Home ఆఫ్ బీట్ చేతికి నోటి మధ్య వీధి భారతం

చేతికి నోటి మధ్య వీధి భారతం

lf

దేశంలో దాదాపు కోటి మందికి పైగా ప్రజలు ఇలా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వచ్చి ఉపాధి వెతుక్కునేవారికి, వేరే ఏ విధమైన నైపుణ్యాలు లేని వారికి వీధులపై చిరు వ్యాపారాలు చేసుకోవడం ఒక ప్రధాన ఉపాధి మార్గంగా కనిపిస్తుంది. కొంతమంది వ్యాపారులు ఒక నిర్దేశిత స్థలంలో వ్యాపారాలు నిర్వహిస్తుంటే మరికొంత మంది వీధి వీధికి, ఊరూరా తిరుగుతూ తమ వ్యాపారాలు కొనసాగిస్తుంటారు. కొంత మంది ప్రతి రోజు నిర్ణీత సమయంలో వ్యాపారం జరుపుతూ ఉంటే మరికొందరు వారానికొకసారి జరిగే సంతలలో వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. కొందరు ఒక తాత్కాలిక దుకాణం వంటిది ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తుండగా మరికొందరు తోపుడు బండ్లపై తమ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ప్రతి రోజు సాయంత్రం ఆరు అయేటప్పటికి లలిత, భాగ్యమ్మ హైదరాబాద్ లోని ఒక రద్దీగా ఉండే వీధి చివర జొన్న రొట్టెల వ్యాపారం మొదలు పెడతారు. వారిది మహబూబ్ నగర్ జిల్లా. హైదరాబాద్ కి కుటుంబంతో సహా వలస వచ్చి ఏడాది దాటుతుంది. వారి భర్తలు కూలి పనికి వెళ్తుండగా చన్నీళ్ళకు వేణ్ణీళ్ళు లాగా ఎంతో కొంత సహాయపడుతుందని వారిద్దరూ కలిసి ఈ వ్యాపారం మొదలు పెట్టారు. ప్రతి రోజు దాదాపు 60 రొట్టెలు అమ్మి 600 దాక సంపాదిస్తారు. ఖర్చులు పోను చెరొక రెండు వందలు మిగులుతుంది. ఊరిలో కొద్ధి పాటి భూమి ఉన్నా దాని మీద వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక ఇలా వలస వచ్చి దొరికిన పని చేసుకుంటూ బతుకుతున్నారు. బీహార్ నుండి ఢిల్లీ కి వెళ్లి అక్కడ స్త్రీలు వాడుకునే రబ్బర్ బ్యాండ్ లు, హెయిర్ క్లిప్ లు వంటి వి అమ్ముకుంటూ బతుకుతున్న రమేష్ ది మరొక కథ. అనుకోకుండా తండ్రి చనిపోవడంతో అమ్మని, చెల్లెలిని పోషించే భారం ఈ ఇరవైమూడేళ్ల కుర్రవాడిపై పడింది. సరైన చదువు లేదు. ఎలా సంపాదించాలో తెలియని ఈ అబ్బాయికి ఆపద్భాంధవుడిలాగా వారి ఊరి నుండి ఢిల్లీ వెళ్లి స్థిరపడిన ఒక పెద్దాయన కలిసాడు. ఢిల్లీ లో ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చు అనుకుంటూ అతనితో వెళ్లిన రమేష్ ఊరి నుండి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బుతో ఈ చిరు వ్యాపారం మొదలు పెట్టాడు. రోజుకు దాదాపు ఐదు వందలు సంపాదించినా అంత పెద్ద నగరంలో బతకడానికి అది ఏ మూలకూ సరిపోదని ఆ కుర్రవాడికి తొందరగానే తెలిసి వచ్చింది. తాను సరిగా తిని తినక ఆ కొద్ధి మొత్తంలో నుండే ఎంతో కొంత దాచిపెట్టి ఊరిలో ఉన్న అమ్మకి, చెల్లికి పంపిస్తుంటాడు. ఏడాదిన్నర అయింది వారిని చూసి వచ్చి. ఊరికి వెళ్లి వాళ్ళని చూడాలని ఉన్నా అందుకు అయ్యే ఖర్చు భరించే శక్తి లేదు ఆ అబ్బాయికి. దేశంలో దాదాపు కోటి మందికి పైగా ప్రజలు ఇలా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వచ్చి ఉపాధి వెతుక్కునేవారికి, వేరే ఏ విధమైన నైపుణ్యాలు లేని వారికి వీధులపై చిరు వ్యాపారాలు చేసుకోవడం ఒక ప్రధాన ఉపాధి మార్గంగా కనిపిస్తుంది. కొంతమంది వ్యాపారులు ఒక నిర్దేశిత స్థలంలో