Home ఆఫ్ బీట్ పర్యాటకంలో పరుగులు

పర్యాటకంలో పరుగులు

 తెలంగాణకు మూడు రెట్లు పెరిగిన విదేశి టూరిస్టులు

 టాప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి

సమైక్య రాష్ట్రంలో మరుగునపడ్డ తెలంగాణ పర్యాటక ప్రాధాన్యత స్వంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సగర్వంగా తలెత్తుకుని యావత్తు దేశానికి పరిచయం చేసు కుంది. అప్పట్లో పర్యాటక ప్రాంతాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనివే అనే ఒక సాధారణ అభిప్రాయానికి ఇప్పుడు నాలుగేళ్ళ తెలంగాణ ప్రయాణం ధీటైన సమాధానం చెప్పింది. కట్టుబొట్లు, సంప్రదాయాలు, వేషభాషలు, సంస్కృతి తదితరాలతోపాటు చారిత్రక ప్రాధాన్యత, పర్యాటక ప్రాముఖ్యత, జైనుల, బౌద్ధుల కాలం నుంచి తెలంగాణ ఏ విధంగా ఆలవాలంగా ఉందో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. 

temple

రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే ఢిల్లీలో రాజ్‌పథ్‌పై ‘బోనాలు’ ఉత్సవాన్ని ప్రతిబింబించే శకటాన్ని ప్రదర్శించింది. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు దేశ రాజధాని ఢిల్లీ సహా హర్యానా, జమ్మూకశ్మీర్, ముంబాయి తదితర అనేక రాష్ట్రాలకు, నగరాలకు వ్యాపించింది. ప్రతీ ఏటా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగే బతుకమ్మ సంబురాలకు కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ సహా మహేశ్ శర్మ, బండారు దత్తాత్రేయ లాంటి ప్రముఖులు హాజరవుతుంటారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం హాజరయ్యారు. కృష్ణా పుష్కరాలంటే విజయవాడ, గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి అనే ఒక సాధారణ అభిప్రాయానికి తెలంగాణ కొత్త నిర్వచనాన్ని ఇచ్చి కృష్ణా పుష్కరాలకు నాగార్జునసాగర్, వాడపల్లి, జూరాల, బీచుపల్లి లాంటివన్నీ కేంద్రాలేనని చాటిచెప్పింది. గోదావరి పుష్కరాలకు కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, బాసర తదితర ప్రాంతాలన్నీ నిలయాలుగా మారాయి. ఇక కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ లాంటివి తెలంగాణకు, హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయి. బయో డైవర్శిటీ, గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ లాంటి అనేక అంతర్జాతీయ ప్రదర్శనలకు హైదరాబాద్ సరైన వేదిక అనే గుర్తింపు ఏర్పడింది. ఆ గుర్తింపే ఇప్పుడు అనేక అంతర్జాతీయ ఐటి, వాణిజ్య సంస్థలకు వేదికగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ తన పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు ‘విశ్వ నగరమే’ అనే టాగ్‌లైన్ జోడించారు.

kcr
ఇతర రాష్ట్రాలకూ తెలంగాణ సంస్కృతికి గుర్తింపు :
ప్రతీ ఏటా తెలంగాణలో బతుకమ్మ సంబురాలు జరిగేటప్పుడు అనేక రాష్ట్రాల్లోనూ జరగడం ఒక ఆనవాయితీగానే మారింది. ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిపే ఒక ‘మెల్టింగ్ పాయింట్’గా, ఒక ‘మీటింగ్ పాయింట్’గా ఉన్న తెలంగాణ భిన్న సంస్కృతులకు వేదికగా నిలిచింది. జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాలతో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతలను పంచుకోడానికి వీలు కలిగింది. హర్యానాతోనూ అలాంటి ఒప్పందమే కుదరడంతో సూరజ్‌కుండ్‌లో ప్రతీ ఏటా జరిగే పదిహేను రోజుల హస్తకళా ప్రదర్శనలో తెలంగాణకు తొలి ప్రాధాన్యత లభిస్తోంది. తెలంగాణ ప్రజలు హరియాణీ పదాలను నేర్చుకుంటూ ఉంటే హర్యానాలోని ప్రజలు తెలుగు పదాలను నేర్చుకుంటున్నారు. ప్రతీ ఏటా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పదిహేనురోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో తెలంగాణకు స్థానం లభించింది. తెలంగాణ స్టాల్‌కు రాగానే ‘హైదరాబాదీ బిర్యానీ’, ‘ఇరానీ చాయ్’, ‘చార్మినార్ గాజులు’, ‘హైదరాబాద్ ముత్యాలు’.. ఇలా రకరకాల ప్రాధాన్యతాంశాలను సందర్శకులు గుర్తుచేస్తూ ఆ స్టాళ్ళను సందర్శిస్తూ ఉన్నారు.
ప్రకృతి సౌందర్యాలకు కొత్త హంగులు :

