Friday, April 19, 2024

తెలంగాణ మాండలిక మాగాణం యశోదారెడ్డి కథాగానం

- Advertisement -
- Advertisement -

Article about Writer Pakala Yashoda reddy

బహుముఖ ప్రజ్ఞతో సాహితీ యాత్రను కొనసాగించి తెలంగాణ యాసకు, తెలుగు భాషకు పట్టం కట్టిన తెలంగాణ తొలితరం రచయిత్రి పాలమూరు మట్టి బిడ్డ పాకాల యశోదా రెడ్డి. వీరు 8 ఆగష్టు 1929లో పాలమూరు జిల్లా (అనగా ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా) బిజినేపల్లి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కత్తి కాసిరెడ్డి-సరస్వతమ్మలు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకొన్న యశోదా రెడ్డి తండ్రి తిరస్కారానికి గురై, తమ బంధువు రుక్మిణమ్మ గారి పోషణలో బాల్యాన్ని గడిపారు. అచ్చమైన తెలంగాణ పల్లెదనాన్ని నింపుకున్న యశోదారెడ్డిని పల్లెల్లో ఎచ్చమ్మా అని పిలిచేవాళ్ళు.
మనిషి జీవితంలో నెలవైన ఖాళీలను, చేసుకున్న లోపాలను, కరుడుగట్టిన విషాదాలను పూడ్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరికీ కాలం కొన్ని అవకాశాలను ముందుంచుతుంది. అలాంటి అవకాశాలు యశోదారెడ్డికి కూడా చదువురూపంలో కలిసివచ్చాయి. ఆడపిల్లలకు చదువు నిషేధమైన వ్యవస్థలో, ఫ్యూడల్ కుటుంబ పద్ధతుల్లో నలిగిపోతున్న స్త్రీల ఉద్ధరణకు పూనుకున్న రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి గారు యశోధా రెడ్డికి చదువుపట్ల వున్న ఆసక్తిని గమనించి హైదరాబాద్ నారాయణ గూడలోని బాలికల పాఠశాలలో చేర్పించారు. ఈ సంఘటన యశోదారెడ్డి గారి జీవితానికి మేలిమలుపు.
తన తల్లి తనువు చాలించి దూరమైపోయినా, తండ్రి బిడ్డను కాదనుకొని వదిలివేసినా, జడవకుండా గుండె నిబ్బరంతో, స్వయంకృషిని నమ్ముకొని ఉన్నతచదువులు చదివి గొప్ప మేధస్సును సొంతం చేసుకున్న సాహసికురాలు, జ్ఞాన సంపన్నురాలు యశోదారెడ్డి. స్త్రీల విద్యకున్న ప్రాముఖ్యతను ఆనాటికే గుర్తించిన యశోదారెడ్డి స్త్రీలకు విద్య అవసరం అనీ, అది బాధితులూ, వంచితులూ అయిన స్త్రీల సమస్యలను పరిష్కరిస్తుందని భావించేవారు.
1930-2007 మధ్య సాగిన మూడుతరాల సామాజిక ప్రవాహాన్ని, చోటుచేసుకున్న మార్పులను తన అనుభవాలుగా నింపుకున్న గొప్ప పరిశోధకురాలు యశోదారెడ్డి. ‘తెలుగులో హరివంశములు‘ అనే అంశం మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పి. హెచ్.డి.పట్టా పొందారు.1990-93 మధ్యకాలంలో అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.
యశోదారెడ్డి తెలంగాణ భాషా వేషాలను ఎంతగానో ప్రేమించారు. వాటిని అనుసరించారు. తెలంగాణ యాసకు రానున్న ప్రమాదాన్ని దూరదృష్టితో గ్రహించి సుమారు 75 యేళ్ళ నాడే తన కలాన్ని తెలంగాణ మాండలికపు సిరా బుడ్డీలో ముంచి అచ్చమైన తెలంగాణ పల్లె పదాలకు పట్టం కట్టి, ఎచ్చమ్మగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. తెలుగు జాతీయాలు, సామెతలు, పదబంధాలు, నుడికారాలు ఆమె కలం నిండా నింపి కథల్ని అల్లారు. భాషాపరిరక్షకురాలిగా నడుంబిగించి సాహితీసేవను కొనసాగించారు.