వ్యాపారాలు నిర్వహిస్తుంటే మరికొంత మంది వీధి వీధికి, ఊరూరా తిరుగుతూ తమ వ్యాపారాలు కొనసాగిస్తుంటారు. కొంత మంది ప్రతి రోజు నిర్ణీత సమయంలో వ్యాపారం జరుపుతూ ఉంటే మరికొందరు వారానికొకసారి జరిగే సంతలలో వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. కొందరు ఒక తాత్కాలిక దుకాణం వంటిది ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తుండగా మరికొందరు తోపుడు బండ్లపై తమ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గుండు సూది నుండి ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ఈ రోడ్లపై చిరు వ్యాపారాలు చేసే వర్తకుల దగ్గర దొరకని వస్తువేదీ ఉండదంటే అతిశయోక్తి కాదు. పూలు, పండ్లు, కూరగాయలు, తినుబండారాలు, దుస్తులు, అలంకరణ వస్తువులు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలు..ఇలా వీరు అమ్మని వస్తువు లేదు. తక్కువ ధరలలో విభిన్నమైన వస్తువులను అమ్ముతూ ఎప్పటికప్పడు కొత్త సరుకును అందుబాటులోకి తెస్తూ ఉండడంతో వీరు అమ్మే వస్తువులకు ఎప్పుడు ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అందుకే ఏ ఉపాధి దొరకని ఎంతో మంది ప్రజలు ఈ స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే వీరి జీవితం పైకి కనపడేంత సాఫీగా అయితే ఉండదు అనే విషయం ఏ కొంచం లోతుగా తరచి చూసినా మనకు అర్ధం అవుతుంది. వ్యాపారం అనేది చిన్నదైనా పెద్దదైనా అందులో రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే పెద్ద వ్యాపారస్థులు తమకేదైనా రిస్క్ సంభవిస్తే దానిని ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలను వినియోగించుకుంటుండగా ఈ చిన్న చిన్న వీధి వ్యాపారాలు చేసుకునే వారికి ఇన్సూరెన్స్ లాంటి విషయాలపై అవగాహన లేకపోవడమే కాక వారి చిన్న వ్యాపారాలకు తగిన ఇన్సూరెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేకపోవడంతో ఏ చిన్నపాటి రిస్క్ సంభవించినా వారు తీవ్ర నష్టాలకు లోనై కోలుకోలేని దెబ్బ తింటున్నారు. ఈ వ్యాపారానికి సంబంధించిన రిస్క్ లకు తోడు ప్రతినిత్యం రకరకాల అధికారుల వేధింపులు ఈ చిన్న వ్యాపారులకు ఉండే మరొక ప్రధాన సమస్య. మునిసిపల్ అధికారులు, పోలీస్ లు, ట్రాఫిక్ అధికారులు ఇలా ఎన్నో శాఖల అధికారులతో నిరంతరం వీరు యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఎంతో మందికి మామూళ్లు చెల్లించుకోవడం వీరి వ్యాపార నిర్వహణ లో భాగమైపోయింది. 2010 లో సుప్రీమ్ కోర్ట్ ఈ చిరు వ్యాపారాలు చేసుకునే అవకాశాన్ని ఒక ప్రాధమిక హక్కుగా (రాజ్యాంగంలోని 21 వ ఆర్టికల్ లోని జీవించే హక్కు ఆధారంగా) ప్రకటించింది. 2012 లో జారీ చేయబడిన స్ట్రీట్ వెండార్స్ బిల్ ప్రకారం మునిసిపల్ అధికారులు ప్రతి నగరంలోనూ కొన్ని ప్రత్యేక జోన్ లను ఈ చిరు వ్యాపారులకోసం కేటాయించవలసి ఉంది. దీని వలన వీరు నిర్దేశిత ప్రాంతాలలో వ్యాపారం చేసుకునే అవకాశం కలగడంతో పాటు రోడ్ లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారనే నెపంతో వీరిని వేధించే అధికారుల ఆగడాలు తగ్గే అవకాశం ఉంది. అయితే దేశంలో చాలా కొద్ది మునిసిపాలిటీ లు మాత్రమే దీనిని అమలు చేసినట్లు కనిపిస్తుంది.
