Home ఎడిటోరియల్ కొత్త పుంత ‘స్టడీ ఇన్ ఇండియా’

కొత్త పుంత ‘స్టడీ ఇన్ ఇండియా’

edit

భారత విశ్వవిద్యాలయాలను ప్రపంచంలోని 100 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో చేర్చడానికి ఉద్దేశించిన ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ పథకం తర్వాత విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా వెబ్ సైటు ద్వారా భారత ప్రభుత్వం దేశంలో ఉన్నత విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇండియాలో సాఫ్ట్ పవర్ పెంపొందించడం, దౌత్యనీతిలో ఒక సాధనంగా ఈ సాఫ్ట్ పవర్ ను ఉపయోగించడం, భారతదేశానికి విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచడం, అంతర్జాతీయ విద్యారంగంలో భారతదేశం మార్కెట్ వాటాను ఒకటి నుంచి రెండు శాతానికి రెట్టింపు చేసి ఉన్నత విద్యావ్యవస్థ నాణ్యతను ఇనుమడింప చేయడం, విద్యాభ్యాసానికి సంబంధించి భారతదేశం ర్యాంకును పెంచడం వగైరా ఈ స్కీమ్ లక్షాల్లో ఉన్నాయి. స్టడీ ఇన్ ఇండియా ప్రాజెక్టు కోసం 2018 -19 సంవత్సరానికి గాను 150 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ కేటాయింపులు బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉద్దేశించినవి. స్టడీ ఇన్ ఇండియా గురించిన ఆలోచన 2015 నాటిది. స్మృతి ఇరానీ మానవవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్టడీ ఇన్ ఇండియా ప్రాజెక్టు ప్రాథమిక దశలో ఉంది. మూడేళ్ళ తర్వాత నాలుగు మంత్రిత్వ శాఖలు విదేశీ, హోం, కామర్స్, మానవవనరుల శాఖలు కలిసి రానున్న ఐదు సంవత్సరాల్లో దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్యను 2 లక్షలకు పెంచే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి. దేశంలో 2016 నాటికి 47,755 మంది విదేశీ విద్యార్థులున్నారు. దేశంలో ఉన్నత విద్యారంగం పరిమాణాన్ని బట్టి చూస్తే ఇది చాలా తక్కువ. విదేశీ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం విదేశాల్లో చదువుతున్న భారత విద్యార్థుల సంఖ్య ఐదున్నర లక్షలు. అంటే ఇక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థుల కన్నా పదకొండు రెట్లు ఎక్కువ మంది భారత విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా విదేశీ విద్యార్థులు దేశంలోని 160 ప్రముఖ కాలేజీలు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి పూర్తి సమాచారం పొందగలరు. ఈ విద్యాసంస్థల్లో ప్రవేశం కొరకు ధరఖాస్తు చేసుకోగలరు. ఈ జాబితాలో మరిన్ని విద్యాసంస్థలను చేర్చడం జరుగుతుంది. ఆసియా, ఆఫ్రికా, తూర్పు యూరప్ దేశాలలోని 30 పైబడిన దేశాలకు చెందిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టు ప్రారంభించారు.
విదేశీ విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల అనేకవిధాల ప్రయోజనాలున్నాయి. ఆర్ధికంగా కలిగే ప్రయోజనాలు అందులో ముఖ్యమైనవి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు ఎక్కువగా భారత విద్యార్థులు ఉన్నతవిద్యాభ్యాసం కోసం వెళుతుంటారు. ఈ మూడు దేశాలు విదేశీ విద్యార్థుల వల్ల చాలా ఆదాయం పొందుతున్నాయి. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆస్ట్రేలియా విద్యాసంస్థల ద్వారా దాదాపు 30 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది. అక్కడ అత్యధిక ఆదాయాన్ని సంపాదించి పెట్టే సేవల ఎగుమతుల్లో విద్యారంగం ఒకటి. అమెరికా, కెనడాల్లోని 15 లక్షల మంది విదేశీ విద్యార్థుల వల్ల దాదాపు 49 బిలియన్ డాలర్ల ఆదాయముంది. విదేశీ విద్యార్థుల వల్ల కొన్ని పరోక్ష ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విద్యాసంస్థల్లోని క్లాసురూముల్లోను, క్యాంపసుల్లోను వారి వల్ల సాంస్కృతి వైవిధ్యం వస్తుంది. అధ్యయనానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. వారి వల్ల వారివారి ప్రజలు వారి సంస్కృతిని అర్ధం చేసుకునే అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు, భారతదేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో చదివే అవకాశాలను కల్పించడం వల్ల ఆయా దేశాల్లో భారతదేశం పలుకుబడి పెరుగుతుంది. ఇక్కడి ఐఐటి, ఎన్‌ఐటి, జెఎన్‌యు వంటి విద్యాసంస్థలు లేని కొన్ని దేశాలపై దీనివల్ల మంచి ప్రభావం పడుతుంది. మరో ముఖ్యమైన విషయమేమంటే 50 శాతం విదేశీ విద్యార్థులకు పాక్షికంగా ఫీజు రద్దు చేయడం కూడా గొప్ప నిర్ణయం.
