Home ఆఫ్ బీట్ కృత్రిమ మేధతో ఉద్యోగావకాశాలు మెండు..!

కృత్రిమ మేధతో ఉద్యోగావకాశాలు మెండు..!

Artificial Intelligence

 

కారు బ్రేక్, యాక్సిలరేటర్‌ల దగ్గర్నుంచి టచ్‌స్క్రీన్, డ్రైవర్ లేకుండా వేల కిలోమీటర్లు వేగంగా వెళ్లే కార్ల వరకు తీసుకుంటే వీటన్నింటి వెనుక కృత్రిమ మేధ ఉంది. ఆధునిక టెక్నాలజీలో కొత్త కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు.  

రాబోయే కాలమంతా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు సంబంధించిందే అంటున్నారు నిపుణులు. ఏఐ అన్ని రంగాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రవేశించిన మనం వాడుకునే ప్రతి వస్తువూ దాదాపు మెషిన్ల కిందకే వస్తుంటాయి. కొన్నేళ్ల నుంచి కుట్టు మెషిన్, చేతి గడియారం, ఫ్యాక్టరీల్లో యంత్రాలు, స్మార్ట్ ఫోన్ లాంటివన్నీ మనిషి శ్రమను తగ్గిస్తున్నాయి. ఇవన్నీ మనం ఏం చేయించాలనుకుంటున్నామో అవి చేస్తున్నాయి. ఉదాహరణకు- మనం బ్రేక్ వేస్తే కారు ఆగడం, ఆక్సిలరేటర్ నొక్కితే ముందుకు వెళ్లడం లాంటివి. ఫోన్ విషయానికొస్తే మనం కాల్ నొక్కితే అవతలి వ్యక్తికి ఫోన్ వెళుతుంది. లేదంటే లేదు. ఇవన్నీ మనం చెబితే చేస్తాయి. వాటంతట అవి చేయలేవు.

ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే.. ఫ్యాక్టరీల్లో ఉపయోగించే యంత్రాల నుంచి ఏ మెషిన్ అయినా స్మార్ట్ చేయడం లేదా ఇంటెలిజెంట్ చేయడం. ఒకరకంగా తెలివితేటలను వాటిలో పెట్టడం. అది కోడింగ్ ద్వారా సాధ్యమవుతుంది. దీనిలో కొంత మేథమేటిక్స్, కోడింగ్ ఉంటాయి. వీటిని ఉపయోగించి ఒక యంత్రానికి తెలివితేటలను ఇవ్వడమే ఏఐ ఉద్దేశం. ఇది గత పదేళ్లలో వచ్చేసిన సబ్జెక్టేమీ కాదు. దీనిపై పరిశోధన 60 ఏళ్ల క్రితం నుంచే ప్రారంభమైంది.
మెషిన్ లర్నింగ్, డీప్ లర్నింగ్, డేటా సైన్స్ అనే పదాలు ఎక్కువగా వింటుంటాం. ఇవన్నీ ఏఐకి దగ్గరగా ఉండే విభాగాలు. ఒక రకంగా మెషిన్ లర్నింగ్, డీప్ లర్నింగ్ ఏఐలో ఉపవిభాగాలు. డేటా సైన్స్ ఏఐలో ఉండే చాలా కాన్సెప్టులను వాడుకుంటుంది, కంప్యూటర్ సైన్స్‌లోని వివిధ సబ్జెక్టులను తెచ్చుకుంటుంది.

ఏఐతో అన్నీ సాధ్యం
ఈ మధ్యకాలంలో వచ్చిన ఆండ్రాయిడ్, స్మార్ట్‌ఫోన్లలో.. దానిలో ఫొటో తీసేటపుడు ముఖాలను గుర్తించి, అక్కడ లైటింగ్ ఎక్కువ పడేలా చేయడం గమనించే ఉంటాం కదా. ఇది ఏఐ వల్లే సాధ్యమవుతుంది. అలాగే యూట్యూబ్‌లో ఒక పాటను చూస్తుంటే, దానికి సంబంధమున్న మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, డైరెక్టర్, మెలోడీ, అదే సినిమాకు చెందిన వేరేపాట.. ఇలా ఏదో ఒకదానితో పోలివుండే పాటలన్నింటినీ చూపిస్తుంది. ఆటోప్లే ఆప్షన్‌ను ఎంచుకుంటే..ఒకదాని తరువాత ఒక పాట వస్తుంది కదా? ఇవన్నీ ఏఐ వల్ల జరుగుతున్నవే!

ఫార్మస్యూటికల్ సంస్థల విషయంలో క్యాన్సర్ గుర్తింపు, దాని డయాగ్నొసిస్‌కు ఏఐను ఇప్పటికే వాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల జెనెటిక్, మాలిక్యులర్ డేటా.. ఇలా సమాచారాన్ని అంతటినీ సేకరించి, వాటిలో ఏఐను ఉపయోగించి రోగనిర్ధారణ, నివారణ చర్యలు చేపడుతున్నారు. ఈ విధానం ద్వారా చాలా త్వరగా, కచ్చితంగా క్యాన్సర్ నిర్ధారణ సాధ్యమవుతోంది. ఉదాహరణకు- చర్మంపై ఉండే ఒక చిన్న దద్దుర్లు వంటి వాటిని ఫొటో తీసి, పరీక్షించుకుంటే అది చర్మ క్యాన్సర్ అవునో కాదో కచ్చితంగా ఏఐ ద్వారా నిర్ధారించగల సిస్టమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి.

అన్ని రంగాల్లోనూ ఉపయోగం
వ్యవసాయంలో ఒక ఆకు మీద ఏదో చీడో పీడో ఉంది. ఒక్క ఫోటో తీసి ఇస్తే విశ్లేషించి, ఏ మందు ఎంత మోతాదులో వాడాలో వంటి పరిష్కారాలను కూడా సూచిస్తుంది ఏఐ. మొంటాసో వంటి పెద్ద సంస్థలు ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నాయి. మనం ప్రయాణించే కారు హఠాత్తుగా ఆగిపోతే ఎంత హైరానా పడతామో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ మన కారుకి ఇంకొన్ని రోజుల్లో ఫలానా సమస్య రాబోతోందని ముందే తెలిస్తే ఆ బాధలన్నీ తప్పుతాయి కదా… ఆ పనిని ఏఐ చేస్తుంది. బీఎండబ్ల్యూ, మెర్సిడిస్ వంటి పెద్ద సంస్థల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. మనిషి లేకుండా కారు వెళ్లడాన్ని పదేళ్ల క్రితం ఎవరైనా ఊహించారా… ఆలోచించడానికే భయపడి ఉంటారు. మరి ఇప్పుడు ఒక సాధారణ బీటెక్ విద్యార్థి తన ల్యాప్‌టాప్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ బేసిక్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నాడు. ఇదీ ఏఐ మహిమే. ఇప్పుడు సెల్ఫ్‌డైవింగ్ కార్లు లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి కూడా!

ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉదాహరణలు. బ్యాంకింగ్ రంగంలో జరిగే తప్పులను పసిగట్టడం, ఎవరెవరు ఎంత బీమా ఎప్పుడెప్పుడు కట్టాలో నిర్ణయించడం వంటి ఎన్నో పనులను ఇప్పుడు ఏఐ అవలీలగా చేసేస్తోంది. ముందస్తుగా నేరాన్ని పసిగట్టే విధానాన్ని కూడా ఏఐతో రూపొం దించవచ్చు. వచ్చే 10, -20 ఏళ్లలో ప్రతి పరిశ్రమ, అప్లికేషన్లలోకీ ఏఐ ప్రవేశించడం ఖాయం అంటున్నారు నిపుణులు.

నిపుణుల కొరత
మనదేశంలో ఏఐ, మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్ రంగాల్లో వేల ఉద్యోగాలు ఫ్రెషర్లకూ, అనుభవజ్ఞులకూ లభిస్తున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీల నుంచి చిన్న స్టార్టప్‌ల వరకూ వందల కంపెనీలు ఈ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. జాబ్ పోర్టల్‌కి వెళ్లినా ప్రతిరోజూ వందల పోస్టులను డేటాసైన్స్, ఏఐ, మెషిన్ లర్నింగ్‌లలో ఉద్యోగాలను ప్రకటిస్తున్నారు. కానీ ఉద్యోగ మార్కెట్లో ఏఐ నిపుణులు అవసరాలకు తగినంతమంది దొరకటం లేదనేది వాస్తవం. పెద్ద కంపెనీల్లో కూడా ఏఐ నిపుణులు తక్కువే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటినుంచీ ఏఐలో కెరియర్‌ను ఆరంభించి, నిర్మించుకోగలిగితే పదేళ్ళలో చాలా సీనియర్ లేదా ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ అవుతారు. ఏఐపై పట్టు వచ్చేస్తుంది. ఆ రంగంతో పాటు దీనిలో ప్రవేశించినవారి కెరియర్ కూడా ఎదుగుతుంది. దీనిలో వేతనాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏఐలో నైపుణ్యాలు సంపాదించే పనిలో ఉండండి మరి..

Artificial Intelligence To New courses in modern technology

Telangana Latest News