Home వార్తలు కళలు, సంస్కృతి కొలువు దీరిన గ్రామం శిల్పారామం

కళలు, సంస్కృతి కొలువు దీరిన గ్రామం శిల్పారామం

పేరు శిల్పారామం, నిజానికి అన్ని జానపద కళల వేదిక ఇది. హైదరాబాద్, మాదాపూర్‌లోని హైటెక్ సిటీకి దగ్గరలో 1992 లో ప్రారంభమైన ఈ విశిష్ట, సుందర సువిశాల కళారామం అనునిత్యం చూపరులను ఆకట్టుకుంటున్నది. కనువిందుతోబాటు ఎంతో పరిజ్ఞానాన్ని కూడా పంచి ఇస్తున్నది. 65 ఎకరాల విస్తీర్ణంలో కొలువుదీరి ఉంది. హస్తకళల ఉత్పత్తులను సరసమైన ధరలకు అందిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే ప్రాచీన కళల అత్యాధునిక టూరిస్ట్ కేంద్రమిది. మొత్తంగా చూస్తే కళాకారుల గ్రామం కళ్లకు కడుతుంది.
భారతదేశ పురాతన కళలను, సంప్రదాయాలను పరిరక్షించే ఆలోచనతో ఈ గ్రామాన్ని రూపొందించారు. ఏడాది పొడవునా సంప్రదాయ పండుగలను ఇక్కడ జరుపుకుంటారు. కళలపై ప్రేమతో, హస్తకళలపై మక్కువతో యావద్భారతం నుంచి రకరకాల వృత్తి కళాకారులు ఇక్కడికి వచ్చి తమ తమ వృత్తి నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన హస్తకళాకారుల సృజనాత్మక శక్తి, కళా నైపుణ్యం కనిపిస్త్తుందిక్కడ. కళాత్మక హృదయంతో మనం ఖరీదుచేసే ప్రతి వస్తువు వెనక సంప్రదాయ హస్తకళా లాఘవం కానవస్తుంది.

