Home కలం శరత్కాల చంద్రుడు శరత్

శరత్కాల చంద్రుడు శరత్

km

మోతీలాల్ ఛటోపాధ్యాయ్, భువన్మోహిని పేద దంపతులకు, బెంగాల్ హుగ్లీ జిల్లాలోని మారుమూల గ్రామం దేవానందపూర్ లో 15 సెప్టెంబర్ 1876 న జన్మించిన, శరత్ చంద్ర జీవితం చాలావరకు కష్టాలమయం. అయిదుగురు పిల్లల తండ్రిగా ఏ విధమైన బాధ్యతలు తీసుకోకుండా, కేవలం కలల ప్రపంచంలో జీవిస్తూ, సోమరిగా జీవితాన్ని వెళ్లదీస్తున్న తండ్రి మూలంగా, బాల్యం అంతా బీహార్ భాగల్పూర్ లోని మాతామహుడు కేదార్నాథ్ గంగోపాధ్యాయ్ ఇంటిలోనే గడపాల్సి వచ్చింది. ఎక్కడా కుదురుగా ఉద్యోగం చేయని తండ్రి, అక్కడ కూడా కొంత కాలం చిన్నపాటి ఉద్యోగం చేసాడు. అయితే తండ్రి లోని కల్పనా శక్తి, సాహిత్యం పట్ల ఆసక్తి, అతని సాహిత్యానికి బలమైన పునాదులు వేసాయి. స్థిరత్వం లేని తండ్రి, కష్టతరమైన ఆర్ధిక పరిస్థితుల మూలంగా పదేపదే పాఠశాలలు మారాల్సి వచ్చేది. -విద్యార్థిగా సూక్ష్మబుద్ధి తెలివితేటలు కనపర్చేవాడు కాబట్టి ఉపాధ్యాయులు అతని ఆకతాయి తనాన్ని అంతగా పట్టించుకునే వారు కాదు. ఎక్కువ కొంటెపిల్లలతొనే స్నేహాలుండేవి. పొలాల్లోను పళ్లతోటల్లోనూ ఏవరికీ తెలియకుండా ఫలసాయాల్ని దొంగిలించి నిరుపేదలకు పంచేవాళ్లు. అదే సమయంలో, అంతే కొంటెపిల్ల అయిన ధీరూ కు దగ్గరయాడు. ఆ అమ్మాయిని చివరివరకూ మరచిపోలేక పోయాడు. అది శ్రీకాంత్ నవలలో ప్రగాఢంగా కనిపిస్తుంది. ఎంత బడిదొంగ అయినా, పరీక్షల్లో చాలా మంచి మార్కులతో పాసయ్యేవాడు. అతని తెలివితేటలకు మురిసి రెండు క్లాసులు ముందుకు కూడా ఒకసారి అనుమతించారు.
తల్లీతండ్రీ తానే అయి, ఇంటందరినీ ఎంతో ఓపికగా తల్లే చూసుకుంది. అయిదుగురు పిల్లల్ని, ఏ పనీ చేయని భర్తని ఏ తగాదా లేకుండా చూసుకోవడంలో ఆమె ఆరోగ్యం పాడయి 1895లో ఆమె కన్నుమూసింది. అప్పటికి శరత్ కు 19ఏళ్లు. పిల్లలంతా చెట్టుకొకరులా ఇతర కుటుంబ సభ్యులవద్ద ఉండాల్సి వచ్చింది. చదువు మానుకుని దేవానందపూర్ లోని తండ్రి ఇంటికి తండ్రితో బాటు శరత్, వేదనందా సోదరుడు బేలూరు మఠం లోకి చెదిరిపోయారు. చేసిన అప్పు తీర్చేందుకు కొన్నాళ్లకు తామున్న ఇంటిని సైతం తండ్రి 225 రూపాయలకి ఎవరికో అమ్మేయడంతో, మళ్లీ తండ్రితో బాటు భాగల్పూర్ కు తిరిగి రావల్సి వచ్చింది. అడపాదడపా అయినా దాదాపు 20 ఏళ్లు భాగల్పూర్ లోనే ఎక్కువ జీవితం గడిపాడు. అతని నవలలలోని అనేక భాగాలు అక్కడ రాసినవి, లేదా అక్కడి అనుభవాలతో రాసినవే.