adb
ప్రకృతి సౌందర్యం ఇప్పుడు అందరికీ కనువిందు చేస్తోంది. ఇన్నేళ్లుగా ప్రచారం లేక, కొత్తవారికి తెలియక, పాలకుల నిర్లక్ష్యానికి గురైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, అద్భుత పుణ్యక్షేత్రాలు తెలంగాణ స్థానికులకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నాలుగేళ్లలో గణనీయమైన వృద్ధితో పర్యాటకుల ఆకర్షణలో తామూ ముందున్నామని ప్రపంచం ముంగిట నిలిచింది తెలంగాణ. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 31 పర్యాటక కార్యక్రమాలు ఈ నాలుగేళ్లలో పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించగా, మరికొన్ని కేంద్ర సాయంతో నిర్మాణమయ్యాయి. ఇందులో సిద్ధిపేటలోని కోమటిబండ చెరువును అభివృద్ధి చేసి, పర్యాటకులు సేదతీరేలా అన్ని సౌకర్యాలు కల్పించడం విశేషం. మిషన్ కాకతీయ నిధులతో చెరువు పునరుద్ధరణ, మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం, పర్యాటక శాఖ సహకారంతో బోటింగ్, జలక్రీడలకు అవకాశం కలిగింది. జంగాలపల్లి, ఏడుపాయల, ధర్మపురి, వేములవాడ, బీచుపల్లి, జెట్‌ప్రోలు, సోమశిల, పెద్దచింతరేవుల, మల్తకల్, కోయిల్‌కొండ, లక్నవరం, శ్రీరంగాపురం, అలీసాగర్, పాకాల, మల్లేపల్లి, కడెం, డిండి, కాళేశ్వరం, కొండగట్టులో హరిత హోటల్‌ల నిర్మాణం పూర్తయ్యింది. బోటింగ్ యూనిట్ల కోసం 50 కొత్త బోట్లు కొనుగోలు, నాలుగు జెట్టీల నిర్మాణం జరిగింది. ఇందుకోసం రూ.6 కోట్ల పైచిలుకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. కొత్తగా కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు, నాగర్‌కర్నూలు జిల్లాలోని సోమశిల, సింగోటం, నాగార్జునసాగర్, సిద్ధిపేట జిల్లా కోమటిబండ చెరువుల్లో బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది పర్యాటక అభివృద్ధి సంస్థ (టిఎస్‌టిడిసి).పిల్లలమర్రి వద్ద పర్యాటక సౌకర్యాలు, వర్గల్‌లోని రహదారులు, మెట్లదారి, రెయిలింగ్ పనులు అభివృద్ధి చెందాయి. కురవి వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసింది. జహీరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్స్‌టిట్యూట్, భువనగిరిలో కోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కుమ్రం భీం స్మారక మ్యూజియం (జోడేఘాట్)ను రూ.16.6 కోట్లతో, ఎలగందల్ కోట వద్ద సౌండ్, లైట్ షో, మంథనిలో ఎకో పార్క్‌ను రూ.76 కోట్లకు పైగా వెచ్చించి అభివృద్ధి చేసింది. ఇందులో కొంత కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఉన్నాయి.