రాళ్లు రప్పలమయం..
shilparamam1హైదరాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిల్పారామ ప్రాంతం 1992 కు ముందు రాళ్లు, రప్పలు, తుప్పలతో నిండి ఉండేది. అలాంటి ప్రదేశాన్ని హస్తకళల గ్రామంగా శిల్పారామంగా మలచడం వెనుక చాలా కృషి దాగి ఉంది. ఎంతో మంది కార్మికుల శ్రమ ఫలితమే ఈ గ్రామం. భారత దేశంలోని కళలన్నింటినీ ఒకచోటకు చేర్చాలనే ఉద్దేశంతో తంజావూరుకు చెందిన సౌత్‌జోన్ కల్చరల్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి దీనిని ఏర్పాటుచేశారు. నాలుగేళ్ల తర్వాత నెమ్మదినెమ్మదిగా ఒక రూపాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుత తరానికి మన కళలు, భారత దేశ సంప్రదాయాల గురించి అంతగా తెలీదు. పుస్తకాల్లో చదవడం తప్ప. వాళ్లు కళాకారులను గానీ, కళల్ని గానీ ప్రత్యక్షంగా చూసే అవకాశం, ఓపిక, తీరిక లేవు. అలాంటివారికి వీటిని పరిచయం చేయాలి, కళాకారుల శ్రమైక జీవనాన్ని చూపించాలనే ఉద్దేశమే శిల్పారామం ఏర్పాటుకు కారణం. కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడపడానికి అనుకూలమైన ప్రదేశం హైదరాబాద్ నగరంలో ఒకటుందంటే అది శిల్పారామమే.
మన సంప్రదాయ కళలు
రాజస్తాన్‌కు చెందిన బాందినీ వర్క్ , కశ్మీర్‌కు చెందిన పేపర్ వర్క్, బీదర్‌కు చెందిన బిద్రీ వర్క్, మణిపూర్‌లోని బేంబూ ( వెదురు) వర్క్, యూపీ బ్రాస్‌వేర్ ( ఇత్తడి) వర్క్, హైదరాబాద్ ముత్యాలు, అదేవిధంగా మట్టి కుండలు, టెర్రకోట, ఉడ్ (చెక్క) కార్వింగ్, జువెల్లరీ ( నగలు), నిర్మల్ పెయింట్స్, కొండపల్లి బొమ్మలు, బంజారా గుజరాతీ కశ్మీరీ, పటచిత్ర మధుబని పెయింటింగ్స్, పోచంపల్లి, వరంగల్ దరీస్, జూట్ (జౌళి) బేగ్స్, వివిధ రకాల రాష్ట్రాల చేనేత వస్త్రాలు, ఫైతానీ, కశ్మీరీ, సంభాల్‌పూర్, కాంజీవరం, తంజావూరు, ధర్మవరం, పెద్దాపురం, మదురై, గుంటూరు, బందర్ మొదలైన ప్రసిద్ధిగాంచిన చేనేత వస్త్రాలు అన్నింటినీ ఒకేచోట చూడవచ్చు. భారతీయ హస్తకళాకారుల పనితనాన్ని, ఆయా వస్తువుల్ని తయారుచేసే విధానాన్ని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు.