యువకుడైన శరత్ అత్యంత దుర్బలుడు సున్నిత మనస్కుడు కావడంతో తండ్రితో అభిప్రాయ భేదాల మూలంగా ఇంటిని వదిలి బతుకుతెరువు కోసం ఊరూరా తిరిగాడు. 1900 సంవత్సరంలో బీహార్ బనాలీ ఎస్టేట్ లోను, తరువాత సంథాల్ జిల్లా సెటిల్మెంటు ఆఫీసర్ దగ్గర సహాయకుడుగాను పని చేసాడు. కొన్నాళకు అవి కూడా నచ్చక ఆ ఉద్యోగాల్ని వదిలేసి, ఒంటరిగా, అనాసక్తిగా ఏదో తెలియని దుఃఖంతో, ఏమి చేయాలో తెలియక దిశారహితంగా తిరుగుతూ, అర్ధరాత్రులు స్మశానాల్లో సైతం సంచరించేవాడు. తరువాత కొన్నాళ్లకు నాగా సాధువుల గుంపులో చేరి 1902 ప్రాంతంలో ముజఫర్‌పూర్ కు కొట్టుకుపోయాడు. అయితే తండ్రి మరణవార్త తెలిసి భాగల్పూర్ కు వచ్చి తండ్రి చివరి సంస్కారాలు పూర్తయాక ఉద్యోగం వెతుక్కుందుకు కలకత్తా కి వెళ్లాడు. కొన్ని తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుంటూ ఒక హిందీ వార్తా పత్రికలో అనువాదకుడిగా నెలకు 30 రూపాయల జీతానికి కుదిరాడు. అక్కడా ఉండలేక కలకత్తా హైకోర్టులో అనువాదకుడుగా చేరాడు. తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయాక ఎన్నాళ్లో కలకత్తాలోనూ ఉండలేక 1903లో బెంగాల్ వదిలి రంగూన్ లోని మేనమామ ఇంటికి 27 ఏళ్ల ప్రాయంలో చేరాడు. ఉద్యోగాల వేట అక్కడే చేసుకుందామనుకున్నాడు. బెంగాల్ లోని మధ్య తరగతి బెంగాలీలకు ఆ దేశం ఒక కర్మస్థానమని, బెంగాల్ జన్మస్థానమని తరచు చెప్పుకునేవాడు. కలకత్తాలో ప్లేగు వ్యాధి ప్రబలకముందే శరత్ రంగూన్ చేరినా, కొన్నాళ్లకు తన మేనమామ న్యుమోనియా వ్యాధితో మరణించడంతో అక్కడ కూడా అనాథ అయాడు. ఆ అభద్రతలో మళ్లీ వీధుల్లో పడక తప్పలేదు. కొన్ని తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుంటూ, బర్మా రైల్వే అక్కౌంట్సు విభాగంలో శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగంలో చేరి కలకత్తాకి 1916 లో తిరిగి వచ్చేవరకూ అందులోనే పనిచేసాడు.
బర్మాలో శరత్ గడిపిన సమయం అతని జీవితంలో ముఖ్యమైన దశగానే చెప్పుకోవాలి. అతని సాహిత్య జీవితాన్ని తిరిగి బ్రతికించింది. ఒక ప్రముఖ సృజనాత్మక రచయితగా మారేందుకు దోహదం చేసింది. 1916లో తిరిగి కలకత్తా చేరుకునే సరికే అతని కథలు అనేకం ప్రచురించ బడ్డాయి, అతని నవలలు చాలా పత్రికలలో ధారావాహికంగా రావడం మొదలయింది. అతని ప్రజాదరణ ఆకాశం అంత ఎత్తుకుపోయింది. కానీ స్వీయ జీవితంలో కోలుకోలేని కష్టాలు మాత్రం తప్పలేదు. 1906లో తాను ఏరికోరి వివాహమాడిన భార్య శాంతిదేవి 1908 లోనే ప్లేగు వ్యాధితో, ఒక ఏడాది కొడుకుతో బాటు మరణించింది. అది మరచిపోయేందుకు అనేక పుస్తకాలు – సామాజిక శాస్త్రం, చరిత్ర, తత్త్వశాస్త్రం, మనస్తత్త్వ శాస్త్రం లాంటివాటిని సైతం వదలకుండా పిచ్చిగా చదివాడు. హోమియో లో వేలుపెట్టాడు, ఒక ప్రాధమిక పాఠశాల తెరిచాడు, పాటల బృందాన్ని ఏర్పర్చుకున్నాడు. ఈ ప్రాకులాటల్లో 1909లో ఆరోగ్యం బాగా క్షీణించింది. దానితో చిత్రకళమీద కు మళ్లాడు. 1910లో మోక్షదా అన్న వితంతు యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఆమె పేరు హిరణ్మయిగా మార్చాడు. ఆమెకు చదవడం రాయడం నేర్పాడు. శరత్ మరణాంతరం మరో 23ఏళ్ల వరకూ ఆమె బ్రతికుంది.
