Home ఎడిటోరియల్ కు.ని భారం మహిళదేనా?

కు.ని భారం మహిళదేనా?

edit

“స్త్రీ పిల్లలను కనే యంత్రం కాదు” – సమానత్వం కోసం పోరాడుతున్న చాలా మంది మహిళలు వినిపించే నినాదమిది. ఈ నినాదం 1980ల నాటి బాలీవుడ్ సినిమా ప్రభావం కూడా వచ్చి ఉండవచ్చు. ఎమర్జన్సీ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్న కాలమది. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల జ్ఞాపకాలు కూడా వెంటాడుతున్న కాలమది. మేం ఇద్దరం మాకిద్దరు (హమ్ దో హమారే దో) రోజులవి. 1984లో ఇలాంటి సినిమా కూడా వచ్చింది. జనాకర్షక చిల్లర డైలాగులు, అసంబద్ధమైన కథలతో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయప్పుడు. అప్పటి సినిమా పరిశ్రమలో పురుషాహంకారమే రాజ్యం చేసింది. అయితే, ఎంత అసంబద్ధమైన కథలు ఉన్నప్పటికీ, మహిళల కష్టాలు, వారి సమస్యలపై దృష్టిపెట్టినవి కూడా ఉన్నాయి. పిల్లలను కనడం, పెంచడమే మహిళల బతుకైన వాతావరణాన్ని ప్రతిబింబించాయి. దశాబ్దాలు గడిచినా ఈ పరిస్థితి మారలేదు. నిజానికి ప్రభుత్వ పరంగా కుటుంబ నియంత్రణ చర్యలు తీసుకున్న మొదటి దేశం భారతదేశమే. 1952లోనే జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించాం. జనాభా పెరుగుదలను అదుపు చేయడానికి, ప్రగతిని మరింత వేగవంతం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. దశాబ్దం తర్వాత, అంటే 60ల తర్వాతి నుంచి ప్రభుత్వం ముగ్గురు పిల్లల తర్వాత ఇక వద్దు అనే విధానాన్ని బలంగా ప్రచారం చేసింది. ఇదంతా కుటుంబ నియంత్రణ విషయంలో తీసుకున్న చర్యలు. కాని ఇన్ని దశాబ్దాలు గడిచినా మహిళలపై భారం తగ్గలేదు. అలాగే జనాభా పెరుగుదల కూడా అదుపులోకి రాలేదు. ఉదాహరణకు 2024 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారబోతోందన్న శాస్త్రీయ జోస్యం. అంటే చైనాను కూడా అధిగమిస్తుంది. అంతకు ముందు ఐక్యరాజ్యసమితి అధ్యయనం ప్రకారం 2030 నాటికి భారత జనాభా నూటయాభై కోట్లను దాటుతుందని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని తెలిసింది. కాని తాజా లెక్కల ప్రకారం రెండు సంవత్సరాల ముందే ఈ ఘనత సాధిస్తుందని అర్థమవుతోంది. ప్రతి సంవత్సరం భారత జనాభాకు రెండు కోట్ల అరవై లక్షల శిశువులు వచ్చి చేరుతున్నారు. ప్రస్తుతం భారత జనాభా నూటపాతిక కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా కోటి ఇరవై ఒక్క లక్షలు.
ఈ గణాంకాలు ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అందరూ మాట్లాడేవే. ఈ గణాంకాల గురించి మాట్లాడడమంటే, పెరిగిపోతున్న జనాభా గురించి భయాందోళనలు రెచ్చగొట్టడం కాదు. జనాభా పెరుగుదలను అదుపు చేయడానికి మనం చేపట్టిన కార్యక్రమాలు ఎందుకు విఫలమవుతున్నాయన్నది సమీక్షించుకోవడం ప్రధానమైన ఉద్దేశం. ఇటీవల జాతీయ ఆరోగ్య కార్యక్రమం (నేషనల్ హెల్త్ మిషన్) రిపోర్టు ప్రకారం 2017-18 సంవత్సరంలో 14,73,418 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. అందులో 93 శాతం మహిళలకు జరిగిన ఆపరేషన్లే. అంతకు ముందు సంవత్సరం మొత్తం ఆపరేషన్లలో 98 శాతం మహిళలపైనే జరిగాయి. ఇప్పుడు కాస్త పరిస్థితి మెరుగుపడినట్లు కనబడుతున్నప్పటికీ కుటుంబ నియంత్రణకు, గర్భనిరోధానికి సంబంధించి పూర్తి బరువు బాధ్యతలన్నీ మహిళలే మోస్తున్నారని అర్థమవుతోంది. భారతదేశం లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ప్రధానంగా గర్భనిరోధక ఆపరేషన్ల ద్వారానే అమలవుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఆపరేషన్లు ఎక్కువగా మహిళలపైనే జరుగుతున్నాయి. ఫలితంగా మహిళలు ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవడం, కొన్ని సందర్భాల్లో చనిపోవడం కూడా జరిగింది. అలాంటి సంఘటనలను కప్పిపుచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ రిపోర్టు ప్రకారం పురుషులపై కుటుంబనియంత్రణ ఆపరేషన్లు తక్కువగా జరగడమే కాదు, పురుషులకు ఆపరేషన్లు చేసే సదుపాయాలు కూడా లేవని