శిల్పారామంలో వేదికలు …
లండన్‌లోని ఓ పార్క్‌లో ఏర్పాటుచేసిన వేదికలమీద ఎలాంటి కళాకారులైనా తమ వాయిద్యాలతో సహా ఉచితంగా కళను ప్రదర్శించుకోవచ్చు. సంస్థ సభ్యులు ఈ విషయాన్ని గమనించి శిల్పారామంలో కూడా అటువంటి వేదికలను ఏర్పాటుచేయించారు. సంప్రదాయ వేదిక, శిల్పసీమ, రాక్ హైట్స్, మౌంటెన్ హైట్స్, అంఫి థియేటర్ లాంటి వేదికలు శిల్పారామంలో ఉన్నాయి. ప్రతి శని ఆదివారాల్లో ప్రముఖుల ప్రదర్శనలు, ఆంధ్ర నాట్యం, యక్షగానం, యువ కళాకారుల, గిరిజన, కోయ, డప్పుల విన్యాసాలు మనసును దోచుకుంటాయి. రెండు వేల మంది పట్టేలా డిజైన్ చేసి నిర్మించారు ఈ వేదికలను. పుట్టినరోజు వేడుకలు, రిసెప్షన్, గెట్‌టుగెదర్‌లాంటి చిన్న చిన్న పార్టీలను కూడా ఇక్కడ చేసుకుంటారు. ఇక్కడ ప్రతి మూడు నెలల వరకు అన్ని కార్యక్రమాలకు వేదికలు బుక్ ముందే అయిపోయి ఉంటాయి.
మ్యూజియంలు..
shilparamam2హ్యాండీ క్రాఫ్ట్ మ్యూజియం, హ్యాండ్‌లూమ్స్ మ్యూజియం, పాటరీ మ్యూజియం, లెదర్ పప్పెట్రీ మ్యూజియం, గ్లాస్ హౌస్, విలేజ్ మ్యూజియం, శిల్పసీమ ఇవన్నీ సందర్శకులకు విజ్ఞానాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి.
రూరల్ మ్యూజియం రావడానికి కారణం…
దుబాయ్‌లో జరిగిన ఓ పండుగలో చూసిన ఫైబర్‌తో చేసిన రూరల్ మ్యూజియం స్ఫూర్తితో ఇక్కడ కూడా గ్రామీణ మ్యూజియంను నెలకొల్పారు. వాస్తుశిల్పి బి. వెంకట్ రూరల్ మ్యూజియాన్ని తయారుచేశారు. కళాకారుల జీవనవిధానం తెలిపే విధంగా ఈ మ్యూజియం ఏర్పాటయింది. మట్టి, సిమెంటు, ఫైబర్ బొమ్మలతో తయారుచేశారు. మూడు నెలలకొకసారి వాటి బట్టలు, రంగులు, జుట్టు అవన్నీ మారుస్తూ ఉంటారు. ఇక్కడ పనిచేసే వారికి శిల్పారామంలోనే వసతి కల్పిస్తుంటారు. శంకర్ అనే కళాకారుని ఆధ్వర్యంలో ఇక్కడ నిరంతరం పని జరుగుతూనే ఉంటుంది. పండుగ సమయాల్లో వీరంతా చాలా బిజీగా ఉంటారు.
కళాకారుల కోసం…
కొత్తగా వస్తున్న కళాకారులు తమ కళను ప్రదర్శించాలంటే రవీంద్రభారతిలాంటి చోట్ల ఎక్కువ డబ్బు కట్టాల్సి ఉంటుంది. అంత భరించలేరు. కళను ప్రదర్శించనూలేరు.