ఈ చట్టం ప్రకారం ప్రతి పట్టణంలోని స్ట్రీట్ వెండార్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులతో ఒక కమిటీ ని ఏర్పాటు చేసి ఈ చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. దీనితో పాటు స్ట్రీట్ వెండార్స్ అందరికి ఐడెంటిటీ కార్డు లు జారీ చేసి ప్రతి పట్టణంలోనూ చిరు వ్యాపారుల రక్షణకు చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు బీహార్, కర్ణాటక, ఉత్తరాఖండ్ మరి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఇది అమలు చేసినట్లు తెలుస్తుంది. వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి అనేది చిరు వ్యాపారులు ఎదుర్కునే మరొక ప్రధాన సమస్య. అసంఘటిత రంగంలో ఉండే వీరికి పెట్టుబడి సమకూర్చే వ్యవస్థాగతమైన సంస్థలు, సదుపాయాలు లేకపోవడంతో వీరు ప్రధానంగా వడ్డీ వ్యాపారులపైనా, మైక్రో-ఫైనాన్స్ సంస్థలపైనా ఆధారపడుతున్నారు. ఈ వడ్డీ వ్యాపారులపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో చిరు వ్యాపారుల నిస్సహాయతను, అవసరాన్ని అవకాశంగా తీసుకుని వారు ఇష్టం వచ్చినట్లు వడ్డీలు వసూలు చేస్తూ వారి శ్రమను, సంపాదనను దోచుకుంటున్నారు. హైదరాబాద్ లో రోజు సాయంత్రం పూట తిను బండారాలు విక్రయించే మల్లేష్ ప్రతిరోజు ఉదయం పూట ఆ రోజుకి కావాల్సిన సామానులు కొనుక్కోవడానికి తగినంత అప్పు తీసుకుని రాత్రికి ఆ అప్పు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాడు. పొద్దున్న తొమ్మిది వందలు తీసుకుంటే రాత్రికల్లా అతను తిరిగి వెయ్యి రూపాయలు చెల్లిస్తాడు. తొమ్మిది వందలకు ఒక్క రోజుకు వంద రూపాయలు వడ్డీ అన్నమాట. అంత వడ్డీనా అని అడిగేందుకు మల్లేష్ కు మరొక ప్రత్యామ్నాయం లేదు. ఎంత వడ్డీ అయినా సరే అప్పు తీసుకోక తప్పని పరిస్థితి అతనిది. ఇలా వీరి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వీరిని దోచుకుంటున్న వడ్డీ వ్యాపారులపై ఏ విధమైన నియంత్రణ లేదు. ఇక రోజంతా నిలబడి పని చేయవల్సిన అవసరం ఉన్న వ్యాపారులు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. కాలుష్యం వల్ల సంభవించే వ్యాధులు, ఎసిడిటీ వంటివి చిరు వ్యాపారులలో తరచుగా కనిపించే ఆరోగ్య సమస్యలు. అంతేకాక రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకునే స్త్రీలకు టాయిలెట్ సదుపాయాలు అందుబాటు ఉండకపోవడం మరొక ప్రధాన సమస్య. వారిపై లైంగిక వేధింపులు కూడా సర్వ సాధారణం. మంచి వైద్యం పొందటం అనేది వారి తాహతుకు మించిన అంశం కావడంతో ఎంతో మంది చిరు వ్యాపారులు సరైన వైద్యం లేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ జీవనం సాగిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల నుండి సుదూర పట్టణాలకు వలస వచ్చి చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఉన్న మరొక సమస్య సంపాదించిన చిన్న మొత్తాలను ఊరిలో ఉన్న కుటుంబాలకు పంపడం. బ్యాంకు ఖాతాలు లేకపోవడం, ప్రతి సారి ఊరికి వెళ్లి రావాలంటే అయ్యే ఖర్చు భరించలేకపోవడం తో పాటు ఊరికి వెళ్లి రావడం అంటే వారికి కొన్ని దినాల పాటు ఆదాయం కోల్పోవడమే. అలా ఆదాయం పోగొట్టుకోవడం వారి తాహతుకు మించిన పని కావడంతో ఎంతో మంది ఏళ్ళ తరబడి కుటుంబాలకు దూరమై అతి కష్టం మీద వారికి డబ్బు పంపుతూ జీవనం వెళ్ళ దీస్తున్నారు.
పూలు, పండ్లు, కూరగాయలు ఇతర ఆహార పదార్ధాలు అమ్ముతూ జీవించేవారికి ఉండే మరొక ప్రధాన సమస్య ఆయా వస్తువులు అమ్ముడు కాకపోతే వాటిని నిల్వ చేసుకోలేకపోవడం. తొందరగా పాడైపోయే ఇటువంటి ఉత్పత్తులను నిల్వచేసుకునే సదుపాయం వారి నివాసాలలో లేకపోవడం, అటువంటి సౌకర్యం కల్పించే సంస్థాగత సదుపాయాలు లేకపోవడంతో అవి అమ్ముడు కాని రోజులలో వారు తీవ్ర నష్టాలను ఎదుర్కుంటున్నారు.
