Home ఎడిటోరియల్ ఎందుకీ తొందరపాటు?

ఎందుకీ తొందరపాటు?

Article about Modi china tour

వివాదాస్పదమైన ట్రిపుల్ తలాఖ్ 1 వరుసగా ముమ్మారు తలాఖ్ ప్రకటనతో ముస్లిం మహిళకు విడాకులిచ్చే ఆచారాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించే బిల్లును నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ ద్వారా అమలులోకి తేవటం తొందరపాటు చర్యగా భావించక తప్పదు. ‘తప్పనిసరి పరిస్థితుల్లో’ ఆర్డినెన్స్ మార్గం ఎంచుకున్నట్లు చట్టం న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ తమ ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. ఏమిటా తప్పనిసరి పరిస్థితులంటే ట్రిపుల్ తలాఖ్ కేసులు పెరిగాయన్నారు. మరోనెల రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానుండగా, ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయటం రానున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం ఆశించి తీసుకున్న నిర్ణయంగా విమర్శలకు గురవుతున్నది. తలాఖ్ ఎ బిద్దత్ (ట్రిపుల్ తలాఖ్) చట్ట విరుద్ధమని 2017 ఆగస్టు 22న ప్రకటించిన సుప్రీంకోర్టు, తదనుగుణంగా చట్టం తీసుకురావలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం రూపొందించిన ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల రక్షణ) బిల్లును 2017 డిసెంబర్‌లో లోక్‌సభ ఆమోదించింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు కొన్ని క్లాజులతో విభేదించిన తదుపరి ప్రభుత్వం కొన్ని సవరణలు తెచ్చింది. నేరం చేసిన పురుషులకు బెయిలు మంజూరు, ఆ అధికారాన్ని మేజిస్ట్రేట్‌కు దఖలు పరచటం వంటివి అందులో ఉన్నాయి. అయితే భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తే భార్యాబిడ్డల పోషణకు చట్టంలో మార్గాంతరం ఏమిటన్న ప్రతిపక్షాల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమివ్వలేదు. రాజ్యసభ వర్షాకాల సమావేశం చివరి రోజు ఎజండాలో ట్రిపుల్ తలాఖ్ బిల్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించలేదు. పూర్తి ఏకీభావం లేనందున సభాధ్యక్షుడు బిల్లును చేపట్టకుండా సభను నిరవధికంగా వాయిదా వేయటంతో బిల్లు పరిశీలన శీతాకాల సమావేశానికి వాయిదా పడింది. ట్రిపుల్ తలాఖ్ బిల్లు ఆమోదం పొందకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆరోపించారు. బాధితురాలైన భార్య, ఆమె సంబంధీకులు మాత్రమే ట్రిపుల్ తలాఖ్ ఫిర్యాదు చేయాలని, జైలు శిక్షపడిన నేరస్థుడి భార్యకు పరిహారం విషయాన్ని బెయిల్ సందర్భంలో మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారని, అంతేగాక భార్యాభర్తలు రాజీపడేందుకు మేజిస్ట్రేట్ ప్రయత్నిస్తారని కూడా ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. మూడేళ్ల జైలు శిక్షతో కూడిన నాన్‌బెయిలబుల్ నేరం ప్రతిపాదన నుంచి ప్రభుత్వం అంచెలంచెలుగా బిల్లు క్లాజులను సడలించింది.
ట్రిపుల్ అమానుషంగా, అనాగరికంగా నిరసిస్తున్న కొన్ని ముస్లిం మహిళా సంఘాలు, కొందరు వ్యక్తులు ఆ దురాచారాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు వరకు పోరాటాన్ని తీసుకెళ్లారు. ముస్లిం మహిళలకు రాజ్యాంగం నిర్దేశించిన సమాన న్యాయం చేకూర్చాలన్నది వారి వాదన. అయితే ముస్లిం వివాహం విడాకుల అంశం తమ వ్యక్తిగత చట్టానికి సంబంధించిన విషయాలని, వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదిస్తున్నది. ఇది ముస్లిం సమాజంలో స్త్రీ పురుషులను విడదీసే చర్యగా ఖండిస్తున్నది. ముస్లిం మహిళలకు సమానత్వం కోరుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం, హిందు సమాజంలో చట్ట ప్రకారం విడాకులివ్వకుండా భార్యలను వదిలివేసే భర్తలను శిక్షించేందుకు ఎందుకు చట్టం తేవడం లేదని హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక వివాహం, విడాకులు సివిల్ వ్యవహారమైనందున ట్రిపుల్ క్రిమినల్ నేరం కిందకు తేవటం చెల్లుబాటు కాదనే వాదన ఉంది. ట్రిపుల్ తలాఖ్ చెల్లుబాటు కానప్పుడు వివాహ బంధం కొనసాగుతున్నట్లే లెక్క. మరోవైపున పురుషుణ్ణి నేరస్థునిగా జైలుకు పంపుతున్నారు. ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలి? ఏ మతంలో అయినా సంస్కరణలు అంతర్గత సంఘర్షణ, ఉద్యమం ద్వారా వచ్చినపుడు వాటికి ఎక్కువ ఆమోదయోగ్యత ఉంటుంది. ప్రభుత్వం అందుకు ప్రయత్నించినపుడు, అందు నా ముస్లిం మైనారిటీల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించినపుడు దాన్ని వారు అనుమానంతోనే చూస్తారు. ఉమ్మడి పౌరస్మృతి సాధనను లక్షంగా పెట్టుకున్న అధికార పార్టీ ఈ పనిచేస్తున్నట్లు అనుమానాలు మరీ ఎక్కువ. ట్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయం టూ వాటిని ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా చిత్రించటం మోడీ ప్రభుత్వ తక్షణ ఎన్నికల ప్రయోజనం. బిల్లును బలపరచాలని బిజెపివారు సోనియా గాంధికి, మమతా బెనర్జీకి, మాయావతికి విజ్ఞప్తి చేయటంలోనే వారి కుత్సితం వెల్లడవుతోంది. ఇటువంటి విషయాల్లో స్థూల ఏకాభిప్రాయ సాధనకు ప్రభుత్వం ఓపిగ్గా ప్రయత్నించాలిగాని తొందరపాటు చర్యలు నిరర్ధకం.