యశోదారెడ్డి రచనలు
1951లో ‘విచ్చిన తామరలు‘ అనే కథ ’సుజాత’ పత్రికలో ముద్రించబడింది. సరళ గ్రాంథిక భాషలో రాసిన ఈ కథ ఆమె తొలి కథ. ద్విపదవాజ్ఞ్మయం, ప్రబంధ వాజ్ఞ్మయం, భారతీయ చిత్రకళ, భాగవతసుధ గ్రంథాలు. మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల లాంటి కథాసంపుటాలు. 1976లో ఉగాదికి ‘ఉయ్యాల, ‘భావిక‘ అనే కవితాసంపుటాలను కూడా ప్రచురించారు. ఇవేగాక రేడియో నాటికలు, గల్పికలు, అనువాదాలు, బాలసాహిత్య రచనల్ని చేశారు. వీరి రచనలలో ‘మా ఊరి ముచ్చట్లు కథల్లో దాగిన మాండలిక సొబగుల్ని, జీవన విధానాన్ని పరికిద్దాం.
మా ఊరి ముచ్చట్లు
‘కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం‘ తెలుగు అకాడమీ నిఘంటువు. ‘కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధం‘ బ్రౌన్ నిఘంటువు. ఈ రెండు నిర్వచనాలు కథకు ఉన్న మౌళిక లక్షణాన్ని తెలుపుతున్నాయి. అంటే సత్యాన్ని ఆత్మగా చెప్పడం కథలోని ప్రధానాంశం. యశోదారెడ్డి కథల్లో కూడా సత్యం నిష్ఠగా పాటించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిత్యం సామాజిక అవినీతి, అస్తవ్యస్త జీవితాల వాస్తవిక స్థితులను ఆమె కథలుగా మలిచారు. 1950-60ల్లో దక్కన్ రేడియో ద్వారా తన ఊరి ముచ్చట్లను కథలమాలగా కూర్చి ‘మహాలక్ష్మి ముచ్చట్లు‘గా జోరువానగా కురిపించారు. 1973లో 10 కథలతో ‘మా ఊరి ముచ్చట్లు‘ కథాసంపుటిని ప్రచురించారు.
మాండలిక సొబగులు
‘అసలైన తెలుగు భాషను ఆస్వాదించాలంటే తెలంగాణపు తెలుగును చదవండి, వినండి, గ్రహించండి. ఆ భాషపై సరైన అవగాహన, పట్టులేని వారి మాట విని అది శిష్ట వ్యవహారయోగ్యం కాని అనాగరిక భాషంటూ అవమానించడం, అవహేళనచేయడం గొప్పకాదు తప్పు‘ అంటారు యశోదారెడ్డి.
పాకాల యశోదారెడ్డి కథలు అచ్చమైన తెలంగాణా పల్లెపదాలను, గ్రామీణ నాగరికతను, వినసొంపైన యాసను మన కళ్ళకుగడతాయి. ముఖ్యంగా స్వాతంత్య్రానంతర తెలంగాణ ప్రాంత గ్రామీణ సామాజిక స్థితిని పట్టిచూపుతాయి. ‘కేవలము పదములే పట్టిక వలె ఇచ్చిన విసుగు జనింపజేయునను తలంపుతో కథలుగానల్లి చూపుటకు ప్రయత్నించినాను‘ అని చెప్పారు యశోదారెడ్డి.
