Home ఎడిటోరియల్ పేదలను పీడించే వాతావ‘రణం’!

పేదలను పీడించే వాతావ‘రణం’!

 

శీతోష్ణ స్థితిలో మార్పులు మొత్తం భూగోళంపై ఉండే మనుషులు, వృక్షజాలం, జంతువులు మొదలైన సకల జీవరాసులపై భారీగానో, కొద్ది మేరకో ప్రభావం చూపడం సహజం. ఈ ప్రభావం పేదల మీద, వర్ధమాన దేశాల మీద విపరీతమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఇంతకు ముందు శీతోష్ణ స్థితిలో మార్పులు నెమ్మదిగా కనిపిస్తాయని అనుకునే వారు. కాని 2018 అక్టోబర్ లో ఐక్య రాజ్య సమితి శీతోష్ణ స్థితిలో మార్పులపై వివిధ ప్రభుత్వాల నివేదిక విడుదల చేసిన తర్వాత అభిప్రాయం తప్పని తేలింది. భూగోళ కవోష్ణత 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందని ఈ నివేదికలో తెలియజేశారు. ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరగడం వల్ల కోట్లాది మంది పేదలు అయిపోతారు అని ఈ నివేదికలో తెలియజేశారు.
శీతోష్ణ స్థితిలో మార్పు పేదలపై ఎంతటి దుష్ప్రభావం చూపుతుంది అనడానికి ప్రస్తుతం అనుభవ పూర్వకమైన సాక్ష్యాధారాలు చాలా అందుబాటులో ఉన్నాయి. ఈ మార్పులవల్ల ఆహారం, నీటి కొరత పెరుగుతాయి. ఈ నిత్యావసరాలను పొందడానికి పోటీ తీవ్రం అవుతుంది. దీనివల్ల ఇప్పుడున్న ఘర్షణలు పెరగడంతో పాటు కొత్త ఘర్షణలు పెరుగుతాయి. దక్షిణాఫ్రికాలోని అతి ప్రాచీనమైన కేప్‌టౌన్ లో 2015లో నీటి కొరత ప్రారంభం అయింది. ప్రపంచంలో అతి పెద్దదైన ఈ నగరంలో మంచి నీరు దొరక్కుండా పోయే ప్రమాదం ఉంది. ఈ నగర పరిసరాల్లో ఉన్న ఆవాసాలలో అనేక ఏళ్లుగా నీటి కొరత తాండవిస్తోంది. ఆ ప్రాంతాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్ర స్థాయిలో ఎదుర్కోవలసి రావచ్చు. కాంగోలో వర్షపాతంలో మార్పులవల్ల ఆహారోత్పత్తి తగ్గింది. సేద్య యోగ్యమైన భూమి మీద ఒత్తిడి పెరిగింది.వివిధ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఉద్రిక్తతలు ఎక్కువ అ యినాయి. ఈ ఘర్షణలకు ఎక్కువగా బలయ్యే ది పేదలే. ఇది మరింత పేదరికానికి, ఆవాసాలు కోల్పోవడానికి దారి తీసి జనం విష వలయంలో చిక్కుకుంటారు.
శీతోష్ణ స్థితిలో మార్పులవల్ల తరచుగా వరదులు, అనావృష్టి కారణంగా ఆహార కొరత పెరిగి, ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. ఇది ఆకలికి, పోషకాహార లోపానికి దారి తీస్తుంది. వీటివల్ల ఇబ్బంది పడేది పేదలే. ఆహార సంక్షోభంపై ప్రపంచ ఆహార పథకం 2018లో విడుదల చేసిన ఆహార సంక్షోభం నివేదిక ప్రకారం 23 దేశాలలో ఆహార సంక్షోభం ఏర్పడింది. ఈ దేశాల్లో ఎక్కువ ఆఫ్రికాలోనే ఉన్నాయి. అనావృష్టి ప్రభావం దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలపై ఉంది. వీరికి అత్యవసరంగా సహాయం అందజేయవలసి ఉంది.
