Home ఆఫ్ బీట్ ఇంటింటా సుస్మిత రుచులు

ఇంటింటా సుస్మిత రుచులు

lf

పిన్నవయసులోనే ఉన్నత శిఖరాలకు ఎదిగి, అందరిచేతా ప్రశంసలు అందుకుంటూ, యువతకు ఆదర్శంగా నిలుస్తోంది యంగెస్ట్ కంట్రీ చెఫ్ రికార్డు గ్రహీత, సుస్మిత స్కూల్ ఆఫ్ కుకరీ ఫౌండర్ ఈడుపుగంటి సుస్మిత చౌదరి. పిజిలు పిహెచ్‌డీలు చేసినా సరైన కొలువు దొరక్క నిరుద్యోగంతో అల్లాడుతున్న నేటి సమాజంలో సుస్మిత తనదైన ఒక దిశా నిర్దేశం చేస్తూ వస్తోంది. ఏడవ తరగతితోనే తరగతి గదులకు స్వస్తిచెప్పి, ఈ విశాల
ప్రపంచంలో నిజమైన విద్య, ఉపాధి తద్వారా డబ్బు, గుర్తింపు, సంతృప్తి నిచ్చే ఆతిథ్య (హోటల్), ఆహార (ఫుడ్) రంగంలోకి అడుగుపెట్టిన సుస్మితను విజేత పలకరించింది.

అయితే డిగ్రీ పనికిరాకపోయినా కనీసం ఉండాలి అన్న పట్టుదలతో 8వ తరగతి నుండి రాష్ట్ర ప్రభుత్వ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ద్వారా ఎస్. ఎస్. సి., ఇంటర్, ప్రథమ శ్రేణిలో పూర్తి చేసి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ‘ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సు’, ‘డిప్లమో ఇన్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బెవరేజస్ కోర్సు’ చేసి ప్రస్తుతం బాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్ చేస్తోంది. చదివినంత కాలం విద్యార్థులు థియరీకి ఇచ్చిన ప్రాధాన్యత, ప్రాక్టికల్స్‌కు ఇవ్వరని గ్రహించింది సుస్మిత. దాంతో తల్లి డాక్టర్ రైజల్ చౌదరి వద్ద భారతీయ సంప్రదాయ వంటల్లో మెళకువలను తెలుసుకుంది.
సంప్రదాయ వంటల్లో ఆరోగ్యం, ఆనందం చెడిపోకుండా పలు వినూత్న ప్రయోగాలు చేస్తూ ముందడుగు వేస్తోంది. తొలుత సుస్మిత తల్లి, కుటుంబసభ్యులనే కస్టమర్స్‌గా భావించి వండి, వడ్డించి వారి అభిప్రాయాలు తీసుకునేది. వారు వంటలు ‘బాగున్నాయి’ అంటే సంతృప్తి పడక ఆ డిష్ ఎందుకు ఇష్టపడుతున్నారు, ఎందుకు బాగుంది, లేదా ఎందుకు బాగాలేదు, ఎలావుంటే బాగుండేదో చెప్పమని అడిగి తెలుసుకునేది.
ఇలా ఓ వైపు వంటలు నేర్చుకుంటూ మరో వైపు చదువు కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వుండే వంటలపై దృష్టి సారించింది. దుబాయికి చెందిన ఓ ఇంటర్నేషనల్ ఫుడ్‌ఎక్‌పర్ట్ చెఫ్ వద్ద సుమారు 3 వేలకు పైగా ఇంటర్నేషనల్ డిషెస్/రెసిపీస్‌లో శిక్షణ పొందింది. ఒక్కొక్కసారి కొన్ని రకాల ఖరీదైన డిషెష్ తయారీ నేర్చుకోవడానికి గంటకు 10 నుంచి 25 వేలు ఖర్చు కూడా చెల్లించింది. మళ్లీ నేర్చుకున్నవి ఇంటిదగ్గర ప్రాక్టీసు చేయడానికి వాటి తయారీకి కావలసిన సరుకులు, సామగ్రి ఎంతో ఖరీదైనా వెనుకాడకుండా కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను మరింత ముందుకు తీసుకెళ్ళింది.

