Home ఆఫ్ బీట్ ఆ సామాన్యుడు అసమాన్యుడు

ఆ సామాన్యుడు అసమాన్యుడు

life

పత్రికా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి ఉరఫ్ సివై చింతామణి జర్నలిజంలో కొత్త వెలుగునింపారు. “పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం”గా ప్రఖ్యాతిగాంచారు. విజయనగరంలో ఏప్రిల్ 10, 1880 సంవత్సరంలో జన్మించిన చింతామణి ప్రస్థానం విజయనగరం నుండి అలహాబాద్ వరకు సాగింది. ఆయన చరిత్రలో వ్యక్తిగత అంశాలులేవు. సామాజిక చరిత్ర పరచిన వెలుగునీడలే కనబడతాయి. చింతామణి తన గురించి చెప్పుకుంటూ “నేను ఎడిటర్‌ని మాత్రమే కాదు. ఫోర్‌మన్‌ని, ప్రూఫ్‌రీడర్‌ని, రిపోర్టర్‌ని, సబ్‌ఎడిటర్‌ని కూడా. నాన్నగారు రామ సోమయాజులు వేదపండితులు, విజయనగర సంస్థానంలో పని చేసేవారు. నా చేత కూడా వేదాలను చదివించాలని ఆయన ఆశించారు. ఆనాటి మహారాజు ఆనంద గజపతిరాజు మాత్రం ఆంగ్ల కళాశాలలో చదివించండి అని సలహాఇచ్చారు. అలా నాకు ఆంగ్లంతో సాన్నిహిత్యం పెరిగింది. కళాశాలలో చేరానన్న మాటేగానీ పాఠ్యవిషయాల కంటే నాటి ప్రపంచ విషయాలు, పరిణామాలపైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. నా అభిప్రాయాలను ఇంగ్లీష్‌లో రాసి స్నేహితులు, ఉపాధ్యాయులకు చూపెడుతుండేవాణ్ణి. వారు నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఆ ఉత్సాహంలో సమకాలీన రాజకీయాలపై వివిధ పత్రికలలో వ్యాసాలు రాస్తుండేవాణ్ణి. మొదటి నుంచీ చదువుకంటే ఇతర విషయాలపైనే ఆసక్తి అధికంగా ఉండేది. ఫలితంగా ఎఫ్.ఏ. పరీక్ష తన్నింది. ఒకసారి బాగా సుస్తి చేసింది.
వైద్యం చేయించడానికి విజయనగరం నుంచి విశాఖపట్నం తీసుకొచ్చారు నాన్నగారు. చింతామణి ఇక్కడ ఉంటేనే మంచిది గాడిలో పడుతాడు. చదువు మీద శ్రద్ధ పెడతాడు అని అక్కడి మిత్రులు సలహా ఇచ్చారు. బంధువులూ అదే అన్నారు. ఇందరి మాట తీసేయలేక నాన్నగారూ అలాగే అన్నారు. అలా అనుకోకుండా విశాఖపట్టణంలోనే ఉండిపోయా. చదువుకంటే ఇతర విషయాలపైనే శ్రద్ధ పెరిగిపోవడంతో బంధువుల ఆశ నెరవేరలేదు. సురేంద్రనాథ్ బెనర్జీ అంటే చెప్పరాని ఇష్టం. ఇష్టం అనడం కంటే ఆరాధన అంటే మరింత బాగుంటుంది. స్థానిక రాజకీయ నాయకులతో కలిసి తిరుగుతూ దేశ రాజకీయాల గురించి మాట్లాడేవాణ్ణి. మా మాటలు వాదనలు ఏదో పిచ్చాపాటిగాకాకుండా రాజకీయ విషయాలమీద పట్టు ఉన్న వ్యక్తిలా విశ్లేషించి మట్లాడేవాణ్ణి. దాన్ని ఆనాటి నాయకులు కూడా ప్రశంసించేవారు. వైజాగ్‌లో స్పెక్టేటర్ పత్రికకు విస్తృతంగా వ్యాసాలు