి ప్రోమోలో హం దేఖేంగే పాటను విడుదల చేసింది. జియావుల్ హక్ నియంత పరిపాలనపై తిరుగుబాటుకు చిహ్నంగా ఈ పాట గుర్తింపు పొందిన పాట. ఈ పాటలోని పదాలు – కిరీటాలు ఎగురవేసినప్పుడు, సింహాసనాలు కూలద్రోసినప్పుడు, నేనే సత్యమన్న నినాదం వినిపిస్తుంది. అది నువ్వు నేనే, ప్రజలే రాజ్యం చేస్తారు. అది నువ్వు నేనే – అనే పదాలు అనేక విప్లవోద్యమాల్లో వినిపించిన పదాలు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం పరిహసించబడే పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ కళాకారులు ఈ పాటనే ఎంచుకుని బహుళత్వాన్ని ప్రతిబింబిస్తూ హం దేఖేంగే (మేం చూస్తాం) అంటూ పాడడం ప్రజల్లోని కొత్త ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆకాంక్షలను పాకిస్థాన్ రాజకీయ నాయకత్వం, మిలిటరీ గుర్తిస్తాయా అన్నది భవిష్యత్తే చెప్పాలి.

*  కె.ధనుంజయ