Home లైఫ్ స్టైల్ ఈ కస్టమర్ కొనేరకమేనా?

ఈ కస్టమర్ కొనేరకమేనా?

th

టిహబ్‌లో కొత్తపుంతల స్టార్టప్‌లు 

స్టార్టప్ కేంద్రాలకు నిలయంగా ఉండాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి హబ్ సత్పలితాలను ఇస్తోంది. సృజనాత్మకతకు పెద్ద పీట వేసేందుకు , నూతన ఆలోచనలను పంచుకునేందుకు వేదికవుతోంది. సృజనాత్మక ఆలోచనలు ఉన్నా వాటిని ఆచరణలో పెట్టే దారి దొరకని వారికి.. డబ్బు ఇతర ఆర్థిక స్తోమత లేని వారికి ఒక వేదిక కల్పించడంలో టి హబ్ బాసటగా నిలుస్తోంది. కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో టి హబ్ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకుంటోంది. టి- హబ్‌ను 2015 లో ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 346 స్టార్టప్‌లు ఆవిష్కృతమైనాయి. కాకుండా దేశీయంగా మరో 190 అలుమినీ స్టార్టప్స్ , 156 కరెంట్ కేటలిస్ట్ స్టార్టప్‌లతో కలిసి పని చేస్తోంది.
రూ.50కోట్ల రుణాలు ఆన్‌లైన్‌లోనే… : విద్యార్థులకు విద్యా రుణాలు, గృహిణులకు వ్యక్తిగత రుణాలు, వాణిజ్య రుణాలు అవసరమైన వారి కోసం మధ్య వర్తిగా ఉంటూ రుణాలు ఇప్పించే స్టార్టప్ కంపెనీ టి హబ్‌లో ఏర్పాటైంది. లోహరియా టెక్నాలజీస్ ప్రై లిమిటెడ్ అనే సంస్థ ఆయా విభాగాల్లో రుణాలను ఇప్పించనుంది. రుణాలు ఇచ్చేది బ్యాంకులు కాదు సుమా! ప్రైవేటు వ్యక్తులే. వడ్డీ కూడా బయట ప్రైవేటు సంస్థలు విధించే స్థాయిలో ఉండదు. రుణాలు ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే లబ్దిదారులకు అందుతుండడం గమనార్హం. రుణాలు అవసరమైన వారు ఎనీటైమ్ లోన్ ఇన్ వెబ్ పోర్టల్ ద్వారా సంప్రదిస్తారు. వీరు రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత కనబర్చిన వ్యక్తుల నుండి ఆన్‌లైన్ ద్వారా ఇప్పిస్తారు. ఎవరు కూడా ఆయా వ్యక్తులను కలువాల్సిన పని లేదు. రుణం అవసరమైన వారు, రుణాలు ఇచ్చే వ్యక్తులు కూడా అంతా ఆన్‌లైన్ లోనే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. వీరికి రుణాలిప్పించేందుకు టిహబ్ మధ్య వర్తిత్వంగా ఉండడం గమనార్హం. 2016 నుండి ఇప్పటి వరకు రూ.50 కోట్లను రుణాలుగా ఇప్పించినట్లు ఆ సంస్థ టెక్నికల్ హెడ్ శశిధర్ రావు తెలిపారు.
కొనేవారేనా? టైం పాస్‌కు వచ్చారా చెప్పనున్న స్టార్టప్ : దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాళ్ల యజమానులకు ఉపకరించే ఒక స్టార్టప్ టి హబ్‌లో పని చేస్తోంది. ఆన్ బోర్డ్ కష్టమర్ డాట్ కామ్ అనే ఈ స్టార్టప్ షాపులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లకు తరుచుగా వచ్చే కష్టమర్ల గుణగణాలను ఇట్టే చెప్పేస్తుంది. ఆ కష్టమర్ ఇంతకీ కొనేరకమేనా? ఊరికే చూసి టైం పాస్ చేసి వెళ్తుంటారా? అన్న విషయాన్ని కూడా పసిగట్టేస్తుంది. తమ తమ షాపులకు వచ్చే రిపీట్ కష్టమర్లను గుర్తించి వారికి మరింతగా ప్రొత్సహించేందుకు షాపింగ్ మాళ్లు, యజమానుల వారు ఇటీవల గిఫ్ట్‌లు, ఇతర నజరానాలతో బుట్టలో వేసుకుంటున్నారు. ఈ కోవలోనే ఆన్‌బోర్డ్ కష్టమర్ స్టార్టప్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఆన్ బోర్డ్ కష్టమర్ స్టార్టప్ ద్వారా వినియోగదారుల సమయం వృథా కాకుండా నివారించవచ్చని, పనీ పాటా లేకుండా వచ్చే కష్టమర్ల తాకిడికి చెక్ పెట్టవచ్చని ఈ యాప్‌ను రూపొందించిన విజయ సాగి, అవినాష్ గొల్లపూడి తెలిపారు. ఇద్దరు మిత్రులను కలుపుకుని 18 నెలలు శ్రమించి ఈ ఆన్‌బోర్డు కష్టమర్ యాప్‌ను రూపొందించినట్లు వారు వెల్లడించారు.
బుక్ మై షో తరహా ఆన్‌లైన్ టికెటింగ్ సేవలు : బాహుబలి, కాటమ రాయుడు, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలను విడుదలైన రోజే తొలి షోలోనే చూడాలనుకునే వారికోసం బుక్‌మై షో యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి మరెన్నో యాప్‌లను టి హబ్‌లోనూ రూపొందిస్తున్నారు. యువతకున్న క్రేజీని ఈ యాప్‌లు తీరుస్తాయన్న తృప్తి తమకు నిలుస్తోందని టి హబ్ ఉద్యోగి ఎన్. గోవింద్ రాజన్ అన్నారు.
మై బస్ టికెట్స్ యాప్ : దసరా, సంక్రాంతిలాంటి పుండుగలు వస్తే రైలు ప్రయాణాల కంటే కూడా బస్సులో వెళ్లాలను కునే వారి కోసం మై బస్ టికెట్ యాప్‌ను టి హబ్ వేదికగా అందుబాటులోకి తెచ్చారు. ఒక్క ఫోన్ కాల్ ద్వారా బస్ టిక్కెట్లను సులభంగా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని మై బస్ టికెట్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఏజెన్సీల బెదడ లేకుండా నేరుగా వినియోగదారులు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలకు మై బస్ టిక్కెట్ యాప్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైబస్ టిక్కెట్ యాప్ ఉద్యోగి బి. సుధీర్ రెడ్డి తెలిపారు.
చిట్టీలు ఆన్‌లైన్‌లో : టి హబ్‌లో చిట్స్ మాంగ్స్ అనే రిజిస్ట్రర్డ్ చిట్స్ కంపెనీ వినియోగదారులకు ఆన్‌లైన్‌లో చిట్టీలను వేసేందుకు తన సహకారం అందిస్తోంది. చిట్టీలను ఆన్‌లైన్‌లో వేయడం కొత్తగానే ఉందనుకుంటున్నారా? నిజమే మరి. చిట్స్ మాంగ్స్ సిఇఓ పవన్ ఆదిపురం మన తెలంగాణతో మాట్లాడుతూ ఏడాది కిందటే ఆన్‌లైన్ చిట్స్ విధానాన్ని తమ సంస్థ కనుగొందన్నారు. టి హబ్‌కు ఈ విషయాన్ని తెలియజేయగా ప్రభుత్వం తమకు ఇక్కడ స్థలం ఇతరు సౌకర్యాలు కల్పించిందన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 22 జిల్లాలకు చెందిన 250 మంది కష్టమర్లు చిట్టీలను వేయడం, తీసుకోవడం లాంటి కార్యకలాపాలు చేశారన్నారు. వీరిలో 55 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా, 45 శాతం మంది ప్రైవేట్ వ్యాపారులు, యువత ఉన్నారన్నారు.