అన్నింటికన్నా ముఖ్యంగా గమనించవలసిన విషయమేమంటే, స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం భారతదేశం సాఫ్ట్ పవర్ ను పెంచడానికి ఉద్దేశించింది కావడం. సాఫ్ట్ పవర్ అనే పదాన్ని జోసెఫ్ నై మొదట ఉపయోగించాడు. సాఫ్ట్ పవర్ అనేది విదేశీ సంబంధాల్లో దేశం పలుకుబడికి సూచిక. ఒక దేశం సంస్కృతి, రాజకీయ ఆదర్శాలు, విధానాలు, ప్రజాస్వామ్యం, మానవహక్కులు, వ్యక్తిగత అవకాశాలు వంటివి ఎంతగా ఇతరులను ఆకర్షిస్తాయో అంతగా ఆ దేశం పలుకుబడి, సాఫ్ట్ పవర్ ఎక్కువవుతాయి. ఇతర దేశాలు ఆ దేశాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తాయి. ఒక దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు కూడా సాఫ్ట్ పవర్ కు కారణమవుతాయి. ఇతర దేశాల్లోని యువతరం ఈ విద్యాసంస్థల పట్ల ఆకర్షితులై ఇక్కడ చదవాలని కోరుకోవడం అన్నది ఆ దేశం సాఫ్ట్ పవర్ కు నిదర్శనం. జోసెఫ్ నై ప్రకారం అమెరికాకు సంబంధించి సాఫ్ట్ పవర్ ముఖ్యంగా హాలీవుడ్, హార్వార్డ్, మైక్రోసాఫ్ట్, మైకెల్ జోర్డన్ల వల్ల లభించింది. సాఫ్ట్ పవర్ విషయంలో చైనా చాలా జాగ్రత్తలు తీసుకుంది. చైనా ఈ విషయమై ఏటా 10 నుంచి 12 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. చైనా 2012లోనే ప్రపంచంలో అతిపెద్ద విద్యా కేంద్రంగా మారాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. 2020 నాటికి చైనాలో విదేశీ విద్యార్థుల సంఖ్య ఐదు లక్షలకు పెంచాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పుడు ప్రపంచంలోని పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాలు అక్కడ ఉన్నాయి. తన లక్ష్యసాధన దిశగా చైనా వేగంగా అడుగులు వేస్తోంది. 2016 నాటికి చైనాలో విదేశీ విద్యార్థుల సంఖ్య 4 లక్షలు. అమెరికా, బ్రిటన్ ల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో విదేశీ విద్యార్థులు చదువుతున్న దేశం ఇదే. కన్ ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్లను స్థాపించడం ద్వారా చైనీస్ భాషకు కూడా ప్రపంచంలో ప్రాచుర్యం కల్పిస్తోంది. మధ్యతరగతి ఆదాయం ఉన్న దేశాల నుంచి విద్యార్థులు పాశ్చాత్య దేశాలకు వెళ్ళే బదులు ఇప్పుడు చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్ లకు వెళుతున్నారు. అంతేకాదు, ఈ దేశాల్లో పాశ్చాత్య విశ్వవిద్యాలయాల శాఖలు కూడా ఏర్పడుతున్నాయి. పాశ్చాత్యదేశాలు కూడా విద్యార్థులను విదేశీ చదువులవైపు ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగంలో కొత్త పరిణామాలివి. కాని భారతదేశంలో విద్యారంగం నాణ్యత దృష్ట్యా వెంటనే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం కష్టం కావచ్చు. చైనా మాదిరిగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే విద్యారంగంలో ప్రపంచంలో ఒక పెద్ద శక్తిగా భారతదేశం ఎదగవచ్చు. విదేశాల్లో చదవాలని భావించే విద్యార్థులను భారత దేశంలోని విద్యాసంస్థలు ఆకర్షించాలంటే విద్యాబోధనలో నాణ్యత పెరగడం అవసరం. అలాగే ఖర్చు, విద్యాసంస్థ ఉన్న ప్రాంతం, లభించే కోర్సులు వగైరా కూడా ఎంతో కీలకమైనవి. బ్రాండ్ ప్రమోషన్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు కాని ఈ మౌలికమైన విషయాలను మరిచిపోతే విదేశీ విద్యార్థులను ఆకర్షించలేము. తక్కువ ఖర్చులో విద్యాభ్యాసానికి భారతదేశం కేంద్రంగా మారుతుందని కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ చెప్పిన మాటలు నిజమే. కాని విద్యాపరంగా ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకున్నప్పుడే అది సాధ్యం. మధ్యప్రాచ్యంలో కాని, ఆగ్నేయాసియా దేశాల్లో కాని విద్యార్థులకు ఎలాంటి కోర్సులు అవసరం, ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయన్న విషయాలు కూడా చాలా ముఖ్యం. అలాగే నగరాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకు ఎల్లప్పుడు సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రామినెన్స్ స్కీము కూడా ఇప్పుడే ప్రవేశపెట్టడం వల్ల దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు విదేశీ విద్యార్థులను ఆకర్షించవచ్చు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రామినెన్స్ హోదా పొందడానికి మార్గదర్శక సూత్రాల్లో కనీసం 30 శాతం విదేశీ విద్యార్థులు ఉండాలని చెప్పడం కూడా చాలా మంచి నిర్ణయం. 25 శాతం విదేశీ అధ్యాపకులను నియమించాలని చెప్పడం వల్ల విదేశీ విద్యార్థులను ఈ విద్యాసంస్థలు ఆకర్షించే అవకాశాలు పెరిగాయి.