ఇన్ని సమస్యల మధ్య చిన్న చిన్న వ్యాపారాలను నెట్టుకొస్తూ స్వయం ఉపాధి పొందుతున్న కోట్లాది మంది వ్యాపారులకు సరైన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేషనల్ స్ట్రీట్ వెండార్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (NASVI) పేరిట దేశంలోని స్ట్రీట్ వెండార్స్ అందరిని సంఘటితం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కోటికి పైగా ఉన్న ఈ చిరు వ్యాపారులు సంఘటితం కావడం ఎంతో అవసరం. అయితే ఇంకా ఎంతో మంది చిరు వ్యాపారులకు ఇటువంటి సంఘాల పట్ల అవగాహన లేకపోవడంతో వారు ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలో జీవనం సాగిస్తున్నారు. NASVI వంటి సంస్థలు వారిని సంఘటితం చేయడం తో పాటు వారికి సంస్థాగత రుణ సౌకర్యం కల్పించడం, వెండింగ్ జోన్ లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం, వారికి ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించడం , వారు తమ సంపాదనను తమ కుటుంబాలకు పంపుకునే ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే ఎంతో మంది చిరు వ్యాపారులకు మేలు జరుగుతుంది. వ్యవసాయం, గ్రామీణ చేతివృత్తులు గిట్టుబాటు కాని వృత్తులుగా మారిపోతున్న నేపథ్యంలో ఎంతోమంది గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలసబాట పడుతున్నారు. పట్టణాలలో వారందరికి ఉపాధి కలిగించే పరిశ్రమలు కానీ, సదుపాయాలు కానీ లేకపోవడం వారిని స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపేలా చేస్తున్నది. ఈ స్వయం ఉపాధిలో ఉన్న సమస్యలను తొలగించి వారికి చిన్న చిన్న వ్యాపారాలు సులువుగా, ఇబ్బందులు లేకుండా చేసుకునే వెసులుబాటు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత.
లలిత, భాగ్యమ్మ, రమేష్ వంటి చిన్న వ్యాపారులు నిజానికి వారికి ఉన్న కొద్దిపాటి సొమ్మునంతా పెట్టుబడి గా పెట్టి వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఆ వ్యాపారం కానీ నష్టపోతే వారి జీవితం మరింత అధోగతిలోకి పడిపోతుంది. ఏ రక్షణ సదుపాయాలు లేకుండా ఉన్నదంతా పెట్టుబడిగా పెట్టి యుద్ధం చేసే ధైర్యం మనలాంటివారికి ఎలాగూ లేదు. ఆ ధైర్యం మాత్రమే కొండంత పెట్టుబడిగా పని చేసే ఇటువంటి వారికి కనీస వెసులుబాటు కల్పిస్తూ వారి వ్యాపారాలు వారు కాస్త సులువుగా చేసుకునేలా చేయగలిగితే వారికి ఎంతో మేలు చేసినట్లే.

ఈ వ్యాపారానికి సంబంధించిన రిస్క్‌లకు తోడు ప్రతినిత్యం రకరకాల అధికారుల వేధింపులు ఈ చిన్న వ్యాపారులకు ఉండే మరొక ప్రధాన సమస్య. మునిసిపల్ అధికారులు, పోలీస్ లు, ట్రాఫిక్ అధికారులు ఇలా ఎన్నో శాఖల అధికారులతో నిరంతరం వీరు యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఎంతో మందికి మామూళ్లు చెల్లించుకోవడం వీరి వ్యాపార నిర్వహణలో భాగమైపోయింది.  2010 లో సుప్రీమ్ కోర్ట్ ఈ చిరు వ్యాపారాలు చేసుకునే       అవకాశాన్ని ఒక ప్రాధమిక హక్కుగా (రాజ్యాంగంలోని 21 వ ఆర్టికల్ లోని జీవించే హక్కు ఆధారంగా) ప్రకటించింది. 2012 లో జారీ చేయబడిన స్ట్రీట్ వెండార్స్ బిల్ ప్రకారం మునిసిపల్ అధికారులు ప్రతి నగరంలోనూ కొన్ని ప్రత్యేక జోన్ లను ఈ చిరు వ్యాపారులకోసం కేటాయించవలసి ఉంది. దీని వలన వీరు నిర్దేశిత ప్రాంతాలలో వ్యాపారం చేసుకునే అవకాశం కలగడంతో పాటు రోడ్ లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారనే నెపంతో వీరిని వేధించే అధికారుల ఆగడాలు తగ్గే అవకాశం ఉంది. అయితే దేశంలో చాలా కొద్ది మునిసిపాలిటీ లు మాత్రమే దీనిని అమలు చేసినట్లు కనిపిస్తుంది.

భారతి కోడె