Home ఎడిటోరియల్ రూపాయి పతనం

రూపాయి పతనం

Article about Modi china tour

అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ కనీవినీ సాయికి పడిపోయింది. మరింతగా దిగజారే సూచనలు కనుపిస్తున్నాయి. బుధవారం నాడు డాలర్‌తో మన కరెన్సీ మారకం రేటు 73 రూపాయలు దాటిపోయింది. మన దిగుమతుల ఖర్చు ఆ మేరకు ఆకాశాన్నంటి అవసరాల కోసం పెట్టే వ్యయం విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. అది మన కరెంట్ అక్కౌంట్ (ఆదాయ వ్యయ ఖాతా) లోటును కూడా పెంచేస్తుంది. ఇది నిస్సందేహంగా మన ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి చావుదెబ్బ వంటిది. దీని పర్యవసానంగా స్టాక్ మార్కెట్ సూచీ భారీ పతనాన్ని చవిచూస్తున్నది. గురువారం నాడు బొంబాయి స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఒక్కసారిగా 806.47 పాయింట్లు పడిపోయింది. ఇది సెన్సెక్స్ చరిత్రలోనే మరో భారీ పతనమంటున్నారు. బుధవారం నాడు రికార్డయిన 501 పాయింట్ల దిగజారుడుతో కలుపుకొంటే ఈ రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్ తిన్న దెబ్బ అత్యంత తీవ్రమైనదని భావించకతప్పదు. డాలరుతో మన కరెన్సీ విలువ గురువారం నాడు రూ. 73.61కి ఘోరంగా పతనం కావడం వల్లనే స్టాక్ మార్కెట్ ఇంత దారుణంగా దెబ్బతిన్నదని నిపుణులు చెబుతున్నది వాస్తవం. రూపాయి మారకం విలువ పడిపోయి దిగుమతులు ఖర్చు పెరిగిపోవడంతో మన లోటు పాతాళాన్ని తాకి సెన్సెక్స్ కుంగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర భారీ పెరుగుదలే దీనికి ప్రధాన కారణం.
ఒకప్పుడు బ్యారెల్ 30 డాలర్లకు పడిపోయిన క్రూడాయిల్ ధర ఇప్పుడు మళ్లీ పెరిగిపెరిగి 85 డాలర్లు దాటిపోయింది. మనం 80 శాతం పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటున్నాము. పెట్రోల్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల వరుసలో అమెరికా, చైనాల తర్వాత మనది మూడవది. క్రూడాయిల్‌ను అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుక్కోవలసింది డాలర్లలోనే కాబట్టి పెరుగుతున్న చమురు ధరతో పాటు మన డాలర్ల అవసరం కూడా ఎగబాకిపోయింది. ఈ ప్రధాన కారణంతోపాటు ఇంకా మరికొన్ని పరిణామాల వల్ల రూపాయి మారకం విలువ నానాటికీ దిగజారిపోతోంది.
ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డాలరుతో రూపాయి విలువ 58 రూపాయల 66 పైసలుండగా ఇప్పుడది రూ. 73.61కి చేరుకున్నది. ఈ పతన దిశ దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగా పీల్చిపిప్పి చేస్తున్నదో చెప్పనలవి కాదు. రూపాయి పతనం ఎగుమతిదార్లకు మేలు చేస్తుంది. దిగుమతిదార్ల జేబులు ఖాళీ చేస్తుంది. ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), జౌళి తదితర ఎగుమతి ప్రధానమైన రంగాలకు డాలర్లు వచ్చిపడి రూపాయిల్లో వాటి సంపద పెరుగుతుంది. దిగుమతి చేసుకునే భారీ మౌలిక పరికరాల రంగం దెబ్బతింటుంది. ఇప్పటికే నీరసించిన వజ్రాలు, నగల వంటి రంగాలు మరింత కుంగిపోతాయి.
రూపాయి పతనంతోబాటు అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లు పెంచడం వల్ల కూడా మన స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిపోతాయి. పర్యవసానంగా మన డాలరు నిల్వలు ఆ మేరకు తరుగుతాయి. అమెరికా బ్యాంకు ఈ ఏడాది రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచింది. డాలరుతో రూపాయి విలువ పడిపోయినప్పుడల్లా రిజర్వు బ్యాంకు కలుగజేసుకుని తన వద్ద గల విదేశీ మారక కరెన్సీ నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేయడం ఆనవాయితీ. దానితో మార్కెట్‌లో డాలరు లభ్యత పెరిగి రూపాయి మీద దాని దాష్టీకం పరిమితమవుతుంది. ఈసారి కూడా ఆర్‌బిఐ కలుగజేసుకున్నది కానీ దాని ప్రభావం పరిమితమేనని నిపుణులు అంటున్నారు.
డాలరుతో రూపాయి విలువ పతనం కొనసాగుతున్న కొద్దీ దేశంలో అన్ని సరకుల, సేవల ధరలు విజృంభించడం సహజం. దానితో మార్కెట్‌లో డబ్బు రాకడ పెరిగి ద్రవ్యోల్బణం పేట్రేగుతుంది. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెబుతున్నారు. కానీ చిల్లర మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగిపోయి ద్రవ్యోల్బణం పైకి జరగడానికే ఆస్కారం ఎక్కువ. ఇటువంటప్పుడు రిజర్వు బ్యాంకు ఆర్థిక విధానంలో కాఠిన్యాన్ని చూపుతుంది. అంటే బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుంది. అది డబ్బు లభ్యతను పరిమితం చేసి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుందన్నది ఆర్థిక సూత్రం. రూపాయి అసాధారణపతనం నేపథ్యంలో ఆర్‌బిఐ భేటీలో వడ్డీ రేట్లు పెంచడం ఖాయమన్నది ఆర్థిక నిపుణుల జోస్యం. డాలరుతో రూపాయి నిరంతరాయ దయనీయ స్థితికి గట్టి విరుగుడు దిగుమతులపై ఆధారపడే స్థితిని తగ్గించడం, మన సరకుల నాణ్యతను పెంచడం ద్వారా ఎగుమతులను మెరుగుపర్చుకోవడం. దీంతోబాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను విశేషంగా ఆకర్షించుకోవడం కూడా రూపాయి బలపడడానికి దోహదం చేస్తుంది. ఈ వైపు ఎంత వడిగా అడుగులుపడితే అంతగా మన రూపాయి కోలుకొని దాని విశ్వసనీయత పుంజుకుంటుంది.