పర్యాటక అభివృద్ధికి ప్రధానంగా ‘థీమ్’ ఆధారిత మౌలిక వసతులు, పర్యాటక ప్రాంతాల అనుసంధానం అవసరం. ఇందుకోసం భద్రాచలంలో రామాయణ సర్కూట్ అభివృద్ధికి కేంద్రం ఒప్పుకుంది. రూ.50 కోట్ల మేర వెచ్చించడానికి కేంద్ర పర్యాటక శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ పథకంలో బాగంగా ఆలంపూర్ జోగులాంబ దేవాలయాన్ని చేర్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తూ ఉంది. పాత మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.91.62 కోట్లతో స్వదేశ్ దర్శన్ పథకంలో ఎకో టూరిజం సర్యూట్ అభివృద్ధికి కేంద్రం అంగీకరించింది. ఇందులో సోమశిల, సింగోటం రిజర్వాయర్, ఫరహాబాద్, మల్లెలతీర్థం, కడలివనం, ఈగలపెంట ప్రాంతాలను సర్కూట్‌గా అభివృద్ధి చేస్తారు. ట్రైబల్ సర్యూట్‌ను రూ.84.40 కోట్ల అంచనాతో కేంద్రం ఆమోదించింది. ఇందులో గట్టమ్మ, లక్నవరం, మేడారం, తాడ్వాయి, మల్లూరు ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. ఇదేవిధంగా రూ.99.42 కోట్లతో హెరిటేజ్ సర్యూట్ అభివృద్ధికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఇందులో ‘పైగా’ సమాధులు, హయత్‌భక్షి బేగం మసీదు, రేమండ్ సమాధి అభివృద్ధి చేయాల్సివుంది. దీంతో పాటు ఇటీవలే నీతి అయోగ్ రూ.113.50 కోట్లతో పలు అభివృద్ధి పనులు మంజూరు చేసింది. ఈ నిధులతో గజ్వేల్‌లో 1200 మందికి సరిపడా బహుల ప్రయోజనాల ఆడిటోరియం, లోయర్ మానేరు వద్ద థీమ్ పార్కు, కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వద్ద ఎకో టూరిజం పార్కు, కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్, నాగార్జునసాగర్ లాంచ్ స్టేషన్‌లో ఆధ్యాత్మిక, ధ్యాన కేంద్రం, మౌలిక వసతులు నిర్మించాల్సి ఉంది. రూ.113.37 కోట్లతో కాళోజి కళాకేంద్రం, భువనగిరి కోట వద్ద రోప్ వే, బుద్ధవనం, సిద్ధిపేటలో బడ్జెట్ హోటల్, జనగాం జిల్లా ఖిలాషాపూర్‌లో అభివృద్ధి పనులు, గజ్వేల్‌లోని పాండవుల చెరువు కట్ట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, బార్లతో పాటు, రహదారి పక్కన సేదతీరడానికి అవసరమైన వసతులతో ఆతిథ్య రంగంలో విశేష సేవలు అందిస్తోంది. వీటికి తోడు అధునాతన వోల్వో, మెర్సిడెస్ బెంజ్ వంటి బస్సులు, మినీ బస్సులు, కారవాన్ వ్యాన్లు, ఇన్నోవాలతో ప్యాకేజీ టూర్లు, వ్యక్తిగత పర్యటనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ట్రాన్స్‌పోర్టు విభాగమే ఉంది. తాజాగా 2 కొత్త వోల్వో మల్టీ ఆక్సిల్ బస్సులు కొనుగోలు చేశారు. దీంతో పాటు గోల్కొండ కోట, వెయ్యి స్థంభాల గుడి, ఎలగందల కోటలో సౌండ్ అండ్ లైట్ షోలతో ఆయా ప్రాంతాల చరిత్రను దృశ్య, శ్రవణాత్మకంగా తెలియజేస్తున్నారు. చెరువులు, గుహలు, జలపాతాలు, ద్వీపాలు, కొండలు, నదులు, అడవులు, ప్రకృతి సంపద వైపు జనాలకు ఆకర్శించేలా ఎకో టూరిజంను కార్పోరేషన్ ప్రోత్సహిస్తుంది. బతుకమ్మ, బోనా లు ఉత్సవాలకు సహకారం, సింగిల్ విండో పద్దతిలో పర్యాటక ప్యాకేజీలు అందించడంతో రాష్ట్ర అభివృద్ధికి కార్పోరేషన్ ఇతోధికంగా సహకరిస్తుంది.

ఎం. అశ్వధ కుమార్ రెడ్డి