తెలుస్తోంది. వాసెక్టమీ ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయించుకోవడం వల్ల తమ శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయన్న అపోహ కూడా పురుషులను ఆపరేషన్లు చేయించుకోకుండా అడ్డుకుంటోంది. వాసెక్టమీ చాలా సులభమైనది, ట్యూబెక్టమీ అంటే స్త్రీలకు చేసే ఆపరేషను కాస్త సంక్లిష్టమైనది. స్త్రీలకు ఆపరేషను ద్వారా అండాలు గర్భాశయం చేరుకోకుండా పాలోపియన్ ట్యూబులను బ్లాక్ చేస్తారు. పురుషులకు ఆపరేషన్లు చేసే సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆపరేషన్లు తక్కువగా జరుగుతున్నాయి. అలాగే ఎమర్జన్సీ కాలంలో బలవంతంగా జరిగిన ఆపరేషన్ల ప్రహసనం కూడా పురుషుల్లో ఈ ఆపరేషన్ల పట్ల వ్యతిరేకత పెరిగేలా చేసింది. సామాజికంగా కూడా ఈ ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల పురుషులు ఒకరకంగా అప్రతిష్ఠ విషయమై భయపడుతున్నాడు. కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయించుకోవడం వల్ల పురుషుడి లైంగిక సామర్థ్యం నశిస్తుందన్న అపోహలు బలంగా ఉన్నాయి. ఈ అపోహలను తొలగించడం కష్టసాధ్యంగా మారింది. ప్రభుత్వం ఈ విషయమై ప్రయత్నాలు చేయలేదని కాదు. కాని ఈ ప్రయత్నాలు అనుకున్న స్థాయిలో జరగనూలేదు. పురుషులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపనూ లేదు. గత అనేక సంవత్సరాలుగా కుటుంబ నియంత్రణ పథకాల్లో కొన్ని మార్పు లు వచ్చాయి. అలాగే గర్భనిరోధక పద్ధతుల్లోనూ మార్పులు వచ్చా యి. పిల్స్ వచ్చాయి. ఐయుసిడి వంటివి వచ్చాయి. కాని ఈ పద్ధతులు ఎంతవరకు సురక్షితమైనవి, వీటివల్ల వచ్చే సమస్యలేమిటన్నది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఫార్మా కంపెనీలు ఈ పద్ధతులను గొప్పగా ప్రచారం చేయవచ్చు కాని వాటి ఫలితాల గురించి అవగాహన ప్రజల్లో కల్పించడం అవసరం.
పాప్యులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనం ముత్రేజా ప్రకారం ఇలాంటి తాత్కాలిక పద్ధతులన్నింటా సైడ్ ఎఫెక్టులు ఉన్నాయి. ఉదాహరణకు ఐయుసిడిలు వాడడం లేదా మాత్రలు వాడడం వల్ల రుతుక్రమం దెబ్బతింటుంది. రుతుకాలంలో మహిళల పట్ల చూపించే వివక్ష ఉంది. పైగా మహిళలకు తగిన కౌన్సెలింగ్ సదుపాయాలు కూడా లేవు. మహిళలకు ఇవి చాలా అసౌకర్యం కలిగించే పద్ధతులు. వీటన్నింటికి మించి మహిళ తన ఇష్టపూర్వకంగా ఈ పద్ధతులు పాటించడం జరగదు. కుటుంబం తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయడమే జరుగుతుంది.
కేవలం గణాంకాలను చూసినంత మాత్రాన అసలు వివరాలు తెలుస్తాయనుకుంటే పొరబాటు. వాస్తవమేమంటే, జనాభా అదుపు విషయంలో భారత ప్రభుత్వాలు ఎన్నడూ సీరియస్‌గా లేవు. కుటుంబ నియంత్రణ అనేది దేశంలో స్త్రీ శరీరాన్ని అదుపు చేయడం లో భాగంగానే కొనసాగింది. అందువల్లనే ఎమర్జన్సీ కాలంలో పురుషులపై బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగినప్పుడు అది చాలా పెద్ద సమస్యగా మారింది. పెద్ద రాజకీయ సమస్య రూపం సంతరించుకుంది. మరి మహిళల విషయమేమిటి? అనేక దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ భారాన్ని మహిళలే మోస్తున్నారు. ఆలోచించవలసిన మరో ముఖ్యమైన విషయమేమంటే, కుటుంబ నియంత్రణకు సంబంధించి పిల్లలను దత్తత తీసుకోవడం అన్నది ఒక గొప్ప పద్ధతిగా భారతదేశం ఎన్నడూ భావించలేదు. పిల్లలు లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకోవడం అనేది కూడా కుటుంబ నియంత్రణ, సమాజం సంక్షేమాల విషయంలో గొప్పగా పనిచేస్తుంది. కాని ప్రభు త్వం దానికి బదులుగా కృత్రిమ గర్భధారణ పద్ధతులకు ప్రచారం కల్పించడం వల్ల లాభం ఎక్కువని భావించింది. ఫలితంగా కుటుంబ నియంత్రణ విషయంలో ఈ భారమంతా స్త్రీలపైనే పడుతుంది. స్త్రీ శరీరమే దీనికి సాధనంగా మారుతుంది. పిల్లలను కనే యంత్రం కాదు అనే నినాదమైనా, ఇద్దరు ముద్దు ముద్దు ఆపై వద్దు అనే నినాదాలైనా అన్నీ మహిళల చుట్టూ తిరిగేవే. కుటుంబ నియంత్రణ భారాన్ని పురుషుడు కూడా మోయాలన్న ఆలోచన కూడా చాలా మందికి కలగడం లేదు.