143 దేశాలలో ఘర్షణల వల్ల 2017లో 3 కోట్ల ఆరు లక్షల మంది నిర్వాసితులయ్యారు. అంటే ప్రతి రోజూ 80,000 మంది నిర్వాసితులవుతున్నారు. వరదలు, తుపాన్ల వల్ల నిర్వాసితులవుతున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. వరదల వల్ల 86 లక్షల మంది, తుపాన్ల వల్ల 75 లక్షల మంది నిర్వాసితులయ్యారు. శీతోష్ణ స్థితిలో మార్పుల ప్రభావం అన్ని చోట్లా కనిపిస్తోంది. ఢాకాలో తీర ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ప్యూర్టోరికోలో మరియా తుపాను బీభత్సం సృష్టించింది. పశ్చిమ ఆఫ్రికాలో ఛాద్ సరస్సు ఎడారిలా మారిపోతోంది. 2100 సంవత్సరానికల్లా యూరప్ సమాజ దేశాల్లో ఆశ్రయం పొందే వారు 28 శాతం పెరుగుతారని అంచనా.
శీతోష్ణ స్థితిలో మార్పులతో ప్రభావితమైన దేశాల్లో భారత్ అయిదో స్థానంలో ఉంది. మన దేశంలో 80 కోట్ల మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తారు. వీరికి వ్యవసాయం, సహజ వనరులే జీవనాధారం. వీటివల్లే వారికి జీవనోపాధి లభిస్తుంది. మన దేశంలోని వ్యవసాయ భూముల్లో 50 శాతం వర్షాల మీద ఆధారపడ్డవే. రుతుపవనాల్లో మార్పులు జీవనోపాధిని దెబ్బతీస్తాయి. శీతోష్ణ స్థితిలో మార్పుల వల్ల గోధుమ పంట తగ్గిపోయినట్టు అనుభవపూర్వకమైన ఆధారాలున్నాయి. శ్రామికుల ఉత్పాదకత తగ్గింది. చిన్న రైతులకు శీతోష్ణ స్థితిలో మార్పుల ప్రభావం ఏమిటో తెలుసు. వాతావరణంలో మార్పులవల్ల పంటల విధానాలను మార్చుకోవలసి వచ్చింది. ఇది సామాజిక- ఆర్థిక మార్పులకు దారి తీసింది. చిన్న రైతులకు రుణాలు అందవు. బీమా ఉండదు. శీతోష్ణ స్థితిలో మార్పుల ప్రభావం వీరి మీదే ఎక్కువ ఉంటుంది. శీతోష్ణ స్థితిలో మార్పులవల్ల పేదరికం, పోషకాహార లోపం, రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి.
2018లో కొటోవిస్‌లో శీతోష్ణ స్థితిలో మార్పులపై జరిగిన మహాసభలో ఈ మార్పుల దుష్ప్రభావాన్ని ఎదుర్కోడానికి వర్ధమాన దేశాలకు ఆర్థిక సహాయం చేస్తామన్న వాగ్దానాన్ని సంపన్న దేశాలు నిలబెట్టుకోలేదని భారత్ విమర్శించింది. పేదలు, వర్ధమాన దేశాలే శీతోష్ణ స్థితిలో మార్పుల దుష్ప్రభావానికి అధికంగా లోనవుతున్నాయి. నిజానికి శీతోష్ణ స్థితిలో మార్పులవల్ల తలెత్తిన సంక్షోభానికి ఈ దేశాలు కారణం కాదు. కానీ అభివృద్ధిలోనూ ఈ దేశాలే వెనుకబడుతున్నాయి. శీతోష్ణ స్థితిలో మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కోవడానికి కృషి చేస్తున్నది కూడా వర్ధమాన దేశాలే. ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడుతున్నాయి. సత్వరం చర్యలు తీసుకోకపోతే ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి కోసం దశాబ్దాలుగా చేస్తున్న కృషి నిష్ఫలంగా తయారవుతుంది. ముఖ్యంగా మన దేశంలో అభివృద్ధి కుంటువడుతుంది. కొంత కాలంగా ఈ ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. సంపన్న దేశాలకు, వర్ధమాన దేశాలకు మధ్య; పేదలకు, సంపన్నులకు మధ్య అంతరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

* (ఇ.పి.డబ్ల్యు.సౌజన్యంతో)

Article about Weather changes