తెలంగాణ మాండలికం ప్రమాదంలో పడటానికి మూడు కారణాలు మనం గమనించవచ్చు. ఒకటి ఆంగ్లభాషా ప్రభా వం, రెండు నిజాం పరిపాలనా భాషైన ఉర్దూ ప్రభావం, మూ డు విశాలాంధ్రుల వలస భాష. వీటన్నింటి వలన సహజత్వాన్ని కోల్పోతున్న తెలంగాణ మాండలికానికి సజీవత్వాన్ని కల్పించడానికి యశోదారెడ్డి పూనుకుని ఆమె కథల్లో ఆ యాసను,భాషను నిలబెట్టారు. ఆ భాషాపరిమళాలను భావితరాలకు అందించిపోయారు. ‘యంకన్న‘ అనే కథలో గాసగాండ్లు, ఆరడు, మెడ పలుపులు, మెడ తలుగులు, గుంజుగ, తడక తలుపు, క్రోసు (దూరానికి ప్రమాణం),‘మా పంతులు‘ కథలో దిండిగం, శ్యాగు, తులువ చేష్టలు, ఉల్లెడ (మేలుకట్టు, మేనా), కువ్వాడ (వేళాకోళం), కువ్వారం (మోసం), పగ్గాలు, మెడ దుత్తలు, బండి, కందెన, పెద్ద సవారీ ఎడ్లు, పరదాలు. చిట్టిలువలు, బెల్లప్పూస వంటి ఆహారపదార్థాలు. గాజప్పలాట, వెన్నెలకుప్పలాట, చెండాట వంటి బాల్యక్రీడలు. లాంటి పదాలు ఇప్పుడు తెరమరుగు అయిపోయాయి.‘మీ తెలుగు మాట అచ్చపుమాట, మురిపాల మూట, మల్లెపూల తోట, సింగారాల గురిగి, ఒంపుసొంపుల ఊట‘ అంటారు ‘మా పంతులు‘ కథలో రచయిత్రి. ఇలాంటి ఎన్నో తెలంగాణ మాండలికాల శోభను తెలిపే వాడుకపదాలను యశోదారెడ్డి కథల్లో మనం చూస్తాం. అలాంటి మాణిక్యాలను ఇప్పటి భాష దూరం చేసుకోవడం బాధాకరం.
జీవన విధానం
పల్లెకు ప్రాణం వ్యవసాయం. వ్యవసాయానికి ఆదరువు పసరం. పసరానికి మనిషికి మధ్య పెనవేసుకున్న అనుబంధాన్ని యంకన్న కథలో సీతక్క-యంకన్న అనే గొడ్లును పాత్రలుగా చేసి మనుషులకి-పశువులకి మధ్య వున్న సంబంధాన్ని చక్కగా వివరించారు.‘అరుసున్ని సూసి పురుషుణ్ణి పోగొట్టుకున్నట్లు‘ అనే సామెతల్ని సందర్భానుసారంగా వాడుతారు రచయిత్రి. సీతక్క కడుపుతో ఉన్నప్పుడు దిష్టి తగుల్తాదని ‘జీడిగింజల ఉలవదారం మెడలో కట్టడం‘. అప్పటి ఆచారాన్ని ఈ కథ తెలుపుతుంది. ‘ఇదేం సిత్రమమ్మా సీతక్కకి ఒకటే ఈత . ఎనకటి జన్మలో సీతక్క మనిసి పుట్టువే ఉన్నట్లుంది.లేకుంటే వావి వరసలు లేని ఈ పసరానికి కట్టుబాట్లేంటి అని ఒగరంటే ఆ ఆవు సాలే అంతగావొచ్చు. అయింది కాన్ది కైగట్టి సెప్పుకోడం అలవాటైంది మందికి. లేకుంటే నోర్లేని పసరం ఎంకన్నను తప్పించి వేరే పసరాన్ని పారనీయదంటే యట్ల అనేటోడంటే ఇనెటోడు యట్లింటడు అన్నారు ఇంగొకరు. ఏమో యాది యాది అబద్ధమో సీతక్క మళ్ళీ కట్టనే లేదు‘. సమాజంలో ఉన్నవి లేనివి అనుకుంటూ సంబంధాలకు మకిలి అంటించే ప్రయత్నం ఎలా ఉంటుందో రచయిత్రి ఈ సంభాషణల ద్వారా తెలుపుతారు.ఈ కథలో నాటి కాలం గర్భం దాల్చిన ఆడబిడ్డకి చేసే సాంప్రదాయ పండుగను, చావుకు ఆచరించే ఆచారాలు రచయిత్రి ఎంతో ఆర్ద్రంగా చిత్రీకరించింది. ముక్తమ్మ పాత్రతో పసరం మీద మనిషికున్న ప్రేమానుబంధాన్ని తెలియచెబుతుంది. ‘మా పంతులు‘ కథ కాలానుగుణంగా వచ్చిన మార్పులు వీధి బడుల ద్వారా జీవితాలను వెళ్లదీస్తూ గ్రామానికి మంచి మార్గదర్శకత్వాన్ని చేసే పంతుళ్ళ జీవితాన్ని ఎలా మార్చివేస్తున్నాయి, వాళ్ళ జీవితాల్ని ఎలా దిగజారుస్తున్నాయన్న విషయాన్ని, ఒక సంధికాలాన్ని రచయిత్రి తెలియజెప్పుతుంది.