వయస్సులో ఎంతో పెద్దవాడైనా, బంకించంద్ర తో, శరత్ కు అనేక సామ్యాలు కనిపిస్తాయి. ఇరువురూ మధ్యతరగతి నుండి వచ్చినవారు. హిందూ మతం సమాజం మీద దృక్పధాలు ఒకటే. ఇద్దరూ హిందూ సమాజాన్ని శుభ్రపరచాలనుకున్న వారే. ఇద్దరూ ఉగ్రమైన దేశభక్తులే. శరత్ తొలి రచనల్లో బంకించంద్ర చటర్జీ ప్రభావం స్పష్టంగా ఉంటుంది. దానికి కారణాన్ని ఆయనే ఇలా చెప్పుకున్నాడు. ‘నేను బంకిం బాబుని ఎంతగా చదివి ఆరాధించానంటే, అతని సాహిత్యం కంటే గొప్ప సాహిత్యం మరెక్కడా ఉండే ఉండదు అనుకునేటంతగా. అతని నవలల్ని అదే పనిగా చదివాను కంఠతా వచ్చేటంతగా. అది నా బలహీనతగా మారింది. అయితే నా రచనల్లో వారిని గుడ్డిగా అనుసరించలేదు. అది నాకు ఒక ప్రయోజనకారి ఉపవృత్తిగా మాత్రమే పనికొచ్చింది.’
అప్పటి శరత్ రచనలు మౌలిక హిందూ ఛాందసత్వం మీద, అప్పుడున్న సామాజిక స్థితిగతులమీద అతని అసంతృప్తిని తెలియజేస్తాయి. సామాజిక విచక్షణ మీద, మూఢనమ్మకాలమీద, మతం పేరుమీద మతాంధత మీద అతని అసహనం క్రోధం అతని రచనల్లో ఎక్కడా దాచుకోలేదు. అయితే అవి కఠినంగానో ద్వేషపూరితంగానో వెక్కిరింతలగానో విమర్శిస్తున్నట్టుగా లేకుండా చూసుకున్నారు. దేవదాసు, పరిణిత, బిరాజ్ బహు, పల్లి సమాజ్ లాంటివి ఈ కోవకు చెందినవే. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అద్భుతంగా అందరి హృదయాల్లో స్థానం పొందిన దేవదాసు నవల శరత్ కి ఏ మాత్రం నచ్చలేదు. అందులో దేవదాసు పలాయన ప్రతికూల గుణం అతనే సమ్మతించలేకపోయాడు. అందుకని పదహారేళ్ల వరకూ దానిని ప్రచురించడానికి కూడా ఒప్పుకోలేదు. 1917లో అది ప్రచురించబడ్డప్పుడు దేవదాసుని క్షమించి జాలిపడమని పాఠకుల్ని సైతం వేడుకున్నాడు. 30కి పైగా నవలలు , డజన్లకొద్దీ కథలు, నాటకాలు, వ్యాసాలు రాసాడు. సమాజంలోని దుష్కర్మలు, మూఢనమ్మకాలు, అణచివేతలు అతని తొలి రచనల్లో ఎక్కువగా కనిపిస్తాయి. తరువాతి రచనల్లో అతని సమయంలోని మాతృదేశాభిమానం ఎదిరించే గుణం ఉన్న రచనలకు ప్రాధాన్యం కనిపిస్తుంది. చార్లెస్ డికిన్స్ లా రచనలమీద జీవనోపాధికోసం ఆధారపడ్డా, శరత్ సృష్టించిన