మరి వాళ్ల పరిస్థితేంటి….
ఇవన్నీ ఆలోచించి కళాకారులు ఉచితంగా తమ కళను ప్రదర్శించుకునే సదుపాయం ఇక్కడ కల్పించారు. కళాకారులకు ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తారు. వాళ్లను ప్రోత్సహిస్తారు. ఇక్కడకు వచ్చే సందర్శకులే ప్రేక్షకులౌతారు. సందర్శకులకు షాపింగ్‌తోపాటు వినోదం కూడా దొరుకుతుంది. హరికథలు, చిందు, యక్షగానాలు, బుర్రకథలు, ఒగ్గుడోలు ప్రదర్శించేవారికి వారివారి ప్రదేశాల నుంచి రాకపోకలకు చార్జీలు, భోజనం లాంటి అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తారు.
మేళాల ప్రత్యేకం…
artsవివిధ జిల్లాల నుంచి కళాకారులు వచ్చి వాళ్ల వస్తువులతో ఇక్కడ అమ్మకాలు జరుపుకుంటుంటారు. వచ్చేవాళ్లు బయట గదులు అద్దెకు తీసుకుని ఉంటారు. పేద కళాకారులకు మాత్రం ఇక్కడ వసతి దొరుకుతుంది. సాయంత్రం పూట శాస్త్రీయ సంగీతం, జానపద కళలు, గిరిజన కళల ప్రదర్శనలుంటాయి.
హేండ్‌లూమ్స్..
చేనేత కార్మికుని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం కష్టపడుతుంటారు. కానీ నెలకు పదివేలు కూడా సంపాదించలేరు. వాళ్లకు దళారీ అవసరం లేకుండా వాళ్లే స్వయంగా అమ్ముకునేలా ఇక్కడ ఏర్పాటుచేశారు.
ఇంకా ఎక్కడెక్కడంటే…
హైదరాబాదులో విజయం పొందింది కనుక విశాఖపట్నం, తిరుపతి, కడప, కాకినాడలాంటి చోట్ల కూడా శిల్పారామాలు ఉన్నాయి. తెలంగాణలో సంగారెడ్డిలో మరో శిల్పారామం మొదలయింది. అవి ఇంకా అభివృద్ధి కావడానికి సమయం పడుతుంది.
బడ్జెట్ ఎలా మరి..
శిల్పారామంలో గేట్ దగ్గర వసూలు చేసే టికెట్ డబ్బులు, సంప్రదాయ వేదిక, రాక్ హైట్స్, ఫౌంటెన్ హైట్స్‌లాంటి వేదికలలో జరిగే పెళ్లి, రిసెప్షన్, పుట్టినరోజు వేడుకలులాంటి వాటికి ఇంత డబ్బని వసూలు చేస్తారు. అదంతా శిల్పారామంలో పనిచేసే ఉద్యోగులకు, పనివాళ్లకు జీతాలుగా అందిస్తారు.
కళాకారులకు సన్మానం..
ఇక్కడికి వచ్చి తమ కళలను ప్రదర్శించే కళాకారులను శిల్పారామం యాజమాన్యం ఇక్కడ తయారుచేసే పోచంపల్లి శాలువాలతో తగిన విధంగా సత్కరిస్తోంది. పోచంపల్లి లూమ్(మిల్లు) ఉంది. అతిథులకు అతనే శాలువాలు తయారుచేసి ఇస్తాడు. తయరుచేసిన కళాకారులకు తగురీతిలో చెల్లిస్తుంది యాజమాన్యం.
స్టాల్స్ ఎన్నంటే…
350 స్టాల్సున్నాయి. పాటరీ టెర్రకోట, ఉడ్ కార్వింగ్, జువెల్లరీ, నిర్మల్ పెయింట్స్, కొండపల్లి బొమ్మలు, బంజారా గుజరాతీ కశ్మీరీ, పటచిత్ర మధుబని పెయింటింగ్స్, హేండ్‌లూమ్స్, పోచంపల్లి, వరంగల్ దరీస్, జూట్ బేగ్స్ అన్నీ ఇక్కడ లభిస్తాయి. అక్టోబర్‌లో ప్రతి ఏడూ దసరా మేళా, డిసెంబర్ 15 నుంచి జనవరి 1 వరకు ఆలిండియా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళాలు జరుగుతాయి. అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ లాంటి చాలా చోట్ల నుంచి వచ్చి స్టాల్స్‌ను పెట్టుకుంటారు. బయట స్టాల్‌కు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడైతే సబ్సిడీ లభిస్తుంది. డిసిహెచ్ ( డెవలప్‌మెంట్ హ్యాండీక్రాఫ్ట్) వాళ్లది కార్డు ఉంటే తప్పనిసరిగా స్టాల్ దొరుకుతుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా సందడిగా ఉంటుంది. సందర్శకులు అనేకమంది వస్తుంటారు. ఏడాది పొడవుగా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సమ్మర్ క్యాంప్ , ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రెయినింగులు, ఆర్టిజం సెమినార్‌లు పెడుతుంటారు. నిఫ్ట్‌లోని ప్రొఫెసర్లు వచ్చి సెమినార్‌లో పాల్గొంటారు.
ఎవరెవరు పనిచేస్తుంటారు …
shilparamam3పరిపాలనా విభాగం, ల్యాండ్ స్కేప్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్లు ఇక్కడ నిరంతరం పనిచేస్తుంటాయి. శిల్పారామంలో కళాకారుల నుంచి డబ్బులు వసూలు చేయరు. దీని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్లు వేలకొద్దీ ఉన్నారు. గవర్నమెంటు, ప్రయివేటు స్కూలు పిల్లలకు క్రాఫ్ట్ ఎవేర్‌నెస్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. 3వ తరగతి నుంచి 10 వరకు విద్యార్థులకు కళల గురించి ప్రదర్శనలు ఇస్తుంటారు. డెమో కోసం వచ్చే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టికెట్ కూడా కొనక్కరలేదు.
ఆర్టిస్టులకు ఉచితం…
మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, నాగాలాండ్‌ల నుంచి మేళా సమయాలలో వచ్చే కళాకారులకు అన్ని సదుపాయాలు కలిగిస్తుంటారు. ఇక్కడ 6 గెస్టుహౌస్‌లున్నాయి. బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులకు ఉచితంగా ఇస్తారు. జానపద కళాకారులకు అన్నీ ఉచితమే.

