Home ఎడిటోరియల్ కొన ఊపిరిలో సెక్యులరిజం

కొన ఊపిరిలో సెక్యులరిజం

edit

రాజకీయాలు గొంతు నొక్కుతుంటే సెక్యులరిజం ( మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం) సూత్రం దేశంలో ఊపిరాడక గిలగిలలా డుతోంది. సెక్యులరిజం వ్యవస్థపై అధికారంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేరుగా విరుచుకుపడుతోంది. ‘పౌరులపై ఆడిన పెద్ద అబద్ధం’ అని సెక్యులరిజాన్ని ఆ పార్టీ ఇటీవల కొంత కాలంగా విమర్శిస్తోంది. కాంగ్రెస్ సుతిమెత్తని హిందూత్వ వైఖరిని అవలంబిస్తే, బిజెపి కఠిన హిందూత్వను చలాయిస్తోంది. మొత్తానికి రెండు పార్టీలూ తమ మత దృష్టితో సెక్యులరిజానికి శక్తివంచన లేకుండా హాని కలిగించాయి. బాబ్రీ మసీదు కేసును సుప్రీంకోర్టు విచారించిన ఐదు రోజులకు ‘రామరాజ్య రథయాత్ర’ అయోధ్య నుంచి రామేశ్వరానికి మొదలయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రజల మద్దతు కూడగట్టే లక్షంతో, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో ఆ యాత్ర మొదలయింది.
హజ్ యాత్రకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినా, హిందూ ప్రార్థనా స్థలాలకు సబ్సిడీలు మాత్రం కొనసాగుతున్నాయి. ‘మైనారిటీలను బుజ్జగించడం నిలిపివేస్తేనే వారి నిజమైన అభివృద్ధి సాధ్యం’ అని సాకు చూపుతూ హజ్ యాత్రకు సబ్సిడీలను నిలిపివేశారు. ఇందుకు సమర్థనగా రాజ్యాంగంలోని 27వ అధికరణను చూపుతున్నారు. పన్నుల సొమ్మును మతాలకు మళ్లించడం సెక్యులరిజానికి విరుద్ధమని ఆ అధికరణ పేర్కొంది. దివాళీ రోజున ఆగ్రాలో భగవాన్ రాముడు సీతా దేవి ఆహ్వానానికి రూ. 165 కోట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి ఈ అధికరణ అడ్డు రాలేదు!
2002 అల్లర్లలో గుజరాత్‌లో కూల్చివేసిన ప్రార్థనా స్థలాలు (చాలా వరకు ముస్లింలవి) తిరిగి నిర్మించడం కూడదని, ప్రభుత్వం మతం వేర్వేరు కనుక వాటి పునర్నిర్మాణం వద్దని సుప్రీంకోర్టులో గుజరాత్ ప్రభుత్వం వాదించింది. అయితే ఆ కేసులో తీర్పు వెలువడిన నెల రోజులకు ప్రధాని మోడీ మాట మార్చారు. 2013 వరదలలో దెబ్బతిన్న కేదార్‌నాథ్ ఆలయాన్ని పునర్నిర్మించాలన్న తన విజ్ఞప్తిని యుపిఎ ప్రభుత్వం పట్టించుకోలేదని మోడీ విమర్శించారు. సరయూ నది ఒడ్డున వంద మీటర్ల ఎత్తు రాముడి విగ్రహాన్ని నిర్మిస్తానని యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రతిజ్ఞ చేశారు. దీనిని బట్టి బిజెపి వాదనలోని వక్రీకరణ స్పష్టమవుతోంది. మైనారిటీ వర్గం ప్రార్థనా స్థలాల పునర్నిర్మాణం సెక్యులరిజం ‘లక్ష్మణ రేఖ’ కు విరుద్ధం. కానీ దివాళీ ఉత్సవాలకు హిందూ దేవుళ్లపై రూ. 165 కోట్లు ఖర్చు చేయడం మాత్రం విరుద్ధం కాదు.
ఇటీవల కొంత కాలంగా సెక్యులరిజంపై నేరుగా, బాహాటంగా బిజెపి నాయకులు విరుచుకుపడడం ఎక్కువయింది. ‘పౌరులపై విసిరిన అతిపెద్ద అబద్ధం సెక్యులరిజం’ అని ఆదిత్య నాథ్ వ్యాఖ్యానించారు. ‘రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగిస్తాం’ అని కేంద్ర మంత్రి అనంత హెగ్డే ఇటీవల ప్రకటించారు. రాజకీయ చర్చల్లో సెక్యులరిజం పట్ల నిబద్ధత అనేదే ప్రస్తావనకు రావడం లేదు. ఎవరి నిర్వచనాలు ఎలా ఉన్నా సెక్యులరిజం అన్నది ‘సహింపు’ సూత్రమే తప్ప ‘ఉత్సవ’ సూత్రం కాదు. భిన్న మతాలను దృష్టిలో పెట్టుకొని ఆచరించేది. భిన్నత్వాన్ని కాపాడడానికి అనుసరించే ‘వ్యూహం’ అది. చివరకు దానిని ‘కృత్రిమ అవయవం’గా దిగజార్చారు. భారత దేశపు రాజ్యాంగ స్ఫూర్తికి సెక్యులరిజం ఆధారం. దాని గుర్తింపు కూడా సెక్యులరిజంతో ముడిపడి ఉంది. రాజ్యాంగ మూల సూత్రం కూడా అదే. సమూహాల మధ్య సమానత్వాన్ని ఆచరించి చూపేదే ‘సెక్యులరిజం’. ఆ మూల సూత్రంపై ఎన్నో దాడులు సాగుతున్నా సుప్రీంకోర్టు భరింపరాని మౌనాన్ని ప్రదర్శిస్తోంది. మెజారిటీ వాదుల క్రూరత్వం నుండి రక్షించే ఏకైక వ్యవస్థ సుప్రీంకోర్టు. ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం అత్యంత తక్కువగా ఉండడం భారత దేశంలో ముందు నుంచి వస్తున్న మంచి ఆనవాయితీ. జోక్యం చేసుకోవాల్సి వచ్చిన సందర్భాల్లో సూత్ర బద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మన రాజ్యాంగం నిర్దేశిస్తున్న సూత్రాలను మరిచి సెక్యులరిజంపై ఇటీవల వ్యాఖ్యలు తరచూ వినవస్తున్నాయి. సాంస్కృతిక భిన్నత్వం మధ్య ఏకత్వం పాటించడమే సెర్యులరిజం మూల సూత్రం.
మెజారిటీ వాదానికి కళ్లెం వేయడమే సెక్యులరిజాన్ని రక్షించే మార్గం. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ సెక్యులరిజంపై జరుగుతున్న దాడుల పట్ల ‘దారిన పోయే దానయ్య’ తరహాలో వ్యవహరిస్తోంది. ఎన్నికల తరుణంలో మతపరమైన హామీలు గుప్పించడం అవినీతి కిందకు వస్తుందని 1951 ప్రజా ప్రాతినిథ్య చట్టం నిర్దేశిస్తున్నదని, దానివల్ల అనర్హత సంప్రాప్తిస్తుందని ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ‘అభిరామ్ సింగ్ కొమ్మాచెన్ కేసు’లో పేర్కొంది. ఈ తీర్పు వెలువడినప్పటికీ మత పరంగా ఓటర్లను రెచ్చగొట్టిన కేసులో ఒక్క రాజకీయ వేత్తకూడా ఇంతవరకు అరెస్టు కాలేదు. మైనారిటీలందరినీ పాకిస్థానీ మద్దతుదార్లుగా పేర్కొంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేసినా ఒక్క నాయకుడు కూడా అరెస్టు కాలేదు. ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో స్వయంగా ప్రధాని మోడీ పాకిస్థాన్‌పై, ముస్లింలపై విషం కక్కారు.
బిజెపి ఎంపిలు కూడా తమ ప్రసంగాల్లో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు బాహాటంగా చేశారు. అయినా వారిపై చర్యల ఊసు లేనే లేదు. మతసహనంపై నేరుగా దాడులు జరిగాయి. సుప్రీంకోర్టు బెంచ్ అభిరామ్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును ఇటువంటి సందర్భాల్లో కఠినంగా అమలు పర్చాలి. 2016లో ఈ తీర్పు వెలువడింది. హిందూత్వను ఒక మతంగా కాకుండా ఒక జీవిత విధానంగా రమేష్ యశ్వంత్ కాశీనాథ్ కుంటే మధ్య నడిచిన కేసులో పేర్కొనడం ద్వారా హిందూ మతం సెక్యులరిజానికి అనుగుణమైనదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జెఎస్ వర్మ చెప్పారు. దీనితో హిందువులను సంబోధిస్తూ నేరుగా వ్యాఖ్యలు చేయడం సక్రమమే అని చాటినట్లు అయింది. ‘దారిన పోయే దానయ్య’ లా వ్యవహరించడం అంటే ఇదే.
సమాజంలోని కొన్ని వర్గాలపట్ల వివక్ష పాటించడం ఎటువంటి పరిస్థితులను సమర్ధించదగ్గది కాదు. అలా చేస్తే మైనారిటీలపట్ల పద్ధతి ప్రకారం చూపే వివక్షలను సమర్ధింంచడమే అవుతుంది. 2002లో గుజరాత్‌లో ధ్వంసమయిన ప్రార్థనాలయాల పునర్నిర్మాణాన్ని గట్టిగా వ్యతిరేకించిన ప్రభుత్వం కేదార్ నాథ్ ఆలయం పునర్నిర్మాణానికి పట్టుబట్టడం ఏమిటని అడగడం ద్వారా సెక్యులరిజాన్ని కాపాడే ప్రయత్నం కోర్టులు, సమాజం ప్రారంభించాలి. రాజకీయాల్లో రెండు నాల్కల ధోరణిని ప్రశ్నించాలి. కోర్టులు సెక్యులరిజం రక్షణకు దృఢంగా అడుగు వేయనిదే మౌలిక సూత్రమైన సమానత్వానికి ప్రమాదం తప్పదు. సెక్యులరిజం అన్నది శిలువ మోయడం వంటి కాదు. అది ఒక నగను ధరించడం వంటిది. సుప్రీంకోర్టు ఆ నగ పరిరక్షణకు పూనుకోవాలి. ఇది న్యాయ నిపుణుల డిమాండ్.