పాత్రలు సంప్రదాయం, సామాజిక మార్పుకీ మధ్య, మూఢనమ్మకాలు తిరుగుబాటుకీ మధ్య, పవిత్రతకి అపవిత్రతకీ మధ్య సంఘర్షణల్లో జీవిస్తాయి. శరత్ తన రచనల్లో తీర్పు చెప్పడు. అది కేవలం ఒక సందేశంలా వదులుతాడు. ఎప్పుడూ అది జాబితా కాదు. తమ గురించి తామే మాట్లాడుకుంటాయి అతని పాత్రలు. హిందూ సమాజంలోని రుగ్మతల్ని ఆలోచింపజేస్తాయి. మానవత్వాన్ని భ్రష్టుపట్టించి నీచ స్థితిలోకి తోసిన, అణచిపేతకు గురైన వారి పట్ల సామాజికస్పృహని పెంచి, సానుభూతితో సమాజం మీద తిరగబడాలన్న కోరికని రగిలిస్తాయి. బంకించంద్ర తరువాత శరత్ ని ఎక్కువ ప్రభావితం చేసింది రవీంద్రుడే. అతనికి తాను ఏకలవ్య శిష్యుడు గా చెప్పుకున్నాడు. రవీంద్రుని భాష, అభివ్యక్తి అతన్ని వెంటాడేవి. అయితే రవీంద్రుని గాని, బంకించంద్రని గాని, శరత్ ఎప్పుడూ కలుసుకోలేదు. మారుపేరుతో వస్తున్న శరత్ రచనలు, రవీంద్రునివే అని పాఠకులు కొన్నాళ్లు భ్రమ పడ్డారు. రవీంద్రుడు ఆ రచనలు నావి కావు అని చెప్పుకున్నా నమ్మని పరిస్థితి. శరత్ పేరుమీదే అ తరువాత రచనలు వచ్చిన దరిమిలా ఆ స్థితి నుండి పాఠకులు బయటపడ్డారు.
ఒక వంద సంవత్సరాల వ్యవధిలో బెంగాల్ సాహిత్యాకాశంలో ఖగోళ కాపలాదారులుగా , వంగిన చంద్రుడు – బంకించంద్రుడని , రాజరిక సూర్యుడు – రవీంద్రుడని, శరత్కాల చంద్రుడు – శరత్ చంద్రుడని భావిస్తారు. బంకించంద్ర కంటే రవీంద్రుడు, రవీంద్రుడు కంటే శరత్ చిన్నవాడు. బంకించంద్ర, రవీంద్రుడు పండితులు, విద్యావంతులు, మేధావులు, తత్వవేత్తలు. వారిద్దరూ కవులుకూడా. శరత్ లేనివి ఉన్నట్టు నటించ లేదు. తట్టుకోలేనంత బీదరికం నుండి బయటకొచ్చిన వాడు. అతని పరిమితులు బాగా ఎరిగి ఎప్పటికప్పుడు వాటిని గుర్తుంచుకున్నవాడు. కేన్సర్ మూలంగా శరత్ చంద్ర చటర్జీ 16 జనవరి 1938లో కలకత్తా పార్క్ నర్సింగ్ హోం లో కన్ను మూసారు. అతని ఆత్మకథ అతనెప్పుడూ రాసుకోలేదు. అందుకు కారణం అతని నిజ జీవితాన్ని గూర్చి నిజాయితీగా చెప్పేటంత ధైర్యం అతని దగ్గర లేదని అతనే చెప్పుకున్నాడు. అతని చివరి నవల శేష ప్రశ్న 1931లో పూర్తిచేసాడు.
