Home ఎడిటోరియల్ 33 జిల్లాల తెలంగాణ

33 జిల్లాల తెలంగాణ

 

1948లో 8 జిల్లాల తెలంగాణ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ఏర్పాటుతో 10 జిల్లాల రాష్ట్రమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యార్ధం తెలంగాణ ప్రజలు జిల్లాల విభజనకై, కొత్త జిల్లాల ఏర్పాటుకే ఉద్యమాలు లేవనెత్తారు. అయితే ఆనాటి పాలకులు ప్రజల కోరికని మన్నించలేదు. నాడు ఆదిలాబాద్ జిల్లాలో భాగమైన మంచిర్యాల వాసులు దశాబ్దాలుగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు కోసం చేయని ప్రయత్నం లేదు. నాయకుల హామీలు నెరవేరనే లేదు. అదే రకంగా రంగారెడ్డి జిల్లాలో భాగమైన వికారాబాద్ ప్రజలు, మెదక్ జిల్లాలోని సిద్దిపేట వాసులు దూరభారాలను తప్పించేందుకు, జిల్లాల ఏర్పాటు కోసం ఎదురు చూశారు. అక్టోబర్ 2016లో తెలంగాణ ప్రభుత్వం 21 కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలు అయ్యాయి.

ఇండియన్ యూనియన్‌లో నిజాం స్టేట్ కలిసే నాటికి అది మూడు విభిన్న భాషల ప్రజలతో కూడిన భౌగోళిక ప్రాంతం. కన్నడ, మరాఠా ప్రాంతాలతో పాటు తెలుగు మాట్లాడే తెలంగాణ నిజాం పాలనలో ఉండేది.
1948లో ఆపరేషన్ పోలో దెబ్బకు నిజాం రాజ్యం భారతదేశంలో ఓ భాగమైపోయి 24.11.1948 నాడు హైదరాబాద్ రాష్ట్రంగా మారిపోయింది. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి నాలుగు డివిజన్లలో 16 జిల్లా లుండేవి. ఔరంగాబాద్, గుల్బర్గా, గుల్షనాబాద్, వరంగల్ డివిజన్లు కాగా గుల్షనాబాద్ డివిజన్‌లో మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు, వరంగల్ డివిజన్‌లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉండేవి. ప్రస్తుత ఖమ్మం జిల్లా ఆనాడు వరంగల్‌లో భాగమే. మిగతా కన్నడ, మరాఠా జిల్లాలు ఇతర రెండు డివిజన్లలో ఉండేవి. 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల ద్వారా హైదరాబాద్ స్టేట్‌కు బూర్గుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు.
1956లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ సిఫారసుల మేరకు హైదరాబాద్ స్టేట్ మూడు భాగాలుగా విడిపోయింది. మరాఠా ప్రాంతాన్ని బొంబాయి స్టేట్‌లో, రాయచూర్, గుల్బర్గాలను కర్నాటకలో కలిపేశారు. భాష ప్రయుక్త రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్రస్టేట్‌లో కలిసిపోయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా తెలంగాణ భౌగోళికంగా ఎన్నో మార్పులకు లోనైంది. 1720 నుండి 1948 దాకా పది మంది అసఫ్‌జాహీ రాజుల పాలనలో ఒక భాగంగా ఉండేది. 1948 నుండి 1956 దాకా హైదరాబాద్ స్టేట్‌గా సొంత అస్తిత్వంతో బతికినా ఆంగ్ల భాష వచ్చిన అధికారుల కోసం కేంద్రం, రాష్ట్రం బయట వాళ్లకు ప్రభుత్యోద్యోగాలివ్వడం బానిసత్వ అంశను దూరం చేయలేకపోయింది. 1951 జనాభా లెక్కల ప్రకారం బొంబాయి, మద్రాసులో అక్షరాస్యత శాతం వరుసగా 35%, 29% ఉండ గా, తెలంగాణ అనగా హైదరాబాద్ స్టేట్‌లో చదువుకున్న వారు 15% మాత్రమే. అందులో ఆడవాళ్లు 3 శాతమే. ఓ వైపు మనుగడ కోసం తండ్లాడు తుండగా హైదరాబాద్, ఆంధ్ర స్టేట్‌లు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి జిల్లాల సంఖ్య 20 మాత్రమే. ఆ తర్వాత 3 జిల్లాలు ఏర్పడి ఎపిలో మొత్తం 23 జిల్లా అయినాయి. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను కలిపి 1.6.1979 నాడు విజయనగరం జిల్లా ఏర్పడింది. అట్లే కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని తాలూకాలను తీసుకొని 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటు చేశారు. 1972లో దానికి ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు. 1978లో హైదరాబాద్‌ను పట్టణ, గ్రామీణ ప్రాతిపదికన రెండు జిల్లాలుగా విభజించారు. ఆ తర్వాత గ్రామీణ జిల్లాకు రంగారెడ్డి అని పేరు మార్చారు. నిజానికి ఖమ్మం వరంగల్ జిల్లాలోని ఒక తాలూకా ప్రాంతం. 1953లో వరంగల్ జిల్లాలోని ఆరు తాలూకాలు విడదీసి ఖమ్మం జిల్లాకు పురుడు పోశారు. 1959 దాకా భద్రాచలం తూర్పు గోదావరి జిల్లాలో తాలూకాగా ఉండేది. అశ్వారావుపేట పశ్చిమ గోదావరిలో ఓ భాగమే. తిరిగి 2014 జులైలో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను పార్లమెంటు తీర్మానంతో ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఇలా రకరకాల భౌగోళిక మార్పులతో నేటి తెలంగాణ రూపు దిద్దుకుంది.
1948లో 8 జిల్లాల తెలంగాణ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ఏర్పాటుతో 10 జిల్లాల రాష్ట్రమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యార్ధం తెలంగాణ ప్రజలు జిల్లాల విభజనకై, కొత్త జిల్లాల ఏర్పాటుకే ఉద్యమాలు లేవనెత్తారు. అయితే ఆనాటి పాలకులు ప్రజల కోరికని మన్నించలేదు. నాడు ఆదిలాబాద్ జిల్లాలో భాగమైన మంచిర్యాల వాసులు దశాబ్దాలుగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు కోసం చేయని ప్రయత్నం లేదు. నాయకుల హామీలు నెరవేరనే లేదు. అదే రకంగా రంగారెడ్డి జిల్లాలో భాగమైన వికారాబాద్ ప్రజలు, మెదక్ జిల్లాలోని సిద్దిపేట వాసులు దూరభారాలను తప్పించేందుకు, జిల్లాల ఏర్పాటు కోసం ఎదురు చూశారు. అక్టోబర్ 2016లో తెలంగాణ ప్రభుత్వం 21 కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలు అయ్యాయి. తొలుత ముప్పయే అనుకున్నా కుమరంభీం అసిఫాబాద్ జిల్లా చేరి సంఖ్య 31 అయ్యింది.
31 జిల్లాలు ఉంటాయా తగ్గుతాయా అనే ఊగిసలాట కొంత కాలం కొనసాగింది. రాష్ట్రపతి ఆమోదం నానబెట్టడంతో ఆశనిరాశల మధ్య కాలం గడిచింది. అయితే కేంద్రం జోన్ల విభజనకు ఆమోద ముద్ర వేయడంతో జిల్లాల సంఖ్య నికరమైపోయింది. ఆనాడు చివరి నిమిషంలో కొత్త జిల్లాగా ఏర్పడ్డ అసిఫాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విచిత్రమేమిటంటే 1905 లో ఆదిలాబాద్ జిల్లా ఏర్పడేదాకా నిజాం స్టేట్‌లో అసిఫాబాద్ జిల్లా కేంద్రంగా విలసిల్లింది. ఇప్పటికీ జిల్లా జైలు అసిఫాబాద్‌లోనే ఉంది. 1913లో ఓసారి, 1941లో మరోసారి అది జిల్లా కేంద్రంగా కొనసాగింది కూడా. నిజాం రాజ్యం మహారాష్ట్రలోని రాబోర దాకా విస్తరించి ఉన్నందున అధికారులకు మార్గమధ్యంలో అసిఫాబాద్ విడిదిగా పని చేసేది. రైలు దిగి అసిఫాబాద్ పోయేందుకు అనుకూలంగా రెబ్బెన అనే గ్రామ సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ రైల్వే స్టేషన్ పేరు అసిఫాబాద్ రోడ్‌గానే ఉండిపోయింది. రాజధాని హైదరాబాద్‌కు దూరంగా ఉన్నందున అధికారిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అసిఫాబాద్, రాబోరల మధ్య ఎనిమిది విశ్రాంతి గృహాలుండేవి. ఇంతటి గత వైభవంగల అసిఫాబాద్ తిరిగి జిల్లాగా రూపుదిద్దుకోవడం గిరిజనుల కెంతో సౌలభ్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే అసిఫాబాద్ ప్రాంత గిరిజనుల్లో తమకు సుమారు యాభై కిలోమీటర్ల దూరమున్న మంచిర్యాల ఎటువైపో తెలియని వారూ ఉన్నారు.
ఈ నెల 17వ తేదీ నుండి కొత్తగా ఏర్పడిన ములుగు, నారాయణపేట రెండు జిల్లాలతో తెలంగాణ 33 జిల్లాల రాష్ట్రమైంది. ఎన్నో మలుపులు తిరిగిన తెలంగాణ నైసర్గిక స్వరూపం నేటికి ఓ సంపూర్ణతను సాధించిందనుకోవచ్చు. జిల్లాల ఏర్పాటు, విభజన సామాన్యుడికి సౌలభ్యమే కాని పాలకులకు జిల్లా కేంద్రం ఏర్పాటు, జిల్లా స్థాయి కార్యాలయాలు వాటికి అధిపతుల నియామకం అదనపు కార్యభారమే. దశాబ్దాలుగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఎదురు చూసిన తెలంగాణ ప్రజలు కోరిన మేరకు 33 జిల్లాల రాష్ట్రం ఉద్భవించడం స్వీయ పాలనలో సాధించిన విజయాల్లో ఒకటి. కాలం మారినకొద్దీ ప్రజల అవసరాల నిమిత్తం ముందుముందు మరిన్ని జిల్లాలు ఏర్పడ్డా ఆహ్వానించదగిందే.

బి.నర్సన్
9440128169

Article on 33 Districts of Telangana