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాన్ని రెండింటిని కలిపి 1956 లో ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేయగానే అప్పటిదాకా తెలంగాణ పల్లెల్లో పిల్లలలకు పెద్దబాలశిక్ష, గణితం, శాస్త్ర విషయాలు, మంచి చెడులను నేర్పుతున్న స్థానిక పంతుళ్లను తొలగించి, ఆంగ్లం చదువుకున్న ఉపాధ్యాయులను వీధిబడుల్లో నియమించడంతో అప్పటిదాకా పొట్టపోసుకుంటున్న పంతుళ్ళ జీవితాలు అతలాకుతలం అయ్యాయి ఆ విషయాలను యశోదారెడ్డి గారు మా పంతులు కథలో చిత్రీకరణ చేశారు.
‘గండ్ల కత్తెరలో సొప్పదంటోలే‘ ‘కుడితిలో వడ్డ ఎలుక తీరుగా‘ అనే సామెతలు వాడి పాఠకుల్ని ఆలోచనల్లోకి నెడుతుంది కవయిత్రి. ‘గంగిరేగుచెట్టు‘ కథలో చిన్ననాటి సంగతులను తెలుపుతుంది రచయిత్రి. ఇందులో ప్రధానపాత్ర ముత్యాలమ్మ. తన అన్నకూతురు ఎచ్చమ్మతో పెళ్లి కుదుర్చుకోవడానికి వస్తుంది. కానీ ఎచ్చమ్మ తీరుని ఓర్చుకోలేని ముత్యాలమ్మ అన్నతో సంబంధాన్ని తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోతుంది. తల్లిలేనిపిల్ల స్వేచ్ఛను అంగీకరించలేని సమాజాన్ని, మూఢవిశ్వాసాలు, అమాయక ప్రజల జీవనం ఈ కథలో ఉన్నాయి.
‘నాగి‘ కథలో పేదరికం వల్ల దొంగతనాలు చేస్తున్న నాగికి ఆకలిబాధల్ని తీర్చుకొనే అవకాశాల్ని అందించి మంచిమార్గంలో పయనింపజేసేలా కథను మలుస్తారు రచయిత్రి. బతుకుబాటల్ని చూపిస్తే అనేక అరాచకాలు కనుమరుగవుతాయని ఈ కథ తెలుపుతుంది. గ్రామాల్లో సామూహికంగా జరుపుకునే పండుగ వాతావరణాన్ని ‘పీర్లపండగ‘ కథ ఆవిష్కరిస్తుంది. ‘మ్యానరికం‘ కథ మేనరికపు వివాహాల్ని వాటి పరిణామాల్ని తెలుపుతుంది. ఈ కథలో ఆడపిల్లను ముస్తాబుచేసే తీరు ఆకట్టుకుంటుంది. ‘సీతక్క పెండ్లి ,మురారి, జోగులయ్య‘ కథల్లో అనేక గ్రామీణ జీవనగతులు మనకి ఎన్నో విషయాలను తేటపరుస్తాయి. యశోదారెడ్డి గారి కథలన్నింటికీ వ్యవసాయ గ్రామీణ నేపథ్యం ఆధారభూతం. వీరి కథలు1950నాటి తెలంగాణ ప్రాంత పరిస్థితులను కథనం చేశాయి.యశోదారెడ్డి గారి వ్యక్తిత్వం ధర్మాగ్రహాన్ని వెళ్ళగక్కుతుంది. అందుకే వారిని ఉగ్రస్వభావిగా నిలబెట్టింది. వాస్తవిక చిత్రణతో సమాజాన్ని మేల్కొల్పిన యశోదారెడ్డి గారు ఎంతో భాషాసంపదను అందించిన విదుషీమణి అక్టోబర్ 2007 లో మరణించి కీర్తి శేషులయ్యారు. నేటి తరానికి వారి సాహిత్య, భాషా సంపదను దగ్గరచేసి, తెలంగాణ ఆడబిడ్డ యశోదమ్మను స్మరించుకుందాం.

రాయపాటి శివయ్య, 9885154281

Article about Writer Pakala Yashoda reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News