రాశాను. నా రచనా ధోరణి నచ్చి ఆ పత్రికవారు ఎడిటర్‌గా నియమించారు. అప్పటికి నా వయసు 18 సంవత్సరాలే! ఆ రోజు ల్లో నా నెలజీతం 30 రూపాయలు. ఆ రోజుల్లో అది మహా గొప్ప జీతం. కొంత కాలానికి వైజాగ్ స్పెక్టేటర్‌ను యాజమాన్యం అమ్మేస్తోందని తెలిసి 300 రూపాయలిచ్చి తీసుకున్నాను. ఆ పత్రికను నాతోపాటే విజయనగరానికి తీసుకెళ్లాను. పాతపేరు మార్చేసి ఇండియన్ హెరాల్డ్ అని పెట్టాను. నా పత్రికకు మంచి పేరు, గుర్తింపు పాఠకుల ఆదరణ వచ్చింది. కానీ వాటిని ఆర్థిక సమస్యలు మింగేశాయి. ఫలితంగా ఇండియన్ హెరాల్డ్ పత్రిక 2 సంవత్సరాల్లోనే మూతపడింది. బతుకుతెరువు వెతుక్కుంటూ మద్రాస్‌లో జి.సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆధ్వర్యంలో వెలువడుతున్న మద్రాస్ స్టాండర్డ్ పత్రికలో చేరాను. కొంతకాలం తరువాత అలహాబాద్ వెళ్లి ఇండియన్ ఫ్యూచర్ పత్రికలో చేరాను. అక్కడి నుంచి మోతీలాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవ్య సారథ్యంలోని లీడర్ పత్రికకు ఎడిటర్‌గా పనిచేసే అవకాశం లభించింది. అప్పుడే నా కెరీర్ అనూహ్య మలుపు తిరిగింది. నా రచనల కోసం ఎదురుచూసి చదివే పాఠకులు పెరిగారు. ఆ విధంగా నా రచన లీడర్ పత్రిక ఎదుగుదలకు సాయపడింది. ఒక దశలో అభిమానులు లీడర్ చింతమణి అని పిలిచేవారు. ఆ నాటి పొలిటికల్ ఫైట్‌లో మా పత్రిక ఒక పదునైన ఆయుధంగా మారింది. ఆనాటి రాజకీయ పరిణామాలు అందరిలోలాగే నాలోనూ ఎంతో ఆవేశాన్ని రగలించేవి. అది అక్షరాలలోకి దూకేది. కిర్రెక్కించే ఆ సంపాదకీయాలు అందరిలో నిప్పు దట్టించినట్లుగా ఉన్నాయనేవారు. భయాలు, మొహమాటాలు నాకు మొదటి నుంచీ లేవు. కనుక నా అక్షరాలు కూడా నిజాలు కక్కడానికి మొహమాటపడలేదు. ఆవేశానికి నిర్మాణాత్మకమైన విమర్శను కూడా జతచేసే వాణ్ణి. అందువల్ల నా సంపాదకీయాలలోనూ, ఇతర రచనలలోనూ సమకాలీన రాజకీయాలతోపాటే సామాజిక స్పృహ ప్రతిఫలించే అంశాలు కూడా ఉండేవి. అందుకని మనవాళ్లేకాక బ్రిటిష్‌వారు కూడా ఆ సంపాదకీయాలను
ఆసక్తిగా చదివేవారు. 3 దశాబ్దాలపాటు లీడర్ సంపాదకునిగా పనిచేసి ప్రజల మన్నన పొందడం నా అదృష్టం. పండితులు, పామరులు, మేధావులు, విద్యాధికులు అన్ని వర్గాల వారు నా సంపాదకీయాలు చదివి స్పందించేవారు” అని అంటారు చింతామణి. డైనమిక్ ఎడిటర్‌గాపేరు తెచ్చుకున్న చింతామణి పత్రికారంగంలోనేకాక, జాతీయ రాజకీయ నాయకుల సరసన మితవాద నాయక ప్రముఖుడిగా ఖ్యాతి గడించారు. మన అపూర్వ చింతామణి జులై 1, 1941లో దివంగతులయ్యారు.