శరత్ మరణాన్ని తట్టుకోలేకపోతున్న ప్రజల్ని ఉద్దేశించి ‘భూమి వక్షస్సు నుండి అతన్ని తీసుకుపోయిన మరణం, అతని దేశవాసుల గుండెలనుండి మాత్రం తీసుకుపోలేదని‘ ఓదార్చాడు రవీంద్రుడు. అంతకుముందు శరత్ ని ఉద్దేశించి ’నేను సాధారణ కుటుంబ స్త్రీ’ అన్న పేరుతో ఒక ప్రముఖ కవిత కూడా రవీంద్రుడు రాశారు. ‘నన్ను ఎల్లకాలం గుర్తుంచుకోవాలని నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే అన్నింటిలానే మానవ మేధస్సు కూడా మారుతూనే ఉంటుంది. ఈరోజు అతి ముఖ్యమనుకున్నవి రేపటికది ఏమీ కాకపొవచ్చు. ఏది ఏమైనా కొన్నాళ్లకు నా సాహిత్య సంపాదన లో చాలాభాగం, ఇంకా పుట్టని తరాల అనాదరణలో మునిగిపోవచ్చు. నేనందుకు బాధపడను. నాకున్న ఒకే ఒక్క ఆశ అంతా, అందులో ఏ మాత్రం సత్యం ఎక్కడ ఉన్నా, అది సమయం దుష్పరిణామాల్ని తట్టుకుని నిలుస్తుందని. నా సాహిత్యం ఉన్నతమైనదా విలువైనదా కాదా అన్నది అంత ముఖ్యం కాదు నాకు. సాహిత్య సరస్వతి కి నేను నా సాహిత్య జీవన శ్రమని వినమ్రంగా సమర్పించానా లేదా అన్నది నాకు కావల్సింది.
శరత్ కుటీర్ కు దగ్గరలోని పవిత్రా పాఠశాల మైదానంలో, ప్రతీ ఏడాదీ జనవరి చివరి వారంలో శరత్ మేలా జరుపుతూ వస్తున్నారు. ఆ మేలాలో శరత్ వాడిన వస్తువుల్ని, ఆతని రచనల్ని ప్రదర్శనలో ఉంచుతారు. శరత్ ని కలకత్తా విశ్వవిద్యాలయం 1923లో జగత్తరిణీ బంగారు పతకంతో సత్కరించింది. 1925లో రోమైన్ రోల్లాండ్ ప్రపంచంలో ఒక ఉత్తమ నవలకారుడుగా గుర్తించారు. 1936లో ఢాకా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సన్మానించింది.
శరత్ స్వాతంత్రోద్యమంలో కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. సర్ సి.ఆర్.దాస్ విన్నపంతో జాతీయ కాంగ్రేసు హౌరా శాఖకు అధ్యక్షుడుగా 1921 నుండి 1936 వరకూ ఉన్నారు. సి.ఆర్.దాస్ నడుపుతున్న పత్రిక ‘నారాయణ్’ కు సంపాదక బాధ్యత కూడా నిర్వహించారు. శరత్ జీవితచరిత్ర కోసం, పద్నాలుగేళ్లు అనేక వ్యయ ప్రయాసలకోర్చి తిరుగుతూ సేకరించిన సమాచారంతో హిందీ ప్రసిద్ధ రచయిత విష్ణు ప్రభాకర్ చివరకది పూర్తిచేయగలిగారు. రికామీగా తిరిగేవారు దిశాహీనంగా ఎటుతోస్తే అటుపోతారు. సరి అయిన దిశ వైపు ప్రయాణం ఒక్కమారు మొదలెడితే వారికి తిరుగుండదు. వాళ్లే బహుశా కొన్నాళ్లకు మహాపురుషులు అవుతారేమో అని అభిప్రాయపడ్డారు. అందుకే శరత్ ని ఆయన ‘ఆవారా మస్సీహా‘ అన్నారు. ‘దేశదిమ్మరి ప్రవక్త శరత్ బాబు’ పేరున ఆ పుస్తకాన్ని తెలుగులో జ్వాలాముఖి సాహిత్య అకాడమీకి అనువాదం చేసారు. ఆనంద ప్రచురణకర్తలు శరత్ సంపూర్ణ సాహిత్యాన్ని రెండు లక్షల కాపీలు ముద్రించారు. ఇప్పటికీ ప్రతీఏటా శరత్ సాహిత్యం ఇరవైవేల కాపీలకు తక్కువకాకుండా అమ్ముడుపోవడం విశేషం. అదొక్కటి చాలు శరత్ ఇంకా బతికే ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం.