Home దునియా జింకా జీవకళ

జింకా జీవకళ

Jinka Rama Raoవర్ణ రంజితమైన కుంచెను మంత్ర దండంగా మార్చి అనితర సాధ్యమైన, అత్యంత రమణీయమైన, అద్భుత సుందరలోకాలను సృష్టించాడాయన. రసమయ రేఖలతో, రంగుల కుంచెలతో మంజుల రవాలను ధ్వనింపజేసి మనోజ్ఙ దృశ్యాలను సాక్షాత్కరింపచేశాడు. ప్రకృతి ఒడిలో చిత్రకళలో ప్రథమ పాఠాలు నేర్చుకున్నాడు. గీతలలో దాగివున్న సృజనాత్మకతను, రేఖలలో ఒదిగి వున్న రమ్యతను చిన్నతనంలోనే ఆకలింపు చేసుకొని చిత్రకళారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు జింకా రామారావు. అంతే కాదు గీతాంజలిలోని 103 ఖండికల పరమార్థాన్ని వివరిస్తూ గీసిన వివిధ చిత్రకళా రీతులు ఆయన నైపుణ్యానికి, వైవిధ్యానికి అద్దం పడతాయి. చిన్నతనంలోనే చిత్రకళా ప్రతిభా కిరణాలను వికసింపచేసి ఎల్లలు లేని చిత్రకళా రంగంలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న జింకా రామారావుని దునియా పలకరించింది.

మీ బాల్యం,కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?

నేను 1946 నవంబర్ 29న సత్తెనపల్లి గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాను. మా నాన్న జింకా కోటయ్య, అమ్మ సుబ్బమ్మ మగ్గం పనులు చేస్తుండేవారు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు సంతానం అందులో ఆఖరి వాడ్ని నేను. చిన్నవాడిని అవడంతో మా ఇంట్లో వాళ్ళు నన్ను చాలా గారాబంగా చూసుకునేవారు. మా అక్కయ్యలిద్దరూ నన్ను కొడుకులా భావించేవారు. నా బాల్యం, విద్యాభ్యాసం దాదాపుగా మొత్తం సత్తెనపల్లిలోనే జరిగింది. మా ఊరు ప్రకృతి సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. గ్రామీణ జీవన శైలి, తెలుగుదనం చిన్నతనం నుంచి నా ప్రాణ మిత్రులు.

మీ కుటుంబంలో చిత్రకారులెవరైనా వున్నారా? చిత్రకళా రంగం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి?

మా కుటుంబంలో చిత్రకళతో ఎవరికీ పరిచయం లేదు. కానీ నాకు మాత్రం ఊహ తెలిసినప్పట్నుంచి చిత్రకళే ప్రపంచం. నేను మూడవ తరగతి నుంచే ప్రతి రోజు కొత్త కొత్త బొమ్మలను వేయడానికి ప్రయత్నించే వాడిని. పాఠశాలలో బలపంతో పలక మీద ఎప్పుడూ ఏదో ఒక చిత్రాన్ని గీస్తుండేవాడిని. నా పక్కన వున్న పిల్లలందరూ ఆ చిత్రాలను తీసుకెళ్ళి ఇది రామారావు గీసాడండీ అంటూ మాష్టారుకి చూపించేవారు. వాటిని చూసి మాష్టారు నువ్వు బాగా గీస్తున్నావురా, నీకు మంచి భవిష్యత్తుంటుందని ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహమే నన్ను ఈరోజు మీ ముందు చిత్రకారుడిగా నిలబెట్టిందని నా నమ్మకం. మా హైస్కుల్ డ్రాయింగ్ టీచర్ వజ్రగిరి జోసఫ్ గారు డ్రాయింగ్ రూంని ఎప్పుడూ కలర్‌ఫుల్‌గా వివిధ రకాల చిత్రాలతో అలంకరించేవారు. వాటిని చూసిన ప్రతిసారీ నాకు ఏదో తెలియని ఆసక్తి కలిగేది. ఎక్కడైనా, ఎవరైనా సైన్‌బోర్డ్ రాస్తుంటే ఆ లైట్ అండ్ షేడ్ ఎలా కలుపుతారు ఆ రంగు ఎలా వస్తుందని ఎప్పుడూ ఆలోచిస్తూ వుండేవాడిని. ఆ ఆలోచనలే నన్ను చిత్రకళా రంగం వైపు మరిన్ని అడుగులు ముందుకేయించాయి.

మీ గురువుగారి గురించి చెప్పండి?
మల్లం గురవయ్య గారి దగ్గర చిత్ర కళలో మెళుకువలు చేర్చుకున్నాను.ఆయన కలకత్తాలోని శాంతి నికేతన్‌లో చిత్రకళను అభ్యసించారు. గురువు గారు ఒకసారి సత్తెనపల్లి వచ్చినప్పుడు మా నాన్న నా పెయింటింగ్స్ చూపించారు. వాటిని చూసి
చాలా బాగా వేశాడు నాతో పంపించండి చిత్రకళలో మంచి భవిష్యత్తుంటుందని చెప్పి తన వెంట తీసుకెళ్ళారు. ఆయన ఎప్పుడూ ఎదో ఒక చిత్రాన్ని గీయడానికి ప్రయత్నించమనేవారు. ఎక్కడికెళ్ళినా వెంట స్కెచ్‌బుక్‌ని తీసుకెళ్ళి డైరెక్ట్ స్కెచ్‌లని గీయమనేవారు. మన పరిసరాలే మనకు గురువులు ప్రకృతి అందాలే గీతలకు కొత్త ఆశలని చెప్పి నాతో ప్రతి రోజు విభిన్న చిత్రాలను గీయించారు. ఆయన శిక్షణే నాకు పది మందిలో మంచి చిత్రకారుడనే గౌరవాన్ని కల్పించింది.

మీకు ఊహ తెలిసిన తర్వాత గీసిన మొదటి చిత్రమేది?
చిన్నతనం నుంచి ఎప్పుడూ ఏదో ఒక చిత్రాన్ని గీస్తూ వుండేవాడిని. అలా ఒక రోజు అనుకోకుండా నాలుగో తరగతిలో పలక మీద గీసిన బుద్ధుడి బొమ్మ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందరూ మెచ్చు కోవడంతో ఇంకా బాగా వెయ్యాలనే ఆలోచనతో కొత్త కొత్త బొమ్మలు వేయడానికి ప్రయత్నించాను.

గీతాంజలిలోని ఖండికల మూలాంశాన్ని చిత్రాల ద్వారా వివరించాలనే ఆలోచన ఎలా కలిగింది?
గీతాంజలిలో మొత్తం 103 ఖండికలున్నాయి. ప్రతి ఖండిక భావాన్ని నా చిత్రాలలో వివరించే ప్రయత్నం చేశాను. భారతదేశంలోనే గీతాంజలిలోని 103 ఖండికల పరమార్థాన్ని గీతలతో వివరించడం ఇదే తొలిసారి. మొదట్లో మామూలుగా పెన్సిల్ స్కెచ్‌లు వేశాను. అది చూసిన కొందరు బాగా వేస్తు న్నావు ఇంకా బాగా చెయ్యమని చెప్పారు. వారి సలహాతో కొత్తగా గీయాలనే ఆలోచన కలిగింది. 103 గీతాలకు గీయడానికి నాకు 5 సంవత్సరాల సమయం పట్టింది. గుంటూరులో ఈ చిత్రాల ఎగ్జిబిషన్ కూడా నిర్వహించాము. అంతే కాదు గీతాంజలిని నాదైన లాంగ్వేజ్‌లోకి మళ్ళీ రాసుకొని చిత్రాలను గీశాను.

మీ చిత్రాలన్నీ ఎక్కువగా గ్రామీణ జీవన శైలికి దగ్గరగా వుంటాయి ఎందుకని?
నేను పుట్టి పెరిగిందంతా పల్లెటూరిలోనే. చిత్రకళా ప్రగతి పథానికి ప్రకృతే మూలం. అందువలన నా చిత్రాలన్నీ గ్రామీణ జీవన శైలికి అద్దం పట్టేలా వుంటాయి. ఎప్పుడూ ప్రకృతి పలుకులను నా చిత్రాల ద్వారా వివరించాలనే ప్రయత్నం చేస్తుంటాను. కోటి అందాల గ్రామీణ శైలియే నా గీతలకు స్ఫూర్తి.

ఇప్పటి వరకు మీరందుకున్న ప్రశంసలలో ఎప్పటికీ మర్చిపోలేనిది?
నేను అచ్చంగా ఆయిల్ పెయింటింగ్స్, వాటర్ పెయింటింగ్స్ అంటూ దేనికో ఒక్క దానికి స్టిక్ అవ్వలేదు. అన్ని రకాల మీడియమ్స్‌లో వర్క్ చేయడం నాకు ఇష్టం. నా పెయింటింగ్స్‌లో ఇండోనిక్ వర్క్‌ని కూడా మీరు గమనించవచ్చు. ఇండోనిక్ లైన్ డ్రాయింగ్స్‌లో భావ ప్రకటన చేసే చిత్రాలు వేశాను. చెట్టుని ప్రాతిపదికగా చేసుకొని గీసిన ఈ చిత్రాలను మీరు ఇంకెక్కడా చూడలేరు. చెట్టు జీవితంలో చోటు చేసుకునే మార్పులు, చెట్ల మీద నివసించే పక్షులు, పక్షులకు చెట్లకు మధ్య గల బంధం ఇలా వివిధ అంశాలను ఆధారంగా చేసుకుని 20 పెయింటింగ్స్ వేశాను.ఆ చిత్రాలు చూసి ప్రముఖ చిత్రకారుడు కొరసాల సీతారామ స్వామి గారు మెచ్చుకున్నారు. ఒక కళాకారుడిగా తోటి కళాకారుడిని మెప్పించగలగడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఆయన ప్రశంసలను నేను ఎప్పటికీ మర్చిపోలేను.

ఇప్పటి వరకు దాదాపు ఎన్ని పెయింటింగ్స్ వేశారు? అవార్డులు ఏమైనా అందుకున్నారా?
దాదాపుగా 400 పెయింటింగ్స్ వేశాను. ఆంధ్రా బ్యాక్ ఫౌండర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య సంస్థ నన్ను గుర్తించి అవార్డును అందజేసింది. అలాగే అంతర్జాతీయ యునెస్కో అవార్డు, సత్తెనపల్లిలోని ప్రగతి కళాభవన్ అవార్డు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందుకున్నాను.

చిత్రకళా రంగంలో స్థిరపడాలనుకునే నేటి తరం వారికి మీరేం చెప్తారు?
చిత్రకళా రంగంలో స్థిరపడటం అంత సులువు కాదు. ఒక కళాకారుడికి సమాజంలో గుర్తింపు రావడానికి చాలా కాలం పడుతుంది. ఎంత గుర్తింపు వచ్చినా సంపాదన మాత్రం అంతంత మాత్రంగానే వుంటుంది. అందువలన ఈ రంగంలో స్థిరపడాలనుకునేవారు నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వుండాలి.

Artist Jinka Rama Rao Interview
ఆవుల యమున