ఇటాలియన్, చైనీస్, మెక్సికన్, అమెరికన్, అరేబీయన్, ఇండియన్ సౌత్, నార్త్ కుజిన్స్‌తో పాటు కేక్స్, ఐసింగ్స్, ఫాండెంట్, కుకీస్, బిస్కట్స్, చాకొలెట్స్, డిజైనర్ చాకొలెట్స్, ఐస్క్రీం, కాక్టైల్స్, మాక్టైల్స్, పిజ్జా, బర్గర్స్, డిజర్ట్, స్వీట్స్, చాట్స్, సూప్స్, సలాడ్స్, రైస్, బిర్యానీస్, వెజ్, నాన్‌వెజ్ కర్రీస్, స్నాక్స్, స్టార్టర్స్, తందూరి, ట్రెడిషనల్, రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్, సంప్రదాయ పచ్చళ్ళు ఇలా ఎన్నో … మరెన్నో నేర్చుకుంది. వీటికోసం 12 నుంచి 15 లక్షలు వెచ్చించడానికి కూడా వెనుకాడకుండా తన ప్రస్థానం కొనసాగించింది.
టివి షోలు, అత్యున్నత ప్రతిభా పురస్కారాలు
ఈ టీవీ వంటి పలు శాటిలైట్ ఛానల్స్‌లో వివిధ ప్రత్యేక సందర్భాలలో ‘స్పెషల్ కుకరీ షో ’ లు సమర్పించడమేకాక ,‘కంట్రీ చెఫ్’ పేరుతో ‘యూ ట్యూబ్’ ఛానల్ కూడా నిర్వహిస్తూ అనతికాలంలోనే వేలాది మంది సభ్యుల మన్ననలను పొందింది.
శిక్షణా సంస్థ : ‘సుస్మితస్కూల్ ఆఫ్ కుకరీ’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించడమే కాక విజన్-2030 లక్ష్యంతో ‘ సిటిజన్స్ అందరికీ ఉద్యోగం/ఉపాధి’ అనే నినాదంతో పనిచేస్తున్న ‘వరల్డ్ సిటిజన్ జర్నలిస్ట్ అసోసియేషన్’ తో కలిసి సుమారు 30రకాల కోర్సులను నేర్పుతోంది సుస్మితచౌదరి. విద్యార్థులకు పార్ట్ టైం, ఫుల్ టైం కోర్సులు, నిరుద్యోగులకు షార్ట్ టర్మ్ కోర్సులు, చదువులేని/ మధ్యలో ఆపేసిన వారికోసం ఇంటిగ్రేటెడ్ కోర్సులు, మహిళలకు ఇంటినుంచే ఉపాధి పొందే స్పెషల్ కోర్సులు డిజైన్ చేసింది. 10వ తరగతి తరువాత, ఇంటర్ తరువాత 100% ప్రాక్టికల్స్‌తో హోటల్ మేనేజిమెంట్, ఫుడ్ స్పెషలైజేషన్ కోర్సులు పార్ట్ టైం, ఫుల్ టైం అవకాశాలతో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు నేర్పుతోంది సుస్మిత. బిర్యాని హబ్ పెట్టుకోవడానికి గాను ‘బిర్యాని మాస్టర్ కోర్సు’, నూడిల్స్ పాయింట్ పెట్టుకోవడానికి గాను’ నూడిల్స్ మాస్టర్ కోర్సూ, సలాడ్స్, సూప్స్ కార్నర్స్ పెట్టుకోవడానికి గాను ‘సలాడ్స్, సూపర్ స్కోర్సూ, చాట్ భండార్స్ పెట్టుకోవడానికి గాను ‘చాట్ మాస్టర్ కోర్సు’, దోశ కార్నర్ పెట్టుకోవడానికి గాను ‘దోశ మాస్టర్ కోర్సు’, ఐస్క్రీంస్, మిల్క్ షేక్స్, జ్యూసెస్, మాక్ టైల్స్ మొదలగు పార్లర్లు పెట్టుకోవడానికి గాను ఆయా కోర్సులలో శిక్షణ , సర్టిఫికెట్లు, ప్లేస్‌మెంట్స్, లోను సౌకర్యాలు కల్పిస్తోంది.ఈ శిక్షణ పొందాలనుకునే వారు www. worldcitizenjournalists.org ద్వారా తెలుసుకోవచ్చు.
పుస్తకరచన
అత్యంత తక్కువ ధరకు మార్కెట్లో ‘ఇంటింటా రుచుల’ పేరిట సుస్మితచౌదరి రాసిన 10 పుస్తకాలు జెపి పబ్లికేషన్స్ ద్వారా లభ్యమవుతున్నాయి. బ్రేక్ ఫాస్ట్ రెగ్యులర్ స్పెషల్, వెజ్ కర్రీస్ రెగ్యులర్, స్పెషల్ , నాన్ వెజ్ కర్రీస్ రెగ్యులర్ స్పెషల్ , వెజ్ రైస్ , బిర్యానీస్, నాన్ వెజ్ బిర్యానీస్, రోటి పచ్చళ్ళు, ఊరగాయలు, పికిల్స్ మొదలగు పుస్తకాలు తెలుగునాట విపరీతంగా సేల్స్ అవడం విశేషం.
బహుముఖప్రజ్ఞ
12 ఏళ్ళ వయసులోనే చేతిరాతపై www. వరల్డ్9 డాట్ టీవీ(www.world9.tv) ద్వారా పలు వీడియో పాఠాలు కూడా చెప్పడమే కాక నేటి డిజిటల్ యుగంలో నెంబర్ గా ఉన్న డిజిటల్ మార్కెటింగ్‌పై కూడా పిజి స్థాయి అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు పూర్తిచేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా అందరి ప్రశంసలు పొందుతోంది. సంప్రదాయంగా తల్లి వద్ద నుంచి‘సంఖ్యాశాస్త్రం’, ‘సిగ్నేచరాలజీ’, ‘హేండ్రైటింగ్’లలో కూడా ప్రత్యేక శిక్షణ పొందిన సుస్మితచౌదరి సిగ్నేచరాలజీ పై తల్లితో కలసి ఓ పుస్తకం రాయడమేకాక దేశ విదేశీ ప్రముఖులతో పాటు అమితాబచ్చన్, ఐశ్వర్యారాయ్, రజనీకాంత్, చిరంజీవి, మహేష్‌బాబు మొదలైన వారినే కాక రాష్ట్రపతులు, ప్రధానులు, మంత్రులు, గవర్నర్లు, న్యాయమూర్తుల సంతకాల విశ్లేషణ చేసి పలువురి మన్ననలను పొందింది. ఏ పనిచేసినా అంకిత భావంతో చేయాలని, చాలా జాగ్రత్తగా పరీక్ష రాస్తున్నట్లు భావించి ఆ పనిని పూర్తి చేయాలని ఎప్పుడూ చెప్పే మా అంకుల్ భారత తొలి టీవీ జర్నలిస్ట్, 24 ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ కొండవీటి మురళి నా స్ఫూర్తిదాత, నా తల్లి , తొలి మహిళా న్యూమరాలజిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి రైజల్ చౌదరి నా తొలి గురువని వినమ్రంగా చెబుతోంది సుస్మిత.