సవివరంగా చెప్తుంటాను…
మాది ఆదిలాబాద్ జిల్లా నిర్మల్. గత పదేళ్ల నుంచి ఆర్టిస్టుగా పనిచేస్తున్నాను. మా నాన్నగారు బి. వెంకన్న జాతీయ అవార్డు గ్రహీత. నేను 2007లో మాస్టారుగా ఎంపికై శిల్పారామంలో పనిచేస్తు న్నాను. ప్రస్తుతం మ్యూజియం ఇంచార్జిగా పనిచేస్తున్నాను. ఏ బొమ్మనైనా లైవ్ డెమానిస్ట్రేషన్ ఇస్తాను. ఆల్‌ఓవర్ ఇండియా క్రాఫ్ట్, తెలంగాణ క్రాఫ్ట్, సిల్వర్ ఫిలిగ్రీ, కొండపల్లి అన్నింటి గురించి సవివరంగా చూపించడం (డెమో) ద్వారా చెప్తాను. మా శిల్పారామంలో జరిగేవే మా పండుగలు.

మ్యూజియం ఇంచార్జి , రాజేంద్రకుమార్

ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు 

సంక్రాంతి పండక్కి అంతా వాళ్ల వాళ్ల ఊరెళ్తుంటారు. మరి ఇక్కడ ఉన్నవాళ్లంతా శిల్పారామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో ఇక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది. నగరంలో నివసించే వాళ్లకు ఇవన్నీ కొత్తగా కనిపిస్తుంటాయి. పల్లెటూర్లలో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఇక్కడ కూడా అలాంటిదే కనిపిస్తుంది. పల్లె సుద్దులు, జానపద కళారూపాలు, డోలు వాయిద్యాలు, జగ్గు నాగారా, కొమ్ము వాయిద్యాలు వాయించే కళాకారులు వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడకు వచ్చి వారి కళలను ప్రదర్శిస్తుంటారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారిక్కడ. ఇంట్లో తయారుచేసుకున్న పిండి వంటల్ని తెచ్చుకుని ఇక్కడ పిక్‌నిన్ జరుపుకునే వారు మరికొందరు. అందరూ కలిసి ఒకచోటనే పండుగ చేసుకోవడమనేది శిల్పారామంలోనే చూడొచ్చు. ప్రతిఏటా ఇక్కడ సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటారు.

విదేశీయులకు ఇష్టం..

నా పేరు అరుణ. సికింద్రాబాద్ వారాసిగూడలో ఉంటాం. చిన్నా పెద్ద అందరికీ అద్దాలు కుట్టిన వస్త్రాలను ఇక్కడ అమ్ముతుంటాం. గుజరాతీ పండుగలప్పుడు ఎంబ్రాయిడరీ బట్టలు అమ్ముతాం. నేసిన బట్టలపై అద్దాలు కుట్టి అందజేస్తున్నాం. విదేశీయులు బాగా కొంటుంటారు. మేళా పండుగల సమయంలో బాగా గిరాకీ ఉంటుంది. మాకు వర్కర్లు ఉన్నారు. మేం అన్ని రాష్ట్రలకు వెళ్లి వాళ్లు ఎలా తయారుచేస్తున్నారో చూసి వాటిని ఇక్కడ అలాగే తయారుచేస్తున్నాం.

 స్టాల్‌పైనే ఆధారపడ్డాం..

నా పేరు సంతోషి. మేం ఇక్కడ పదేళ్ల నుంచి స్టాల్ పెట్టుకుంటున్నాం. నా భర్తకు పక్షవాతం రావడంతో మేం దీనిపైనే ఆధారపడ్డాం. ఇవన్నీ త్రెడ్ వర్క్. మేం తయారుచేస్తాం. పర్వత్‌నగర్‌లో ఉంటున్నాం. మాదాపూర్ దగ్గర ఉంటాం. ఇక్కడే తయారుచేస్తుంటాం. మాకు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. క్వాలిటీ తెలిసిన కస్టమర్ ఆలోచించకుండా తీసుకుంటారు. డిజైన్ మొత్తం మేం చేస్తాం. మా పిల్లల చదువు, ఇల్లు గడవడం మొత్తం స్టాల్ వల్ల వచ్చిన అమ్మకం డబ్బుతోనే. మా దగ్గర మంచి ముత్యాలు దొరుకుతాయి. నాకు ఇద్దరు పిల్లలు. చదువుకుంటున్నారు. నాకు పనిలో సాయం చేస్తుంటారు. క్రిస్టల్, స్టోన్స్, ముత్యాలు అన్ని రకాలుంటాయి. పండుగల సమయంలో పబ్లిక్ ఎక్కువగా వస్తుంటారు. దీంతో బాగా గిరాకీ ఉంటుంది.

 కొనకుండా వెళ్లరు…

నేను పూనం రమేష్. పదేళ్ల నుంచి ఇక్కడ స్టాల్ పెట్టుకుంటున్నాం. కొండాపూర్‌లో ఉంటాం. మా వ్యాపారం మాగుంది. లాస్‌లేదు. గుజరాత్‌లో మేం స్వయంగా తయారుచేసిన వాటిని ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటాం. అన్నీ చేత్తో తయారుచేసినవే. మా కుటుంబ సభ్యులందరం పనిచేస్తుంటాం. ఇంటికి కావల్సిన డెకరేషన్ వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. మాకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. వచ్చిన వాళ్లు కొనకుండా వెళ్లనే వెళ్లరు.

మల్లీశ్వరి వారణాసి

ఫొటోలుః కె.సర్వేశ్వర్ రెడ్డి